Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 10


                                                         పరమార్థం

    శాంతమ్మ మనసుని సమాధాన పరచుకోడానికి ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా మనసుని వేధిస్తున్నదొక్కటే, జీవిత పరమార్థం ఇదికాదని.
    శాంతమ్మ తులసి తోట గుమ్మంలో కూచుని పత్తి విప్పుతోంది. ఉయ్యాలలో పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. విసుక్కుంటూ లేచే పిల్లాడి నోట్లో పాలసీసా వుంచింది. 'ఇప్పటికి వినిపించిందా' రాఘవయ్య గదిలోనించి ముందు గదిలోకొచ్చాడు. 'ఆ-వినిపించింది. ఓ రామా లేదు. కృష్ణా లేదు' విసుగ్గా అంది శాంతమ్మ.
    అప్పుడే గడపలో అడుగు పెట్టిన కోడల్ని చూసి 'అప్పుడే వచ్చేవేమిటి?' అడిగాడు రాఘవయ్య.
    'ఇంకా ముందు రావాల్సినదాన్ని, బస్సు అందక' ఉయ్యాల్లో పిల్లాడి దగ్గర కెళ్ళింది రాధ.
    'పిల్లాడికి బాగాలేదనే మధ్యాహ్నం సెలవు యిచ్చి వచ్చేసాను' ఉయ్యాల ఊపుతూ అత్త వినేలా అంది రాధ.
                                                  *    *    *
    రాధంటే శాంతమ్మకి చాలా యిష్టం. కూతురు ఫారిన్ లో ఉంది. ఏ నాలుగేళ్ళకో ఓసారి వచ్చి వెళ్ళిపోతుంది. తన ఇంట్లో లక్షణంగా తిరిగే కోడలును ఏనాడూ కోడలులా చూడలేదు శాంతమ్మ నిజానికి. కొడుకు కోడలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే. కలసి సినిమాల కెడుతుంటే ఎంతో ఆనందపడేది శాంతమ్మ. రాధ స్నేహితులంతా అనేవారు 'ఒసేయ్ రాధా, అదృష్టం అంటే నీదేనే - భర్త ప్రేమగా చూడటంలో గొప్ప విశేషమేముంది? అత్తగారు ప్రేమగా చూడటంలోనే గొప్పంతా' అని. తల్లికి దూరంగా వున్నానని అనుకునేదేకాదు రాధ. కానీ ఈ మధ్య పాలల్లో ఉప్పురాయి పడ్డట్టు నిర్మలమైన శాంతమ్మ మనసు ఎందుకో కలతచెందుతోంది.
    ఆ రోజు రాత్రి రాధకి ఎంతకీ నిద్రపట్టలేదు. టు ఇటు ఒత్తి గిల్లింది. చివరికి 'ఏమండీ' అని భర్తను లేపింది. 'ఊ' పక్కకు ఒత్తిగిల్లాడు రామం.
    'అత్తగారెందుకో అదివరకులా లేదు - గిట్టని వాళ్ళు నాపైనా చెప్పారేమో - పిల్లాడిని కూడా అదివరకంత లాలనగా చూడడం లేదు.'
    రామం నవ్వాడు. 'అర్థంలేని ఆలోచనలతో' మనసు పాడుచేసుకోకు. అమ్మ చాలా మంచిది. చెప్పుడు మాటలకి మారిపోదు' - రామం క్షణంలో మళ్ళా నిద్రలో మునిగిపోయాడు.
                                                  *    *    *
    పక్కింటి పార్వతమ్మతో కలిసి పొద్దున్న ఎనిమిదయ్యేసరికి గుడికి బయలుదేరింది శాంతమ్మ ఆ రోజు. 'అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి వెడుతున్నాను' గదిలో ముసలాయనకి, వంటింట్లో వున్న కోడలుకి వినబడేలా ఓ కేక పెట్టింది.
    రాధకి ఏం చేయాలో తోచలేదు. తన ఆఫీసు కెళ్ళితే పిల్లాణ్ణి ఎవరు చూస్తారు? పాలు కలపడం, పట్టడం మామగారికి రావు. తనకి ఇంక సెలవులు కూడా లేవు. రాధ మనసులో కొన్ని వందల సమస్యలు తల ఎత్తి నాట్యమాడాయి ఆ క్షణంలో.
                                                  *    *    *
    గుళ్ళో కూచ్చున్న శాంతమ్మ అమ్మవారి విగ్రహంకేసే చూస్తోంది. ఎంత చక్కగా అలంకరించారు! ఇంతకాలం దైవచింతనకి తావులేకుండా గడిపేసింది. ఓ వ్రతాలు, తీర్థయాత్రలు ఏవీ లేవు. కాని తను ఏ క్షణంలో కన్ను మూస్తుందో- అప్పుడు తనవెంట వచ్చేవి ఏవీ- ఈ ఇల్లు, పిల్లలు, మేడలు, మిద్దెలూనా? కావే- తను చేసుకున్న పుణ్యమేదో అదే! శాంతమ్మ గడిచిపోయిన కాలాన్ని తల్చుకుని పశ్చాత్తాప పడింది. శాంతమ్మ అమ్మ వారి విగ్రహాన్ని చూస్తూనే వుంది - కనీ నిశ్చలత కుదరటం లేదు - రాధమ్మ ఆఫీసుకి వెళ్ళివుంటుంది. పసివాడు ఇప్పుడిప్పుడే పాకుతున్నాడు. గడపదాటి బయటికొచ్చేస్తే? ముసలాయన నిద్రపోతుంటే? శాంతమ్మ గుండె ఝల్లుమంది. ఇక గుడిలో కూచోలేక పోయింది. అయినా ఇంత నిశ్చలత లేకపోతే ఎలా? సమాధానపరచుకుని మళ్ళీ కూచుంది.
                            *    *    *
    రాధ ఓ వారం రోజులు నానా ఇబ్బందిపడి పనిపిల్లని కుదిర్చింది. పిల్లాడిని ఎత్తుకోటానికి, ఆడించటానికి, పాలు పట్టడానికి, నిద్ర పుచ్చటానికీ. కాని ఇంట్లో రాధ, భర్త ఏదో చిరాకుగానే వుంటున్నారు- విసుగ్గా వుంటున్నారు. ఇంట్లో పనులన్నీ యాంత్రికంగానే జరిగిపోతున్నాయి. భోజనాల దగ్గర గంటలు గంటలు కబుర్లు చెప్పుకోటాలు, సినిమాలు, షికార్లు అన్నీ ఇంచుమించుగా తగ్గిపోయాయి. శాంతమ్మ అంతా గమనిస్తూనే వుంది. తను ఇంటి బాధ్యత పట్టించుకోడం పూర్తిగా తగ్గించేసింది - ఉంటే దేవాలయంలో, లేకపోతే చేతిలో భాగవతంతో మాత్రమే కనిపిస్తోందీ మధ్య. అవును మరి - తన పరమార్థం తను చూసుకోవద్దూ!
    కాని, శాంతమ్మ విషయం ఎవరూ ఇంట్లో పట్టించుకోటం లేదు. పిల్లాడిని ఎంత పనిలో వున్నా అత్తగారికి అందివ్వడం మానేసింది రాధ. ఆఫీసు విశేషాలు రకరకాలుగా రోజూ అమ్మకు చెప్పే రామం చాలా ముభావంగా వుంటున్నాడు. ముసలాయన మనుమడి సేవలో మునిగిపోయాడు. శాంతమ్మ ఆ రోజు తను ఆ ఇంట్లో ఒంటరిదయి పోయినట్లు బాధపడింది మొదటిసారిగా. అయినా గుళ్ళు గోపురాలు తిరిగివస్తేనేనా వుంది భక్తి! ఏమో - ఇల్లంతా తనే అయి భర్తని, పిల్లల్ని సంతోషపరుస్తూ గడిపిన రోజుకన్నా ఇప్పుడు సాధించినదేమిటి? ఏమో - మానసిక సంఘర్షణలో పడి నలిగిపోయింది శాంతమ్మ. భాగవతంలో రెండు కన్నీటి బిందువులు జారిపడ్డాయి.
    'శాంతమ్మా, శాంతమ్మా! బయలుదేరు - ఊరేగింపు వస్తోంది - వెళ్ళాలనుకున్నాం కదూ' గోడవతల నుంచి పార్వతమ్మ కేక పెడుతోంది.
    "ఒంట్లో బాగా లేదు - రాలేను ఒదినా" - శాంతమ్మ భాగవతం మూసేసి గదిలోకొచ్చింది.
    ఆ రాత్రి శాంతమ్మకి ఎంతకీ నిద్రపట్టలేదు - లేచి మంచం మీద కూచుంది. ఏదో అశాంతి. తనకు తెలియకుండానే తన నుంచి ఏదో దూరమయిపోయినట్లు ఆవేదన. "ఏమండీ" నిద్రపోతున్న రాఘవయ్యను కదిపించింది. "ఏమిటీ" రాఘవయ్య లేచి కూచున్నాడు. భార్య కళ్ళలోకి చూచాడు. కళ్ళలో ఎంతో దిగులు - పాపం, అనుకున్నాడు మనసులో - భార్యను చూస్తూ.
    'మనసేమీ బాగాలేదండీ' శాంతమ్మ కన్నీళ్ళు ఆపుకోలేక పోయింది. రాఘవయ్య క్షణం ఆగి _
    'అదేమిటి - మనసు బాగుండకపోడం అంటే - అయినా శాంతా నీకేం బోల్డు పుణ్యం సంపాదిస్తున్నావుగా'- నెమ్మదిగా నవ్వాడు రాఘవయ్య.
    ఆ నవ్వు శాంతమ్మ గుండెల్ని పిండిచేసింది. ఇంత మందిని క్షోభ పెడుతూ తను మూటకట్టే పుణ్యం ఎంతటిది? శాంతమ్మ శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది.
                                                 *    *    *
    గుడిలో దేవుడి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్దామనీ, పదిరోజులుగా ఇల్లు కదలని శాంతమ్మని చూద్దామని వచ్చిన పార్వతమ్మ, ముందు గదిలో నవ్వుకుంటూ కబుర్లాడుకుంటున్న రాధని, రామాన్ని, దొడ్డి గుమ్మంలో మనుమణ్ణి ఒళ్ళో కూచోపెట్టుకుని ముసలాయనతో ముచ్చట్లాడుతున్న శాంతమ్మనీ చూసి 'ఎన్ని జన్మలెత్తినా ఈ శాంతమ్మ కిక ముక్తిలేదు' అని గొణుక్కుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మరుక్షణంలో.
    "నాకు ఏ గుళ్ళూ, గోపురాలు అక్కర్లేదు బాబూ, ఈ పసివాడే పరమాత్మ" పసివాడి పాల పెదాలు చీర కొంగుతో తుడుస్తూ మురిసిపోయింది శాంతమ్మ.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS