లేఖ పైకి చూచింది. ఆమె వదనానికి అలంకార ప్రాయములైన నల్లని విశాల నేత్రాలతో కసారి ఆమె అగాధంగా చూచింది. 'ఇంటికి పోదాం' అన్నది.
"ఇక్కడ పిల్లల్తో సంబరం చేసుకోవచ్చు" అని గొణిగాడు కాలూ తనను బైట పడేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ.
లేత పెదవులు బైటికి వచ్చేట్టు 'ప్చ్' అని "ఇంటిదగ్గర చాల సంబరం ఉంది. పద బాబూ" అంది.
వయస్కురాలైన బాలికలా, వారికోసం బైట వేచి ఉన్న ఎద్దుల బండి దగ్గరకి తండ్రిని లాక్కుపోయింది.
లేఖ పసిబిడ్డగా ఉండగా కాలూ ఆనందార్ణవంలో మునిగి తేలాడు. పసిబిడ్డను ఎత్తుకొన్నప్పుడు అతడు అనుభవించిన ఆనందానికి అంతులేదు. ఇదంతా చూస్తూంటే కాలూలో మాతృప్రేమ పొంగి పొర్లుతుందా అన్నట్లుండేది. బిడ్డ పెరిగి తన పనులు తాను చూచుకోవడం ప్రారంభించేవరకు అతనికి ఒక రకపు విచారం కలిగింది. అతని భుజాలకు ఆమెను ఎత్తుకోవాలనే ఆకలి తీరలేదు. ఆమె సామాన్యంగా నిద్రించే భుజస్కందం రిక్తంగా కనిపించసాగింది. ఇప్పుడు లేఖకు ప్రత్యేకమైన మంచం ఉంది. కాలూ నిద్రలోసహితం మంచంమీద ఆమెకి వెదకేవాడు. లేఖను ఎవరో ఎత్తుకుపోయారనే ఆదుర్దాతో అమాంతంగా నిద్రనుంచి మేల్కొనేవాడు. అప్పుడు అతడు మెల్లగా ప్రాకి ఆమె మంచం దగ్గరికి చేరేవాడు. చీకట్లో, దిండుకు తలవేసి సగం తెరిచి ఉన్న నోటితో నిద్రించి ఉన్న లేఖను చూచేవాడు. ఆమె నిద్రనుంచి మేల్కొనకుండా మెల్లగా ఆమె మెత్తని వెంట్రుకలకు చేతిని ఆన్చి ఆమె శ్వాసను చూసేవాడు. కాయగాసిన చేతిని కదిలించిన ఆ విశ్వాసం ఎంత విచిత్రమైంది! మనిషికి ఇంకేం కావాలి? దేవుడు తన ఆడదాన్ని తీసుకొనిపోయాడుకాని ఆ స్థానంలో తనకు లేఖను ప్రసాదించాడు.
ఆరు సంవత్సరాలు దొర్లాయి. ఆమె చుబుకంపైన సూదిమొనలాంటి పుట్టుమచ్చ చూచిన కాలూ సంతోషం గట్టు తెంచుకుంది. "ఆడబిడ్డ ముఖాన కనీసం సూదిమొనంత మచ్చైనా ఉండాలి" అన్నాడు బిడ్డతో. "మీ అమ్మకు మూడుండేవి. ఒకటి నీకున్నట్లే చుబుకంపైన. రెండవది ఆమె నవ్వుతే ఏర్పడే చెక్కిలి గుంటలో. మూడవది. మూ - డ- వ- ది.........." శాశ్వతంగా తన స్మృతిపథంలో నిలిచిపోయిన ఒకానొక చిత్రాన్ని స్మరించుకొని, తన పసిబిడ్డను చూచి - కొంతసేపాగి, "అది సరిగ్గా ముఖాన కాక గొంతుక్రింది భాగంలో ఉండింది" అన్నాడు.
కొంతసేపు అతనికళ్ళు - ఎప్పటిలాగే - ఏదో సుదూర పదార్ధంలో ఇరుక్కున్నాయి.
లేఖను స్కూలుకు పంపడం చాలా కష్టమే. కాని తనకు చాతనైనంతవరకు లేఖను ఉన్నత కుటుంబంలో పుట్టినదానిగా పోషించి పెద్దదాన్ని చేయాలనుకున్నాడు కాలూ. అమాయకుడైన కమ్మరి ఈ నిర్ణయం వెనుక లేఖ తల్లి గాఢవాంఛకూడా ఉంది. ఆమెకు కలుగబోయే బిడ్డనుగురించి "మన బంగారు పాప- ఆడైనా, మగైనా, మిషన్ స్కూలుకు వెళ్ళి అక్కడ ఉన్నంతవరకూ నేర్చుకుంటుంది. ఆ ఖర్చులకుగాను మనం పస్తులుండి అయినా డబ్బు సమకూర్చాలి" అంటుండేది.
డబ్బు సమస్య ఎప్పుడూ ఉదయించనేలేదు. కాలూ పదికోసులు దూరంలో మంచి కమ్మరి అని పేరుపొందకముందే పాప బడిఫీజుకూ పుస్తకాలకూ సరిపోయేంత సంపాదించాడు. కాని ఆమెను స్కూల్లో చేర్చుకుంటారా? ఆమె అందమైంది. ఆమె పేరుకూడా సుందరమైంది. అయినా ఆమె కమ్మరి బిడ్డే! ఆ బడి పెద్దపంతులమ్మ మీద కాలూ తన ఆశలన్నీ నిలుపుకున్నాడు. ఆమె వృద్ధురాలు. అప్పుడప్పుడూ ఏదో ఒక పని చేయించుకోవడానికి ఆమె కాలూ దగ్గరికి వచ్చేది. ఆమె ముఖంలో దయ కనిపించేది. ఆమె కళ్ళలో కరుణ ఉండేది. కాలూ ప్రత్యేక శ్రద్ధతో ఆమెపని చేసేవాడు. నామమాత్రపు కూలిమాత్రమే ఆమెనుండి తీసుకునేవాడు. ఆమె అప్పుడప్పుడూ కొలిమికి రావడం మూలాన లేఖను చూడ్డమూ, ఆమెకు తల్లిలేదని తెలుసుకోవడమూ జరిగింది. కాలూ తన కోరిక వ్యక్తపర్చినప్పుడు ఆమె పెదవులు బిగించి లేఖను కొన్ని క్షణాలు అవలోకించింది.
"పాపా! నీ పేరు?"
"లేఖ."
కాలూ వెంటనే బిడ్డవైపు తిరిగి "పూర్తిపేరు చెప్పాలమ్మా" అన్నాడు.
"చంద్రలేఖ"
ఆ వృద్దనారి ఆలోచనా నిమగ్న అయేవరకు కాలూ హృదయం ఆశ, నిరాశలమధ్య కొట్టుకోసాగింది. ఆమె "కాదు" అంటే? అది తన స్వప్నాలకు అంతం. తల్లి కలలు పగటికలలు కావడం. కాని ఆమె నిక్కెల్ ఫ్రేము కళ్ళద్దాల్లోంచి చిరునవ్వు గోచరించింది. ఆమె తెల్లని తల ఆమోదసూచకంగా ఆడింది.
"మంచిది సరే అట్లాగే" అంది. ఇంకో నిముషంలోనే ఆమె ఒక వార్నింగ్ ఇచ్చింది. "నీ బిడ్డ శుభ్రమైన మంచి బట్టలు వేసుకోవాలి - బూట్లుకూడా." శ్రామికవర్గబాలురు ఉత్తకాళ్ళతోనే స్కూలుకు వస్తారని ఆమెకు తెలుసు.
"చంద్రలేఖకు కావలసినవి అన్నీ వస్తాయి" అన్నాడు కాలూ.
మరుసటిరోజు అరమైలు దూరంగా మెయిన్ రోడ్డుమీద ఉన్న కాన్వెంటు స్కూలుకు లేఖను తీసికెళ్ళాడు. కాని అతడు మెయిన్ గేటు నుంచి 50 అడుగులు ఇవతలే నిలిచిపోయాడు.
ఆమె పుస్తకాలూ, పలకా ఉన్న పచ్చని కాన్వాసుబాగ్ ఆమె భుజానికి తగిలించి 'లేఖా లోపలికి వెళ్ళు' అన్నాడు.
ఆమె అతని చేయి గట్టిగా పట్టుకొని నిశ్చలంగా నిల్చుంది.
"లేఖా"
ఆమె బావురుమంది. "నేను స్కూలుకు వెళ్ళను" అంది.
ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చేమాటలు మాట్లాడుతుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
"నీ ఈడుగల అనేకమందితో ఆడుకుంటూ నీకు స్కూలు సరదాగా ఉంటుంది. నీవు కథల పుస్తకాలు చదవడం నేర్చుకుంటావు. లేఖా! నీవు నాకు గర్వకారణం కావద్దూ? చూడు నీ ముఖం ఎలా అయిందో"
"అయితే నా వెంటరా" అంది ఒకచేత్తో కళ్ళు తుడుచుకుంటూ, ఎర్రని ఇటుకల పాఠశాలా భవనాన్ని చూస్తూను.
గేటువాడు లేఖను తనతో చూడకుండానే తన భావాన్ని ఆమెకు ఎలా చెపుతాడు? తనకు ఉన్నవాటిలో మంచిబట్టలు వేసుకున్నా తానెవరో గేటువానికి తెలిసిపోవచ్చు. అతడు "అదిగో కమ్మరిబిడ్డ బడికి వస్తూంది" అనుకోవచ్చు.
వారు కొంతదూరం సాగారు. కాలూ మళ్ళీ ఆగాడు.
"లేఖా! ఇకవెళ్ళు. భయపడకు అదిగో ఆ ఇద్దరు పిల్లల్నుచూడు. వారు నీకంటే చిన్నవారు."
అప్పటికీ ఆమె అతని వేలు గట్టిగా పట్టుకునే ఉంది.
"చంద్రలేఖా" గట్టిగా పిలిచాడు.
అదిరి తలెత్తి అతనివైపు చూచింది. తల వ్రేలాడేసింది. అతని చేయి వదిలింది. కొంతదూరం పోయింది.
"లేఖా! స్కూలులో ప్రవేశించకముందే ఏదీ ఒక్క నవ్వు"
ఆమె ఆగింది. చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులోని మార్దవం అతనిగుండె బరువెక్కించింది. మరుక్షణంలో మరల నడకసాగించింది. చూస్తూ చూస్తుండగానే ఆమె పిల్లలగుంపులో కలిసిపోయింది. వారంతా గేటుదాటగానే కాలూ వెనక్కు తిరిగాడు. అతడు కాళ్ళను లాక్కుపోతున్నాడు. లేఖ తనప్రక్కన కూర్చొని చూస్తూ ఉండకపోతే పనిచేయడం తనకు కష్టం అనిపించింది.
కాలూ ఒక అలారం గడియారం కొన్నాడు. ఇంటివసారాలో కూర్చొని పనిచేస్తున్నప్పుడు అతని దృష్టిఅంతా నల్లని రెండుముళ్ళవైపే ఉండేది. గంటలు గడచి స్కూలువదిలేసమయం అయ్యేవరకు నిమిషాలే గంటలయ్యేవి. చివరకు అలారం మ్రోగకముందే సమ్మెట పారేసి మూడుమెట్లుదిగి వీధిలోకి వచ్చేవాడు. స్కూలుకు పరిగెత్తేవాడు. కాని స్కూలుకు కొంతదూరంలోనే నుంచునేవాడు.
లేఖ చదువులో చురుగ్గా ముందడుగువేయడం అతనికి ఆనందాన్నీ, గర్వాన్నీ కలిగించింది. ఆమె వార్షిక పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. డబుల్ ప్రమోషన్ లభించింది. ఇప్పుడు అతడు ఆమెను స్కూలునుంచి తీసుకొనిరావలసిన పనిలేదు. కాని మెట్లదగ్గర వీధిలో ఆమెకై నిరీక్షించాలి. అతన్ని చూడగానే ఆమె పరుగెత్తుతుంది. దట్టమైన ఆమె వెంట్రుకలు, నీలిరంగు రిబ్బన్నువిడిచి చెదిరిపోతాయి. పరుగెత్తడంలో ఆమె ముఖం ఎర్రబారుతుంది.
"బాబూ ఇంగ్లీషుగంటలో ఏమైందో తెల్సా?"
అతడు కూతురు చేయిపట్టుకొని లోనికి తీసుకువెళ్తాడు.
"మొదలు పాలగిన్నె ఖాళీచేయి. రొట్టెతిను. తరువాత చెప్పు"
ఆమె సంగతినకముందే ఆదుర్దాగా "ఏమైంది?" అని అడుగుతాడు.