Previous Page Next Page 
మారణహోమం పేజి 91

 

    తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు తరుణ్.
    "కానీ దీనికి అర్ధం ఏమిటి? నిఖిల్ బాధతో వెళ్ళాడా. ఎందుకు?"
    చెవులు రిక్కించి వింది అమూల్య. అది బాధ అయి ఉండదు , రాధ అయి ఉంటుందని ఆమె అడమనుసుకి వెంటనే స్పురించింది.
    ఒక సూదిని సుతారంగా తన గుండెల్లో గుచ్చినట్లు సన్నటి బాధ!
    రాధ! నిఖిల్ కి నీడలా మసలగల అదృష్టవంతురాలు రాధ!
    అతనితో కలిసి సింగపూర్ వెళ్ళింది!
    బలవంతాన ఆలోచనలలో నుంచి బయటపడి అతనివైపు చిరునవ్వుతో చూసింది.
    "మీరు తలచుకుంటే నిఖిల్ కీ, నిప్పూ, నీరు పుట్టకుండా చెయ్యడం ఎంతసేపు! పోనియ్యండి! మీరు లాల్చీలు వేసుకోరా?"
    "వేసుకుంటాను. ఎందుకు?"
    "ఏం లేదు. లాల్చీ వేసుకుంటే మీరు చాలా బాగుంటారనిపిస్తోంది." అని ఆగి, "అలా మిమ్మల్ని చూడాలని ఉంది" అంది క్రీ గంట చూస్తూ.
    నవ్వాడు తరుణ్.
    మరోగంట సేపు కబుర్లు తర్వాత వెళ్ళిపోయాడు అతను.   
ఆ తర్వాత అరగంటకు ఫోన్ మోగింది , అమూల్య అపార్ట్ మెంట్ లో.
    ఉద్వేగంతో అమూల్య గుండె దడదడ కొట్టుకుంది.
    ఫోన్ చేస్తోంది నిఖిల్ అని అనిపిస్తోంది ఆమె మనసుకి.
    రిసీవర్ ఎత్తింది.
    "హల్లో!"
    "అమూల్యా!" అని పలికింది ఒక స్త్రీ కంఠం. అందులో స్నేహం లేదు. తప్పనిసరి పరిస్థితులలో తన ప్రత్యర్ధితో మాట్లాడవలసిన మనిషి గొంతులా బిగుసుకుపోయి ఉంది.
    రాధ!
    అప్రయత్నంగానే నిటారుగా నిలబడింది అమూల్య. చెప్పలేనంత ఆశాభంగం కలిగింది తనకు.
    "నువ్వా? ఎక్కడనుంచి"
    "సింగపూర్. న్యూస్ ఏమన్నా ఉంటె కనుక్కోమన్నాడు నిఖిల్."
    "అలాగా!" అని, తనకు తెలిసింది అంతా చెప్పంది అమూల్య. చివరిగా అంది. "నువ్వు కూడా నిఖిల్ తో ఉన్నావని తరుణ్ కీ తెలిసినట్లు లేదు. అది ఒక అదృష్టం! జాగ్రత్త."
    "ఒకే! ఉంటాను."
    లైన్ డేడ్ అయిపొయింది.
    నిట్టూర్చింది అమూల్య. తను అంత పకడ్భందీగా వేసిన ప్లాను , అరగంట గడవక ముందే నిఖిల్ కి చేరిపోయిందని తరుణ్ కీ తెలియదు.

                                                   * * *


    "రాజుని చంపేశారుట!" అంది రాధ. ఆమె గొంతులో దుఖం పొంగిపోరలుతోంది.
    "న్నో!" అన్నాడు నిఖిల్ లేచి నిలబడుతూ. "నేను నమ్మను!"
    "నిజం నిఖిల్! అమూల్యకీ తరుణ్ చెప్పాడట."
    "ఏమని?"
    "వాళ్ళ మనుషులు రాజుని టార్చర్ చేసి చంపారని?"
    నిఖిల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "అనుభవిస్తారు. వాళ్ళని వదలను నేను."
    సంకోచంగా అంది రాధ, "రాజు, చనిపోయేముందు మన రహస్యాలన్నీ చెప్పెశాడుట."
    ఆమె ఉహించినట్లు నిఖిల్ ఆశ్చర్యపడలేదు. "తప్పదు! టార్చర్ లో కొత్త పద్దతులు ఎన్ని వచ్చాయంటే, ఎంత మొండిమనిషి అయినా నిజం కక్కేయ్యక తప్పదు. నిజం చెప్పాలంటే చనిపోగలిగితే అది వేరే సంగతి అనుకో!"
    "శత్రువులకు దొరికిపోయాక విషయాలు వెల్లడించడం కన్నా విషం మింగి చావడం మేలు నిఖిల్! నా మటుకు నేనయితే అలాగే చేస్తాను. నా గొంతులో ప్రాణం ఉండగా, మన విషయాలు మరెవ్వరికీ తెలియనివ్వను" అంది రాధ ఉద్వేగంగా.
    అబిమానంగా రాధవైపు చూశాడు నిఖిల్. "గుర్తుంచుకుంటాను రాదా! ఇంకేం చెప్పింది అమూల్య?"
    నిఖిల్ పెదాలు అమూల్య అనే పదాన్ని ఉచ్చరించడమే తను భరించలేనట్లు మొహం పెట్టింది రాధ. అమూల్య పేరు పలికేటప్పుడు పరవశంగా ఉంటుందా అతని గొంతు? లేకపోతే అంతా తన భ్రమేనా?
    అమూల్య తనకు చెప్పిన విషయాలన్నీ వివరంగా నిఖిల్ కి చెప్పింది రాధ. "నిఖిల్ ని అడిగానని చెప్పు!" అన్న అమూల్య మాటలు మాత్రం చెప్పడం వదిలేసింది.
    అప్పటిదాకా చిటికెన వెలి గోరు కొరుకుతూ దీక్షగా రాధ మాటలు వింటున్న రింగడు నిఖిల్ వేపు తిరిగాడు.
    "యస్ బస్టర్డ్! ఏం చేద్దాం ఇప్పుడు?"
    "నువ్వే చెప్పాలి" అన్నాడు నిఖిల్.
    ఒక్కొక్క వేలు మడుస్తూ చెప్పాడు రింగడు. రోడ్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. రైలు స్టేషన్లలో కాపలా పెడతారు. ఎయిర్ పోర్ట్సులో కాచుకుని ఉంటారు. హార్బర్లలోకి అడుగు పెట్టనివ్వరు. ఇంకెలా తప్పించుకుపోతావు నువ్వు?" అన్నాడు యాసగా మాట్లాడుతూ.
    సిగరెట్ అంటించాడు నిఖిల్.
    "అన్ని మార్గాలు మూసేసినా , మరేదో దారి ఉండి తీరుతుంది రింగడూ! ఉండి తీరాలి! అది నా అనుభవం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS