Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 9

 

    జడ్జి గారొచ్చారా?"
    "ఏమిటి డాక్టరు గార్ని జడ్జి చేసేస్తున్నావ్?"
    "ఆహా! మీ నాన్నగారు కాదు! మాధవి నాన్నగారిని గురించి అడుగుతున్నాను."
    "యూ సిల్లి బాయ్ . వాళ్ళ నాన్నను గురించి నన్ను అడుగుతా వెందుకు?"
    "నో! నో!" నిన్ను కాదు మాధవినే అడుగుతున్నాను"
    సుజాత గిర్రున వెనక్కు తిరిగి తన చేతిలో వున్నసాగర్ చేతిని విసురుగా వదిలేసి "ఊ వెళ్ళు , కొంగు పట్టుకు తిరుగు" అన్నది.
    "ఏం! నీ చీరకు కొంగు లేదా?"
    "కొంగు చూపించి వెళ్తున్నది అవిడేగా!' సాగదీస్తూ అన్నది సుజాత.
    అంతలో "హల్లో! సాగర్' అంటూ నలుగురు కుర్రాళ్ళు సాగర్ దగ్గరకు వచ్చారు.
    వాళ్ళను తీసుకువెళ్ళి వేరే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనూ వాళ్ళతో బాటు కూర్చున్నాడు. స్నేహితులు కేక్స్ స్వీట్స్ తింటూ కబుర్లు చెబుతూ కూర్చున్నారు.
    ఓ అరగంట గడిచింది. బేరర్ ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసాడు.
    అల్లంత దూరంలో సన్నజాజి పందిరి పక్కగా నున్న టేబుల్ చుట్టూ గుమికూడారు. దగ్గరలో వున్నా వాళ్ళు లేచి సన్నజాజి పందిరి కేసి పరిగెత్తారు.
    సాగర్ తను కూర్చున్న కుర్చీని వెనక్కు తోసి గుమికూడిన జనాన్ని తప్పుకొని టేబిల్ ముందుకు వచ్చాడు.
    'అయ్యో మాధవి!" మాధవి తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తుంది నాగరత్నమ్మ.
    డాక్టర్ మూర్తి వంగి మాధవి నాడి చూస్తూ వున్నాడు. అంతలో సాంబశివరావుతో కలిసి జడ్జి రామనాధం వచ్చారు. వాళ్ళ వెనుకే సుజాత పరుగెత్తు కొచ్చింది.
    "గాభరా పడాల్సిందేమీ లేదు! షి ఈజ్ అల్ రైట్, లే అమ్మాయ్! కూర్చో! ఏం జరిగింది?" డాక్టర్ మూర్తి మాధవిని లేవదీసి కూర్చో బెట్టాడు.
    మాధవి దృష్టి సాగర్ మీద పడింది. చివాలున లేచి సాగర్ ను చిన్నపిల్లలా పెనవేసుకుంది.
    సాగర్ మాధవి వీపు తడుతూ "ఒకే నౌ రిలాక్స్" అనునయించాడు.
    "వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేయండి! మీ అమ్మాయి జబ్బు నయమవుతుంది" జడ్జిగారిని , సాంబశివరావు గారిని చూస్తూ అన్నాడు డాక్టర్.
    ఆ మాట తూటాలా వచ్చి సాగర్ బుర్రలోకి ప్రవేశించింది. తామే పరిస్థితిలో వున్నది గ్రహించిన సాగర్ బిడియ పడ్డాడు. మాధవి చేతులను మెల్లగా తప్పించి దూరంగా జరిగాడు. మాధవి కళ్ళల్లో అనూహ్యమైన భయాలు దోబూచు లాడుతున్నట్లున్నాయి.
    మాధవిని కార్లో కూర్చోబెట్టి , తల్లీ, తండ్రి చెరో ప్రక్క కూర్చున్నారు. డాక్టర్ మూర్తి రామనాధం గారికి చీటీ అందిస్తూ "రాత్రికి రెండు టాబ్ లెట్స్ వేయండి. రేపు మూడు పూటలా ఒక్కొక్కటి వేయండి. ఎల్లుండి ఎలా వున్నది చెప్పండి" అన్నాడు.
    చీటీ అందుకొన్న రామనాధం డాక్టర్ కేసి కృతజ్ఞత భావంతో చూశాడు.
    "చాలా థాంక్స్ డాక్టర్ గారూ! అమ్మాయిని ఎవరైనా స్పెషలిస్టు కి చూపిస్తే మంచిదనుకుంటాను" సూచనగా అన్నాడు రామనాధం.
    'అవసరమైతే అలాగే చేద్దాం . షి విల్ బి. అల్ రైట్ బై టుమారో..... రేపు నాకోకసారి ఫోన్ చేయండి. అమ్మాయిని పూర్తిగా రెస్ట్ తీసుకోమనండి. గుడ్ నైట్ పాపా! మాధవీ! చీర్ యూ!" అన్నాడు డాక్టర్.
    మాధవి పేలవంగా నవ్వి "థాంక్యు సర్" అని 'గుడ్ నైట్" చెప్పింది.
    కారు సాగిపోతుంటే మాధవి కళ్ళు సాగర్ ను వెతికాయి. నిలబడి వున్న సాగర్ చేయి ఊపాడు. డాక్టర్ ను సాగనంపుతూ తండ్రి సాంబశివరావు డాక్టర్ మూర్తితో కలిసి రావడం సాగర్ చూశాడు.
    "మీ వాడు జడ్జి గారమ్మయితో...."
    డాక్టరు మాట పూర్తీ కాక ముందే సాంబశివరావు అందుకొని "జడ్జి గారు మా ఫామిలీ ఫ్రెండ్! పిల్లలిద్దరూ చాలా కాలంగా కలసి మెలసి తిరిగిన వాళ్ళు!" అన్నాడు.
    'అయితే ఇంకేం బంధుత్వం కలుపుకో!"
    "కాని అమ్మాయి....."
    "పెళ్ళయితే పిచ్చి కుదురుతుందంటారుగా!"
    "కుదురుతుందో ముదురుతుందో!"
    మొత్తానికీ పోలీసువాడి వనిపిం'చేవయ్యా. ఆ సంగతి చెప్పాల్సింది డాక్టర్లు. పోలీసులు కాదు.!"
    "అందుకే నిన్ను సామెతలు చెప్పకుండా సీరియస్ గా అలోచించి చెప్పమంటున్నాను."
    "ఫిట్స్ తప్ప వేరే ఏం లేదనుకుంటాను."
    "అది చాలదా ఏం? ఇంకా వేరే ఏం కావాలి? ఫిట్స్ ఎండుకోస్తున్నాయ్? దానికి ట్రీట్ మెంట్ ఏమిటి?"
    "కేసు పూర్తిగా ఇన్విష్టిగేట్ చేయాలి. అన్ని టెస్టులు పూర్తి చేసి న్యూరాలజిస్టును కన్సల్ట్ చేయాలి. ఆ మాటే జడ్జి గారికి కూడా చెప్పాను" కారు డోర్ తెరచి పట్టుకొని అన్నాడు డాక్టరు.
    వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ వెనుకే వచ్చిన సాగర్ "డాడీ ఆర్.డి. ఓ గారు మీ కోసం చూస్తున్నారు" అని చెప్పాడు.
    డాక్టరుకు గుడ్ నైట్ ' చెప్పి సాంబశివరావు వెళ్ళి పోయాడు.
    కారు స్టార్ట్ చేస్తున్నడాక్టరు దగ్గర కొచ్చి "మీతో ఓసారి మాట్లాడాలి, ఎప్పుడు రమ్మంటారు?" సాగర్ అడిగాడు.
    "నీ గరల్ ఫ్రెండ్ సంగతేనా? మీ నాన్నగారితో ఇంతకూ ముందే చెప్పానోయ్" అన్నాడు డాక్టర్.
    "మీతో కొన్ని ముఖ్యమయిన విషయాలు మాట్లాడాలి!"
    "ఓ.కే. ఎప్పుడైనా ఈవినింగ్ రా! ఫోన్ చేసి రా!"
    డాక్టరు గారి కారు గేటు దాటిపోయింది. మరో గంట కల్లా అంతా సద్దుమణిగింది. లైట్లు వాళ్ళు, హోటల్ వాళ్ళు సామాను లారీలో ఎక్కించుకు వెళ్ళిపోయారు. పోలీసు సిబ్బంది ఎస్.పి గారికి శెల్యుట్ వెళ్ళిపోయారు.
    సాగర్ తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొంటుండగా తండ్రి పిలుపు వినిపించింది. మళ్ళీ చొక్కా తగిలించుకొని వచ్చాడు.
    "సాగర్, సుజాతను వాళ్ళింటి దగ్గర దింపిరా. చాలా పొద్దుపోయింది.
    'అదేమిటి / సుజాత ఇంకా ఇక్కడే వుందా?"
    'అవును, ,మీ అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నది. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేయ్." అని చెప్పి సాంబశివరావు తన గదిలోకి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS