Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 9


    "నన్ను క్షమించు నాన్నా! నిన్ను చాలా బాధపెట్టాను. నేను అంత కృతజ్ఞత లేనివాణ్ణికాదు. కన్నతల్లి కనిపారేస్తే మీ రెక్కల నీడల్లో యింతవాణ్ణి చేశారు." ఆవేశంగా అన్నాడు శరత్.       


    "ఏమిట్రా ఆ మాటలు. నువ్వు మా బిడ్డవే. ఎవరూ కనిపారెయ్యలేదు. ఎవరు చెప్పారు నీకు అలాగని." ఇక నిల్చోలేని వాడిలా శరత్ పక్క కుర్చీలో కూలబడ్డాడు.


    "ఇంకెప్పుడూ అలా అనకురా బాబూ."


    శరత్ తల వంచుకున్నాడు.


    "నాకంతా తెలిసింది. రాత్రి మీరే స్వయంగా అనడం విన్నాను."


    "బాబూ!"


    ఇద్దరిమధ్యా మళ్ళీ మౌనం ఆవరించింది. వాతావరణం పురిపెట్టి పేనిన తాడులా వుంది.


    "ఆ అమ్మాయి నాన్న పేరు ఏమిటి? ఎక్కడ వుంటాడు. నేను ఇవ్వాళే వెళ్ళి మాట్లాడతాను ." సంభాషణ మరోవైపుకు తిప్పుతూ అడిగాడు రామనాథం.


    "ఆ విషయం చెప్పటానికి రాలేదు నాన్నా!" చిన్నగా అన్నాడు.


    రామనాథం శరత్ ముఖంలోకి లోతుగా చూశాడు.


    "ఆ అమ్మాయిని చేసుకోవా? మనసు మార్చుకున్నావా."


    "ఏమో చెప్పలేను. ఆ అమ్మాయే నన్ను చేసుకోకపోవచ్చును."


    "అదేమిటి?"


    "అవును. ఆ అమ్మాయికి తనెవరో తెలుసు. తనలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదో తెలుసు."   


    "శరత్!"


    "నేనెవర్నో నాకు తెలియదు. నేను అక్రమ సంతానాన్ని. పరిత్యక్తుణ్ణి."


    "శరత్!"


    "నాకు అమ్మా నాన్నా లేరు."


    "శరత్! ఎంతమాట అన్నావురా? మేము అమ్మా, నాన్నలా నిన్ను పెంచలేదా? నీకు అమ్మా నాన్న లేరా? ఆ మాట మీ అమ్మ దగ్గిర అంటే ఆమె జీవిస్తుందా?" రామనాథం కంఠంలో దుఃఖం పెల్లుబికింది.


    శరత్ ఓ క్షణం రామనాథం ముఖంలోకి చూశాడు.


    "మీరు నాకేం లోటు చెయ్యలేదు. కన్నబిడ్డలాగే ఇరవై రెండేళ్ళు భయంకర రహస్యాన్ని మమతల పొరల్లో దాచుకొని పెంచారు. మీరే నా తల్లిదండ్రులు. కర్ణుడు తమ రాధేయుడిగానే చెప్పుకున్నాడు. నేను మీ బిడ్డనే! నేను సుశీలమ్మ కొడుకునే. కాని ఆ కుంతీదేవి - నన్ను కని పారేసిన ఆ సాధ్వి ఎవరో తెలుసుకోవాలని వుంది" ఉద్రేకంగా అన్నాడు శరత్.


    రామనాథం నిట్టూర్చాడు. సమాధానం చెప్పలేదు.


    "నన్ను కన్నతల్లిని ఒక్కసారి చూడాలని వుంది. నా తండ్రి ఎవరో తెలుసుకోవాలని వుంది. ఏ పరిస్థితుల్లో కన్నబిడ్డను పరిత్యజించిందో తెలుసుకోవాలని వుంది. అంతవరకు నాకు నిద్రపట్టదు. నువ్వు చెప్పకపోతే అమ్మనే అడిగి తెలుసుకుంటాను."    


    "ఇరవై రెండేళ్ళుగా మన మధ్య పెరిగిన ఈ బంధాన్ని ఇంత తేలిగ్గా తెంచుకొని వెళ్ళిపోతావా," తనకు తానే చెప్పుకుంటున్నట్లు చిన్నగా అన్నాడు రామనాథం.


    "ఈ బంధం తెంచుకుంటే తెగేదికాదు నాన్నా, నాకు తెంచుకోవాలనీ లేదు, కేవలం తెలుసుకోవాలని మాత్రమే వుంది."  


    రామనాథం చెమర్చిన కళ్ళను తుడుచుకున్నాడు.


    "చెప్పు నాన్నా! నన్ను కన్నతల్లి ఎవరు?"


    "నాకు తెలియదు."


    శరత్ రామనాథం ముఖంలోకి లోతుగా చూశాడు.


    "అబద్ధం!" దాదాపు అరిచినట్టే అన్నాడు.


    "నిజం."


    "మరి నేను ఎక్కడ దొరికాను. రోడ్డుపక్కన మురుగు కాలవ ఒడ్డున దొరికానా? అనాధాశ్రమంనుంచి తెచ్చారా, ఆసుపత్రిలో ఎవరో కని పారేస్తే తెచ్చారా? చెప్పు నాన్నా!"   


    రామనాథంగారి ముఖంలో విషాద రేఖలు అలుముకున్నాయి.


    "నాకు తెలిసింది చెబుతాను. నాకు పెళ్ళయిన రెండేళ్ళకు మీ అమ్మ మగబిడ్డను కన్నది. వారు రెండు నెలలు పెరిగి పోయాడు. మీ అమ్మ చాలా కృంగిపోయింది. ఆ తర్వాత ఐదేళ్ళు మాకు పిల్లలు కలగలేదు. మీ అమ్మ మొక్కని రాయి, చెయ్యని నోములేదు. మీ అమ్మమ్మకు జబ్బుగా వుందని మీ అమ్మ పుట్టింటికి వెళ్ళింది. అప్పటికి మీ మామయ్యకు పెళ్ళి కాలేదు.   


    రెండు నెలల తర్వాత మీ అమ్మ తిరిగి వచ్చింది. వంటరిగా రాలేదు. ఓ పసిబిడ్డను తీసుకొచ్చింది. ఎవరి పిల్లవాడని అడిగాను.  


    "మన బాబేనండీ! మళ్ళీ నా బాబు నా ఒళ్ళోకి వచ్చాడు చూడండి! పోలికలు" అన్నది చేతుల్లో వున్న బిడ్డ ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ.


    నాకు ఏడ్వాలో నవ్వాలో తెలియలేదు. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం ఇచ్చింది. చివరకు ఒకరోజు భోరున ఏడుస్తూ మళ్ళీ ఆ ప్రశ్న వెయ్యవద్దని కోరింది. అంతే, ఆ తర్వాత ఎన్నడూ నేను మళ్ళీ ప్రశ్నించలేదు. తర్వాత మూడేళ్ళకు తమ్ముడు పుట్టాడు."


    అంతవరకూ చెప్పి ఆగి ఆలోచనలో పడ్డాడు రామనాథం.


    "అవును! అప్పుడు నన్ను అనాథాశ్రమంలో ఇవ్వమన్నారు. అమ్మ ఒప్పుకోలేదు" అని అదోలా విరక్తిగా నవ్వాడు శరత్.


    "అవును, ఆ తర్వాత నువ్వు నా బిడ్డవుకాదు అనే విషయాన్ని నేను కూడా మర్చిపోయాను. కాని చిన్నతనంలో నిన్ను చనువుగా దగ్గిరకు తీసుకోలేకపోయాను. అయినా నీమీద నాకు తెలియకుండానే వాత్సల్యం ఏర్పడింది. ఈ రోజు నువ్వు నన్ను పరాయివాడిలా సంభోదించావు."            


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS