Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 11


    నాకో కుర్రవాడు కావాలి !

    నాకు కావల్సిన కుర్రవాడు అబద్ధాలు ఆడనివాడై వుండాలి! అతడు ప్రేమించబోయే అమ్మాయి కోటీశ్వరుడి కూతురు. అందులోనూ అతడు ఆ ప్రేమలో పూర్తిగా సఫలీకృతుడై ఆ అమ్మాయికి గర్భం వచ్చే స్థితికి తీసుకెళ్ళాలి! అంతవరకూ వచ్చాక అతడు నా మాట వింటాడని రూలేముంది? నేనిచ్చే డబ్బుకన్నా ఆ అమ్మాయిని పెళ్ళాడితే వచ్చే డబ్బు కొన్ని వందలరెట్లు ఎక్కువ! అలాంటి కుర్రవాడు నాకెక్కడ దొరుకుతాడు?

    సరిగ్గా ఆ సమయానికి నువ్వు బ్యాంకులో కనబడ్డావు! 'నిజం చెప్పలేదు' అన్న కారణంగా నువ్వు ఒక దొంగమీద ప్రాణాలకు తెగించి తిరగబడటంతో నా దృష్టిని ఆకర్షించావు. ప్రాణాలకు తెగించి కూడా నువ్వు నిజమే చెప్తావా-లేదా అన్న విషయం నిరూపించుకోవటం కోసం నీ చుట్టూ మిలిటరీ వాతావరణం సృష్టించి నాటకం ఆడాను. పదివేలు ఖర్చయినా వెనుకాడలేదు. ఇక్కడో విషయం గమనించాలి నువ్వు! ఇంత ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతున్నా నేను నా స్వంత జీవన విషయం వచ్చేసరికి పైసా పైసాకి కక్కుర్తి పడతాను. కుక్కిమంచం, చిప్ప భోజనం చేస్తూ మరోవైపు మారిస్ మైనర్ కారు వుంచుకున్నది అందుకే! ఇక్కడ కారు నాకోసం కాదు. నా పథకం అమలు జరపటం కోసం- అంతే! దీన్నిబట్టి అర్ధంచేసుకో. ఎంత కసితో వున్నానో నేను.... నా మూడు లక్షలు అయిపోయే లోపులో నా లక్ష్యం నెరవేరాలి" అతడు ఆగి, తిరిగి అన్నాడు.

    "....నువ్వు ప్రాణం పోయినా అబద్ధం చెప్పవని మిలటరీ కాంప్ లో ఋజువైంది. నీ చెల్లెలి ఆపరేషన్ కోసం అర్జంటుగా నీకు పాతికవేలు కావాలి. నీ ఫ్యాక్టరీలో కూడా నువ్వు సుఖంగా లేవు. రాజీనామా ఇచ్చేద్దామనుకుంటున్నావు! ఇన్ని కారణాలున్న కుర్రవాడు అదృష్టవశాత్తూ నాకు దొరికావు....చెప్పు! నా అవసరానికి నువ్వు ఉపయోగపడతావా?"

    "ఏమిటి నీ అవసరం? నేనేం చెయ్యాలి?"

    "నా ప్రత్యర్ధి కూతుర్ని ప్రేమిస్తున్నట్లు నటించి ఆ అమ్మాయికి అయిదో నెల వచ్చాక నువ్వు తప్పుకోవాలి...."

    "ఎవరు మీ ప్రత్యర్ధి? ఎవరా అమ్మాయి ??"

    ప్రసాదరావు "చెప్పను" అన్నాడు. "ఒకవేళ ఈ విషయము ఎక్కడయినా 'లీక్' అయితే నేను ఇరవై సంవత్సరాలపాటు అకుంఠిత దీక్షతో అదో యజ్ఞంలా నిర్వర్తించుకుంటూ వచ్చిన ఈ కార్యం సమూలంగా నాశనమైపోతుంది. ముందు నువ్వు 'ఊ' అను మిగతా ప్లాను తరువాత చర్చిద్దాం."

    వేణు లేచి "సారీ" అన్నాడు. "నేనీపని చెయ్యను."

    ప్రసాదరావు మొహం వాడిపోయింది. "ఎందుకని" అని అడిగాడు ఇరిటేటింగ్ గా.

    "మీమీ గొడవలకి ఒక అమ్మాయిని బలి చెయ్యటం దారుణం."

    "కానీ అతడు నాకు చేసిన అన్యాయం సామాన్యమైనదేమీ కాదు."

    "మీకూ మీకూ ఎన్నైనా వుండచ్చు. కాని దానికి ఓ అమ్మాయిని బలిపెట్టటం అన్యాయం."

    "నా చెల్లెలికి అదే అన్యాయం జరిగింది వేణూ! అందుకే అది చచ్చిపోయింది."

    "అయినా సరే...."

    ప్రసాదరావు అతడిని బలవంతంగా కూర్చోబెడ్తూ "నేను చెప్పేది పూర్తిగా విను. ఈ పని చేసినందుకు నీకు లక్షరూపాయలిస్తాను" అన్నాడు.

    వేణు చప్పున తలెత్తాడు. ఎవరో మోటారు సైకిలిస్టు పెద్ద శబ్దము చేసుకుంటూ రోడ్డుమీద వేగంగా వెళుతున్నాడు. దూరంగా మైకులోంచి పెళ్ళిపాట వినిపిస్తూంది.

    "అవును వేణూ! లక్షరూపాయలు! నువ్వు 'ఊ' అనగానే ఇప్పుడే పాతికవేలిస్తాను. నీ చెల్లిలి ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆ అమ్మాయికి అయిదోనెల నిర్ధారణ అవగానే మిగతా డెబ్బై అయిదువేలు ఇచ్చేస్తాను."

    "ఉహూ! డబ్బుకోసం కాదు. మీరు లక్ష కాదుకదా, పదిలక్షలు ఇచ్చినా ఈ పని చెయ్యను. నాకు ఓ చెల్లెలుంది. ఆ చెల్లెకీ అదే పరిస్థితి ఏర్పడితే నేనేమవుతానో కలలో కూడా ఊహించలేను. అటువంటిది నేనీ పని చేస్తానని ఎలా ఊహించారు?"

    "అయితే నేనింత కష్టపడ్డది వేస్టన్నమాట!" దిగులుగా అన్నాడు ప్రసాదరావు. వేణు మాట్లాడలేదు. ప్రసాదరావు తల పట్టుకొని కూర్చున్నాడు కొంచెంసేపు. తరువాత తలెత్తి- "మంచిది వెళ్ళిరా" అంటూ లేచి డ్రాయరు సొరుగులోంచి కొంత డబ్బుతీసి వేణు చేతిలో పెట్టాడు.

    వేణు విస్మయంతో "ఏమిటిది?" అది అడిగాడు. 

    "నిన్ను ఇంత కష్టపెట్టినందుకు నష్టపరిహారం రెండువేలు...." వేణు వద్దనలేదు. తనకి రావల్సిన కష్ట ఫలితం అన్నట్టు ఆ డబ్బుని జేబులో పెట్టుకుంటూ "....ఇంకెవరిమీదా ఇలా దారుణమైన ప్రయోగాలు చెయ్యకండి. ఆ మిలటరీ కాంప్ లో తుపాకీ పేలబోయేముందు దాదాపు నా గుండె ఆగిపోయేదే. ఇంకొకసారి మీ పరీక్షలో మరెవరికైనా అలా ఆగిపోతే మీరు జైల్లో కూర్చొని మరో పదేళ్ళపాటు మీ ప్రతిజ్ఞని వాయిదా వేసుకోవలసి వుంటుంది."

    "ప్రతి ప్లాన్ కి ఇలా వేలకి వేలు ఖర్చు పెట్టుకుంటూ పోతే నా డబ్బంతా కుర్రవాణ్ణి వెదుక్కోవడానికే అయిపోతుందని నాకు తెలుసు. ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ వెయ్యాలి."

    "విష్ యు బెస్ట్ ఆఫ్ లక్...."

    "థాంక్యూ...." అన్నాడు ప్రసాదరావు ఉక్రోషాన్ని అణచుకుంటూ. వేణు అక్కడనుంచి వచ్చేశాడు.


                                5


    లింగం అనే కార్మికుడు, మానేజరు దయానందం తొత్తు అన్న విషయం కనుక్కున్నది ముందు వేణు.

    ఆ రోజు కార్మికులు ఊరేగింపుగా జగపతిరావు వున్న గెస్టుహౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ అలజడి సృష్టించింది లింగమే. దయానందమూ అతడూ కలిసి వేసిన ప్లాన్ వల్ల పోలీసులు మధ్యలో జోక్యం చేసుకోవటం, స్ట్రయిక్ ఫెయిల్ అవటం జరిగింది.

    వేణు చేసిన తప్పేమిటంటే దయానందం ఈ పని చేసినందుకు లింగానికి లంచం ఇస్తూ వుండగా తను గమనించానని రామయ్యకి చెప్పటం.

    ఆ ముసలి కార్మికుడు తన కడుపులో ఈ రహస్యాన్ని దాచుకోలేక ఇద్దరి ముగ్గురి దగ్గిర ఈ మాట అన్నాడు. నెమ్మదిగా ఈ విషయం దయానందం వరకూ పాకిపోయింది.

    దయానందం పెనంమీద ఆవగింజ అయ్యాడు.

    ఋజువులు లేవు కాబట్టి వేణూ ఏమీ చెయ్యలేడని అతడికి తెలుసు. కానీ వేణు ఈ విషయం కనుక్కోవటంవల్ల లింగం తనకి మరి సాయం చేసే వీలుని పూర్తిగా కోల్పోయేడు. దీంతో దయానందం వేణుమీద లోలోపలే పగపట్టాడు. కానీ ఎక్కడా బైటపడలేదు. బైటపడకపోవడం అతడి గొప్ప గుణాల్లో ఒకటి.

    ఆ రోజు వేణు ఫ్యాక్టరీలో పనిచేస్తూ వుండగా లింగం అందరికీ స్వీట్లు పంచడం కనిపించింది. విషయం ఏమిటని వాకబు చేస్తే, అతడికి ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. వేణు తనలో తాను నవ్వుకున్నాడు. కష్టించి పనిచెయ్యటం కన్నా మానేజర్లనీ, యజమాన్లనీ కాకాపట్టడం ప్రమోషన్స్ సంపాదించడానికి దగ్గిర మార్గం.

    వేణు తన పనిలో నిమగ్నమై వుండగా లింగం అతడికీ స్వీటు ఇచ్చాడు. వేణు ఈర్ష్య పడకుండా అతడిని అభినందించి, స్వీటు తీసుకున్నాడు.

    అది తిన్న అరగంటకి, వేణూకి కడుపులో తిప్పుతున్నట్లు అనిపించింది. బ్రాందీయో- విస్కీయో తాగినట్లు వళ్ళు తూలసాగింది. అదే సమయానికి మిషనులోకి వెళుతున్న మెటీరియల్ మెలికపడి వుండటం గమనించి స్విచ్ ఆఫ్ చేయబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

    పెద్ద శబ్దంతో మిషన్ బ్రేక్ డౌన్ అయింది.

    అప్పటికప్పుడు అతడు సస్పెండ్ కాబడ్డాడు. అతడిని పరీక్షించిన డాక్టరు, అతడు డ్రింక్ తీసుకుని పనిలోకి వచ్చాడని రిపోర్టు ఇచ్చాడు. నాల్రోజుల తరువాత అతడు పనిలోంచి శాశ్వతంగా తొలగించబడ్డాడు. పదిహేను సంవత్సరాలు అంటిపెట్టుకొని వున్న నిజాయితీ అతడికి కాపాడలేకపోయింది.

    చాలా తొందర తొందరగా ఊహించని వేగంతో ఈ సంఘటనలన్నీ ఒకదాని తరువాత మరొకటి జరిగిపోయాయి. ఏ పరిస్థితుల్లో అతడి తండ్రిమీద తప్పుడు అభియోగాలు మోపబడినాయో అవే పరిస్థితులలో అతడి ఉద్యోగం కూడా పోయింది.

    అతడు తనకి రావలసిన అరియర్సు తీసుకుని ఫ్యాక్టరీలోంచి బైటకొచ్చేస్తూంటే లింగం నవ్వినా నవ్వు మాత్రం అతడు మర్చిపోలేదు. అతడి వెనుకే దయానందం వున్నాడు.


                                                             *    *    *   


    "చాలా పకడ్భందీగా వేసేరు ప్లాను."

    వెనుకనుంచి వినపడిన మాటలకి, ఆలోచనలో వున్న వేణూ ఉలిక్కిపడి వెనుతిరిగాడు. వెనుక ప్రసాదరావు నిలబడి వున్నాడు.

    "మీరా?" అన్నాడు వేణు.

    "సారీ! నీ ఉద్యోగం పోయిందటగా?"

    వేణు మాట్లాడలేదు.

    "ఇప్పుడేం చేస్తావు? హాయిగా నేను చెప్పిన ప్లాన్ కి వప్పుకో...."

    "సారీ...." అన్నాడు వేణు లేచి నిలబడి. "నా ఉద్యోగం పోయి వుండవచ్చు. నేనూ_ నా చెల్లెలూ వీధినపడి అడుక్కుతినాల్సిన పరిస్థితి వచ్చిన మాట నిజమే అయ్యుండవచ్చు. మీరు ఎరగా చూపిస్తున్న లక్ష రూపాయలు నా జీవితంలో సంపాదించలేనంత పెద్ద మొత్తం అవ్వొచ్చు. కానీ మీరు చెయ్యమంటున్నది నీతిమాలిన పని. ఒక ఇరవయ్యేళ్ళ అమ్మాయిని_ చౌకబారు మాటలతో చెప్పాలంటే.... కడుపుచేసి వదిలెయ్యటం.... అది నేను చెయ్యలేను. నన్ను క్షమించండి...."

    అతడి నిజాయితీ చూసి, ప్రసాదరావు కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. వేణు చేతుల్ని తన చేతులలోకి తీసుకుంటూ, "సారీ వేణు! నన్ను క్షమించు" అన్నాడు.

    "ఎందుకు?" అన్నాడు వేణు ఆశ్చర్యంగా.

    "నీ ఉద్యోగం పోవటానికి కారణం నేనే...."

    వేణు అదిరిపడ్డాడు.

    "అవును వేణూ! నీ మీద కక్ష సాధించటం ఎలా అని ఆ లింగమూ_ దయానందమూ బుర్రలు బ్రద్దలు కొట్టుకుంటూంటే పరోక్షంగా ఈ ప్లాను వాళ్ళకి అందజేసేను...."

    "మిమ్మల్ని చంపినా పాపం లేదు."

    "నిజమే...." వప్పుకున్నాడు. "....కానీ ఉద్యోగం పోతే నీ బింకం సడలిపోతుందని అనుకున్నాను. అప్పుడు నా ప్లాన్ కి వప్పుకుంటావనుకున్నాను."

    "ఇంత గొప్ప తెలివితేటలు వాళ్ళ కెక్కడివి అని అప్పుడే అనుకున్నాను. అయినా ఇలా వెంటపడి నా కడుపు కొట్టటం వల్ల మీకొచ్చే లాభం ఏమిటి?"

    "ఈ మాత్రం ఉద్యోగం నీకెక్కడైనా దొరుకుతుంది."

    "ఫ్యాక్టరీ ఉద్యోగం గురించి కాదు నేనడుగుతున్నది. నన్ను వదిలి పెట్టరా_ అని...."

    "నా పగ...."

    "మీ పగని తగలెయ్య. ఇలా ఇంకొక్కసారి జరుగుతే నేనే మీ మీద పగబట్టాల్సి వస్తుంది...." అని అక్కణ్ణుంచి కదిలిపోయాడు.


                        *    *    *   


    అతడు అనుకున్నంత తేలిగ్గా ఆ సంఘటన ముగిసిపోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS