అప్పుడే ప్రదక్షిణం చేసుకుని వచ్చిన పూజారికి వెంగమాంబను చూడగానే ముఖం చాటంతయింది. పలకరించబోయి ఆపిల్ల ముఖంలోకి చూసి విస్తుపోయాడు. "ఏం తల్లీ? ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు?" అని అడిగాడు అనునయంగా.
పూజారి పలకరింపుకు వెంగమాంబలో దుఃఖం పొంగి పొర్లింది. మాట్లాడకుండా అక్కడే చతికిలబడిపోయింది.
"ఏం తల్లీ! ఏమయింది? అసలు గుడివైపు రావడమే మానేశావు. నాన్న వద్దన్నాడా?" పూజారి దగ్గరగా కూర్చుని ప్రశ్నమీద ప్రశ్నలేస్తూనే ఉన్నాడు.
అతికష్టంమీద వెంగమాంబ అసలు విషయం చెప్పింది. "నాన్న ఇంట్లోంచి కదలడానికి వీల్లేదని, నా స్వామిని చూడడానికి వీల్లేదని అంటున్నాడు. ఇక ఆ యింట్లో నేను ఉండలేను" అంటూ మళ్ళీ బావురుమంది.
పూజారి మురిపెంగా ఆ పిల్లవైపు చూస్తూ నిట్టూర్చాడు. ఈ పిల్ల జీవితం ఏ మలుపు తిరుగుతుందో కానీ, అందరు పిల్లల్లాంటిది కాదు. ఏ యోగినో, తపస్వినో, మహాభక్తురాలో ఈ ఊళ్లో ఇలా పుట్టింది. నిత్యమూ భగవంతుడి దగ్గరే ఉండే తనకన్నా ఈ పిల్లే ఆయనకు దగ్గర.
"తల్లీ! అమ్మా నాన్న ఏదో అన్నారని ఇల్లొదిలిపోతావా? వాళ్ళేమన్నా నీ మంచి కోసమే కదమ్మా. ఈ దేవుడెంతో తల్లిదండ్రులూ అంతే. నా మాట విని ఇంటికి వెళ్ళు" అని నచ్చజెప్పాడు.
సరేనంటూ స్వామిని మరోసారి తనివితీరా చూసి భారంగా గుళ్ళోంచి బయటికి నడిచింది వెంగమాంబ.
నిద్రలేచిన మంగమాంబ, కృష్ణయ్యలు కూతురు కనిపించకపోవడంతో వీథిగుమ్మంలో ముగ్గు వేస్తోంది అనుకున్నారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. చూస్తూండగానే పొద్దెక్కింది. ఇది ఇంకా ముగ్గు వేస్తూనే ఉందేమోననుకుని కృష్ణయ్య మనసులోనే చికాకుపడుతూ పాలు తీయడానికి వెళుతూ వీథిగుమ్మంవైపు చూశాడు. వెంగమాంబ కనిపించలేదు. విసవిసా అతివైపు అడుగులేశాడు. వీథిగుమ్మం తుడిచినట్టు కూడా లేదు. గబగబ లోపలికి వచ్చి, నూతిగట్టు దగ్గర అంట్లు తోముతుందేమోనని చూశాడు. ఉహూఁ..... వెంగమాంబ కనిపించలేదు.
కృష్ణయ్యలో కోపమూ, ఆందోళన జమిలిగా పెరిగిపోయాయి. "మంగా.... మంగా.... ఇది కనిపించడం లేదే" అని ఒక్కకేకపెట్టాడు. చేస్తున్న పని మధ్యలోనే వదిలేసి మంగమాంబ కంగారుగా అన్ని గదులూ వెతికింది. వెంగమాంబ కనిపించకపోవడంతో ఆమె గుండె దడదడలాడింది.
కృష్ణయ్య ఒక్క ఉదుటున బయటికి నడిచాడు. నేరుగా గుడికి దారి తీశాడు. పూజారి ఎదురొచ్చాడు. "అమ్మాయి కోసమా? ఇంటికి పంపించి చాలా సేపయిందే" అన్నాడు. కృష్ణయ్య నోటమాట రాలేదు. అమ్మాయి ఇంటికి రాలేదు... ఆమాట పూజారితో అంటే ఊరంతా చెప్తాడు.
"అబ్బే.... అమ్మాయికోసం కాదు. నేను గుడికి వచ్చాను. అమ్మాయి ఇంట్లోనే ఉంది" అన్నాడు నూతిలోంచి వచ్చిందా అన్నట్టున్న కంఠస్వరంతో స్వామిముందు చేతులు ముకుళించి "స్వామీ! ఏమిటీ పరీక్ష! నీవే అమ్మాయిని చక్కదిద్డాలి. మావల్ల కాదు" అని మనసులో అనుకున్నాడు. తన ముఖ కవళికలను పూజారి ఎక్కడ గమనిస్తాడో ననుకుని జాగ్రత్తపడుతూ అక్కడినుంచి బయలుదేరి నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
మంగమాంబ కూతురు కోసం, భర్త కోసం ఎదురుచూస్తూ వీథివాకిలిలోనే ఉంది. ఇంటికొచ్చిన భర్త ముఖకవళికలను గమనించి, పలకరించడానికి కూడా భయపడింది. కృష్ణయ్య వసారాలో నిస్తేజంగా కూలబడ్డాడు.
అంతలో కూరలమ్మి అటువైపుగా వచ్చి, మంగమాంబను చూసి ఆగింది. "అమ్మగారూ, కూరలు తాజాగా వున్నాయి. తీసుకుంటారా?" అని అడిగింది గంప దింపుకుంటూ.
మంగమాంబ నిట్టూర్చింది. 'కూరలు సరేలేవే. మాపాప ఎక్కడైనా కనిపించిందా?' అని అభిమానం చంపుకుంటూ, ఆందోళనగా అడిగింది.
"పాప కనిపించకేమమ్మా! పక్క సందులో ముగ్గులేస్తోంది. వెంటేశ్వర స్వామి ముగ్గంట. అందరూ ఇంతగా సూత్తున్నారమ్మా!" అంది కూరలమ్మి తాపీగా.
మంగమ్మ ముఖం వెలవెలపోయింది. "ఉండవే, ఇప్పుడే వస్తాను" అంటూ పక్క సందులోకి నడిచింది. అప్పటికే ముగ్గువేయడం పూర్తీచేసి దానివైపే వెంగమాంబ తదేకంగా, మురిపెంగా చూస్తోంద్. ఆ సందులోని ఈడు పిల్లందరూ ఆ పిల్ల చుట్టూ మూగి ఉన్నారు. అమ్మలక్కలు చోద్యంగా చూస్తున్నారు.
మంగమాంబ తలెత్తి ఎవరివైపూ చూడకుండా, నేరుగా వెళ్లి వెంగమాంబ చెయ్యి పట్టుకుని ఇంటికి లాక్కొచ్చింది. కోపంతో ఊగిపోతూ గదిలో పెట్టి తాళం వేసింది. భార్య ఉగ్రరూపం చూసి కృష్ణయ్య కోపం అంతరించి సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు.
"బయటికొచ్చావంటే నీ భరతం పడతాను. ఏమనుకుంటున్నావో! నీ పిచ్చి భక్తితో మమ్మల్ని వేపుకు తింటున్నావు కదే. దేవుడు, దేవుడు. ఈ సారి ఇలాంటి పిచ్చిపనులు చేస్తే గరిట కాల్చి వాతపెడతాను. రోగం కుదురుతుంది" అంటూ గదిముందు నిలబడి కేకలు పెట్టింది మంగమ్మ. అంతలోనే దుఃఖం ముంచుకొచ్చి, కళ్లు మూసుకుని అక్కడే కూలబడింది.
తను చేస్తున్న తప్పేమిటో, తల్లిదండ్రులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో వెంగమాంబకు ఆర్థం కావడం లేదు. గదిలోనే నేలమీద పడుకుని స్వామి రూపాన్ని ఊహించుకుంటూ కళ్లు మూసుకుని ఉండిపోయింది.
కృష్ణయ్య లేచి నిలబడి పైగుడ్డ వేసుకునీ వీథిలోకి నడిచాడు. తన సమస్యను ఆప్తులెవరితోనైనా పంచుకుంటే తప్ప గుండె బరువు తీరదని పించిందతనికి. నేరుగా పెద్దాచార్లు గారి ఇంటికి దారితీశాడు.
వసారాలో కూర్చుని ఉన్న పెద్దాచార్లు కృష్ణయ్యను చూసి "రావోయ్..... రా ..... దారి తప్పి వచ్చావు" అంటూ ఆప్యాయంగా పలకరించాడు.
కృష్ణయ్య అక్కడే నేలమీద కూలబడ్డాడు. పెద్దాచార్లుగారిని చూస్తేనే కొంత దిగులు తీరిపోతుంది. ఆ ముఖంలో ఎంతో ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటుంది.
"అమ్మాయితో పెద్ద చిక్కొచ్చి పడింది" అన్నాడు కృష్ణయ్య నిట్టూర్చుతూ.
"ఏదో వింటున్నానయ్యా. అయినా చిన్నపిల్ల. దేవుడూ, భక్తీ మనిళ్ళల్లో ఉన్న సంపదే. పిల్లలో అవి అతిగా ఉన్నాయేమో. పెద్దదై, పెళ్ళయితే అవే సర్దుకుంటాయి. ఆమాత్రానికే సమస్యకుంటే ఎలా కృష్ణయ్య?" పెద్దాచార్లు సానుభూతిగా అన్నాడు.
"ఏమిటో అర్థం కావడం లేదు. స్వామి" అంటూ "గుళ్ళోనూ, వీథుల్లోనూ తాండవమాడుతుంది. ఆ ఇంటికీ ఈ ఇంటికీ వెళ్ళి ముగ్గు అడిగితెచ్చి వెంకటేశ్వరస్వామి బొమ్మలు వేస్తుంది" అన్నాడు కృష్ణయ్య.
"ఈ మాత్రానికే మీ దంపతులు ఊరికే దిగులుపడిపోకండి. ఒక్కగానొక్క కూతురు..... తొందరపడి చేయి చేసుకోవడం లాంటివి చేయకండి. లేతమనసు దెబ్బతింటుంది. మంచి మాటలతో చెప్పండి. ఇల్లు కదలకుండా వీలైనంతవరకు కట్టడి చేయండి. మీరే గోరంతను కొండంతలు చేసుకుంటూ చులకనకాకండి" అన్నాడు.
కృష్ణయ్య కాస్త దిటవు తెచ్చుకుని పెద్దాచార్లు వద్ద సెలవు తీసుకుని ఇంటివైపు నడిచాడు. "పెళ్ళయితే అన్నీ సర్దుకుంటాయి" అన్న పెద్దాచార్లు మాట అతని చెవుల్లో గింగురుమంటోంది.
"పెళ్ళి! అప్పుడే దీనికి పెళ్ళా?" "ఏమో! పెళ్ళయిన వేళావిశేషాన్ని బట్టి పిల్ల మారుతుందేమో" అనుకున్నాడు. మంగమాంబ దగ్గర ఆ విషయం ఎత్తుదామను కున్నాడు గానీ, తనకే వింతగా అనిపించి ఎత్తలేకపోయాడు.
మంగమాంబ బిందె పుచ్చుకొని నీళ్ళు తేవడానికి చెరువుకు బయలు దేరింది. చెరువు దగ్గర అమ్మలక్కలందరూ మూగుతారనీ, వెంగమాంబ గురించి ఏదో ఒక మాట అంటారనీ, సలహాలు ఇస్తారనీ మంగమాంబకు తెలుసు. వీలయినంతవరకు వారిని తప్పించుకుని తిరుగుతూనే ఉంది. కానీ నీళ్ళు తెచ్చుకోవడం తప్పదుకదా! బిడియపడుతూనే చెరువుని సమీపించింది.
అప్పటికే అక్కడకు చేరిన అమ్మలక్కలు ఒకరి ఇంటి విషయాలు మరొకరు కూపీ తీస్తున్నారు. "మీ కోడలు పురిటి కెళ్ళిందటకదా?" అని ఒకరు, "మీ మనవడి కింకా మాటలురాలేదే?" అని మరొకరు, "మీ చిన్నదానికి పదేళ్ళు నిండాయి కదా, ఇంకా విశేషమేమీ లేదేమిటి?" అని ఇంకొకరు ఆరాలు తీస్తూ, చెరువు గట్టున బిందెలు తోముకుంటున్నారు. మంగమాంబ వాళ్ళ కంట బడకుండా, వాళ్ళ చూపులో చూపు కలపకుండా ఉండడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ, వాళ్ళ చూపులో చూపు కలపకుండా ఉండడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ, తలవంచుకుని బిందెలో నీళ్ళు నింపుకోబోయింది. కానీ, ఓ పెద్దావిడ మంగమాంబను చూడనే చూసింది.
ఏమే, మంగా, మన వెంకమ్మ వీథుల్లో గంతులేస్తూ పాటలు పాడు తోందట. అదేమిటే, ఆడపిల్లకు తగునా?" అంది.
మిగిలిన ఆడవాళ్ళు కూడా పని ఆపేసి, మంగమాంబవైపు చోద్యంగా చూస్తూ ఉండిపోయారు.
మంగమాంబకు తలకొట్టేసినట్లయింది. ఏం సమాధానం చెప్పాలో తోచక మాట్లాడకుండా ఉండిపోయింది.
అవున్లే తల్లీ, పిల్లల్ని కన్నాంకానీ , వాళ్ళ బుద్ధుల్ని కన్నామా? అయినా చూస్తూ చూస్తూ ఊరుకోగలమా! ఏదైనా ఉపాయం చూడవలసిందె... "అవునవును" అన్నట్టు మిగిలిన వాళ్ళు ఆ పెద్దావిడవైపు, మంగమాంబవైపు మార్చి మార్చి చూస్తూ ఉండిపోయారు.
మంగమాంబకు కన్నీళ్ళు తరువాయి......
