Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 8


    శరత్ కు రిక్షావాడిని లాగి తన్నాలనిపించింది.


    "నాంపల్లి బస్ స్టాండ్" విసుగ్గా అన్నాడు.


    రిక్షా వేగంగా పోతోంది. శరత్ మస్తిష్కంలో ఆలోచనలు కుక్కల్లా పరుగులు తీస్తున్నాయ్.


    ఎలా ఈ రహస్యాన్ని తెలుసుకోవడం? ఎవర్ని అడగాలి? శరత్ బుర్రలో మెరుపులా ఓ ఆలోచన వచ్చింది.


    "రిక్షా ఆపు!" దాదాపు అరిచినట్టే అన్నాడు. రిక్షావాడు రిక్షా అని వెనక్కు తిరిగి శరత్ కేసి ఆశ్చర్యంగా చూశాడు.


    "ఇక్కడ దిగేస్తాను." అంటూ రిక్షాదిగి రెండు రూపాయలనోటు రిక్షావాడి చేతిలో పెట్టాడు. రిక్షావాడు చిల్లర తీస్తుండగా శరత్ వడివడిగా ఆటో రిక్షాల కేసి నడిచాడు.


    "మహ్ బూబా యాద్ కొచ్చిందో ఏమో మల్ల? నవ్వుకున్నాడు రిక్షావాడు శరత్ కేసి చూస్తూ.


    శరత్ ఆఫీసులో అడుగుపెట్టాడో లేదో మేనేజర్ ఎదురు పరుగెత్తుకుంటూ వచ్చాడు.


    "ఏం పెద్దబాబూ ఇలా వచ్చారు!" వినయంగా అడిగాడు.


    "వున్నారా?"


    "ఎవరు నాన్నగారా?"


    "అవును" అన్నట్టు తలవూపాడు శరత్.


    "వున్నారు. నాన్నగారు ఇవ్వాళ పొద్దుటినుంచీ అదోలా వున్నారు. పిల్చేంతవరకూ ఎవర్నీ లోపలకు రావద్దన్నారు. ఏం జరిగింది బాబూ?"


    పొద్దుటి నుంచీ అదోలా వున్నారా? అంటే.... తన గురించి బాధపడుతున్నారా? ఉదయం తను "నాన్నా" అనకుండా పరాయి వాడిని ఉద్దేశించినట్లు మాట్లాడాను. అప్పుడు ఆయన ముఖం ఎవరో ఈడ్చికొట్టినట్లు అయింది. అవును ఆయనకు తనంటే ప్రేమే! చనువుగా వుండేవాడు కాదు. తనకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేవాడు. ఏనాడు తనతో కఠినంగా ప్రవర్తించలేదు. ఆయన్ను తను.... ఇప్పుడు 'నాన్నా' అని పిలవలేకపోతున్నాడు ఎందుకో జంకుగా వుంది. మనసులో కూడా అనుకోలేకపోతున్నాడు.


    ఆలోచిస్తూనే శరత్ రామనాధం గదిలోకి ప్రవేశించాడు.


    వాకిలి వరకూ వచ్చిన మేనేజరు ఆగిపోయాడు. రివాల్వింగ్ చైర్ లో తల వెనక్కు వాల్చి. అరచేతిలో కళ్ళూ సగం నొసలూ కప్పుకొని చైర్ ను అటూ ఇటూ తిప్పుతూ కూర్చుని వున్నాడు రామనాధం, శరత్ లోపలకు వచ్చింది ఆయన గమనించలేదు.


    శరత్ నిల్చుని తండ్రి వాలకం చూశాడు.


    కళ్ళు తుడుచుకుంటూ చెయ్యి తీసిన రామనాధం ఎదురుగా ఎవరో నిల్చున్నట్టు తోచి, గబుక్కున సర్దుకొని కూర్చున్నాడు.  


    ఎదురుగా నిల్చుని వున్న శరత్ ను విస్మయంగా ఓ క్షణం చూశాడు. రామనాధం కళ్ళు ఎర్రగా వున్నాయి. కనురెప్పలు తడి తడిగా కనిపించాయి.  


    శరత్ మనసు ఏదోగా అయింది. కింకర్తవ్య విమూడుడిలా తండ్రి ముఖంలోకి చూస్తూ నిల్చుండిపోయాడు.    


    "కూర్చో శరత్! ఏమిటి ఇలా వచ్చావ్? డబ్బేమైనా కావాలా?" రామనాధం కంఠంలో ఏనాడూ కన్పించని ప్రత్యేకమైన మెత్తదనం ఏదో కనిపించింది.


    "అక్కర్లేదు " అన్నట్టు తలవూపాడు శరత్.


    ఇద్దరి మధ్యా భరించరాని మౌనం టైం బాంబులా భయపెడుతూ వుంది.


    "మిమ్మల్ని ఓ విషయం అడగటానికి వచ్చాను."


    రామనాధం ఉలిక్కిపడ్డాడు. "మిమ్మల్ని" "మీరు" ఈ మన్నింపు సందేహం లేదు. వాడు అంతా విన్నాడు. తన భార్య అన్నంత పనీ జరిగింది. ఇరవై రెండు సంవత్సరాలు గుండెల్లో దాచుకున్న రహస్యం క్షణిక ఆవేశంలో బద్దలైంది, ఆవేశం అనుబంధాన్ని తెంచేసింది. ఇప్పుడు ఎంత ఆలోచించి ఏం ప్రయోజనం? ఎన్ని కన్నీళ్ళు కార్చినా తెగిన బంధం అతుక్కుంటుందా? వాడు మాటలు నేర్చిన నాటి నుంచీ "నాన్నా అని పిల్చాడు? ఈ రోజు అలా పిలవలేకపోతున్నాడు. ఈ అనుబంధానికి అర్థం లేదా? అందుకే "బ్లడ్ ఈజ్ థిక్కర్ వాటర్" అన్నారా?                


    "ప్లీజ్ చెప్పండి! నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి."


    "ఏమిట్రా శరత్ మీరు.... మీరు అంటున్నావ్? ఇరవై రెండు సంవత్సరాలగా "నాన్నా" అని పిల్చిన ఆ నాలుక ఈ రోజు ఎదురు తిరుగుతూ వుందా?" రామనాధం కంఠంలో జీర పలికింది.    


    శరత్ అపరాధిలా తల దించుకున్నాడు.


    "ఎందుకురా సందేహం? నీ వివాహం గురించేనా? మీ అమ్మ ఆ విషయం చెప్పింది. నువ్వూ బాగా చదువుకున్నావు. కాలంతోపాటు ఆలోచించేవాడివి. పెద్దవాళ్ళకు ఏవో కొన్ని చాదస్తాలు వుంటాయి. వెంటనే బయటపడలేక ముందు తరంతో ఓపిక వున్నంత వరకూ పెనుగులాడతాం. ఆ తర్వాత రాజీపడతాం. తరాల మధ్య వుండే అంతరాలు ఎప్పుడూ ఘర్షణ పడుతూనే వుంటాయ్. నీ ఇష్టం! బాగా ఆలోచించే చెబుతున్నాను. నువ్వు సుఖంగా వుండటమే మాకు కావాల్సింది. ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను."


    శరత్ కళ్ళు పెద్దవిచేసుకొని తండ్రిని చూడసాగాడు.


    "ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తావ్. నా మాటమీద నీకు నమ్మకం లేదా? లేక నీ తండ్రి హృదయాన్ని సందేహిస్తున్నావా? రామనాధం కంఠం గరగర లాడింది. కళ్ళు చెమ్మగిల్లాయి.    


    పులిలాంటి రామనాధంగారిని అంత బేలగా శరత్ ఏనాడు చూడలేదు.


    "నాన్నా" అన్నాడు అప్రయత్నంగానే.


    "బాబూ!" అంటూ లేచివచ్చి కొడుకు తల ఆప్యాయంగా నిమిరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS