Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 8


                         ఓ ఇల్లాలు కావాలి
    "నాన్నా...."
    విశ్వనాథం తలెత్తాడు పేపర్లోంచి.
    లలిత క్షణం మాట్లాడలేదు.
    "నాకు పెళ్ళి చేయరా ఇంక-"
    విశ్వనాథం నెత్తిన పిడుగు పడ్డట్టయింది.
    "చెప్పండి నాన్నా. నా పెళ్ళి గురించి మీకెలాంటి తొందర లేదుగా...."
    "ఏమిటమ్మా, నీకు పెళ్ళి చేయాలన్న విషయం నాకు తెలియదూ__"
    "తెలియదు నాన్నా - నిజంగా తెలియదు. తెలిస్తే__" లలితమ్మ ఏదో అనబోయింది. ఇంతలో జారిపోతున్న సిగపిన్నులు సరిచేసుకుంటూ ఇందిరమ్మ లోపలకొచ్చింది.   
    "దీనికేదో పిచ్చిపుట్టింది - ఇందాక నన్నూ యిలాగే అడిగింది. రెండు తిట్టి నోరు మూయించాను-" దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతుంటే లలితమ్మ నవ్వుతుంటే అనుకోని ఈ సంఘటనకి విశ్వనాథం ముఖం వెలవెల బోయింది.
    "నీకు పెళ్ళిచేయనని ఎందుకనుకుంటున్నావు? ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకి పెళ్ళి చేయకుండా ఊరుకుంటారా?" విశ్వనాధం నెమ్మదిగా అంటున్నాడు. "నీ మనసులో యెవరైనా వుంటే - అదే, ప్రేమించి పెళ్ళి చేసుకుందా మనుకుంటుంటే-" విశ్వనాథం నసిగాడు.
    "ఆ....అంత  తెలివి కూడా వుందా" ఇందిరమ్మ మూతి విరిచింది. వంటింట్లో కెళ్ళిపోయింది.
    "అది తెలివే అయితే ఎప్పుడో ఎవర్నో పెళ్ళి చేసుకొనేదాన్నేమో కానీ" లలిత మాట్లాడలేదు.
    "అమ్మా!" లలిత ఓ కేక వేసింది.
    "నీకు ఎన్నేళ్ళప్పుడు పెళ్ళయింది?"
    "ఏమొ__"
    "కాదు, చెప్పాలి-"
    "పన్నెండో ఏట. పన్నెండెక్కడ - పదకొండునిండి వారం రోజులైందంతే."
    "ఊ-" లలిత నవ్వింది.
    "అప్పటికే నాయనమ్మగోల - పెళ్ళి ఆలస్యమయిందని-" ఇందిరమ్మకి పెళ్ళి ముచ్చట వచ్చేసరికి ఎన్నో విశేషాలు గుర్తుకొచ్చాయి. తను కాపరానికొచ్చిన కొత్తరోజులు, తొలి చూలుకు చేసిన సూడిదల పేరంటం, పిల్ల పుట్టినప్పుడు పేరు పెట్టడం విషయంలో జరిగిన రభస ఎన్నో విశేషాలు ఇందిరమ్మ చెప్తుంటే లలిత వింటూంది.
    "అమ్మా!" గర్జించింది లలిత ఒక్కసారి.
    ఉలిక్కిపడింది ఇందిరమ్మ.
    "ఇప్పుడు నా కెన్నేళ్ళు?"
    "ఏమో-"
    "నేనే చెప్తా, ఇరవై తొమ్మిది నిండి ముప్పై ఏళ్ళు వచ్చాయి-"
    "ఆ- ఏళ్ళకేం బాగానే వస్తాయి-" ఇందిరమ్మ వెక్కిరింపుగా అంది.
    "ఈ వయసుకి నీకు ఐదుగురు పిల్లలు-" లలిత మాట పూర్తి చేయలేదు.
    "ఐతే ఏమంటావు?" ఐదుగురు పిల్లలని లలిత అనేసరికి ఇందిరమ్మ ముఖం ఎర్రబడింది. చటుక్కున అక్కడనుంచి వెళ్ళిపోయింది.
    "అంటే నీకు ఎంత చిన్నతనంలో నీది అనే ఓ యిల్లు, నీవాడు అనే ఒక మగవాడు, నీది అనే సంతానం! విన్నావా అమ్మా, ఎన్నెన్నో మరి నాకో?- ఒక్కటయినావుందా?" లలితగొంతు దుఃఖంతో నిండింది. విశ్వనాథం కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు.
    "ఇటు తిరగండి నాన్నా....నాకు సమాధానం చెప్పరేం?- మీరంతా స్వార్థపరులు నాన్నా! మీ గురించే ఆలోచిస్తారు. కానీ నేనూ ఓ ఇల్లాలు కావాలి. నా గుండెల్లో దాచుకుందుకు నాది అనే సంతానం కావాలి. నాన్నా....నన్ను ప్రేమించి నాకోసమే బతుకుతున్నాననే ఒక వ్యక్తి కావాలి! నేనూ ఓ యిల్లాలు కావాలి-" ........లలిత కళ్ళు గట్టిగా మూసుకుంది.
    కాళ్ళ దగ్గరున్న బల్లను ఒక్క తన్ను తన్నింది. చిన్న బల్లమీదున్న గాజు గ్లాసు కిందపడి పగిలిపోయింది. లలిత గబగబా కుర్చీలోంచి లేచింది. ఎంత చీకటి పడిపోయింది....అప్పటికి లలిత 4 గంటల పైనుంచి ఆ కుర్చీలో కూచునేవుంది - తను తలితండ్రులతో ఎలాగ పెళ్ళి విషయం మాట్లాడుతుందో, తల్లిదండ్రులు తనకి ఎలాటి సమాధానం యిస్తారో - అంతా ఊహించుకున్న సంభాషణా ప్రపంచంలోంచి బయటపడేసరికి రాత్రి ఎనిమిది గంటలయిందని గుర్తించిన లలిత నీరసంగా నిట్టూర్చింది....... ఎదురుపడి తను ఏమీ చెప్పలేనప్పుడు ఎంతగా మనసులో మధనపడితే ఏంలాభం?
    రాత్రంతా నిద్రపట్టని లలిత అటు ఇటు ఒత్తిగిల్లుతూ కాలం గడిపింది. తెల్లవారినా లలిత మనసు చీకట్లోనే కొట్టుమిట్టాడుతోంది. తన సమస్య తనే తీర్చుకోవాలి. పేపర్లోవేసి మాట్రిమోనియల్స్ ఎందుకు తను చూడకూడదు - అవును, ఎందుకు అప్లై చేయకూడదూ?
                                                *    *    *
    రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు లలిత గబగబా వంటింట్లోకి రాబోయింది. గుమ్మంలో పేపరు చదువుకుంటున్న తండ్రి, కూర తరుగుతూ కబుర్లు చెప్తున్న తల్లి - లలిత రెండడుగులు వెనక్కి వేసింది - ఏమిటది నేనేదో కొత్తచోటుకి వచ్చినట్టు అనుకుంటున్నానేమిటి - లలిత మళ్లా గబగబా ముందుకొచ్చింది. తండ్రి ప్రక్కన కుర్చీవేసుకు కూర్చుంది.
లలిత ఎందుకొచ్చిందో తెలుసు విశ్వనాధానికి.
"తొందరపడరాదు తల్లీ- దేనికైనా టైము రావాలి. మంచిసంబంధం చూసి-" విశ్వనాధం మాట్లాడిన తక్కిన మాటలు లలితకి వినిపించలేదు. వినాల్సింది కూడా ఏమీలేదు. ఈ మాటలే గత పదేళ్ళుగా తండ్రి నుంచి వింటోంది.
    "సరే నాన్నా....ఆఁ....రిప్లై వచ్చిందా?"
    రిప్లయ్యా - ఎక్కణ్ణుంచి....ఆఁ ఇంకా రాలేదమ్మా!" విశ్వనాధం తడబడ్డాడు.
    "ఇంకా రాలేదా - అదేమిటి?" అంది లలిత.
    వెంటనే ఇందిరమ్మ "చాల్లెద్దురూ - ఊరికే అదేదో పిచ్చిగా మాట్లాడితే, మనమూ మాట్లాడుతామా? ఇదిగో అంతా ఒట్టిది - మీ నాన్న ఎవరికీ, అదే ఏ పేపరుకిరాయనేలేదు - ఇంక రిప్లై ఏమిటి"-పకపకా నవ్వింది.
    "నిజంగానా నాన్నా?" నివ్వెరపోయింది లలిత. తండ్రి మాట్లాడలేదు. లలిత విసురుగా లేచి వెళ్ళిపోయింది.
                           *    *    *
    లలిత గదిలో మంచంపైన పడుకుందన్నమాటేగాని, గతమే కళ్లముందు కదలాడుతుంటే కన్ను మూత పడనేలేదు.
    లలిత పదిహేనేళ్ళ వయస్సప్పుడు రాజును పెళ్ళిచేసుకుందామనుకుంది. రాజుబావ కూడా తప్పకుండా తననే పెళ్ళి చెసుకుంటానన్నాడు. కానీ అత్తయ్య తనతోనే అంది- "మీ నాన్న అడక్కుండా నేనేంచేస్తాను. నా కొడుక్కి పెళ్ళి కాదా?" అని.
    అక్కడక్కడ ఆ మాట విన్న నాన్న "అదెందుకు నా కూతుర్ని తన కొడుక్కి చేసుకుంటా ననదూ - నేనే దానివెంటపడి అడగాలా-ఎంత ఆడపిల్ల తండ్రినయితేమాత్రం - వాడు కాకపోతే నాకు అల్లుడే దొరకడా-" ఈ మాటలన్నీ విన్న లలిత "అదికాదు నాన్నా - నాకు బావంటే ఇష్టమే. బావకి నేనంటే ఇష్టమే - నువ్వు ఒక్కసారి అత్తయ్యని అడుగకూడదూ" అని చెప్పాలనుకొని తండ్రి వున్న గది గుమ్మందాకా వచ్చింది కానీ నాన్నంటే భయం. తనే తన పెళ్ళి విషయం మాట్లాడటం ఎంతో తప్పు. అంతే. లలిత నోరు మెదపలేకపోయింది - ఆ తర్వాత బావ పెళ్ళయిపోయింది. చక్కని పిల్లలు, సంసారం!_తనో?
    ఇంటరు పాసయి, టైపు నేర్చుకుని స్కూల్లో టైపిస్టుగ చేరిన లలితకి బాబాయి ఓ సంబంధం తెచ్చాడు. అప్పటికి ఎన్నేళ్ళు తనకి - ఏమొ - ఆఁ పద్దెనిమిది - లలిత ఆవులించింది. ఆ రోజు తండ్రి, బాబాయిల సంభాషణ ఇప్పటికి చెవులలో మారుమ్రోగుతోంది.
    "బుద్ధిమంతుడు. ఎలక్ట్రిసిటీబోర్డులో గుమాస్తా. వాళ్లకి కట్నకానుకలకన్నా పిల్ల చక్కగా వుండాలట. పనిమంతురాలు కావాలట" బాబాయి మాటలు పూర్తి కాకుండానే కుటుంబ వివరాలు అడిగాడు విశ్వనాథం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు అంతే. విశ్వనాధం అంగీకరించలేదు.
    "నలుగురు ఆడపిల్లలా........అంటే అతడి సంపాదనంతా వాళ్ళకే పెట్టాలా - తండ్రి కూడా లేడంటున్నావు - ఆ పిల్లలందరికి చాకిరిచేస్తూ అది పడుండాలా? వీల్లేదు. ఇలాటి సంబంధాలు చెప్పకు" బాబాయి చిన్నబుచ్చుకు వెళ్ళిపోయాడు. బయటకెళ్ళిపోతున్న బాబాయి దగ్గరకి పరిగెత్తి వెళ్ళింది లలిత. బాబాయి అప్పటికే వీధిగుమ్మం దాటాడు. దొడ్లో పచార్లు చేస్తున్న తండ్రి దగ్గరకెళ్ళి నిలబడింది చాలాసేపు.
    "నాన్నా, నాకీ సంబంధం యిష్టమే. పెద్ద కుటుంబం అయితేనే మంచిది. కష్టసుఖాలకి ఆదుకుంటారు. అయినా అలా అంటే ఎలా నాన్నా! మన కుటుంబంలో అన్నయ్యకి పెళ్ళికాలేదు. బాధ్యతలంటే నాకు భయం లేదు. నాకు పెళ్ళి ఇష్టమే" లలిత దొడ్లో గన్నేరు చెట్టుదగ్గర నిలబడింది. తండ్రితో ఈ మాట చెప్పాలని ఎన్నోసార్లు నోట్లో మననం చేసుకుంది. కాని ధైర్యం చాలలేదు. ఇలా మాట్లాడితే నాన్న ఏమనుకుంటాడు? ఛ, ఓ ఆడపిల్ల ఇలా మాట్లాడకూడదు! లలిత లోపలకొచ్చేసింది తండ్రితో మాట్లాడకుండానే.
    కాలం గడుస్తోంది. లలిత ఉద్యోగంలో స్థిరపడిపోయింది. అక్క పురిటికొచ్చి పసిపిల్ల నెత్తుకువెళ్ళింది. అన్నయ్య, ఒదిన పిల్లాడికి అక్షరాభ్యాసం చేయించడానికొచ్చారు. ఇల్లంతా కలకల్లాడుతోంది. చెల్లెళ్ళు, తమ్ముడు కాలేజీలకి సెలవులని ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు అన్నయ్య, నాన్న ఘర్షణపడుతున్నారు. ఇంకేముంది తన విషయమే- "రెండో పెళ్ళి వాడంటే, వాడేమీ ముసలాడు కాడు పిల్లల్లేరు. ఏమిటి మీ అభ్యంతరం? ఇలా ఎన్ని సంబంధాలు మీరు తిప్పేస్తుంటారు - దాన్నడుగుతాను ఏమంటుందో. దాని అభిప్రాయం ముఖ్యం."
    విశ్వనాధం గొంతు చించుకుంటున్నాడు - "అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయినా దానికన్నా పెద్దవాళ్ళు పెళ్ళికాకుండా లేరూ? నీ స్నేహితుడు కదా అని పెళ్ళి చేసుకోమంటున్నావా-వీల్లేదు. దానికి పెద్ద ఆఫీసర్ని చూసి చేస్తాను." అన్నయ్య విసుక్కుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. రెండు రోజుల తర్వాత అన్నయ్య, ఒదిన పిల్లలు ఊరెళ్ళి పోయారు.
    లలిత మనసు చాలా చికాకుగా వుంది. రాత్రి అంతా ఆలోచించి అన్నయ్యకి ఉత్తరం రాసింది. "అన్నయ్యా! ఈ సంబంధం నాకు ఇష్టమే. రెండో పెళ్ళివాడనే అభ్యంతరం నాకు లేదు. కాకపోతే నాన్న ఒప్పుకోడు. నువ్వు ఒక్క పని చెయ్యాలి. నీ స్నేహితుణ్ణి రిజిష్టరు పెళ్ళికి ఒప్పించు. ఈ విషయం నాన్నకి తెలియకుండా, నేను మీ ఊరు వస్తాను. పెళ్ళి జరిపించేయి. ఈ ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఎంతకాలం బతకాలో చెప్పు. నాది అన్నది నాకు లేకపోయాక వీటన్నిటికి ఏం రాణింపో చెప్పు? నాకూ ఓ యిల్లు కావాలి, నేనూ ఓ యిల్లాలు కావాలి. ఒరేయ్ అన్నయ్యా ఇలా సిగ్గువిడిచి రాస్తున్నందుకు నన్ను అర్థం చేసుకుంటావు కదూ?" లలిత ఉత్తరాన్ని ఎన్నోసార్లు చదువుకుంది. కవరు మడిచి పెట్టింది. ఎడ్రసు రాసింది. క్షణంలో లలిత ముఖం నిండా చెమటలు, ఒళ్ళంతా చెమటలు. ఏదో నీరసం, నిస్పృహ. తనకేనా ఇంత ధైర్యం - నాన్నకీ విషయం తెలిస్తే? హమ్మో! తనేదో పెళ్ళికోసం ఉబలాట పడిపోతోందనుకుంటాడు. ఒదిన నవ్వితే-ఏమో. లలిత ఉత్తరాన్ని చింపి గబగబా కిటికీలోంచి బయటకి విసిరేసింది. అబ్బ. ఇలా ఎన్నెన్ని. ఇప్పుడు తనకి ముప్పై. ఇంకా తను నాన్నకి అమ్మకి భయపడాల్సిన అవసరం వుందా! భయంతో తను జీవితంలో ఇప్పటికీ ఎన్నో పోగొట్టుకుంది.
