"ఏం .....వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం లేదా?"
"అది కాదమ్మా! ఆ అమ్మాయి కేవో భయంకరమైన చిత్రాలు కన్పిస్తున్నాయంట! ఉండి ఉండి తనకేదో మాదిరిగా అయిపోతుందట. మా కాలేజి ఫంక్షన్ లో అయితే అసలు స్పృహ తప్పి పడిపోయింది."
"అదేం పాపిష్టి జబ్బురా ఆ అమ్మాయికి! మరైతే ఆ పిల్లను చుట్టుకు చుట్టుకు తిరుగుతావ్ ఎందుకూ?' సుభద్రమ్మ ఆయాసం ఎక్కువయింది.
"అదేం జబ్బు కాదమ్మా, అదొక మానసిక స్థితి - దానికి కారణం ఏదో వుండి వుంటుంది. ఆ కారణమేదో తెలిస్తే ఆమె మానసిక స్థితి బాగు చేయవచ్చు."
"శరీరానికి వచ్చిన జబ్బులే నయం చేయలేరీ డాక్టర్లు! ఇక మానసిక రోగులకు నయం చేస్తారా వీళ్ళు? చూశావుగా ఐదేళ్ళ నుంచి తీసుకుంటున్నా! మందుల మీద బతకడమే కదరా! రోగం రాను రాను ఎక్కువవుతోంది కాని, తగ్గిందెక్కడరా?"
"సరేలేమ్మా! ఎక్కువగా మాట్లాడకు ఆయాసం ఎక్కువవుతుంది. మంచినీళ్ళవ్వమంటావా?"
"నీళ్ళతో పాటు రెండు నిద్రమాత్రలు కూడా ఇవ్వు. ఈరోజు అవి వేసుకోకపోతే కన్ను మూసే పనే లేదు.
"రెండు ఎందుకమ్మా! ఒకటి వేసుకో"
"ఒక్కటి వేసుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే! రెండియ్యి."
సాగర్ రెండు మాత్రలిచ్చి నీళ్ళందించాడు. మాత్రలు మింగి నీళ్ళు తాగి జీరగిలబడిన సుభద్రమ్మ , గది లోంచి బయటకు వెడుతున్న కొడుకును చూసి -------
"ఒరే సాగరూ! ఆ పిచ్చి పిల్లతో ఎందుకురా! మీ నాన్నగారితో చెప్తాను. మంచి సంబంధం ఒకటి చూడమని. నీకేం రా "కో" అంటే కోటిమంది వస్తారు" అన్నది.
"పిచ్చి పిల్లెవరమ్మా?"
"నీదొక పిచ్చిరా? ఇప్పుడే కదా చెప్పావు , ఆ జడ్జి గారమ్మాయికి పిచ్చనీ?"
"పిచ్చి కాదమ్మా అదొక మానసిక స్థితి అంతే"
"అదేలేరా , దాన్నే పిచ్చంటారు."
సాగర్ వెన్ను ముక లోకి చలి పాకినట్లయింది. తన తల్లి ఎంత తేలికగా మాట్లాడుతోంది? ఒక నిండు జీవితం ఎంత నిర్ధాక్షిణ్యంగా తోసి వేయబడుతోంది?
సాగర్ ఆలోచిస్తూ తల్లి కేసి మౌనంగా చూడసాగాడు. దుప్పటి పైకి లాక్కుని తల దిండు సర్దుకుంటూ "ఏమిట్రా అలా వున్నావు" అన్నది.
"ఏం లేదమ్మా బాగానే ఉన్నాను."
"ఏం బాగో ఏమో? నేను చూస్తే ఇలా ఉన్నా. మీ నాన్న తన గొడవేదో తప్ప నీ సంగతి పట్టించుకోరాయే! నువ్వు చూస్తే ఇలా అయిపోతున్నావ్?"
"నువ్వు కళ్ళు మూసుకొని పడుకోమ్మా!"
"కళ్ళెం ఖర్మరా? నోరు ,మూసుకొనే పడుకొంటారా!"
"అబ్బ! అంతలోనే ఇదై పోతావెం అమ్మా? ఇప్పడు నేనేమన్నానని?"
"నేను మాత్రం నిన్నే మన్నానురా? పిచ్చి పిల్లతో నీకెందుకురా అన్నా. ఈ మాట తప్పటరా?"
'అమ్మా, నువ్వు నోరుమూసుకు పడుకో" దాదాపు అరిచినట్టే అన్నాడు సాగర్.
"నేను ఇప్పుడు చేస్తున్నది అదే కదరా? నేనెంత లోకువయి పోయాను రా?" అంటూ మళ్ళీ లేచి కూర్చోడానికి ప్రయత్నం చేసింది సుభద్రమ్మ.
సాగర్ చిరాగ్గా గదిలోంచి బయటకోచ్చాడు. తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసి మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. తల్లిని గురించి ఆలోచించసాగాడు. రానురాను ఆమె ఆరోగ్యం క్షిణిస్తూ వుంది. దాంతో పాటు ఆమె ప్రతిదీ అపార్ధం చేసుకోవడం, తనను అందరూ లోకువగా చూస్తున్నట్లుగా బాధపడటం ఎక్కువవుతున్నది. ఏ విషయాన్నయినా సాగదీసిగాని వదలటం లేదు. గతంలో తూచి తూచి మాట్లాడే అమ్మ ఇలా అయిపొయింది. శారీరక అనారోగ్యం మానసిక అనారోగ్యానికి దారి తీస్తున్నది..... నాన్న చూడబోతే తన డ్యూటీ కి సంబంధించిన టూర్లతో మునిగిపోయి వుంటారు. రామనాధంగారు అయన సతీమణి ఎంతో అదృష్ట వంతులు. ఎప్పుడూ జోక్స్ వేసుకుంటూ సర్దాగా కాలాన్ని గడుపుతుంటారు. ఏ సమస్యలూ లేని వాళ్ళకు కూతురు మానసిక స్థితి పూర్తిగా అర్ధమయితే బెంబేలు పడిపోతారు. ఒక్కగానొక్క బిడ్డ! కాలేజి ఫంక్షన్ లో మాధవి పడిపోవటం అంత సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. డాక్టర్ ఏదో ఓవర్ ఎక్సైట్ మెంట్ వల్ల అలా జరిగిందన్నాడు. రామనాధం గారు పూర్తిగా డాక్టర్ మాట నమ్మారు.
సాగర్ పుస్తకాల మధ్య నుంచి తిరిగి ఒక నోట్ బుక్ తీశాడు . ఇంకా నయం మాధవి దాన్ని చూడలేదు. మాధవి చెప్పిన వన్నింటిని వివరంగా నోట్ చేసుకున్నాడు. టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. భారంగా ఒళ్ళు విరుచుకున్నాడు. కొన్ని వందల మైళ్ళు పరుగెత్తినంత బడలికగా వుంది. తెల్లవారి బర్త్ డే పార్టీకి చేయవలసిన ఏర్పాట్లను గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు.
5
సాంబశివరావు గారి బంగళా గేటు మీద రంగు రంగుల విద్యుద్దీపాలతో 'స్వాగతం' బోర్డు వెలిగిపోతోంది. ఆవరణలో వున్న చెట్లకు దీపాల తోరణాలు అందాన్ని చేకూరుస్తున్నాయి. అతిధులతో అక్కడ కోలాహలంగా వుంది. సాగర్ అతిధులందరిని చిరునవ్వుతో పలకరిస్తూ అన్ని టేబిల్స్ మీద సప్లయి లు అందుతున్నాయో లేదో చూసుకుంటూ ఆవరణంతా కలయ తిరుగు తున్నాడు.
"హయ్ ప్రేమ్"
"హాయ్ సుజాతా! వాట్ ఏ చేంజ్?"
"ఏం ఈ డ్రస్సు బాగా లేదా?" పైనుంచి కింద దాకా తనను తానూ చూసుకొంటూ సుజాత అడిగింది.
"నో, నో, ఇటీజ్ వండర్ ఫుల్!" సాగర్ సుజాతను నిండుగా చూస్తూ అన్నాడు.
"దట్సాల్ రైట్. మరెందుకలా అన్నావ్?"
"ఎప్పుడూ జీన్స్ లో అబ్బాయిలా వుండే నువ్వు చీరలో అమ్మాయి వయిపోయావే అని ఆశ్చర్య పడ్డాను. అంటే! చీరలో నువ్వు అప్సరసలా వున్నావ్!"
"గాస్' మూతి విరిచింది సుజాత.
"డోంట్ బి హాట్ మై డియర్!" తన చిరాకును దాచుకోవడానికి ప్రయత్నం చేశాడు సాగర్.
"ప్రామిస్" సాగర్ చేతికి చెయ్యి ఆనించి కళ్ళల్లోకి చూసింది సుజాత.
సుజాత చేతిలో చేయి వేసిన సాగర్ తన చేతిని వెనక్కు తీసుకోలేక ఎదురుగా నిలబడ్డ మాధవిని చూస్తూ వుండి పోయాడు. మాధవి గిర్రున వెనక్కు తిరిగింది!
"నాన్నగారు రాలేదా?"
"వచ్చారు. అదే మీ నాన్నగారి దగ్గరే నిలబడి వున్నారు , చూడలేదా!" ......సుజాత సాగర్ కు ఇంకా దగ్గరగా జరిగి అన్నది.
