కృష్ణు - మీ వాళ్ళు యింటికి లాక్కెడితే?
శశి - లాక్కువెళ్ళ యేం చేసుకుంటారు ? ఇంక నాకేం భయం , నువున్నాగా? సుందర్రావుగారున్నారుగా?
కృష్ణు - ఆ రాత్రి నగలతో నువ్వు ఎంత అందంగా ఉన్నావో! పాపం , కష్టపడి నీకు చేసిన శృంగారమంతానా కోసమయింది కదా! వాళ్ళకి వందనాలుచేస్తో ఉత్తరం రాయవల్సింది.
శశి - సంతోషించారు ! కాని ఆ జుట్టు దువ్వుకోడం, గివ్వుకోడం యేంలేదా యేమిటి? సర్దుతాను యిట్టారా!
కృష్ణు -నా అందం నీ అందం రెండూ నువ్వేచేసుకో .
శశి - నువ్వు నా కందంగా ఉండొద్దూ ?
కృష్ణు - ఎందుకు నన్ను చూస్తే నీకు ప్రేమ ?
శశి - నన్ను చూస్తే నీ కెందుకు ?
కృష్ణు - ముందు నువ్వు చెప్పు.
శశి- నువ్వు చెప్పు.
కృష్ణు - ఎందుకంటే , ఎందుకంటే ......... నువ్వు అట్లా వుంటావు కనక .చూడు మరేట్లా చూస్తున్నావో !
శశి - యింతేనా ? నేనిట్లా వుండకపోతే ప్రేమ వుండదా ?
కృష్ణు - అట్లా వుండకపోతే నువ్వు కాదన్న మాటేగా, నువ్వు కాకపోతే యెట్లా వుంటుంది ప్రేమ ?
శశి- నేనుమారిపోతే , ముసలిదాన్నయితే?
కృష్ణు - అయినా ఇట్లానే వుంటావు .సరే ,నా మీద నికేందుకో చెప్పుచూద్దాం .
శశి - నేను చెప్పను .
కృష్ణు - చెపుతానన్లేదూ?
శశి - "చెపుతానూ ?" అన్నాను .
కృష్ణు - ఇంత దొంగమాటలెక్కడ నేర్చుకోన్నావు ? చెప్పక పోతే ............
శశి - చెపుతా చెపుతా , వదులుమాఱి ,చెపుతానంటే -ఎందుకంటే -నీకు నా మీద ప్రేమగానుక.
కృష్ణు -ఇంతే !నాకు నీ మీద ప్రేమలేకపోతే ,నిది పోతుందన్న మాట ,నా ప్రేమచూడు ,నీ ప్రేమ పోయినా పోదు .
శశి - కాదు ,కాదు , మఱిచిపోయినా ,ఎందుకంటే , ముద్దోస్తావు కనక .
కృష్ణు - ముద్దు రాకపోతే ?
శశి - వస్తావులేద్దూ ?
కృష్ణు - నేను లేకపోతే ఏం చేసేదానివి ? ఓహొ ఆ దిబ్బన కుక్కతో కలిసి హాయిగా వెన్నెల్లో వాడి వంటినిండా గంధం పూసి సరసాలాడుతో వుండేదాదనివి . వాడిప్పుడు మన్నిచూస్తే బాగుండును .
శశి - చీ.పో !నేను లేకపోతే నువ్వో !
కృష్ణు - నువ్వు లేకపోతే ,నీ కోసం ఎదురుచూస్తో ఆ కాలువ వొడ్డున కూచుండేవాణ్ణి.
శశి - నన్నేరగవుగా?
కృష్ణు - ఎరక్కపోతేనేం?ప్రేమ దేవతకోసం ఎదురుచూస్తో కూచునేవాన్ని ఈ వెన్నెట్లో .అప్పుడు నువ్వోచ్చేదానివి .
శశి - పోదూ! ఏం బడాయి! ఏ పుస్త్జకాలో ,ఏ మందులో చదువుకుంటూ కూచునే వాడివి నీ మొహానికి నేను కనబద్దదాకా ప్రేమ కూడా తెలిసినట్టే! ఆ పిచ్చి కబుర్ల కేమి లెద్దూ !
కృష్ణు - అంత పెద్ద కళ్ళున్నాయికదా అని బడాయి .నాకేం భయమా ?
శశి - నీ కంత నోరుందిగా !
కృష్ణు - ఇదివఱకు చిన్నదే .ఈ మధ్య అరిగిపోయింది .
శశి - ఎందుకో?
కృష్ణు - ఇందుకూ .
కృష్ణుడు పరుగెత్తి చెట్ల నీడలో కనబడలేదు . చివరకు శశిరేఖని చెట్టు వెనక నుండి జడిపించెను .శశిరేఖ అదిరి వెనకకు పడెను .కృష్ణుడామెను పడకుండ కౌగిలించుకొనెను .
కృష్ణు - చూడు చంద్రుణ్ణి,అతన్నేవరు ముద్దు పెట్టుకున్నారో,మొహమంతా తాంబూలం మచ్చలు .
5
మూడు సంవత్సరములు గడిచినవి .కృష్ణా ,శశిరేఖ లిరువురును గోవింధపురముననే కాపురము .కృష్ణుడు తల్లిదండ్రు లాతనిని వదలనేరక .వారిద్దరిని తమ యింటనే యుంచుకోనిరి . కాని శశిరేఖ బంధువులామె మృతిజేందినట్లే భావించుకొని యూరకున్నారు .ఈ కాలమంతయు వారిరు వురును మహాప్రేమ ప్రవాహమునగడపిరి.అత్తమామలు వృద్దులగుటచే యింటిపనియంతయు శశిరేఖ పైబడెను .ప్రొద్దున లేచినది మొదలు రాత్రి వరుకు ఆమెకు కాయకష్టముతోదనే సరిపోయేను . కాని ఆ కాలమంతయు ప్రేమగితమామే చెవుల ప్రతిధ్వనించుటచేఆమె కాపని ఏ మాత్రము కష్టముగా తోచలేదు .కాలముండినపుడేల్ల కృష్ణుడామెకు చదువు నేర్ప ప్రయత్నించెను.కాని మొదలు పెట్టినపుడేల్ల నవ్వులలోను ,ముద్దులలోను పరిణమించెను.భార్యను ప్రేమించిన భర్త యేప్పుడును భార్యకు చదువు చప్పియుండలేదు . సుంధర్రావిప్పాడు గోవింధపురములో డాక్టరు. బహుశ తన స్నేహితుడచటనుండుటచే కోరి యచట పనివేయించుకొని యుండవచ్చును .అతడు తరచు విరి యింటికి వచ్చి సాయంకాలము గడుపుచుండును .
