Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 9


    "ఒసే మంగా, పెద్దదాన్ని, నాకు తోచిన సలహా ఇస్తున్నాను. వీథుల్లో ఆ పాటలు, నాట్యాలు మానేసి, పిల్ల కుదురు తెచ్చుకోవాలంటే ఒకటే ఉపాయం. మూడు ముళ్లు వేయించి దగ్గరకు పంపించు.....!" అంది పెద్దావిడ.
    "మాకు పిల్లలున్నారు గానీ, ఈ చోద్యం ఎక్కడా చూడలేదు బాబూ.... అయినింటి పిల్లలు వీథికెక్కి తైతక్కలాడడమా....!" అని మిగిలిన ఆడవాళ్ళు కూడా గుసగుస లాడుకుంటూ ఒక్కొక్కరే కదిలి. బిందెలో నీళ్ళు పట్టుకోవడం ప్రారంభించారు.
    పెద్దావిడ మాత్రం ప్రశ్నార్థకంగా మంగమాంబను చూస్తూనే ఉంది. "అప్పుడే పెళ్ళేమిటి పిన్నీ, ఇంకా చిన్నది కదా!" అని గొణుగుతూ మంగమాంబ నీళ్ళు ముంచుకోబోయింది.
    "చిన్నదేమిటే తల్లీ! మనందరికీ అంతకంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు కాలేదూ? ముహూర్తబలం బాగుంటే, పిల్లలో మార్పొస్తుంది. సంకోచాలేమీ పెట్టుకోకుండా సంబంధాలు వెతకండి. పెద్దదాన్ని చెబుతున్నాను. కొట్టి పారేయకు" అంది అనునయింపు ధోరణిలో పెద్దావిడ.
    "అదీ నిజమే. ఆలోచించాల్సిందే" అన్నారు మిగిలినవాళ్ళు. ఆ తర్వాత ఒక్కొక్కరూ మంగమాంబకు జాగ్రత్తలు, సలహాలు చెప్పారు.
    "బతుకుజీవుడా" అనుకుంటూ వాళ్ళను వదిలించుకుని మంగమాంబ ఇంటివైపు అడుగులేసింది. "వాళ్ళు చెప్పిదాంట్లో తప్పేముంది? పిల్లను దారిలో పెట్టడానికి ఏదో ఒకటి చేయవలసిందే. మగపిల్లవాడైతే ఆ దారి వేరు. ఆడపిల్లకు పెళ్ళి చేయడం తప్పించి, మరో మార్గమేముంటుంది!" అనుకుంటూ ఇల్లు చేరింది.
    దొడ్లో నందివర్ధనం చెట్టుకింద సోదిచెప్పే నాంచారి, ఆమె ఎదురుగా వెంగమాంబ కూర్చుని ఉన్నారు. ఆ చుట్టు పక్కల నాంచారి తెలియని వాళ్ళెవరూలేరు. సోదిచెప్పించుకుని ఏ పాత చీరో, బత్యమో ఇస్తారు. అప్పుడప్పుడు దొడ్లో కాసిన కూరగాయలు కూడా అడిగి పట్టుకెడుతూ ఉంటుంది. నాంచారిని చూడగానే మంగమాంబకు సంతోషం కలిగింది. ఈ నాంచారి కనిపించి చాలారోజులైంది. కనిపిస్తే బాగుండునని తను ఎన్నోసార్లు అనుకుంది. పిల్ల విషయం ఏమైనా చెబుతుందని తన ఆశ.
    బిందె గుమ్మంలో దించి నాంచారిని సమీపించింది. వెంగమాంబ నాంచారి ముందు చెయ్యిచాచి తనకు సోది చెప్పమని అడుగుతోంది. కొంతసేపు దేవుళ్ళందరినీ తలచుకుని నుదుట అరచెయ్యి పెట్టుకుని మొక్కుకుంది నాంచారి. "కంచి కామాశ్చమ్మ. మదురమీనాచ్చమ్మ, పలుకుతల్లీ, పలుకు.....!" అంటూ పుల్లతో వెంగమాంబ దీక్షగా సోదెమ్మవైపు చూస్తోంది. వెంగమాంబ కూడా ఆసక్తితో నాంచారినే చూస్తోంది.
    నాంచారి చెప్పడం ప్రారంభించింది. ఏదేదో విషయాలు చెబుతోంది. మంగమాంబలో ఆత్రుత పెరిగిపోయింది.
    "పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పవే నాంచారీ" అంది.
    "పెళ్ళి ఎప్పుడవుతుందేమిటి? ఎప్పుడో అయిపోయింది. అది ఇలాటలాటి పెళ్ళి కాదు. బెమ్మాండమైన పెళ్ళి" అంది నాంచారి.
    "నీ చోద్యం కూల సరిగ్గా చెప్పవే" అడిగింది మంగమాంబ.
    "నా మాట పొల్లుకాదు. బిడ్డకు ఆ ఎంకన్నబాబే మొగుడు. సామి వచ్చి తీసుకెళ్ళిపోతాడు" అంది నాంచారి.
    మంగమాంబకు కోపం ముంచుకొచ్చింది.
    "చాల్లే..... నువ్వూ, నీ మాటలు" అంది.

    వెంగమాంబ, "నేను చెబుతూనే ఉన్నాను కదా" అన్నట్టు తల్లివైపు చూసి, "వెంకటేశ్వరస్వామి నన్ను పెళ్ళాడాడు. నన్ను తీసుకెడతాడు" అంది సంబరంగా. "ఈ అమ్మ కనిపెట్టింది. నీకే తెలియకపోయింది" అంది నాంచారి మంగమాంబతో. ఈ లోపల వెంగమాంబ లోపలికి పరుగెత్తింది.
    "నీ పరాచకాలు ఆపి, పిల్లకు పెళ్ళియోగం ఉందో లేదో చెప్పవే" అంది మంగమాంబ బుజ్జగింపు ధోరణిలో.
    "నే చెప్పినా కదమ్మా, ఎవరికీ లేని పెళ్ళియోగం ఈ పిల్లకుంది. అంబ అబద్ధం చెప్పదు" అంది నాంచారి.
    వెంగమాంబ సోలెడు బియ్యం, పాత చీర తెచ్చి నాంచారికి ఇచ్చింది. నాంచారి బుట్ట చంకనెత్తుకుని వెళ్ళిపోయింది.
    మంగమాంబ అలాగే చూస్తూ, కొంతసేపు ఉండిపోయింది. చివరికి ఈ నాంచారి మాటలు కూడా విడ్డూరంగానే ఉన్నాయి. చల్లని మాట చెబుతుందనుకుంటే మరింత అయోమయం పెంచి వెళ్ళిపోయిందే అనుకుంది. వెంగమాంబ లోపలికి వచ్చి "నా స్వామే నా భర్త. వచ్చి నన్ను తీసుకెడతాడు" అంటూ పట్టరాని సంబరంతో పూజగదిలో స్వామి పటం ముందు కూర్చుని స్వామిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
    కూతురు ధోరణి చూసి మంగమాంబకు కూతురిమీద, నాంచారి మీద కూడా కోపం కట్టలు తెంచుకుంది. ఇదొచ్చి పిల్ల మనస్సును కూడా చెడగొట్టింది. పిల్ల మనసులో ఓ కొత్త ఆలోచన కలిగించి వెళ్ళిపోయింది. ఈసారి వస్తే గుమ్మంలోంచే వెళ్ళగోడతాను అనుకుంది.
    నాంచారి మాటలు విన్న తర్వాత, కూతురు పెళ్ళికి తొందరపడాలన్న ఆలోచన మంగమాంబలో బలపడింది.
    విచిత్రంగా కృష్ణయ్య ఆలోచనలు కూడా అటే మళ్ళుతున్నాయి. ఇంటికి రాగానే భార్య నాంచారి సోది గురించి చెప్పిన మాటలు విన్నాక, అతనికీ కోపం వచ్చింది. కాసేపటికి మంగమాంబ తన మనసులో ఆలోచన భర్తకి చెప్పింది. కృష్ణయ్య ఆలోచనలో పడ్డాడు. కూతురు పెళ్ళి విషయంలో తమ ఇద్దరి మాటా కలిసింది. ఇక సంబంధాలు వెతకడమే కర్తవ్యమేమో! భగవంతుడి నిర్ణయం అలాగే ఉందేమోననుకున్నాడు కృష్ణయ్య.
    "సరే, పెళ్ళి చేసేద్దామనుకో. సంబంధాలు వాకబు చేయాలి కదా! దీని సంగతి తెలిసిన వాళ్ళు, చేసుకోడానికి ముందు కోస్తారా? అందులోనూ బంధువుల విషయం చెప్పనే అక్కర్లేదు......" కృష్ణయ్య నసిగాడు.
    "సరిపోయింది, పిల్లకు కాలొంకరా, చెయ్యొంకరా? నిక్షేపంలాంటి పిల్ల. మీరే ఇలా అధైర్యపడితే వచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. తెలిసిన వాళ్ళందరి చెవిలో వేయండి" మంగమాంబ ధైర్యం చెప్పింది.
    "పిల్లకు ఏ లోపమూ లేదు నిజం. కానీ దీని వెర్రి భక్తితోనే కదా సమస్యంతా. కుదురుగా కాపురం చేస్తుందని అవతలి వాళ్ళు అనుకోవద్దూ?"
    "మీ వన్నీ లేనిపోని శంకలు. పెళ్ళయితే భక్తీ అన్నీ పోతాయి. కట్టుకున్నవాడే దారిలో పెట్టుకుంటాడు. వెయ్యి అబద్ధాలాడైనా పెళ్ళి  చేయాలన్నారు. మీరే మీ కూతుర్ని వీథిలో పడేయకుండా తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చండి. ఆ తర్వాత ఆ భగవంతుడే ఉన్నాడు" మంగమాంబ నిబ్బరంగా పలికింది.
    భార్య నిబ్బరానికి కృష్ణయ్యకి కూడా కొంత ధైర్యం చిక్కింది. అవును, తల్లిదండ్రులుగా తమ బాధ్యత తాము నిర్వర్తించాలి కదా! ఇప్పుడు కాకపొతే, ఇంకో ఏడాదో, రెండేళ్ళో గడిచాకైనా పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించవలసిందే. ఇప్పుడే మొదలవడం మంచిదనుకున్నాడు.
    ఎలాగైనా వచ్చే శ్రావణ మాసంలో పిల్ల పెళ్ళి చేసి తీరాలని భార్యాభర్త లిద్దరూ నిర్ణయించుకున్నారు. ఒంటరిగా ఓ గదిలో కూర్చుని నోరారా స్వామిపై పాటలు పాడుకుంటున్న వెంగమాంబ, తల్లిదండ్రులు దేని గురించి మాట్లాడుకుంటున్నారో గ్రహించే స్థితిలో లేదు స్వామి దివ్యమంగళ రూపం తప్ప, అక్కడా మరేమీ కనిపించడం లేదు, ఆ దివ్యనామం తప్ప, ఏదీ  వినిపించడమూ లేదు.
    కృష్ణయ్య ఆ మరునాడే సంబంధాల వేటలో పడ్డాడు. కొన్ని సంబంధాలు తమకు నచ్చక వదులుకున్నారు. వెంగమాంబ గురించి తెలిసి కాబోలు, ఆ మాటపైకి అనకుండా ఇప్పట్లో మా అబ్బాయికి పెళ్ళి చేసే ఉద్దేశ్యం లేదని సున్నితంగానే తిరస్కరించారు. కృష్ణయ్య సంపతులు ధైర్యం చిక్కబట్టుకుంటూ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.
    ఓ రోజు దగ్గరి ఊళ్ళోనే ఒక సంబంధం ఉన్నట్టు తెలిసి కృష్ణయ్య వెళ్ళాడు.
    "పిల్ల భక్తురాలట కదా. కాపురం చేస్తుందా?" అని అడిగింది పిల్లవాడి తల్లి మొహం మీదే.
    "అదేం లేదమ్మా...... ఏదో ఇంట్లో దేవుడిపాటలు, మంగళహారతులు పాడుకుంటూ ఉంటుంది. అంతే" అన్నాడు కృష్ణయ్య.
    "పూజలూ, గుళ్ళూ, గోపురాలు నాలాంటి వాళ్ళకి! చిన్నపిల్లకి అంతచేటు భక్తేమిటి?" సాగదీస్తూ అంది పిల్లవాడి నాయనమ్మ.
    అయినా  మంచిరోజు చూసుకుని పిల్లను చూడ్డానికి వస్తామన్నాడు వరుడి తండ్రి. పిల్లవాడు వ్యవసాయంలో తండ్రికి సాయపడుతున్నాడు. బుద్ధిమంతుడు. పదెకరాల మాగాణి, ఇల్లు ఉన్నాయి. కుటుంబం మంచిది. ఈ సంబంధం కుదిరితే  పిల్ల సుఖపడుతుందని కృష్ణయ్య ఆశ.
    కృష్ణయ్య ఇంటికి రాగానే, కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇస్తూ, ఏమైందని కళ్ళతోనే అడిగింది మంగమాంబ.
    "మంచిరోజు చూసుకుని పిల్లను చూడడానికి వస్తామన్నారు" అన్నాడు కృష్ణయ్య ఇంట్లోకి దారితీస్తూ.
    వెంగమాంబ చెవినపడ్డాయి ఆ మాటలు. "నన్ను చూడ్డానికి రావడమేమిటి? నాకెప్పుడో పెళ్ళయిపోయింది!" అంది.
    కృష్ణయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. "నోర్ముయ్. పిచ్చి మాటలూ, పిచ్చి చేష్టలూ, పెళ్ళి చేసుకోకుండా ఏం చేస్తావే? ఏళ్ళకాలం మాగుండెల మీద కుంపట్లా ఇక్కడే ఉండిపోతావా?" అని అరిచాడు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS