తలుపు తెరవగానే ఒక రివాల్వర్ బారెల్ అతని ముక్కుని తాకుతూ ఆగిపోయింది. రివాల్వర్ ఆయిల్ తాలూకూ వాసన వస్తోంది దానిలో నుంచి.
"కామిన్ రింగడూ! ఏరీ నీ ఫ్రెండ్సు? నీ చేతులు నాకు కనబడేలా ఉంచు! దట్స్ గుడ్! లోపలికి రా!"
చేతులు పైకి ఎత్తాడు రింగడు. లోపలి వచ్చాడు.
"నిఖిల్ ఏడీ? రాధ ఎక్కడ?"
ఆశ్చర్యంగా మొహం పెట్టాడు రింగడు.
"వాళ్ళింకా రాలేదా ఇక్కడికి?"
రింగడి దవడని బలంగా తాకింది రివాల్వర్ వెనుకభాగం.
"వెధవ్వేషాలు వెయ్యకు! ఎక్కడున్నాడు నిఖిల్! చెప్పు! టైం లేదు"
"నాకు తెలియదు"
మోకాలు ఎత్తి రింగడి డొక్కలో తన్నాడు ఆ మనిషి, విలవిల్లాడుతూ కిందపడి పోయాడు రింగడు.
"అల్ రైట్! చెబుతాను. కానీ నన్ను మీరు చంపకూడదు" అన్నాడు రింగడు, ఉపిరి అందాక.
"చంపను. చెప్పు"
అనుమానంగా చూశాడు రింగడు.
"మిమ్మల్ని నమ్మోచ్చో నమ్మకూడదో నాకు తెలియదు. నేను ఒక్క పని చెయ్యాలి. అది చేశాక మీకు అంతా చెప్పేస్తాను. ఆ తర్వాత నన్ను మీరూ చంపినా ఫర్వాలేదు."
"ఏం పని అది?" అన్నాడు అతను అనుమానంగా.
"మా అమ్మకి ఉత్తరం రాశాను. వృద్దురాలు ఆమె. మరణశయ్యమీద ఉంది! నేను వెళ్ళలేకపోయినా, కనీసం నా ఉత్తరాన్ని చూసి సంతోషిస్తుంది. ఆ ఉత్తరాన్ని పోస్టు చెయ్యాలి.'
బల్లమీద ఉన్న ఉత్తరాన్ని తీసి చూపించాడు రింగడు. ఆ వ్యక్తీ దాన్ని చదివాడు. మాములు విషయాలే ఉన్నాయ్ అందులో. వీలున్నంత త్వరలో తను బయలుదేరి వస్తున్నట్లు చివర్లో రాశాడు రింగడు. బ్రౌన్ కవర్ ఎన్విలప్ మీద అడ్రసు రాసి ఉంది.
"స్టాంపు అతికించేసి నీకు ఇస్తాను. దయచేసి పోస్ట్ చెయ్. ఈ మాత్రం సహాయం చాలు నాకు" అని బల్ల మీద ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసి అందులోంచి స్టాంపు బయటికి తీశాడు రింగడు. దాన్ని నాలుకతో తడిచేసి కవరుకి అంటించి కవరుని ఆ వ్యక్తికీ అందించాడు.
"దీన్నీ నేను పోస్ట్ చేస్తాను. భయపడకు. ఇప్పుడు చెప్పు! ఎక్కడున్నాడు "నిఖిల్!"
"నిఖిల్.........."
"ఊ! నిఖిల్?"
"నిఖిల్......నా ప్రాణస్నేహితుడు!" అని మాత్రమే చెప్పి , మొదలు నరికిన చెట్టులాగా నేలమీద కూలిపోయాడు రింగడు. వెనకవైపు సైనైడ్ విషం పూసిన ఆ స్టాంపుని ఇన్నాళ్ళు రెడీగా ఉంచుకున్నాడు అతను. ఒకవేళ తన శత్రువులకి చిక్కితే చిత్రహింస అనుభవించే బదులు తక్షణం చనిపోయేందుకు వీలుగా.
కిందపడి ఉన్న రింగడుని ఒకసారి కదిపి తర్వాత ఆ స్టాంపుని పీకి వాసన చూశాడు తరుణ్ ఏజెంటు. అసహనంగా తనలో తనే ఏదో గోనుక్కుని, తరుణ్ కి ఫోన్ చెయ్యడానికి వెళ్ళిపోయాడు.
* * *
గాలి ఉదృతంగా వీస్తోంది. గాలి వాటంతో బాటు వేగంగా ఇండియా వైపు వెళ్ళిపోతోంది బెలూన్. ప్రొపేన్ బర్నర్ కొంచెం పెద్దది చేశాడు నిఖిల్. మంట పెద్దదయింది. క్రమక్రమంగా మరింత ఎత్తుకి వెళ్ళిపోతోంది బెలూన్.
కిందికి చూశారు నిఖిల్ , రాదా. నీలంగా ఉన్న బంగాళాఖాతం కనబడుతోంది. తూర్పున సింగపూర్ ద్వీపం అక్కడనుంచి చిన్న మట్టిబెడ్డలా కనబడుతోంది.
"భయంగా ఉందా రాదా?" అన్నాడు నిఖిల్ , యాపిల్ పండు ఒకటి తీసుకొని ఒకటి రాధకు అందిస్తూ.
"భయమా? నాకా?" అని నవ్వింది రాధ. "నువ్వు పక్కనుండగా నాకేం భయం నిఖిల్?
నిఖిల్ కూడా చిరునవ్వు నవ్వాడు. "గాలి ఇలా అనుకూలంగా వీస్తూ ఉంటె రేపో, ఎల్లుండో ఇండియా చేరిపోతాం."
"వారం రోజులు పట్టినా నాకేం దిగుల్లేదు " అంది రాధ.
సరిగ్గా అదే సమయంలో -
మద్రాసులో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం కొంచెం బీజీగా అయింది.
"బంగాళాఖాతంలో , ఒరిస్సా బార్డరుకి రెండు వందల మైళ్ళ దూరంలో అతి పెద్ద వాయుగుండం ఏర్పడుతోంది. ఫలితంగా గంటకి నూట అరవై కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు వీచవచ్చు. భారీ వర్షాలు కురియొచ్చు. పల్లపు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను ఉళ్లు ఖాళీ చేయించడం మంచిది" అన్న మెసేజ్ ఆ ఆఫీసునుండి చాలా ప్రభుత్వ కార్యాలయాలకు చేరింది.
మూడు రాష్ట్రాలలో తుఫాను ఎదుర్కొనే ప్రయత్నాలు మొదలయ్యాయి.
* * *
"కొన్ని బిస్కెట్లు కూడా తిను" అన్నాడు నిఖిల్ రాధతో.
"ఇంక చాలు!" అంది రాధ.
ఉయ్యాలలా ఊగుతోంది వాళ్ళు కూర్చున్న బుట్ట. ఏదో అరేబియన్ నైట్స్ కధల్లో రాకుమారుడితో బాటు కీలుగుర్రం ఎక్కి ఆకాశమార్గాన వెళ్ళిపోతున్నంత ఉత్సాహంగా ఉంది రాధకు.
నిఖిల్ వీపుకి తన వీపు ఆనించి కూర్చుని నెమ్మదిగా కూనిరాగం తీస్తుంది రాధ.
