ఉదయం నుంచీ ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు. మనసు రంపపుకోతను అనుభవించింది. ఇక ఆ విషయం మర్చిపో. నువ్వు మా బిడ్డవే. మీ అమ్మను ఏమీ అడక్కు. ఆమె భరించలేదు."
శరత్ మౌనంగా కూర్చున్నాడు.
"సాయంత్రం వెళ్ళి ఆ అమ్మాయి నాన్నతో మాట్లాడనా?"
"వద్దు నాన్నా! ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోను. ముందు ఒకసారి నేను కన్నతల్లిని చూడాలి. చూస్తాను. ఎలా వుందో, ఏ పరిస్థితులలో వుందో తెలుసుకోవాలని వుంది.
"తెలుసుకొని ఏం చేస్తావు?"
"ఆ విషయం ఇప్పుడు చెప్పలేను."
"పెంచిన తల్లిని వదిలేసి కన్నతల్లి దగ్గిరకు వెళ్ళిపోతావా? కొంచెం కటువుగా ఉంది రామనాధం కంఠం.
"చెప్పానుగా నేను మీ బిడ్డనేనని!" ఖచ్చితంగా సమాధానం ఇచ్చాడు.
రామనాధం నిట్టూర్చాడు.
శరత్ లేచి నిల్చున్నాడు.
"మీ అమ్మను అడుగుతావా?"
"తప్పదు" అనేసి చకచకా బయటికి వెళ్ళిపోయాడు శరత్.
5
ఆఫీసునుంచి బయటికి వచ్చిన శరత్ కు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. రాజేశ్వరి ఇంటిదగ్గర వుండదు. ఆ సమయంలో కాలేజీలో వుంటుంది. బయట తిరుగుతూ వుంటే స్నేహితులు ఎదురుపడవచ్చు. వాళ్ళతో మాట్లాడే స్థితిలో లేడు.
శరత్ ఇంటికే వచ్చాడు.
తన గదిలోకి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోకుండా మంచానికి అడ్డం పడ్డాడు.
రామనాధం గారు.... కాదు - కాదు - నాన్న నిజంగానే బాధపడుతున్నాడు.
అతనికి తనంటే ప్రేమ లేకపోలేదు.
అతని బాధకు కారణం తను దూరం అవుతాడనేనా?
కాకపోవచ్చు!
ఇంతవరకూ, అందరూ తనను రామనాధంగారి కొడుకనే అనుకుంటున్నారు. ఆయనకు సమాజంలో అంతస్థు వుంది గౌరవం ఉంది. ఈ విషయం అందరికీ తెలుస్తుందని భయం కాదు - అతను నిజంగానే బాధపడుతున్నాడు.
అతనికి భార్య అంటే అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం.
ఆమె పసిబిడ్డను ఎత్తుకొచ్చి ఎవరిబిడ్డో చెప్పడానికి నిరాకరించినా అతను ఆమెను నిందించలేదు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.
శరత్ కు రామనాధం అంటే అంతకుముందు లేని గౌరవం ఏర్పడింది.
"ఏమిట్రా కన్నా! అలా పడుకున్నావు? బట్టలైనా మార్చుకోలేదు" తల్లి గదిలోకి వచ్చి ప్రశ్నించింది.
తల్లి శరత్ ను "కన్నా!" అనే పిలుస్తుంది. చిన్న కొడుకును అలా పిలవదు.
తల్లి "కన్నా!" అంటే శరత్ కరిగిపోయేవాడు.
ఈరోజు "కన్నా" అన్న ఆ పిలుపు "కర్ణా!" అన్నట్టు అనిపించింది.
అదోలా నవ్వుకున్నాడు.
"ఎందుకురా కన్నా అలా నవ్వుకుంటున్నావు? ఇవ్వాళ నీకేమైంది ఎందుకలా వున్నావు?" ఆవేదనగా అడిగింది తల్లి.
"మీ నాన్న పెళ్ళికి అంగీకరించలేదనేనా?"
శరత్ సమాధానం ఇవ్వలేదు.
"నేను ఒప్పిస్తానుగా దిగులుపడకు." తల దగ్గరగా మంచం మీద కూర్చుని అన్నది సుశీలమ్మ.
"నాన్న ఒప్పుకున్నారు" నిర్లిప్తంగా అన్నాడు శరత్. సుశీలమ్మ కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి.
"ఒప్పుకున్నారా! ఎప్పుడు? ఆయనతో మాట్లాడావా?"
"అవును. నాన్న దగ్గిరకే వెళ్ళి వస్తున్నాను."
సుశీలమ్మ కొడుకు ముఖంలోకి లోతుగా చూసింది. ఆమె ఆశించిన వెలుగు ఆ కళ్ళలో కన్పించలేదు.
ఆయన ఒప్పుకున్నారా? మరి వీడెందుకు ఇంకా దిగులుగా వున్నాడు? ఇద్దరూ ఏమైనా ఘర్షణపడ్డారా? ఆయన తొందరపడి ఏమైనా అన్నారా? నువ్వు నా కొడుకువు కాదు అనలేదు కదా?
ఆ భావం సుశీలమ్మను నిలువెల్లా కుదిపేసింది.
"మరి దిగులుగా వున్నావెందుకురా కన్నా!"
"అమ్మా! నన్ను అలా పిలవొద్దు.
సుశీలమ్మ విస్మయంగా కొడుకు ముఖంలోకి చూసింది.
"ఏమిట్రా నువ్వనేది? కన్నా అని పిలవొద్దా?" ఆమె కంఠం వణికింది.
"కన్నా అంటే నాకు 'కర్ణా' అన్నట్టు విన్పిస్తున్నదమ్మా!"