    లలిత మనసులో మెరుపులాటి ఆలోచన ఒకటి ప్రవేశించింది.
    తను చేస్తున్న ఉద్యోగమే తల్లిదండ్రులు తన వివాహాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం. తన సంపాదనపై తండ్రికి; తన సంపాదనపైన, తన చాకిరీపైన తల్లికి ఎంతో ఆశవుంది. "మా అమ్మాయి మాకు అబ్బాయి లాగే వుంది" అంటారు అమ్మ, నాన్న అందరితో, తనే ఇంటి బాధ్యతంతా చూస్తుంది. తను పెళ్ళిచేసుకు వెళ్ళిపోతే? అందుకే తన పెళ్లిని గురించి వాళ్ళేమీ ఆలోచించటంలేదు. ఇంక వాళ్లు తనకి పెళ్లి చేయరు. లోకమంతా లలితకి పెళ్ళి కాలేదు పాపం, అని "ఇంకేం అవుతుంది" అని అనుకుంటున్నారు. అందరికి చెప్పాలి లలితకీ పెళ్ళవుతుంది, లలితా ఓ ఇల్లాలవుతుంది, తల్లి అవుతుంది అని అలా చెప్పాలి. లలిత కళ్ళనిండా నీళ్ళు.
    గుండె నిండా బరువు.
    ఆడపిల్లకి పెళ్ళే అవసరమా?
    "ఆ" ఒక్కటే సమాధానం-అక్కర్లేదు అనుకొనే వాళ్ల విషయం వేరు. పెళ్లి కావాలనుకునే లలితమ్మ విషయం వేరు.
    "ఓ లలితమ్మా, నీకు ఇంకా ధైర్యం కావాలి. నీ విషయాలు నువ్వే నిర్ణయించుకునే శక్తి కావాలి. నీ మంచి భవిష్యత్తు నువ్వే చూసుకోవాలి. నీకెవరూ చూడరు. గతించినవన్నీ చాలు! వయసు, అందం, ఓర్పు, ఆరోగ్యం అన్నీ చాలావరకు తగ్గిపోయినా చివరవరకూ మిగులుతున్న ఆశ ఒకటి. దాన్ని తుంచకు-" లలితమ్మని అంతరాత్మ ప్రబోధించింది - మేలుకొలిపింది.
                           *    *    *
    ఆ తెల్లవారి లలితమ్మ ధైర్యంగా అనుకున్న మాట్రిమోనియల్స్ లో ఒక దానికి అప్లై చేసింది.
    వారం రోజులు దాటకుండా లలితమ్మకి జవాబు వచ్చింది. ఉత్తరం పూర్తిగా చదివింది ఇప్పుడూ ఒక నిర్ణయం తీసుకోలేకపోతే ఏమవుతుందో, భవిష్యత్తు భయంకరంగా కళ్ల ముందు నిలిచింది.
    ఉత్తరం మళ్లా చదివింది లలితమ్మ క్షణం మనసు కొట్టుమిట్టాడింది. నాన్నతో చెబితే - ఇంకా తను ఇలాగే వుండిపోవల్సివస్తుంది-
    అయినా ఎందుకు చెప్పాలి?
    ఇది నా విషయం!
    లలితమ్మ సమాధానం రాసింది తన అంగీకారాన్ని తెల్పుతూ!
    తను రాసిన ఉత్తరం పోస్టుడబ్బాలో పడేసి వస్తున్న లలితమ్మ కాళ్లు వణికాయి. గుండె దడ దడ లాడింది. గబగబా లోపలికొచ్చి గదిలోకెళ్లి తలుపులేసుకుంది. లలితమ్మ తనకు వచ్చిన ఉత్తరాన్ని విప్పి మళ్లా చదవటం మొదలుపెట్టింది:
    "నాకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి ఆఖరిది పదేళ్ళు - నా వయస్సు నలభై ఆరు - నా భార్య ఏడాది క్రితం కేన్సరులో మరణించింది. అయితే నేనెందుకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో అర్థమయిందనుకుంటాను. నా యింటిని, నా పిల్లల్ని, నన్ను చూసుకునేందుకు ఓ ఇల్లాలు కావాలి! ఇల్లాలు మాత్రమే అయితే అనుబంధంతో ఆప్యాయతలు పెంచుకోవచ్చనే ఆశ ఒకటుంది. చాలా ముఖ్యమయిన, మీ జీవితానికి సంబంధించిన విషయం, నేను వాసక్టమీ చేయించుకున్నాను.... దీనికి మీ అభ్యంతరం లేకపోతే మీ అంగీకారం తెలియ జేయండి"-
    ఉత్తరం పక్కమీద పడేసి దీర్ఘంగా నిట్టూర్చింది లలిత.
    అవును నాకూ ఒక మగవాడి అండదండలు కావాలి. నాది అనే ఓ యిల్లు కావాలి-కాకపోతే ఇక్కడ వీళ్లకి చాకిరీ చేస్తున్నాను. అక్కడి వాళ్లకి చేస్తాను. ప్రతి ఆడది కోరుకునే మాతృత్వాన్ని గురించి తను ఆలోచించేందుకు కూడా అవకాశంలేదు ఇక. సరే, తను గొడ్రాలు లలితమ్మ పెదాలపై చిన్న నవ్వు కదిలింది.
    అతనికి ఓ ఇల్లాలు కావాలి!
    తనూ ఓ ఇల్లాలు కావాలి- అంతే!!
                                                   *    *    *
    మాధవరావు పిల్లలు ముగ్గురిలోనూ లలితమ్మను అసలు పట్టించుకోని, గుర్తించని వాడు పెద్దబ్బాయి రవి. అన్నం పెడుతూ, టీ యిస్తూ ఏదో పల్కరించాలని, చనువు చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది లలితమ్మ. "మీ అమ్మని కాకపోయినా అమ్మలాటిదాన్నే" అందామనుకుంది. కాని రవి ఏ మాటకి అవకాశం యివ్వకుండా భోజనం చేసి వెళ్ళిపోయాడు.
    ఆ సాయంత్రం రవి స్నేహితుడు వచ్చాడు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరికీ టీ తెచ్చి యిస్తున్న లలితమ్మకి వాళ్ళ మాటలు బాగానే వినిపిస్తున్నాయి.
    "మీ కొత్త అమ్మ ఈవిడేనా" అన్నాడు స్నేహితుడు.
    "వాట్ నాన్సెన్స్ - షి ఈజ్ మై ఫాదర్స్ వైఫ్ - దట్స్ ఆల్ రవి సమాధానం.
    మాటలు చెవినిబడ్డ లలితమ్మ ముఖం క్షణంలో పాలిపోయింది. వెంటనే తేరుకుంది. ఆలస్యంగా చేసుకొనే నిర్ణయాలలో ఇలాంటివి తప్పవు. రవి మాటల్లో ఎంత నిజం వుంది! నిజం ఎంత చేదుగా వున్నా నిజం నిజమే- కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఇల్లాలు లలితమ్మ.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS