"మనం త్వరగా ఈ అంబులెన్స్ ని వదిలించుకుని మరేదైనా మార్గం చూసుకోవాలి. ఈపాటికి వాళ్ళు మనసంగతి కనిపెట్టేసి వెదకడం మొదలెట్టినా ఆశ్చర్యం లేదు. " అన్నాడు నిఖిల్.
"అదేమిటి? ఒక్కసారి ఆపండి" అంది రాధ.
సడన్ బ్రేకుతో అంబులెన్స్ ని ఆపాడు నిఖిల్.
రాధ అంబులెన్స్ లో నుంచి కిందికి దూకింది.
రోడ్డు పక్కన పల్లంలో పడి ఉంది ఒక పెద్ద సూట్ కేసు.
"భారత్ కల్చరల్ ట్రూప్" అని ఒక స్టిక్కర్ అటించి ఉంది దానిమీద.
రాధ దాన్ని చూస్తూ ఉంటే ఆమెని చేరుకున్నాడు నిఖిల్. సూట్ కేసు ఓపెన్ చేశాడు. దానిలో కొంత మేకప్ సామాగ్రి ఉంది. గిరిజనులు వేసుకునే రకం దుస్తులు ఉన్నాయి. పూసల దండలు ఉన్నాయి. మొహానికి పూసుకునే రంగులు ఉన్నాయి. గేదె కొమ్ములతో చేసిన కిరిటాల్లాంటివి ఉన్నాయి.
చిన్నగా విజిలేశాడు నిఖిల్.
"రెడీ?" అన్నాడు రాధ వైపు చూస్తూ.
"రెడీ!" అంది రాధ.
ఇద్దరూ ఆ దుస్తులు వేసుకోవడం మొదలెట్టారు. అతని ముందు బట్టలు మార్చుకోవడానికి రాధ సిగ్గుపడలేదు. అతనే పక్కకి తిరిగి నిలబడవలసి వచ్చింది.
ఆ తర్వాత అంబులెన్స్ ని దట్టంగా ఉన్న చెట్టు గుబురు వెనక వదిలేసి వచ్చాడు నిఖిల్.
అప్పుడు దూరంగా వినబడింది మోటారు శబ్దం.
ఒక ట్రక్కు వస్తోంది. బాగా దగ్గరికి వచ్చాక కనబడింది దానికి కట్టి ఉన్న గుడ్డ బ్యానరు.
"భారత్ కల్చరల్ ట్రూప్" అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది దాని మీద.
"చెట్ల వెనుక దాక్కుందామా?" అంది రాధ అతని చెయ్యి పట్టుకుని లాగుతూ.
"వద్దు!" అని తల ఊపి ఆమె చెయ్యి వదిలించుకున్నాడు నిఖిల్.
వాళ్ళ దగ్గరే ఆగింది బస్సు.
దానిలో ఉన్న కల్చరల్ ట్రూప్ మేనేజరు వాళ్ళని చూసి కిందికి దిగాడు. "నేను చెబుతూనే ఉన్నాను. అందరితోబాటే మీరు వచ్చేస్తే బాగుంటుందని. ప్రకృతిని పరిశీలించాలని ఏదో చెప్పి మోటారు సైకిలు మీద ముందే వచ్చేశారు. ఇప్పుడేమయిందో చూడండి." అన్నాడు కోపంగా.
తమని చూసి ఇంకెవరో అని అతను భ్రమపడుతున్నాడని అర్ధమయింది నిఖిల్ కి. మొహానికి ఉన్న వార్ పెయింట్ ని సరిదిద్దుకుంటూ ఊరికే నవ్వాడు.
"సరే ఎక్కండి ! ప్రోగ్రాం టైమయిపోతోంది" అన్నాడు మేనేజరు.
బస్సులో అప్పటికే ముప్పయ్ మంది ఆర్టిస్టులు ఉన్నారు.
"వెరీ గుడ్! మేకప్ భలే కుదిరింది! మిమ్మల్ని చూసినవాళ్ళేవారైనా సరే మీరు నిజంగానే ట్రైబల్ అర్టిస్తులే అని నమ్మేస్తారు" అన్నాడోకతను.
చాలామంది అవునన్నారు.
ఆ తర్వాత ఎవరి గొడవలో వాళ్ళు పడిపోయారు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో అందరిని పరికిస్తున్నారు నిఖిల్, రాధ.
అందరి మాటలవల్ల జరిగినదేమిటో వాళ్ళకు కొద్దికొద్దిగా అర్ధం అవుతోంది.
దేశ రక్షణలో మునిగిపోయి బార్దర్లను నిరంతరం గస్తీ కాస్తూ , కుటుంబాలకు దూరంగా ఉంటున్న జవానులకు వినోదం కలిగించడం కోసం ప్రదర్శనలు ఇవ్వడానికి బయలుదేరింది ఈ భారత్ కల్చరల్ ట్రూప్. ఒక్కొక్క క్యాంపులో ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు వాళ్ళు. ఈసారి క్యాంపు నుంచి బయలుదేరేటప్పుడు ఇద్దరు అర్టుస్తులు సపరేట్ గా మోటారు సైకిలు మీద వెళ్ళిపోయారు. ప్రక్రుతి సౌందర్యాన్ని తీరిగ్గా చూడాలన్నా కుతూహలంతో.
వాళ్ళ మేకప్ సామగ్రి ఉన్న సూట్ కేసు దారిలో పడిపోయి తమకు దొరికింది. తాము గిరిజనుల మేకప్ లోకి మారిపోయారు. అందుకని వీళ్ళు తమని గుర్తుపట్టలేదు.
అయితే,
అసలు ఆర్టిస్టులు ఏమయిపోయినట్లు?
ఏ క్షణంలోనైనా వాళ్ళు ఎదురవుతారా? "విపరీతమైన టెన్షన్!"
అది బయటపడకుండా ఉగ్గబట్టుకు కూర్చున్నారు నిఖిల్, రాదా.
ఆర్టిస్టులందరూ కోలాహలంగా ఉన్నారు. కొంతమంది ఆడుతున్నారు. ఆ ఇరుకులోనే. కొంతమంది పాడుతున్నారు.
నిఖిల్ రాధలను ఎవరూ ప్రత్యేకంగా గమనించడంలేదు.
ఉన్నట్లుండి బస్సు వేగం కొంచెం తగ్గింది.
రోడ్డు రెండుగా చీలింది అక్కడ.
"ఇక్కడ మధ్యలో అంతా బురదనేల ఉంది. దాని చుట్టూ తిరిగి చివరికి నెక్స్ ట్ క్యాంపు చేరుకుంటాయి రెండు రోడ్లు కూడా. కానీ ఎడమ చేతివైపు కొద్దిగా గతుకులు ఎక్కువ. అయితే దగ్గరిదారి. కుడిచేతి వైపు అయితే రోడ్డు సాఫీగా ఉంటుంది గానీ దూరం. ఎటు వెళ్దాం?" అన్నాడు డ్రైవర్ ట్రూపు మేనేజరుతో.
మేనేజరు చేతివాచీ వైపు చూసుకుని "ఇంకా టైం ఉంది. మంచి రోడ్డు మీద నుంచి వెళదాం." అన్నాడు.
బస్సుని కుడిచేతి వైపు తిప్పాడు డ్రైవర్.
బస్సు గనక ఎడమ చేతి వైపు వెళ్లి ఉంటే అక్కడ చెడిపోయిన మోటారు సైకిలుని రిపేరు చెయ్యడానికి తిప్పలు పడుతున్న అసలు ఆర్టిస్టులిద్దరూ వాళ్ళకి కనబడి ఉండేవాళ్ళు.
మరో అరగంట గడిచాక చెట్ల గుబురు వెనక వదిలేయబడ్డ అంబులెన్స్ ని గమనించాడు ఒక సోల్జరు. ఆ వార్తని అతను తక్షణం తన పై అధికారులకు చేరవేశాడు.
అది అంచెలంచెలుగా తరుణ్ కి చేరిపోయింది. అప్పటికే ఇండియాకి తిరిగి వచ్చేశాడు అతను.
