Previous Page Next Page 
మారణహోమం పేజి 95

 

    "ఆకాశ పందిరలో
    నీకు నాకు పెళ్ళంటా
    అప్సరలే పేరంటాళ్ళు
    దేవతలే పురోహితులంటా!"
    అసహనంగా ఆమెని పక్కకి తోసి, లేచి నిలబడ్డాడు నిఖిల్.
    పెదిమలు బిగించి బుట్ట అంచుని పట్టుకుని కిందికి తొంగిచుశాడు నిఖిల్.
    అప్పటికే చాలా ఎత్తుకు వెళ్ళిపోయింది బెలూన్. ఇందాకటి కంటే దాదాపు రెట్టింపు ఎత్తుకు వెళ్ళింది.
    ఉన్నట్లుండి ఉక్క పొయ్యడం మొదలెట్టింది. గాలి స్థంభించినట్లయి పోయింది. బెలూన్ వేగం తగ్గి దాదాపు ఆగిపోయినట్లు నిలుచుంది గాలిలో.
    బెలూన్ ని కొంచెం కిందకు దింపదలుచుకున్నాడు నిఖిల్. అక్కడ వేరే గాలి కరెంటు ఉండవచ్చు. ఆ గాలి వాటంతో తిరిగి తాము ప్రయాణం సాగించవచ్చు.
    ప్రొపేన్ బర్నర్ ని తగ్గించాడు.
    కాసేపటి తర్వాత కిందకు దిగడం మొదలెట్టింది బెలూన్. బాగా కిందికి వచ్చాక అక్కడ సోకింది చల్లటిగాలి.
    వెంటనే ప్రొపేన్ బర్నర్ని కొద్దిగా పెద్దది చేశాడు నిఖిల్. బెలూన్ క్రిందకు దిగడం ఆగింది.
    అక్కడ వీస్తున్న చల్లగాలి ఉన్నట్లుండి చలిచలిగా మారింది. రివరివలాడుతోంది బెలూన్ తాలుకూ గుడ్డ. బుట్ట ఉదృతంగా ఊగుతోంది.
    "ఏమిటది నిఖిల్? ఏమవుతోంది?" అంది రాధ.
    "తుపాన్ అయి ఉండవచ్చు." అన్నాడు నిఖిల్ రాధ మొహంలోకి చూస్తూ.
    అది విని కూడా తొణకలేదు రాధ. "తుఫాన్ వస్తే మనం ఇండియా చేరగలమా?" అంది చాలా మాములుగా.
    "చివరిక్షణం దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అవునా?"
    తల ఊపి , తను కూడా కిందికి చూసింది రాధ.
    ఉన్నట్లుండి బాగా పక్కకి ఒరిగిపోయింది బుట్ట. రాధ కెవ్వుమని కేకవేసింది. మరుక్షణంలో ఆమె బుట్టలో నుంచి కిందికి జారిపోయింది. తక్షణం వంగి ఆమె చేతులు గట్టిగా పెట్టేసుకున్నాడు నిఖిల్.
    అంత ఎత్తున గాలిలో తేలుతోంది రాధ. కింద అగాధమైన బంగాళాఖాతం!
    నిఖిల్ చాతీనీ బుట్ట అంచు కత్తిలా కోస్తోంది. రాదని పట్టుకున్న అతని చేతులు భుజాల దగ్గర విరిగిపోయేటంతగా నెప్పి పుడుతున్నాయి. అయినా పట్టువదలలేదు నిఖిల్.
    రివ్వున తుఫాను గాలి మెదలయింది. వేగం పుంజుకుని జెట్ విమానంలా వెళ్ళిపోతోంది బెలూన్. బుట్ట ఏటవాలుగా ఒరిగిపోయి ఉంది. సర్కసులో చాలా ఎత్తున ఫీట్లు చేసే ట్రెపీజ్ ఆర్టిస్టులాగా నిఖిల్ చేతులు పట్టుకుని వేలాడుతోంది రాధ.
    దేహంలోని శక్తి అంతటినీ చేతుల్లో కేంద్రేకరించాడు నిఖిల్. ఒక్కసారిగా రాదని పైకి లాగాడు.
    నడుముదాకా బుట్టలోకి వచ్చేసింది రాధ. తర్వాత జాగ్రత్తగా కాలు పైకి లాక్కుని లోపల పెట్టింది. ఆ తర్వాత రెండో కాలు కూడా పెట్టి లోపలికి వచ్చేసి వెంటనే నిఖిల్ ని చుట్టేసుకుంది - "థాంక్స్ నిఖిల్!" అంది వణుకుతున్న గొంతుతో.
    ఆమె వెన్ను నిమిరాడు నిఖిల్. "ఇట్సాల రైట్!"
    "నిఖిల్! నా పని ఇంక అయిపోయిందనే అనుకున్నాను."
    "మన పని పూర్తయ్యేదాకా మనిద్దరికీ ఏంకాదు రాదా! భయపడకు.
    పిశాచాలు రోదిస్తున్నట్లు శబ్దం చేస్తూ జంఝుమారుతం వీస్తోంది. అంత పెద్ద బెలూన్ కూడా అల్పమైన పక్షి ఈకలా కొట్టుకుపోతోంది ఆ గాలిలో.
    నిఖిల్ లేచి ఒక తాడు తీసుకుని తననీ, రాదనీ బుట్టనీ కలుపుతూ గట్టిగా కట్టేశాడు. ఈసారి బుట్ట ఒరిగినా ఎవరూ కిందపడకుండా.
    వాళ్ళని అందుకుని ముంచేయ్యాలని మహావేశంతో ఉన్నట్లు తాటిచెట్టు అంత ఎత్తుకి ఎగసిపడుతున్నాయి కెరటాలు.
    హోరున వర్షం మొదలయింది.
    ఆ గాలి ఉదృతానికి బెలూన్ క్లాత్ చిరిగిపోతుందేమోనని భయం వేసింది రాధకు. "అసలు మనం ఇండియా వైపే వెళ్తున్నమా?" అంది ఆదుర్దాగా.
    ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళకు తెలియడం ప్రకృతికి ఇష్టంలేనట్లు బెలూన్ కి అమర్చి ఉన్న దిక్సుచీ టప్పున ఊడి సముద్రంలో పడిపోయింది.
    ఆ తర్వాత ఇంక నింగీనేలా సముద్రం అన్నీ ఏకమైపోయినట్లు అనిపించింది. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతున్నారు నిఖిల్, రాదా.
    చాలా గంటలు గడిచిపోయాయి.
    "బహుశా ఇదే మనకి అంతం అనుకుంటాను" అంది రాధ మెల్లిగా.
    నిఖిల్ మాట్లాడలేదు.
    "నిఖిల్ ! చనిపోయేముందు నేను నీ భార్యనని నోరారా ఒక్కసారి ఎందుకు చెప్పకూడదు?"
    "రాదా!" అన్నాడు నిఖిల్ కోపంగా.
    వెంటనే పెద్దగా కేక పెట్టింది రాధ.
    "ఏమిటి? ఏమయింది?" అన్నాడు నిఖిల్ ఆదుర్దాగా.
    "ఏదో గుచ్చుకుంది."
    నిఖిల్ పరిశీలనగా చూశాడు.
    కొమ్మ! ఏదో చెట్టు కొమ్మ! బుట్టలోకి పొడుచుకొచ్చింది.
    ఒక్కసారిగా అతని మొహం విప్పారింది. అటూ ఇటూ చూసాడు.
    చుట్టుతా చెట్ల కొమ్మలు!
    భూమిమీద దిగారు తాము.
    ఇంకా సరిగా చెప్పాలంటే చెట్టుమీద దిగారు!
    చూస్తూ ఉండగానే, బెలూన్ , ఫర్ మని చిరిగింది. గ్యాస్ అంటా రిలీజ్ అయిపొయింది. బెలూన్ గుడ్డ వచ్చి వాళ్ళ మీద పడింది.
    నెమ్మదిగా చేట్టుదిగి కిందికి వచ్చాడు నిఖిల్. రాధ మూడు కొమ్మలు దిగగలిగింది . కానీ లావుగా ఉన్న ఆ మాను మీద నుంచి దిగడం ఆమెకి చేతకాలేదు.
    "దూకెయ్! నేను పట్టుకుంటాను." అన్నాడు నిఖిల్.
    రాధ సందేహించకుండా దూకేసింది.
    రొప్పుతగ్గాక "ఎక్కడున్నాం మనం?" అంది రాధ.
    "బంగ్లాదేశ్ మేడమ్! బంగ్లాదేశ్!" అంది ఒక గొంతు వెనకనుంచి , వ్యంగ్యంగా "చేతులు పైకి ఎత్తండి!"
    చివుక్కున వెనక్కి తిరిగి చూశారు ఇద్దరూ.
    యూనిఫాంలో ఉన్న సోల్జరు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సబ్ మిషన్ గన్ ఒకటి ఉంది.
    ఒక్క ఉదుటున రాధ చెయ్యి అందుకుని "పరుగెత్తు రాదా!" అన్నాడు నిఖిల్. మరుక్షణంలో వాళ్ళు చెట్ల మరుగున మాయమయ్యారు. వెనకనుంచి బుల్లెట్ల స్ప్రే కురిసింది. కానీ చెట్లు దట్టంగా ఉండడం వల్ల ఒక్క బులెట్ కూడా వాళ్ళకి తగలలేదు.
    ఆ సోల్జరు పెద్దగా అరిచి ఎవరితోనో ఏదో చెప్పడం మొదలెట్టాడు.
    తర్వాత కొంతసేపు నిశ్శబ్దం. అప్పుడు వినబడింది మొరుగు. ఏడెనిమిది కుక్కలు ఒకేసారి మొరుగుతున్నాయి. అవి పరిగెత్తుకోస్తున్నట్లు ఆకుల గలగల శబ్దం చేస్తున్నాయి.
    "వేటకుక్కలని వదిలారు" అన్నాడు నిఖిల్ సాలోచనగా.
    రాధ పెదిమలు తడి ఆరిపోయాయి. చావుకి భయపడదు తను. కానీ ఇది దారుణమైన చావు. బతికి ఉండగానే కండలు పీకి చంపుతాయి ఈ కుక్కలు.
    ఆ కుక్కలు నిఖిల్, రాధల అడుగుజాడలని వాసన చూస్తూ గబగబ వచ్చేస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS