Previous Page Next Page 
మారణహోమం పేజి 96

 

    చటుక్కున ఒక ఐడియా స్పురించింది నిఖిల్ కి. "రాదా! ఈ చెట్టు చుట్టూ ఒకసారి పరుగెత్తు" అన్నాడు.
    ప్రదక్షణం చేస్తునట్లు చాలా పెద్దగా ఉన్న ఒక చెట్టు చుట్టూ పరిగెత్తారు ఇద్దరూ. తర్వాత దగ్గరిలోనే ఉన్న ఒక తామర కొలనులోకి దిగి రెండు తామర తూడులు తెంపుకొచ్చాడు నిఖిల్.
    అక్కడే ఒక చెట్టు వెనక దాక్కున్నారు ఇద్దరూ.
    ఈలోగా కుక్కలు అక్కడికి వచ్చేసాయి. ఇందాక వాళ్ళు ప్రదక్షణం చేసిన చెట్టు చుట్టూ నేలను వాసన చూస్తూ అవికూడా ప్రదక్షిణం చేసాయి చాలాసార్లు.
    నిఖిల్ ప్లే చేసిన ట్రిక్కు పనిచేసింది. కన్ ఫ్యూజ్ అయిపోయాయి కుక్కలు. అయోమయకంగా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి చాలాసేపు.
    "పరిగెత్తు!" అన్నాడు నిఖిల్.
    మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టారు ఇద్దరూ. కొద్దిదూరం పరిగెత్తాక చెట్లు హటాత్తుగా అదృశ్యం అయిపోయినట్లు అనిపించింది. నదీ తీరాన్ని సమీపించారు వాళ్ళు.
    "దూకు రాదా" అన్నాడు నిఖిల్. "ఈ తామర తూడు నోట్లో పెట్టుకొని దూకెయ్"
    ఆతను అందించిన తామరతూడుని నోట్లో పెట్టుకొని నీళ్ళలోకి దూకేసింది రాధ.    
    నీళ్ళలో మునిగారు వాళ్ళు. నోట్లో ఉన్న తామర తూడులు గొట్టాలలా వున్నాయి. ఆ గొట్టాలపై కోస నీటి ఉపరితలానికి పై భాగాన ఉంది. వాటి ద్వారా నోటితో గాలి పీలుస్తున్నాడు నిఖిల్ , రాధా.
    అప్పటిదాకా చెట్టు చుట్టూ గుండ్రంగా తిరుగుతున్న కుక్కలు అయోమయంనుంచి బయటపడి, నిఖిల్, రాధల కొత్త అడుగుజాడలు పసికట్టి , నదివైపు వచ్చేసాయి.
    వాటి వెనకే పరుగెత్తుతూ వచ్చారు సోల్జర్లు. కాసేపు ఆ ప్రాంతాన్ని పరిశీలనగా చూసి పెదిమ విరిచి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
    మరో నిమిషం వెయిట్ చేసి నీళ్ళ పైకి తేలారు నిఖిల్ , రాదా.
    "నది దాటగలిగితే, ఇండియా చేరుకుంటాం" అన్నాడు నిఖిల్.
    ఈదడం మొదలెట్టారు.
    కొద్దిసేపు ఈదగానే రాధకు ఆయాసం వచ్చేసింది. చేతులూ, కాళ్ళు కదల్చడమే కష్టమైపోతోంది తనకు.
    "నన్ను పట్టుకో!" అన్నాడు నిఖిల్. కానీ అతనికి తెలుసు. ఆ అమ్మాయి బరువును మోస్తూ తను ఈ నదిని దాటడం అసంభవం అని.
    అయినా చివరి క్షణం వరకూ పోరాడటమే తన తత్వం!
    అప్పుడు "ఫట్ ' మని అతన్ని బలంగా తాకింది ఏదో, ఉలిక్కిపడ్డాడు అతను! మొసలా అది?
    కళ్ళు చిట్లించి చూశాడు మొసలికాదు అది. చిన్న పడవ. ప్రవాహంలో కొట్టుకుపోతోంది.
    "ఇది చాలు మనం బతికి బయటపడడానికి" అన్నాడు నిఖిల్ సంతోషంగా.
    కొంచెం శ్రమపడి పడవ ఎక్కారు ఇద్దరూ. చాలా పాతపడవ అది. బహుశా అది ఇంకా పనికిరాదనుకుని నీళ్ళలోకి తోసేసి ఉంటారు దాన్ని.
    కిర్రుకిర్రుమని దుర్భరంగా శబ్దం చేస్తోంది. దానికి కొట్టిన మేకులు ఏ క్షణాన అయినా వదులయి ఊడివచ్చేటట్లు ఉన్నాయి.

    
                                                            * * *


    సింగపూర్ ఎయిర్ పోర్టులో దిగి నేరుగా ఇంటిలిజెన్స్ చీఫ్ ని కలిశాడు తరుణ్.
    కుశల ప్రశ్నలూ , మర్యాదలూ పూర్తీ అయ్యాక అసలు విషయంలోకి వచ్చారు.
    "మీవాడు సింగపూర్ లోనే ఎక్కడో ఒకచోట ట్రాప్ అయి ఉండాలి. తప్పించుకుపోవడానికి అసలు చాన్సే లేదు" అన్నాడు చీఫ్ చాలా కాన్ఫిడెన్స్ తో.
    చిరునవ్వుతో తలపంకించాడు తరుణ్. "అవును! మీరు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నారని నాకు తెలుసు! అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా!"
    ఆఫ్ కోర్స్!" అన్నాడు చీఫ్ , అందమైన చిన్నగ్లాసులో స్కాచ్ విస్కీ అందిస్తూ "మీవాడిని మేము ఎలుకని పట్టేసినట్లు పట్టేస్తాం! డోంట్ వర్రీ!"
    తన సిగరెట్స్ చీఫ్ కి ఆఫర్ చేసి తను ఒకటి అంటించాడు తరుణ్. అతని దృష్టి టేబుల్ మీద వున్న న్యూస్ పేపర్ మీద పడింది.
    మొదటి పేజీలోనే ప్రముఖంగా వేసి ఉంది బెలూన్ అడ్వెంచర్ తాలూకు న్యూస్.
    ముందు యధాలాపంగా చదివాడు తరుణ్. వెంటనే అతనికి మెదడులో అలారం మొగినట్లనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా చదివాడు.
    అది గమనించి నవ్వుతూ అన్నాడు చీఫ్ "బెలూన్లో వెళ్ళడం మంచి స్పోర్ట్స్! ఒకసారి నేనూ వెళ్లాను సింగపూర్ నుంచి మలేషియాకి"
    "జెస్ట్ ఏ మినిట్! ఈ బెలూన్ పార్టీ షెడ్యుల్ టైం కంటే ముందే - ఎందుకు బయలుదేరి వుంటారు?" అన్నాడు తరుణ్.
     "అక్కడ రాశారుగా! అనివార్య కారణాల వల్ల అని?"
    "అ అనివార్య కారణాలేమిటి? తెల్లవారి అందరూ చేరితే తమని అందరూ గుర్తుపడతారనా!"
    చేదు మింగినట్లు చూశాడు చీఫ్. తర్వాత చటుక్కున లేచి నిలబడ్డాడు.
    "మిస్టర్ తరుణ్! యూ ఆర్ రైట్! పదండి వెళ్దాం!"
    కొద్ది సేపటి తర్వాత బెలూన్ లో వెళ్ళవలసిన కుర్రాడూ, అమ్మాయి బంధించబడిఉన్న ఇంట్లోకి జొరబడ్డారు తరుణ్, ఇంటలిజెన్స్ చీఫ్. వాళ్ళని విడిపించారు. ఆ తర్వాత -
    నిఖిల్, రాదా బెలూన్ లో తప్పించుకు పారిపోయారని ఇండియాకు మెసేజ్ పంపించాడు తరుణ్.
    ఈసారి ఆటను నిఖిల్ ని ఊరికే పట్టి బంధించమని చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS