ఒకనాటి సాయంకాలము శశిరేఖా కృష్ణులు లాకువద్ద తిరుగుచుండిరి.
శశి - మరి యింత సంతోషముగా వున్నామని తలుచుకున్నప్పుడు తప్పకుండా కష్టాలు
వస్తాయనిపిస్తుంది .
కృష్ణు - వస్తే భయమా? ఈ చంద్రుడు కనబడుఅతున్నన్నాళ్ళు యే మబ్బులు వచ్చినా సంతోషమే. ఈ మబ్బులకి చంద్రుడేట్లాంటిరంగు లిస్తాడు ! అయినా అందరికి రాని కష్టములు మనకేమొస్తాయి?
శశి - అందరికి లేని సుఖం మనకు రాలేదూ ?
కృష్ణు - ఇట్లాంటి సుఖము లేకుండా వాళ్ళు ఎట్లా దినదినము బ్రతుకుతారో తెలిదు. అందనిదానికి చేతులుచాస్తే ఏదో వస్తుందని ఆశ తో భాధపదవచ్చును . కాని యింకఏమి లేదని ప్రతిరోజూ ఒక్క మోస్తరుగా బతకడం కష్టం .
శశి - సారములేని నా బతుక్కి ఇన్ని రంగులేసి మహానందంలో నింపేసింది నువ్వుకదూ? ఎక్కడో ఏమేరక్కుండా బ్రతికే దాని హృదయ భావాలన్నీ కనిపెట్టి సౌందర్యాన్నంతా బయటికి లాగింది నువ్వు కాదూ !నీ ఋణంఎట్లా తీరుతుంది?
కృష్ణు - ఎట్లా తీరుతుందా? తిర్చావుకాదూ? ఆ నల్లచూపులతో ఆ చిన్న ముద్దులతోతే తీరిపోయింది? వెల్తురు నల్లాగా వుంటుంది . నీ కన్నీళ్ళు తెల్లగా వుండడం చూసి ఆశ్చర్యమేస్తుంది నాకు .
శశి - నీ దొంగమాటలు కూడా ఇంత బాగుంటాయనకోలేదు.
కృష్ణు - ఇంత అందముగా ఎట్లా పుట్టినావు మీ వాళ్ళకి ?
శశి - నీ కోసమే.
శశిరేఖ తల్లి బాల్యములోనే అత్తవారియింటికి వెళ్లబోయే ముందు ఆమె యింట్లో వుండి ఎవరికీ తెలియక ఆమె ప్రేమను పొందిన పంజాబు కుర్రవాని సంగతి తెలిసియుండుట సాధ్యమయినచో శశిరేఖ
ఎందుకంత అందమో ఆ చెప్పరాని ఆవేసములేమిటో పల్లెటూరి సాధరనపు బాలికకు, తల్లిదండ్రులకు లేని ఆ గుణము లెట్లు వచ్చెనో తెలిసేయుండును .
శశి - నా స్నేహితులేందరో వుండేవాళ్ళు. వాళ్ళందరిప్ప డేట్లా వున్నారో కదా?
కృష్ణు - ఏ పిల్లనో పెంచుకుంటూ, ఏ మొగుళ్ళకో వండి పెడుతో, ఏ ఆశాజివితంలోనో లేక, ప్రేమ అనేది ఎరక్క, బతుకుతూ వుంటారు .
శశి - ఎందుకోచ్చిందా యీ బతుకని ఆ మహ నరకంలోంచి చెయ్యిపట్టుకు లాగేశావు కదూ?
కృష్ణు - నువ్వు మాత్రం పనిచెయ్యడం లేదూ ! ఏది ,ఈ నేలమీద నడిపించకుండా వుండవలసిన వొళ్ళు ఇట్లా యిట్లా భాధపెడుతున్నాను .నాకంటే కఠినాత్ము డేవడుంటాడు?
శశి - అయితే ఇక్కడ పనిచెయ్యడం వేరు. నీవు మాట్లాడుతో వుంటే అదేచాలు ,ఎంత పనన్నాచేస్తాను .నీ కళ్ళు నా వెంటనే వుంటాయిగావాళ్ళకేముంది పాపం, యే పేరు ప్రతిష్టలో, పిల్లలకి సంబందాలో వాళ్ళని బాధిస్తో వుంటాయి.
కృష్ణు - అట్లానేం? నిన్ను బాదించవూ?
శశి - ఉహూ, నాకి కంఠం చాలు.
అని కౌగలించుకొని కంఠమును ముద్దు పెట్టుకొనెను. కృష్ణుడామె పెదవులను మెల్లగా తాకెను. శశిరేఖ అతని ప్రేమదేవత.ఆమె ఎక్కడ నలుగునో అని భయము.
కృష్ణు - అప్పడప్పడు యిదంతా కల అనుకుంటాను. గుండెలు తటతట కొట్టుకుంటాయి.ఏమేమో అయిపోయినావు అనుకుంటా. కళ్ళంబడి నీళ్ళు కార్తాయి.
శశి - పిచ్చివాడా! నే నేమైపోతాను! కాని కృష్ణ! జ్ఞపకముంది? నే నిక్కిడినుండి పడవవేపు చూస్తోవుంటే "పడవ యేక్కుతావమ్మా?" అని ఎంత మర్యాదగా పలకరించావు నువ్వు?
కృష్ణు - ముద్దు పెదిమలతో ఒక్క మాటన్నా మాట్లాడకుండా కళ్ళేత్తిచూసి మొహం అట్లా తిప్పకున్నావు కదూ? అప్పడే ముద్దుపెట్టుకుంటే ఏం చేసేదానవో?
శశి -ఏం! మళ్ళి పెట్టుకునేదాన్ని.
కృష్ణు -నిజమే !ఇప్పుడు కోత్తవాడేవరన్నా వచ్చి ముద్దుపెట్టుకున్నా అంతే చేస్తావు గావును!
శశి - నువ్వూ ??
అని అతనిని కొట్టబోయేను. కృష్ణుడు నవ్వుచు పారిపోయెను. శశిరేఖ చెట్లసందుల వెంటనంటి చివరకాతనిని పట్టుకొని చెంప పైకొట్టెను.
కృష్ణు - అప్పడే అంత ఆయాసం? ఇదివరకు ఎంతదూరమన్నా పరిగెత్తేదానవే?
శశిరేఖ మాట్లాడక సిగ్గుతో అతని వక్షమున తలను దాచుకోనేను.
కృష్ణు - మరిచిపోయినాను. తెలిసిందిలే. చూడు తలనిండా ఆకు లేట్లా చిక్కుకున్నాయో !ఏది మొహం ఒకసారి చూపించు. మారిందేమో చూస్తాను. ఏది....అడుగో సుందర్రావు,
సుంద - నే నవసరం లేని సమయంలో వస్తున్నట్టున్నాను .
కృష్ణు - లేదు.ఏదో మరిచిపోయి పరిగెత్తింది. మరి....శశిరేఖ కృష్ణుని నోరు రెండుచేతులతో
మూసేను.
శశి - చెప్పవుకదా ?
సుంద - నోరుమూస్తే జవాబు ఎట్లా చెపుతాడు?
శశి - తల వూగించు చెప్పనని. సరే. ఇంక మాట తప్పకూడదు.
