సాగర్ ఆలోచనలో పడ్డాడు. సుజాత ఇంతవరకూ తన తల్లి దగ్గర ఏం చేస్తున్నది? వాళ్ళ నాన్నతో ఎందుకు వెళ్ళలేదు? డాక్టరు గారు కావాలనే కూతుర్ని వదిలి వెళ్ళాడా? ఆలోచిస్తూ తల్లి గదిలోకి ప్రవేశించాడు.
"అడుగో! వచ్చాడమ్మా! నాయనా సాగర్! సుజాతను దిగబెట్టిరా నాయనా!--" భారంగా శ్వాస పీల్చుకుంటూ అన్నది సుభద్రమ్మ.
"సుజాతా! మీ నాన్నగారితో వెళ్ళకుండా యింత వరకూ నువ్విక్కడెం చేస్తున్నట్టు?"
"ఏం వుండకూడదా?" కళ్ళు తిప్పుతూ అడిగింది సుజాత.
"అదేమిట్రా! అలా అంటావు/ ఎవరికి పట్టకపోయినా నా తల్లి సుజాతే నయం రా! పాపం పిచ్చిపిల్ల నన్ను చుట్టుకు చుట్టుకు తిరుగుతుంది. నేనంటే అమ్మాయికీ ప్రాణం. మీ పార్టీ గొడవల్లో మీరున్నారా! అక్కడ కూర్చోలేక లోపల కొచ్చాను. సుజాత అప్పట్నుంచి నాకు మందు మాకూ ఇస్తూ సేవలు చేస్తూ కూర్చున్నది రా! పైగా ఇంకా ఎందుకున్నావని అడుగుతావెం రా?"
"అబ్బ ప్రతిదానికి సాగ దీస్తావెందుకే? సుజాత వెళ్ళలేదా అని అడిగాను! అంతేలేవే?"
సుజాత లేచి వ్యానిటీ బ్యాగు తీసుకొని సుభద్రమ్మని చూసి "వెళ్ళొస్తాను అత్తయ్యగారూ" అన్నది.
"మంచిదమ్మా ! ఎప్పుడు కనిపిస్తావో? నువ్వు కనిపిస్తే నాకు ప్రాణం లేచి వస్తుంది. ఇంకా ఎంత కాలం బతుకుతానమ్మా! ఈ జీవుడున్న నాలుగురోజులు అప్పుడప్పుడూ వచ్చి పోతుండమ్మా!" సుభద్రమ్మ ఆప్యాయంగా అన్నది.
'అలాగే అత్తయ్యగారూ!" సాగర్ కేసి ఓరగా చూస్తూ అన్నది.
సాగర్ కు వొళ్ళు మండింది. అత్తయ్య గారూ......అత్తయ్యగారూ!.... ఏదో కావాలని నొక్కి నొక్కి అంటున్నది సుజాత.
"పడవోయ్! ఏమిటాలోచిస్తున్నావ్? నన్ను వెళ్ళమంటావా? నువ్వొచ్చి పంపిస్తావా?"
"వెళ్ళగలిగితే వెళ్ళు! మళ్ళీ నేనెందుకు నీకు తోడు?"
"సాగర్? ఏమిట్రా నువ్వు, నీకంత కష్టమయితే చెప్పరా! మీ నాన్నగారే దించి వస్తారు."
సాగర్ కంగారు పడ్డాడు.
"పద సుజాతా!' సాగర్ సుజాత చెయ్యి పట్టుకుని తొందర పెట్టాడు.
"వెళ్లొస్తాను అత్తయ్య గారూ!' సుజాత అతన్ని కొంటెగా చూస్తూ అన్నది.
కలసి వెళుతున్న సుజాతను, సాగర్ ను చూసి మురిసి పోయింది సుభద్రమ్మ.
గదిలో నుంచి బయటకు రాగానే "నువ్వెండుకోయ్ ఉడుక్కుంటావ్?" సుజాత అడిగింది.
"మావయ్యగారి దగ్గర కూడా సెలవు తీసుకోవాల్సి వుందా/ లేక వస్తున్నావా?" గబగబా అడుగులు వేస్తూ అన్నాడు సాగర్.
సుజాత సాగర్ ప్రక్కన కూర్చుంది. సాగర్ కారు స్టార్టు చేసి సర్రున తిప్పి రోడ్డెక్కాడు. ఆ కుదుపుకు సుజాత తూలి స్టీరింగ్ మీదకు పడింది.
"నన్నివ్వాళ ఇంటికి చేర్చవా ఏం?" అంది.
"నువ్వు మీ నాన్నగారితో ఎందుకు వెళ్ళలేదూ?"
"అదా! ఆ సంగతి మీ నాన్నగారినే అడుగు" టపీమని సమాధానం చెప్పింది సుజాత.
"మీ నాన్నతో ఎందుకు వెళ్ళ లేదంటే మా నాన్నను అడగమంటావ్! ఏమిటి నీ ధోరణి? నీ కేమయినా ....."
"పిచ్చి....అవును నాకు పిచ్చే"
"సుజాతా!" అసహనంగా అన్నాడు సాగర్.
"అదేమిటి ? పిచ్చి నాకయితేనూ...."
"సుజాతా! అతి తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా?"
"అసలు తెలివే లేదను కుంటుంటే, అతి తెలివేక్కడ నుంచి వచ్చింది నాకు?"
సాగర్ కసిగా బ్రేకు నొక్కాడు. సుజాట్ డాష్ బోర్డు మీదకు తూలింది! నుదురు గట్టిగ పట్టుకొని వెనక్కు వాలింది.
సాగర్ కంగారుగా సుజాతను పట్టుకున్నాడు. "సారీ .....సారీ! ఇలా అవుతుందనుకోలేదు!' నీళ్ళు నములుతూ అన్నాడు.
"ఎలా అవుతుందనుకున్నావు?" నుదుటి మీద బొప్పిని రుద్దుకుంటూ అన్నది సుజాత. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నన్ను క్షమించు సుజా! నీకిలా దెబ్బ తగులుతుందనుకేలేదు. ఏదో కోపంలో....."
"ఎవరి మీద నీకోపం? మీ నాన్నగారి మీదా?"
సుజాత తనకు నిజంగా పిచ్చి పట్టేట్టు చేస్తోంది. ఎత్తి రోడ్డు పక్కన పారేసి వెళ్ళాలని పించింది. కాని బొప్పి కట్టిన నుదురూ, అర్ద్రమైన ఆమె కళ్ళు చూస్తుంటే ఓ పక్క జాలి వేసింది.
సాగర్ మళ్ళీ కారు స్టార్టు చేశాడు.
'అపు, మళ్ళా ఎందుకు స్టార్టు చేశావు?"
"సుజాతా! సారీ చెప్పానుగా! అయిందేదో అయిపొయింది. అలంటి తెలివితక్కువ పని చేయనని ప్రామిస్ చేస్తున్నాను.
"నీకు తెలివి తక్కువని ఎవరన్నారు?"
"సుజాతా! ప్లీజ్! ఇహ వదిలేయవా?"
"నేను నిన్నేదో పట్టుకుని పాకులాడుతున్నట్లు మాట్లాడుతున్నావేమోయ్? అందుకనేగా కారు అపమన్నాను"
సాగర్ కు వళ్ళు మండిపోతున్నది. విసుగునూ, కోపాన్ని అణుచుకుంటూ ప్రాధేయపడుతూ "సుజాతా" అన్నాడు.
"నువ్వు కారాపింది నన్ను దించివేయడానికే కదా! అపెసేయ్ , నేను దిగి వెళ్ళిపోతాను."
'సుజాతా! ప్లీజ్! నీ చేతులు పట్టుకుంటాను"
"ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో, ఆనవు కదా కొంప తీసి?" సుజాత ఓరగా చూసింది.
సుజాత చేతులు కావు గొంతు పట్టుకోవాలనిపించింది. లేని నవ్వు తెచ్చుకొని "యూ! నాటీ గరల్" అన్నాడు సాగర్.
"మీ నాన్నగారే నన్ను ఆపివేశారు. వెళ్ళబోతున్న దాన్ని ఆపి సాగర్ దించి వస్తాడని మా నాన్నకు చెప్పారు. అంతవరకూ అత్తయ్యతో కబుర్లు చెపుతూ ఉండమ్మా అని మీ నాన్న బ్రతిమాలితేనే నేను ఆగిపోయాను. మా నాన్నతో వెళ్ళలేక కాదు! అర్ధమయిందా బుల్లి బాబు!" సుజాత సాగర్ బుగ్గ మీద పొడిచి పొడిచి మరీ చెప్పింది.
సాగర్ వళ్ళు చల్లబడినట్టయింది. కొంపదీసి సుజాత ఇప్పుడు జరిగినదంతా నాన్నగారితో చెప్తుందేమో?
"సుజాతా"
"ఊ"
