"ఎవరైనా వస్తే, ఈ ట్యూబులు ముక్కులో దూర్చేసుకో! ఒకే?"
"ఒకే బాస్!" అంది రాధ, ఒక కన్ను సగం తెరిచి చూస్తూ , ఆమెకి ఇదంతా చాలా రసవత్తరమైన నాటకంలా కనబడుతోంది.
వెదికి ఒక బాక్సులో పెట్టి ఉన్న స్కాల్పెల్ ని తీశాడు నిఖిల్. చాలా పదునుగా వుంది చాకు. ఒక కత్తెరా, కార్భాలిక్ సోపూ, కూడా తీసుకున్నాడు.
తన గెడ్డానికి సోపు పట్టించి, అంబులెన్స్ తాలూకు మిర్రర్ లో చూసుకుంటూ బాగా పెరిగిన గడ్డాన్ని షేవ్ చేసేశాడు నిఖిల్. మీసాలని కొంతమంది మిలటరీ వాళ్ళు పెంచే విధంగా టూత్ బ్రష్ ఆకారంలో కట్ చేశాడు.
అప్పుడు తన రూపాన్ని అద్దంలో చూసుకుని తృప్తిగా తలపంకించాడు నిఖిల్. డ్రయివింగ్ సీట్లో కుర్చుని అంబులెన్స్ స్టార్ చేసాడు.
రెండు కిలోమీటర్ల దూరం పోయాక ఒక చెక్ పోస్టు వచ్చింది. కొంచెం ఎత్తులో పొడుగాటి కొయ్య ఒకటి రోడ్డుకి అడ్డంగా పెట్టి ఉంది అక్కడ. రోడ్డు ప్రక్కగా మట్టితో కట్టిన ఒక రూం ఉంది. అయిదుమంది సోల్జర్స్ అక్కడ నిలబడి ఆత్రుతగా మాట్లాడుకుంటున్నారు.
తమను గురించిన ఇన్ఫర్మేషను వాళ్ళకి అంది ఉండవచ్చని ఉహించాడు నిఖిల్. సో వాట్ నెక్స్ ట్?
ఒక సోల్జరు పరుగెత్తుకొచ్చాడు. "రోకో!" అన్నాడు హిందీలో, ఆగమని సూచిస్తూ. అతని చేతిలో ఉన్న గన్ తాలూకు సేప్టీ క్యాచ్ రిలీజ్ చేసి ఉంది.
అంబులెన్స్ ఆపి నిర్వికారంగా ఉన్న అతని వైపు చూశాడు నిఖిల్. విండోలో నుంచి తల లోపలికి పెట్టి పరికించి చూశాడు సోల్జరు.
"ఎక్కడికి వెళుతున్నావ్?"
"హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి"
"ఎందుకు?"
గుప్పిట మూసి బొటనవేలితో వెనక్కి చూపించాడు నిఖిల్.
"ఒక సివిలియన్ అమ్మాయి! డెలివరి టైము! డాక్టరు సాబ్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళమన్నారు."
సోల్జరు వెనక్కి వెళ్లి డోర్ తెరిచి లోపలికి చూశాడు.
పడుకుని ఉన్న రాధ కనబడింది అతనికి. ఆ అమ్మాయి పొట్ట ఎత్తుగా ఉంది. ఆమె మొహం బూడిదరంగుకి మారుతున్నట్టు భ్రమ కలుగుతోంది చూసేవాళ్ళకి. తేలకళ్ళు పడ్డాయి. మొహంనిండా చెమట పట్టి ఉంది.
కంగారుగా నిఖిల్ వైపు వచ్చాడు సోల్జరు. "భాయ్! ఆ చొక్రి నిజంగానే చచ్చి పోయేటట్లుంది! జల్దీ తీసుకెళ్ళిపో!"
తల పంకించి అంబులెన్స్ ని వేగంగా ముందుకు పోనిచ్చాడు నిఖిల్.
కొద్ది నిమిషాల తర్వాత లేచి కుర్చుని చిన్న వెంటిలేటర్ లాంటి దానిలో నుంచి అతన్ని పిలిచింది రాధ.
"ఏయ్ డ్రైవర్!"
"వెనక్కి తిరిగి చూశాడు నిఖిల్.
"నొప్పులోస్తున్నాయ్! త్వరగా పోనీ!" అంది నీరసంగా నవ్వుతూ.
ఆమె మొహం చూసి ఉలికిపడ్డాడు నిఖిల్. నిజంగానే ప్రసవవేదన పడుతున్న దానిలాగే ఉంది రాధ.
"ఏమిటి? ఏమయింది?" అన్నాడు ఆదుర్దాగా.
"కనబడడంలేదూ? ప్రసవవేదన!"
"పిచ్చి చేష్టలు చెయ్యకు! ఏమయింది?"
"కార్డైట్!"
"ఆ?"
మెడిసన్ చేస్టులో ఉన్న కార్డైట్ బాటిల్ తీసి చూపించింది రాధ.
"కార్డైట్ కొద్దిగా మింగితే అనారోగ్యంగా కనబడతారు మనుషులు. స్కిన్ కలర్ మారుతుంది. చెమట్లు పడతాయి. ఈ సంగతి ఎక్కడో చదివిన గుర్తుంది నాకు. బాటిల్ కనబడింది. మింగేసాను. బెస్టు రిజల్ట్స్ కదూ?"
సీరియస్ గా కాసేపు రాధ వైపు చూశాడు నిఖిల్. తర్వాత అతని పెదిమలు చిరినవ్వుతో విచ్చుకున్నాయి. "నువ్వు నిజంగా అగ్గిబరటావి" అన్నాడు అభిమానంగా.
"నువ్వు అగ్గి పిడుగువి కావా?" అంది రాధ.
"మొత్తానికి ఆ సోల్జరు నమ్మేశాడు. నువ్వు ఏ క్షణంలోనైనా పండంటి పిల్లాణ్ణి కనేసేలా ఉన్నావని."
"ఒకణ్ణి కాదు, పదిమందిని కంటాను, మన పెళ్లి అయ్యాక" అంది రాధ బుగ్గలో నాలుక పెట్టి అల్లరిగా చూస్తూ.
అతను కొట్టబోయేటట్లు చెయ్యి ఎత్తాడు. ఈలోగా వాళ్ళు దాటివచ్చిన చెక్ పోస్టు దగ్గర ఉన్న ఆఫీసరు టేబుల్ మీద ఉన్న వైర్ లెస్ సెట్ యాక్టివేట్ అయ్యింది.
"ఆల్ఫా బ్రేవో చార్లీ," అన్నాడు ఆఫీసరు తన సంకేతాన్ని తెలుపుతూ. తర్వాత మెసేజ్ రావడం మొదలెట్టింది వైర్ లెస్ లో.
అతను నోట్ చేసుకుని వెంటనే ఒక సోల్జర్ ని పిలిచాడు.
"ఒక మొగా, ఒక ఆడా ఇద్దరూ బార్డర్ క్రాస్ చేసి మనవైపు వస్తు ఉండాలి. వళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తూ ఉండండి. సమ్ ఝీ?"
"ఎస్సర్!"
"ప్రతి వెహికల్ నీ జాగ్రత్తగా సోదా చెయ్యండి"
"ఎస్సర్!"
"పొద్దున్న నుంచి ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఇటువైపు?"
"నాలుగు సర్!"
"వాటిల్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా?"
"లేరు సర్!" అని ఒకక్షణం ఆలోచింఛి "ఉంది సర్!" అన్నాడు.
"ఎవరు?"
"కానీ ఆ అమ్మాయి బార్డరు క్రాస్ చేసి పారిపోయి వచ్చినదాన్లా కనబడడం లేదు సార్!"
"ఎందుకని?"
"ఎందుకంటె ఆ అమ్మాయి పొట్ట ఇంత లావున ఉంది సార్!" అని చేతులతో చూపించాడు అతను. "పూరా తొమ్మిది నెలలు నిండినట్లు ఉన్నాయ్ సర్ ఆమెకు! అంబులెన్స్ లో వెళుతోంది."
ఆఫీసరు కనుబొమలు ముడిపడ్డాయ్.
"అంబులేన్స్ లో ఇంకెవరున్నారు?"
"డ్రయివర్ ఒక్కడేసర్! వదులు వదులుగా ఉన్న యూనిఫారం వేసుకుని........."
అతని వాక్యాన్ని సగంలోనే కట్ చేస్తూ మిలటరీ వాడుకబాషలో మొరటుగా తిట్టాడు ఆఫీసరు.
"వదులుగా ఉన్న యునిఫారమా? బేవకూఫ్! వాళ్ళని చూడగానే నీకు అనుమానం వచ్చి ఉండవలసింది!"
"కానీ ఆ అమ్మాయి నిజంగా ప్రెగ్నెంట్ సర్!"
"నడుముకి నాలుగు గుడ్డలు చుడితే నువ్వు కూడా ఒకేసారి నలుగురు పిల్లల్ని కనేటట్లు కనబడతావ్!" అని కోపంగా తిట్టి వైర్ లెస్ అన్ చేశాడు ఆఫీసర్.
"హెడ్ క్వార్టర్స్! సర్! ఒక మగమనిషి, ఒక ఆడమనిషి అంబులెన్స్ లో పారిపోతున్నట్లు అనుమానంగా ఉంది. అతను మనవాళ్ళ యునిఫారం దొంగిలించి వేసుకుని ఉంటాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంటయినట్లు వేషాలు వేస్తోంది జాగ్రత్త సర్!" సోల్జరు వైపు తిరిగాడు అతను. "వెర్రి మొహం వేసుకొని నిలబడకు! వెళ్ళి డ్యూటీ చెయ్యి, వంటిమీద తెలివి ఉంచుకుని."
భయంగా సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు సోల్జరు.
త్వరత్వరగా మరికొన్ని మెసేజెస్ పంపించాడు ఆఫీసరు.
నిఖిల్, రాధల కోసం గాలింపు మరింత తీవ్రతరమయింది.
* * *
