పులిగోరు పతకం
"ఇలారా"- నెమ్మదిగా పిలిచింది రాధికని రాజ్యలక్ష్మమ్మగారు 'వెళ్ళు'- గుమ్మం దగ్గరే నిలబడ్డ రామం నవ్వుతూ అన్నాడు.
వేలికున్న మట్టెలు ఇంకా అలవాటు పడలేదు. నడుస్తుంటే కొత్తగా అనిపిస్తోంది రాధికకి. మెడలో వున్న చంద్రహారంతో కలిసిపోయిన పసుపుతాడు సరిచేసుకుంటూ గుమ్మం దగ్గరే నిలబడింది కొత్త పెళ్ళికూతురు రాధిక.
"పద, నేనూ వస్తా" రాధిక భుజం మీద చేయి వేసి గదిలో కొచ్చాడు రామం.
రాజ్యలక్ష్మమ్మకి డెబ్భై ఏళ్ళు నిండాయి. రెండు రోజుల నుంచి ఆవిడకి కాస్త జ్వరంగా వుంది. అమ్మమ్మ వంకేచూస్తున్నాడు రామం కన్నార్పకుండా.
చదువుకునే రోజుల్లో సెలవులు ఇవ్వటంతోనే అమ్మమ్మ ఊరు వెళ్ళేవాడు రామం. పెద్దమ్మ పిల్లలు, మామయ్య పిల్లలు అంతా సెలవులకి అక్కడే చేరేవారు. పిల్లలందరూ తినడానికి అరిసెలు, జంతికలు చేసి డబ్బాల నిండా నింపేది అమ్మమ్మ. ఎవరూ తీసుకు తినడానికి వీల్లేదు. అమ్మమ్మే పెట్టాలి. కానీ తనంటే మాత్రం అమ్మమ్మకి ప్రత్యేకమైన ఇష్టం. ఎవరూ చూడకుండా రహస్యంగా పిలిచి జంతికలు ఇచ్చి, ఎవరికీ చెప్పకు అనేది. అది ఎంతో గొప్పగా అనిపించిందానాడు. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తోంది. రామం అమ్మమ్మ వంక అలానే చూస్తున్నాడు పాపం, ఎంతో పెద్దదయిపోయింది. జుట్టు ముగ్గుబుట్టలా అయిపోయింది. అమ్మమ్మకి తనంటే ఎంతో ఇష్టంకదా- మరి తనేం చేసాడు అమ్మమ్మకి? అమ్మమ్మ దగ్గర కూచుని ఎక్కవసేపు కబుర్లు చెప్పాలంటే తను బోరింగ్ అనుకుంటున్నాడు - అమ్మమ్మ వంకే చూస్తున్నాడు రామం. పక్కనే రాధిక నిలబడి వుంది.
"వంగి నమస్కారం పెట్టు మా అమ్మమ్మ పాదాలకి" ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు రామం.
"అదే- సాష్టాంగ దండ ప్రయాణమా" రాధిక చిలిపిగా నవ్వుతూ అంది.
"ప్రణామం, ప్రయాణం కాదు"
"ఒకే"- రాధిక అమ్మమ్మ పాదాలకి నమస్కారం పెట్టింది.
'తలుపు దగ్గరగా వేయి' అమ్మమ్మ నెమ్మదిగా అంది.
"ఆ మంచం కింద పెట్టి బయటికి లాగు-'
రామం మంచం కిందకి దూరాడు. ఆ పెట్టి మంచం కింద లోపలగా వుంది. ఆ మంచం కింద నుంచి పెట్టి తీస్తుంటే, రాధిక నవ్వు ఆగలేదు
"యాంటిక్"- నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది.
"మా అమ్మమ్మకి ఇంగ్లీషు వచ్చు, నెమ్మదిగా మాట్లాడు"- పెట్టి ముందుకు జరుపుతూ రామం అన్నాడు.
"అవును, ఈ పాతకాలపు పెట్టిని చూస్తే అమ్మాయికి నవ్వు వస్తుంది మరి- నాలాగే అదీ యాంటిక్"- పాతది కదూ అమ్మమ్మ మంచం మీది నుంచి లేచి కిందకూచుంది.
అమ్మమ్మ మెడలో ఆరు వరసల చంద్రహారం మెరుస్తోంది. చంద్రహారానికి ఓ చిన్న పిన్నుతో తాళంచెవి కదులుతోంది. కళ్ళజోడు సరిచేసుకుంటూ తాళం తీసే ప్రయత్నం చేస్తోంది అమ్మమ్మ.
"నేను తియ్యనా-" రాధిక అంది.
"ఎందుకూ- నేను తియ్యగలను"- కళ్ళజోడు మరోసారి సరిచేసుకుంది అమ్మమ్మ.
పెట్టి తాళం వచ్చింది. దాంట్లో ఓ చిన్న గుడ్డసంచి బట్టల మధ్య దాచింది. పైకి తీసింది. ఆ సంచికి వేసిన ముళ్ళు విప్పుతుంటే రాధిక రామం వంక నవ్వుతూ చూసింది. చూపులతోనే హెచ్చరిక చేసాడు నవ్వొద్దని.
"ఈ మధ్య పెట్టి తీయటం లేదుగా. ఇందులోవన్నీ అలానే పడున్నాయి....ఇలారా...."
రామం అమ్మమ్మ దగ్గరగా జరిగాడు.
"నీకోసం దాచిన జంతికలు వస్తాయి చూడు ఇప్పుడు బయటకి"
రామం చెవిలో రహస్యంగా అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ రాధిక.
"దగ్గరగా రా- ఇది నీ మెళ్ళో పెట్టుకో" పులిగోరు పతకంతో వున్న బంగారు గొలుసు!! రాధిక కళ్ళప్పగించి చూస్తోంది.
"దీన్ని నువ్వే మెళ్ళోవేసుకో- ఆ పెద్దాడికి ఇవ్వనన్నానని వాడికి నా మీద కోపం- వస్తే రానీ, నాకేం? ఆ జుట్టు కత్తిరించుకున్న పిల్ల, అదే వాడి భార్యకిది నచ్చుతుందా- అందుకే నీ కోసమే ఇది దాచాను" అమ్మమ్మ అంటుంటే రాధిక తన పొడుగాటి జడను ముందుకు వేసుకుంది.
పెళ్ళి కూతురుగా పదహారు రోజుల పండుగ వరకైనా చేతుల నిండా గాజులు వుంచుకోమని, నుదుట చక్కటి కుంకుమ బొట్టు పెట్టుకోమని, స్టిక్కరు బౌట్టు పెట్టుకోవద్దని, జడకుచ్చులతో పొడుగ్గా జడవేసుకోమని, నైటీలు వేసుకు పగలంతా తిరక్కుండా లక్షణంగా చీర కట్టుకోమని, బయట కెళ్ళేప్పుడు పాంటు చొక్కా వేసుకోవద్దని తనకి తల్లి మరీ మరీ చెప్పటం గుర్తుంచుకుంది రాధిక. అయితే పదహార్రోజుల పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. అది అయిపోతే తను ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఇంట్లో వున్నప్పుడల్లా నైటీతోనే తిరగచ్చు. జుట్టు చక్కగా బ్యూటీ పార్లర్ లో సెట్ చేయించుకుని, భుజాల వరకు వేలాడేసుకోవచ్చు, హాయిగా పెదాలకి రంగు వేసుకోవచ్చు, టి.వి.యస్. మీద ఎక్కడికైనా వెళ్ళచ్చు. అందుకే రాధిక జడకుచ్చులు సరిచేసుకుంటూ అమ్మమ్మ వంక చూసింది.సరిచేసుకుంటూ అమ్మమ్మ వంక చూసింది.
"అమ్మాయ్"-
"చెప్పండి అమ్మమ్మగారూ" - అమ్మమ్మ గారి పాదాల దగ్గర కూచుంది రాధిక.
"ఇది ఇప్పుడెంతో ఖరీదు, వీడి కోసం జాగ్రత్తగా దాచి పెట్టాను. దీన్ని లాకర్లలో పెట్టి దాచుకోకుండా హాయిగా మెళ్ళో వేసుకోనియ్యి."
"ఒరేయ్- ఆ పెద్దాడికి అప్పుడే చెప్పకు"
"సరే, సరే" రామం చేతిలో గొలుసు కదులుతోంది. ఆ గొలుసుకున్న పులిగోరు వంకే చూస్తోంది రాధిక.
"ఇవి నిజంగా పులిగోర్లేనా" పరీక్షగా చూస్తూ అంది.
"అవును. మా తాతయ్య వేటకెళ్ళి పులిని చంపి, వాటి గోళ్ళు తెచ్చాడు. మా అమ్మమ్మ ఇలా పతకంలో వాటిని అమర్చి నాకోసం దాచి వుంచింది - సరేనా"-
"నిజం పులి" - ఆశ్చర్యంగా రాధిక అంటుంటే రామానికి అమ్మమ్మకి కూడా నవ్వొచ్చింది.
"అదేమిటి అమ్మా - అంత చదువుకున్నావే - ఆ మాత్రం తెలియదూ - తాతగారేమిటి - వేటకెళ్ళటమేమిటి - ఆ రోజుల్లో కోయవాళ్ళు తెచ్చి అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు పిల్లలందరికీ మెళ్ళో వేసేవాళ్ళం గొలుసు చేయించి అమ్మాయ్. వీడికి చిన్నప్పుడు కాళ్ళకి గజ్జెలు, చేతులకి మురుగులు, మొలలో బంగారు మామిడి పిందెలు-"
రాధిక నవ్వు ఆపుకోలేక పైకే నవ్వేసింది.
"ఏమిటలా నవ్వుతావు ఆ ఫోటో నాదగ్గరే వుంది." రామానికి భయమేసిపోయింది. ఇప్పుడా పెట్టిలోంచి ఫోటో బయటికి తీస్తుందేమో అమ్మమ్మ అని.
"అది అన్నింటికీ అలాగే నవ్వుతుందిలే- అయినా అమ్మమ్మా బంగారాన్ని, వెండివీ చిన్నప్పట్నుంచీ వేసుకోటానికి ఎంతో పెట్టి పుట్టాలిలే- దీనికేం తెలుసు- చేతులకి ప్లాస్టిక్ గాజులు, మెళ్ళో పూసల గొలుసులూనూ"- వెక్కిరింపుగా అంటూ రాధిక వంక చూసాడు.
"పోన్లే వాడి మాటలకేం కానీ, ఇది వాడు మెళ్ళో వేసుకొనేలా చూసే బాధ్యత నీకప్పగిస్తున్నా"
రామం మెడలో పులిగోరు పతకం గొలుసు మెరిసింది. ఇద్దరూ అమ్మమ్మ పాదాలకి నమస్కరించారు. అమ్మమ్మ పెట్టికి తాళం వేసి, మంచం కిందికి తోసేసింది.
* * *
అప్పటి నుంచీ మొదలయింది రాధికకి భయం - ఈ పులిగోరు పతకంతో గొలుసు నిజంగానే డాక్టరు రామం మెళ్ళో వేసుకుని హాస్పిటల్ కి వెడతాడేమోనని.
"మీ అమ్మమ్మ మరీనూ- అ పులిగోళ్ళు, సింహపు గోళ్ళు ఏమిటీ ఆవిడ మెడలో వున్న చంద్రహారం మీకిస్తే ఎంత బావుండేదో- నేను ఏ పండగనాడో పెళ్ళినాడో చక్కగా వేసుకునేదాన్ని-" కాఫీ బల్లమీద పెడుతూ రామం వంక చూసింది.
లోపల బనీనులో వున్న గొలుసు పైకి తీసుకున్నాడు రామం.
"ఇది మా అమ్మమ్మ నాకిచ్చింది-నేను వేసుకుంటాను హాయిగా"
"రేపు డ్యూటీకి వెడతాను ఇది మెళ్ళో వేసుకుని"-
"నిజంగా వెడతారా"
"ఆ"-
"ఖచ్చితంగా"-
"అనవసరమైన విషయాలు కల్పించుకోకు. మా అమ్మమ్మకి నామీద ఎంత ప్రేమ లేకపోతే దాచి దాచి నాకిస్తుందో చెప్పు-
"నా మాట వినండి. ఇది మెళ్ళో వేసుకుని హాస్పిటల్ కి వెడితే అందరూ నవ్వుతారండి- దీన్ని చెరిపించి, సన్నగా, నాజూగ్గా ధగ ధగ మెరిసే గొలుసు చేయిస్తాను.... అది మీ మెళ్ళో ఎంతో బావుంటుంది. తెల్లగా వుండే మీ మెడలో ఈ బంగారపు సన్నని గొలుసు ఎంత అందాన్నిస్తుందో!" రాధిక రామం మెడలో వున్న పులిగోరు పతకాన్ని అటు ఇటు తిప్పిచూస్తూ అంది.
"అమ్మమ్మ ఇచ్చిన గొలుసు. నాకు కొన్ని సెంటిమెంట్లున్నాయి. వాటె గ్రేట్ లేడీ షీ ఈజ్!" ఆ గొలుసుని కళ్ళకద్దుకున్నాడు రామం.
రాధికకి కోపంతో బుగ్గలెర్రబడ్డాయి. డైనింగ్ టేబుల్ మీద వున్న పత్రిక తిరగేసింది కాసేపు. రామం కొంటెగా ఆమెకేసి చూసి మరీ నవ్వుతున్నాడు.
"అలా నవ్వక్కర్లేదు- నాకూ వున్నాయి సెంటిమెంట్లు"
"ఉండనీ- మంచిదేగా" రామం రాధిక కేసి చూసాడు రాధిక క్షణం మాట్లాడలేదు.
"సరే వినండి- మా నాయనమ్మ తీసికెళ్ళమంది- ఈ మాటు వచ్చినపుడు తీసుకొస్తానన్నాను."
భుజాల దాకా వేలాడుతున్న జుట్టును ముందుకేసుకుంది రాధిక.
"తెచ్చుకో"- రామం ఈలవేస్తూ, అద్దం ముందు నిలబడి దువ్వుకుంటున్నాడు.
"అది ఎంత పెద్దదో తెలుసా"
"పెద్ద వస్తువయితే మరీ మంచిది- మనకే లాభం"
"మన రెండు బెడ్ రూములూ కలిపినా నడవటానికి చోటుండదు."
"పోనీ నడవద్దు" రామం రాధిక బుగ్గమీద చిటికేసాడు.
"వినండి- ఇలా హాయిగా వచ్చిపడుకోటానికి వీల్లేదు. వింటున్నారా! ఎత్తయిన పీట వేసుకుని దానిమీదకి ఎక్కాలి- దాని చుట్టూ గిలకలు వుంటాయి. అటు ఇటు అద్దాలు అమర్చి వుంటాయి. దానికి పందిరి వుంటుంది. ఇంకా"
"ఊ సరే"- రామం కిటికీ వంక చూస్తున్నాడు.
"ఏమిటి సరే- అది పెద్ద పందిరి పట్టె మంచం-" రాధిక గొంతు హెచ్చించింది.
"రాధీ. నీకు తీసుకురావాలనిపిస్తే తెచ్చుకో, అక్కర్లేదనుకుంటే మానేయ్"
"నేనే తెచ్చుకోవాలి దాన్ని- అక్కకి వద్దంది, ఇల్లు చిన్నదని. ఒదినకి అక్కర్లేదట, డబుల్ కాట్స్ అందమైనవి చేయించుకుంటుందిట- నేనే తెచ్చుకోవాలి.... పైగా మా నాయనమ్మది అది- నాకూ సెంటిమెంటు మరి"
అలాంటి పట్టెమంచం తాతగారింట్లో వుండటం రామానికి గుర్తొచ్చింది. ఒక్కసారి రామానికి రాధికపై కోపం కూడా వచ్చింది. తన మెడలో పులిగోరు పతకానికి, ఆ పందిరి మంచానికి ఏమిటి సంబంధం?
"ఈ రెంటికి సంబంధమేమిటి" కోపంగా అరిచాడు రామం.
"రెండూ యాంటిక్సే - అదే సంబంధం" రాధిక ఎర్రటి రంగుతో మెరుస్తున్న పొడుగైన గోళ్ళవంక చూసుకుంటూ అంది.
"ఆ పులిగోర్లని చూస్తే భయమేస్తోంది బాబూ ఇటివ్వండి చెరిపించి సన్నని గొలుసు" - రాధిక బతిమాలింది.
"నో - ఇది నాది అంతే" రామం మెళ్ళో గొలుసు వంక మరొక్కసారి గర్వంగా చూసుకుంటూ పేపరు తిరగేయటం మొదలుపెట్టాడు - రాధికకి ఏంచేయాలో తోచక అలాగే రామంవంక చూస్తూ కూర్చుంది.
* * *
వారం రోజులు గడిచాయి. పెళ్ళికోసం పెట్టిన సెలవు ఇద్దరిదీ రేపటితో అయిపోతుంది. రామం వంక చూసినపుడల్లా ఆ పతకం ధగధగ మెరుస్తూ రాధికకి కోపాన్ని తెప్పిస్తోంది.
ఆరోజు ఆదివారం. త్వరగా భోజనంచేసి ఇద్దరూ రామం స్నేహితుడింటికెళ్ళటం ఆ రోజు ప్రోగ్రాము.
కాలింగ్ బెల్ మ్యూజికల్ గా మోగింది.
"ఓ - మర్చిపోయా - ఈ రోజు మా లలిత వస్తానంది" రాధిక హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది.
న్యూయార్కులో వుంటున్న లలిత హైదరాబాద్ వచ్చి వారం రోజులయింది. లలిత, రాధిక చిన్నప్పట్నించీ స్నేహితులు. స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఉన్నట్టుండి లలిత మెడవైపు చూస్తూ కన్నార్పకుండా వుండిపోయింది రాధిక.
ఏమిటే అలా చూస్తున్నావు - బాగా లావయి, మెడ నిండుగా - " లలిత ఏదో అనబోయింది.
"అదికాదు, నీ మెడలో" రాధిక అలానే చూస్తోంది.
"ఓ - ఇదా - ఇది ఇప్పుడక్కడ ఫేషన్ - అంతేకాదు, నా ఫ్రెండు ఇండియా వచ్చినప్పుడు నాకోసం కొనితెచ్చింది. దీన్ని చూసి ఇలాటిదే కావాలని నా ఫ్రెండ్సు ఎందరో అడిగారు. నేను వెళ్ళేప్పుడు కొనుక్కెళ్ళాలి....!"
లలిత మాటలేవీ వినిపించుకోటం లేదు రాధిక. మెళ్ళోనించి తీసి రాధిక చేతిలో పెట్టింది లలిత. పులిగోరు పతకం సన్నని గొలుసుకి లాకెట్టులా వేలాడుతోంది!
"ఇది నిజంగా పులిగోళ్ళా-" రాధిక ఆ గొలుసు చేతిలో అటు ఇటు తిప్పుతూ అంది.
లలిత గలగల నవ్వింది. "నిజంగా పులిగోళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు - పులిగోళ్ళే అయితే ఆ హారం ఎంత అందంగా వుంటుందో నేను ఊహించగలను - ఎక్కడున్నా యిప్పుడు అలాంటివి? ఇవి ప్లాస్టిక్ వి - ఒసేయ్ రాధీ - నిజంగా పులిగోరు పతకం ఎక్కడైనా దొరుకుతుందంటే చెప్పు - ఎన్ని డాలర్సు ఇచ్చేనా ఇప్పుడే కొనుక్కుంటా అబ్బ, ఎంత ఫాషనో తెలుసా!" లలిత మాటలకి కళ్ళు పెద్దవి చేసింది రాధిక.
"బాలకృష్ణుడి పటంలో చూసారట. అది కాలండర్ బొమ్మ. నా మెడలో వున్న దీన్ని చూసి ఇదే కావాలని పట్టుపట్టారు అక్కడ నా స్నేహితులు."
స్నేహితురాళ్ళిద్దరి మాటలు వింటున్న రామానికి నవ్వు ఆగలేదు.
"కృష్ణుడి ఫించం కూడా చూడలేదా మీ ఫ్రెండ్సు - లేకపోతే నెమలిఫించాలు తెమ్మనేవారే మిమ్మల్ని" - ముందు గదిలో నుంచే గట్టిగా అన్నాడు రామం.
లలిత, రాధిక కూడా పకపకా నవ్వుకున్నారు.
"ఫాషన్ ఎంత త్వరగా మారిపోతుందో చెప్పలేం."
"అక్కడెందుకు, ఇప్పుడిక్కడా పులిగోరు పతకం ఫాషనే" అంది లలిత.
ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక లలిత వెళ్ళిపోయింది. రాధిక ఏదో ఆలోచిస్తూ సోఫాలో అలానే కూచుండిపోయింది. రామం చదువుతున్న పుస్తకం పడేసి నిద్రలోకి జారుకున్నాడు.
* * *
తెల్లవారగానే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తిచేసేసుకుంది రాధిక. రామం ఈ రోజు నుంచీ హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి.... రాధిక ఆఫీసుకి వెళ్ళిపోవాలి.
గాడ్రెజ్ తీసి హాఫ్ వాయిల్ జరీ చీరపైకి తీసింది రాధిక. రామం వైపు చూస్తూ "ఇదే మాచింగ్" అనుకుంది మనసులో.
బూట్లు తొడుక్కుంటున్నాడు రామం. అద్దంలో మరొక్కసారి చూసుకుని జారే అంచులు సరిచేసుకుంది రాధిక.
"బయల్దేరుదామా" - రామం పెన్ జేబులో పెట్టుకున్నాడు. రాధిక రామం దగ్గరకొచ్చి నిలబడి రామం మెడలో వున్న గొలుసు గబుక్కుని తీసుకుని తన మెడలో వేసుకుంది. గబగబా డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి నిలబడి మెళ్ళో వేసుకున్న పులిగోరు పతకాన్ని సరిచేసుకుంటోంది.
"ఇది ఫాషన్ కదూ" రామం రాధిక వంక తిరిగాడు.
"అవును-అమ్మమ్మగారు బలే మంచిదిచ్చారు నాకు."
"నీక్కాదు-నాకు-"
"అదేలెండి - ఎవరికైతేనేం - మనిద్దరిలో తేడాలేమిటి? ఎంతో బావుంది!" మెడలో వున్న పులిగోరు పతకం గొలుసు చూసుకు మురిసిపోతున్న రాధికను చూస్తూ నవ్వుకున్నాడు రామం.*
