వెంగమాంబ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"పసిదానితో అంతంత మాటలేమిటండీ?" అని మంగమాంబ భర్తను వారించింది.
పదిరోజులు గడిచాయి. ఆ పెళ్ళివారినుంచి ఎలాంటి కబురు రాలేదు. ఓరోజున బంధువులతో కబురుపెట్టారు, మరో సంబంధం కుదుర్చుకున్నామని.
కృష్ణయ్య దంపతులు నీరుగారిపోయారు. ఈ సంబంధం మంచిది, కుదురుతుందని ఎంతో ఆశపడ్డారు. ఇది కూడా పోయింది. ఇలా ఎన్ని సంబంధాలని వెదకాలి?
అంతలో వీథి గుమ్మంలో ఎవరో వచ్చిన అలికిడైంది. పెద్దాచార్యులు గారు!
"లోపలికి దయచేయండి" అంటూ కృష్ణయ్య ఎదురెళ్ళి ఆహ్వానించాడు.
పెద్దాచార్యులు, కృష్ణయ్య చాలాసేపు వసారాలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. కూతురు పెళ్ళి గురించి తన దిగులును ఆయన ముందు వెళ్ళబోసుకున్నాడు కృష్ణయ్య.
"నీ కూతురుకేం కృష్ణయ్యా, కుందనపుబొమ్మ. ఎటొచ్చీ ఆ పిచ్చిచేష్టలు మానేసి కొన్ని రోజులు కుదురుగా ఉంటే, కోరి అమ్మాయిని చేసుకుంటారు. ఊళ్ళో అందరూ రకరకాలుగా అనుకోవడం వల్ల, వచ్చిన సంబంధాలు కూడా వెనక్కిపోతున్నాయి. ఇంట్లోంచి పిల్ల కదలకుండా ఉండే మార్గం చూడు" అన్నాడు పెద్దాచార్యులు సానుభూతిగా.
కృష్ణయ్య నిస్సహాయంగా ఆయనవైపే చూస్తూ ఉండిపోయాడు.
"నెలరోజులు కట్టడి చేశావంటే సంబంధం అదే కుదురుతుంది" అని పెద్దాచార్యులు అనునయంగా హెచ్చరించి లేచాడు. కృష్ణయ్య ఆయనను వీథి చివరిదాకా సాగనంపి వచ్చాడు.
పిల్లను కట్టడి చేయడానికి ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. అవన్నీ నిరుపయోగమయ్యాయి. ఉధృతంగా విరుచుకు పడే వరదనీటికి చేతులు అడ్డుపెట్టడం ఎంత కష్టమో, వెంగమాంబలో కట్టలు తెంచుకునే భక్తి ప్రవాహాన్ని ఆపడం, అంత అసాధ్యంగా పరిణమించింది. కృష్ణయ్య, కాలికి బలపం కట్టుకుని సంబంధాలు వెతుకుతూనే ఉన్నాడు. ఏదీ ఫలించకుండానే, కాలం మాత్రం దొర్లిపోయింది.
వెంగమాంబ క్రమక్రమంగా యవ్వన ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. యవ్వనకాంతితో ఆపిల్ల, ఆపాదమస్తకం కొత్త అందాలను సంతరించుకుంది. తీర్చిదిద్దినట్టున్న అంగసౌష్టవంతో, చూడగానే ఆకట్టుకునే సౌందర్య లావణ్యంతో, ఆడవారిని కూడా ముఖం తిప్పుకోలేనట్టు చేస్తోంది. పొడవైన నల్లని జడ, నునుపైన బుగ్గలు, పలుచని చెక్కిళ్ళు, పసిమిచ్చాయ. సాటి అమ్మాయిలకు అసూయ కలిగించేలా ఉన్న వెంగమాంబను చూసి ఆ తల్లికి ఆనందం కన్నా విషాదమే ఎక్కువ ఆవరిస్తోంది. దీనికి ఇంత అందమిచ్చాడు కానీ, భగవంతుడు అందరి ఆడపిల్లల్లా పెళ్లై కాపురం చేసుకునే కొద్దిపాటి కుదురు ఇవ్వలేదే అనుకుంటూ మనసులో రోదిస్తోంది.
ఓ రోజున ఉన్నట్లుండి పెద్దాచార్యులు కృష్ణయ్య ఇంటికొచ్చాడు. కృష్ణయ్యను తొందరపెట్టి తనతో తీసుకెళ్ళాడు. చిత్తూరు ప్రాంతంలో ఉన్న నారగుంటపాలెంలో ఒక పెళ్ళికొడుకు ఉన్నాడు. విద్యావినయసంపన్నుడు. నుంజేటి తిమ్మయాగ్రణి కుమారుడు. శ్రీవత్సగోత్రుడు. పెళ్ళికొడుకు తండ్రి పెద్దాచార్యులను, కృష్ణయ్యను సాదరంగా ఆహ్వానించాడు. ఎందుకో ఆ ఇంట అడుగు పెడుతుండగానే ఈ సంబంధం కుదురుతుందని కృష్ణయ్య మనసు చెప్పింది. అందులోనూ తనే కాకుండా అందరూ గౌరవించే పెద్దా చార్యులుగారు కలగజేసుకున్న సంబంధం. కృష్ణయ్య ఆహ్వానం మీద పెళ్ళివారు వచ్చి, పిల్లను చూసుకెళ్ళారు. పెద్దాచార్యులే కృష్ణయ్య తరపున పెద్దరికం వహించి, ఇతర వ్యవహారాలు చక్కదిద్ది ముహూర్తం పెట్టించాడు.
మంగమాంబ, కృష్ణయ్యలకు, కొన్నేళ్ళుగా గూడు కట్టుకున్న దిగులు, గుబులు చిటికెలో ఎగిరిపోయినట్టనిపించింది. చాలాకాలం తర్వాత ఆ దంపతుల ముఖంలో కళాకాంతులు కనిపించాయి.
వెంగమాంబ పెళ్ళి చేసుకోనని ఎంత మొరాయించినా, దైవనిర్ణయమైన కళ్యాణ ఘడియను తప్పించలేకపోయింది. మహాభక్తురాలు, సద్గుణపతికి, వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒక్కగానొక్క కూతురు పెళ్ళిని ఘనంగా జరిపించడంలో కృష్ణయ్య దంపతులు ముందు వెనుకలు చూసుకోలేదు. పెళ్ళిమంటపంలో వధూవరులిరువురూ, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ శ్రీ మన్నారాయణులులా బంధుమిత్రులందరికీ కనులపండుగ చేశారు.
వేంకటేశ్వరుడే తన భర్త అనుకుంది వెంగమాంబ. ఆ పేరుగలవాడే చివరకు భర్త అయ్యాడు. అన్ని నామరూపాలూ ఆయనవే కదా!
పెళ్ళిసందడి ముగిసింది. వచ్చిన బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్ళారు. పిల్లను అత్తవారింటికి పంపేప్రయత్నంలో చీర సారెలు సిద్ధం చేసింది మంగమాంబ. ఓ మంచి ముహూర్తం చూసి వెంగమాంబను అత్తవారింట్లో దింపివచ్చారు.
అత్తవారింట్లో వెంగమాంబకు ఏ లోటూ లేదు. అత్తమామలు కోడలిని కూతురు కంటె ఎక్కువగా, అపురూపంగా, ఆదరంగా చూస్తున్నారు. భర్త ఆమె సౌందర్యానికి పరవశించిపోతున్నాడు.
కానీ, వివాహం వెంగమాంబలో ఎలాంటి మార్పు తీసుకురాలేక పోయింది. సంసార జీవితం ఆమెకు కొంచెమైనా ఆసక్తిని కలిగించలేదు సరికదా, అదో కొత్త సంకెలను తగిలించుకున్నట్లుగా ఆమెకు ఊపిరాడ నివ్వకుండా చేస్తోంది. శారీరక భోగాలు, ఐహిక సుఖాలు ఆమె మనసును మరచలేకపోయాయి. పైగా ఆమెలోని వైరాగ్యాన్ని మరింత పెంచాయి. నిరంతరం శ్రీ వేంకటేశ్వరుని ధ్యానంలోనే మునిగి తేలుతూ ఇల్లు, భర్త, అత్తమామలన్న స్పృహ లేకుండా కాలం గడుపుతోంది. భర్తవైపు బంధవులు, అత్తమామలు వెంగమాంబ భక్తితత్పరతకు మొదట్లో ఆశ్చర్యపోతూ ముగ్ధలయ్యారు. కానీ, క్రమక్రమంగా, ఇటువంటి పిల్ల సంసారమేం చేస్తుందన్న భయం వారికీ కలగడం ప్రారంభించింది.
ఓనాడు వెంగమాంబ అత్తగారు, కృష్ణయ్యకు కబురు పెట్టింది.
కృష్ణయ్య మనసులో శంకిస్తూనే బయలుదేరి కూతురి అత్తవారింటికి వచ్చాడు. వెళుతూనే అత్తగారు మాట్లాడిన మాటలకు మ్రాన్పడిపోయాడు. కోడలి ధోరణి తమకు అర్థం కావడం లేదనీ, అసలు మన లోకంలోనే ఉండడం లేదనీ, కొన్ని రోజులు పుట్టింట్లో ఉంటే మనిషి తిన్నబడుతుందనిపిస్తోందని ఆమె అనగానే కృష్ణయ్యకు గుండె ఆగినంత పనయింది. పెళ్ళయిన పిల్ల పుట్టింట్లో ఉండిపొతే ఎలా? ఇరుగు పొరుగుకు ఏం సమాధానం చెప్పాలి? భగవంతుడా, నాకెందుకిన్ని పరీక్షలు అనుకుంటూ మనసులోనే దుఃఖించాడు.
* * *
"అత్తా, నిన్ను అమ్మ రమ్మంటోంది" అంది సీత, సుందరమ్మ కూతురు.
"ఎందుకే?" అడిగింది మంగమాంబ.
"ఏమో....." అంది సీత సిగ్గుపడుతూ.
మంగమాంబ సీత వెంట వెళ్ళింది.
"రా ....వదినా, ఆమంచి మాట విని వెళతావని పిలిచాను. పిల్ల పెళ్ళి ఖాయమైంది..... ఇక ముహూర్తం పెట్టుకోవడమే" అంది సుందరమ్మ.
"ఆడపిల్ల పెళ్ళి కుదరడం కన్నా సంతోషం కలిగించేదేముంటుంది?" అంటూ మంగమాంబ వివరాలు అడిగి తెలుసుకుంది. కట్నకానుకలు, పిల్లకు పెట్టబోయే నగలు, చీరల గురించి మాట్లాడుకున్న తర్వాత "మన వెంగమాంబ బాగుందా?" అని అడిగింది సుందరమ్మ.
"ఆఁ..... ఆ భగవంతుని దయవల్ల. అత్త, మామ, భర్త అందరూ బాగా చూసుకుంటున్నారు" అంది మంగమాంబ. కొండంత బరువు దిగిపోయినట్లు నిట్టూర్చుతూ. "సీతకు పెళ్ళి కుదిరిందని తెలిస్తే పెళ్ళికి వస్తుందో రాదో?' సుందరమ్మ అంది.
"ఎందుకు రాదు? నేను కబురు పెట్టి రప్పిస్తానుగా వదినా" అంది మంగమాంబ. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక ఇంటకి తిరిగొచ్చింది. మంగమాంబ వచ్చిన కాసేపటికే కృష్ణయ్య, కూతురుతో సహావచ్చాడు ఊరినుంచి.
"ఓ నెలరోజులు మన దగ్గరుంచుకుని తర్వత పంపమంది, వాళ్ళ అత్తగారు" అన్నాడు కృష్ణయ్య ముఖం గంభీరంగా పెట్టి.
మంగమాంబ గుండెల్లో రాయి పడ్డట్టయింది.
"ఏమైందీ?" అని అడిగింది, నూతిలోంచి వచ్చినట్టుంది ఆమె గొంతు.
"ఏముందీ...... దీని భక్తి వాళ్ళకు అర్థం కాలేదట.... అందుకు....." అన్నాడు కృష్ణయ్య.
తల్లీతండ్రీ మాట్లాడుకునే మాటలతో తనకు సంబంధములేనట్లుగా వెంగమాంబ పూజగదిలోకి పరుగుతీసి చిన్నప్పటినుంచి తాను కొలుస్తున్న దేవుడి పాఠం ముందు కూర్చుండి పోయింది.
ఆ సాయంత్రం వెంగమాంబను చూడడానికి సీత వచ్చింది.
"సీతా, నీకు పెళ్ళటగా! అమ్మ చెప్పింది" అంది వెంగమాంబ నిరుత్సాహంగా.
సీత ఎంతో అందంగా సిగ్గుపడిపోయింది.
మాటల్లో తనకు ఎప్పుడో పెళ్ళయిపోయిందనీ, తన భర్త శ్రీ వేంకటేశ్వర స్వామి అనీ, అసలు తాను అలమేలు మంగమ్మనని అంది వెంగమాంబ.
