Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 9


    ఎందుకో తెలీదుగానీ ఉత్పలకి తనని మొదటిరోజు కార్లో దింపిన అమ్మాయి గుర్తొచ్చింది. పేరు బాగా  జ్ఞాపకం వుంది .... అనూష!

    ఆమె గుండె వేగంగా కొట్టుకుంది.

    ఆమె ఏమైనా సాయం చేయగలదేమో? ఈ ఆలోచన రాగానే ఆమె శరీరం అప్రయత్నంగా కంపించింది. వణికే కాళ్ళతో ఫోన్ దగ్గిరకి చేరుకుంది. తననెవరూ గమనించటం లేదని గమనించి ఫోన్ చేసింది. ఆమె అరచేతులు చెమటలు పట్టాయి.

    ఆపరేటర్ లైన్లోకి వచ్చాక అనూష కావాలంది. క్షణం తరువాత "హాల్లో! అనూష హియర్" అని వినిపించింది.

    "నేను జ్ఞాపకం వున్నానాండీ. నన్ను ఇంటర్వ్యూకి కార్లో దింపారు".

    "ఉత్పలా?"

    "నేనే థాంక్స్ గాడ్! మీకు పేరుకూడా గుర్తుంది".

    "చెప్పు. ఏమైంది నీ వుద్యోగం?" అనూష కంఠం ఫోన్లో కూడా చిరునవ్వుతో మాట్లాడుతున్నట్టు వుంది.

    "అక్కణ్ణుంచే మాట్లాడుతున్నాను" అంటూ తన సమస్య వివరంగా  చెప్పింది. "ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావటం లేదు".

    "మీ డాక్టరెవరో నిజంగా ఆర్యభట్టుకి బావమదిరిలా వున్నట్టున్నాడే. ఏమన్నావ్? మొత్తం తెచ్చింది రెండు నల్ల బొట్లూ, మూడు ఎర్ర బొట్లూ కదూ!"

    "అవును. అందులో రెండు ఎర్రబోట్లూ,  ఎదురుగా ఇద్దరికీ పెట్టారు. రెండు దాచేసాడు. నా నుదుటిన ఏం పెట్టారో కనుక్కోవాల్ట".

    అట్నుంచి- ఆలోచిస్తున్నట్టు ఒక క్షణం నిశ్శబ్దం తరువాత అనూష కంఠం తాపీగా వినిపించింది- "ఉత్పలా! నీ నుదుటన నర్సు పెట్టింది ఎర్రబొట్టు".

    ఉత్పల అదిరిపడింది.

    "మైగాడ్! మీకు అక్కణ్ణుంచే కనపడిందా?"

    నవ్వు. "నాకేమీ టెలిపతీ లేదు. ఇందులో థీయరీ ఆఫ్ ప్రోబబిలిటీ కూడా లేదు. చివరకి నర్సు  మనస్తత్వ పరిశోధన కూడా లేదు".

    "కానీ కౌటిల్యుడికీ అరగంట పట్టిందట ఈ లెక్క చేయటానికి".

    "పట్టి వుండవచ్చు. అతడు తర్కశాస్త్రం వ్రాయలేదు. కనీసం గణితశాస్త్ర ప్రావీణ్యుడు అవునో కాదో కూడా మనకి తెలీదు. కాబట్టి అతడికి అరగంట పట్టవచ్చు! సామాన్యమైన తెలివితేటలున్న ఈ రోజు ఇంటర్మీడియట్ కుర్రాడు కూడా తార్కికంగా ఆలోచిస్తే సరీగ్గా 4 స్టెప్సులో ఈ లెక్కకి జవాబు తెలుసుకోవచ్చు. నీ నుదుటన నర్సు పెట్టింది ఎర్రబొట్టే......" అంది అట్నుంచి అనూష.

    ఉత్పల అనుమానంగా, "నేను ఎర్రబొట్టు అనగానే, ఎలావచ్చిందీ అని అడుగుతాడేమో...." అంది.

    "అయితే నాలుగు స్టెప్పులూ వరుసగా చెప్పు".

    "ఏమిటవి?"

    "ఉదాహరణకి నీతోపాటు వున్న ఇద్దరమ్మాయిల పేర్లూ రాధా, సీతా అనుకో. ఇక తార్కికంగా ఆలోచించు-"

    1.నీకు ఎర్రబొట్టు పెట్టకపోయివుంటే - నల్ల బొట్టు పెట్టివుండాలి. అటు వంటి పక్షంలో నీ ఎదుట వున్న రాధకి ఒక నల్లబొట్టు, ఒక ఎర్ర బొట్టు మీ ఇద్దరి నుదుళ్ళమీద కనపడాలి.

    2. అప్పుడు రాధ ఇలా అనుకుంటుంది - "నానుదుటి మీద కూడా నల్లబొట్టే వున్న పక్షంలో సీతకి రెండూ నల్లబొట్లే ఎదురుగా కనిపిస్తాయి. ఈపాటికే సీత లేచి, తన నుదుటిమీద  వున్నది ఎర్రబొట్టు అని చెప్పాలి. ఎందుకంటే ట్రేలో తెచ్చింది రెండు  నల్లబొట్టులే కాబట్టి! కాని సీత మౌనంగా వుంది. అంటే నా నుదుటిమీద నల్లబొట్టు లేదన్నమాట".

    ౩. అలా అనుకున్న రాధ లేచి, "నా నుదుటి మీద వున్నది ఎర్ర బొట్టు" అని చెప్పెయ్యాలి. కానీ రాధ ఎంతకీ అలా చెప్పటం లేదు.

    4. అంటే రాధకి రెండూ ఎర్రబొట్టులే కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి నీ నుదుటి మీద వున్నది ఎర్రబొట్టు అన్నమాట"

    అంతా విన్నాక ఉత్పల, ఏమిటో నాకంతా అయోమయంగా వుంది" అంది.

    "అంత పెద్ద లెక్క కాబట్టే ఆర్యభట్టు కౌటిల్యుడిని అంత తిప్పలు పెట్టాడు-"

    "ఈ లెక్క మీకింతకుముందే తెలుసా?"

    "తెలీదు. నువ్వు చెపుతూవుంటే లెక్క కట్టాను. ఇంతకన్నా జవాబు మరొకటి వుండటానికి వీల్లేదు. బెస్టాఫ్ లక్....." అంటూ ఫోన్ పెట్టేసింది అనూష.


                                                     *    *    *

    ఆఫీసు పనులు చూసుకుని అనూష ఇంటికి వెళ్ళేసరికి ఆరయింది. కానీ అప్పటికే పూర్తిగా చీకటిపడింది.

    ఆమె వుంటున్నది ఒక ఫ్లాట్ లో.....! విశాలమైన హాలు...... ఫ్రిజ్..... ఎయిర్ కండిషనర్. అందమైన పొందికైన బెడ్ రూమ్. చివరికి బాత్ రూమ్ కూడా అద్దంలా తళతళలాడుతూ వుంది.

    డ్రాయింగ్ రూమ్ లో వున్న టేప్ రికార్డర్ కి బాత్ రూమ్ లో స్పీకర్ కలపబడి వుండటంతో షవర్ లో వుండే నీటిధారల చప్పుడికి కె.యల్. సైగల్ పాట సెలయేటి ప్రవాహం మీద వర్షపు జల్లు కురిసినట్టు మంద్రంగా వినిపిస్తుంది. ఆమె శరీరం  పదహారేళ్ళ సున్నితత్వంతో మెరవటం లేదు. కానీ  పురుషుడనే మావటీడు లేక  శరీరమనే వనంలో యవ్వన మత్తగజం వీరవిహారం చేస్తూంది. తెలివితేటలు మెదడు పొలాన్ని సాగు చేస్తుంటే, వయసు ఎత్తుపల్లాల కొండాకోనల విషయం చూసుకుంటూంది. రేవంతుడు వెన్నెల్లో వూహించినట్టు శంభుమిత్రుడి నిశ్శబ్ద చిత్రంలా, సోమశేఖరుడు మౌనంగా ప్రార్థించగానే బ్రహ్మ సృష్టించిన మరో మందాకినిలా ఆమె అత్యద్భుత సౌందర్యంతో విలసిల్లటం లేదు. పెదవిమీద నీటిచుక్క పగడమూ, నాభి మీద పడ్డ చినుకు స్వాతి ముత్యమూ, స్థనం మీద  జారిన నీటి చుక్క జలపాతమూ కావటంలేదు. కానీ ఒక రకమైన హుందాతనం, చాలామంది స్త్రీలకి కేవలం  దుస్తులవల్ల వచ్చేది- అవి లేకపోవటంతో మరింత స్వాతంత్ర్యం తీసుకుని స్నిగ్ధత్వమై ఆమెని ఆవరించుకుంది.

    ఆమె స్నానం పూర్తిచేసుకుని బయట గదిలోకి వస్తూంటే కాలింగ్ బెల్ మ్రోగింది. ఆమె తలుపు తీసేసరికి ఎదురుగా ఓ పోలీస్ ఇనస్పెక్టర్ నిల్చుని వున్నాడు. నమ్రత నిండిన కంఠంతో "సారీ మాడమ్. యూ ఆర్ అండర్  అరెస్ట్ " అన్నాడు.

    ఒక లిప్తపాటు అతడు చెపుతున్నది ఆమెకి అర్థం కాలేదు. "ఏమిటీ" అంది.

    "క్షమించాలి. మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వారెంట్ తెచ్చాను" అన్నాడా ఇనస్పెక్టర్.


                              7

    వసంత్ దాదా చాలా సంతోషంగా వున్నాడారోజు.

    అతడి అనుచరుల్లో అతి ముఖ్యుడైన సలీంశంకర్ ని అతడొక అద్భుతమైన వ్యూహమేసి రక్షించగల్గుతున్నాడు. అదీ అతడి సంతోషానికి కారణం! చీకటి ప్రపంచపు నాయకుల పరపతి, తమ అనుచరులని ఎంత బాగా ప్రొటెక్ట్ చేయగల్గితే అంత గొప్పగా పెరుగుతుంది. ఇలా ఒక అనుచరుణ్ణి రక్షించాడని తెలియగానే ఎంతో మంది చిన్న చిన్న 'దాదా' లు ఆ 'దళం' లో చేరటానికి  ఉత్సాహపడతారు.

    వసంతదాదాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే అతడు తన అనుచరులపట్ల ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అందులోనూ ముఖ్యంగా హైద్రాబాద్ గణేశ్ దళానికి చెందిన సలీంశంకర్  అంటే మరీ.

    సలీంశంకర్  మనిషి కాడు.  నరరూప రాక్షసుడు! సెక్సువల్ పర్వెర్ట్.

    పద్నాల్గేళ్ళ క్రితం అతడు వసంతదాదా దగ్గిరకొచ్చాడు. అప్పటికి అతడు  ఫుట్ పాత్ ల మీద నిద్రపోతూ చిన్న చిన్న దొంగతనాలు చేసే స్టేజిలో వున్నాడు. వసంతదాదా కళ్ళు సలీంశంకర్ లో వున్న 'తృష్ణ' ని వెంటనే పట్టుకున్నాయి.

    శంకర్ తో పాటు ఢిల్లీ చేరుకున్న మరొక కుర్రవాడి పేరు వర్థన్. అతడప్పటికే దొమ్మీ రంగు పులిమి చేసిన హత్యలో భాగస్వామి. ఇద్దరూ మరింత  ఎదగటం కోసం దాదాని కలుసుకోవటానికి వెళ్ళారు.

    "ఏం చేద్దామనుకుంటున్నారు?" అని అడిగాడు దాదా వాళ్ళని.

    "బ్యాంకు దొంగతనం".

    "ఎలా"

    సలీంశంకర్ చెప్పాడు. "హైద్రాబాద్ లో నాచారం అనే ప్రదేశం వూరికి దూరంగా వుంది. ఆ ప్రాంతంలో నాలుగైదు బ్యాంకులున్నాయి. సాధారణంగా బ్యాంకు ప్రధాన సంస్థ నుంచి బ్రాంచికి డబ్బు తీసుకెళ్ళాలంటే టాక్సీగానీ, ఆటోగానీ ఉపయోగించాలని రూలు. కానీ కొంతమంది బ్యాంకు ఆఫీసర్లు కక్కుర్తితో స్వంత స్కూటర్ మీద క్యాషు తీసుకెళ్ళి టాక్సీమీద వెళ్ళొచ్చినట్టు వ్రాసుకుంటారు. ఈ విధమైన ఆదాయం నెలకి ఆరేడొందలదాకా వుంటుంది. సాధారణంగా ఈ విషయం బ్యాంకులో ఉన్నతాధికారులకి తెలిసినా వారిది  మరింత పెద్ద దాహం కాబట్టి దీన్ని పట్టించుకోరు. కనీసం టాక్సీ నెంబరు వోచరు మీద వ్రాయాలని కూడా అడగరు. అలాటి బ్రాంచిని ఒకదానిని పట్టుకున్నాము. మాకు ఒక వ్యాను, ఇద్దరు మనుషుల్నీ మీరు ఇస్తే ఆ స్కూటర్ ని రోడ్డుమీద మీ వ్యాను ఆక్సిడెంట్ చేస్తే, ఆ హడావుడిలో స్కూటర్ లో వున్న డబ్బుని మేము దొంగిలిస్తాము".

    "అందులో సగం మీకూ, సగం మాకూ-" అని పూర్తిచేసాడు వర్థన్. దాదా నవ్వేడు. చాలా చిన్నపిల్లలా కనిపించారు వాళ్ళతడికి.

    "వ్యాను నేను ఏర్పాటుచేసి ఆక్సిడెంట్ చేయిస్తే, వ్యాను మీదకే పోలీసుల అనుమానం వస్తుంది. జనం  వ్యాను డ్రైవర్ నే చుట్టుముడతారు. ఈ లోపులో క్యాష్ పోయిందని తెలుస్తే - అక్కడితో మా వాళ్ళ పని ఆఖరు. అయినా ఇంత ఏర్పాటు చేసినవాడిని, మరోఇద్దరు నా మనుషులనే ఏర్పాటుచేస్తే డబ్బుని వాళ్ళే జాగ్రత్తగా తీసుకొస్తారుగా. మీకు సగం వదులుకోవటం దేనికీ?"

    ఇద్దరూ మాట్లాడలేదు.

    "మీకు కావాలంటే నేనే ఒక ప్లాను చెపుతాను. కేవలం మీ ఇద్దరే చేయగలిగింది. దానికిగాను వచ్చినదాంట్లో సగం నాకు మీరివ్వవలసి వుంటుంది" అంటూ వివరంగా చెప్పాడు.

    అంతా వివరించి చెప్పాక అన్నాడు- "అలాగే మనం వెళ్ళి బ్యాంకుని దోపిడీ చేయటం కూడా పూర్వకాల పద్ధతే. వాళ్ళే మనకి  డబ్బు తెచ్చి ఇవ్వటం కొత్త పద్ధతి!"

    వసంతదాదాలో వున్న గొప్పదనం అదే. తన చేతులకి తడి అంటనివ్వడు.


                                                   *    *    *

    సుబ్బారావుకి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చిన మూడు సంవత్సరాలకి పెళ్ళయింది. అందరు కొత్త భర్తల్లాగే భార్య తుమ్మినా అందంగా వుండే స్టేజీలో వున్నాడు. పోతే చాలామందికి ఆ లోకంనుంచి బయటకి రావటానికి తక్కువపడితే, ఇతడు మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చేట్టులేడు. అందుకే బ్యాంకు అయిపోగానే తొందరగా ఇంటికి వచ్చేసాడు - ప్రతి రోజులాగే.

    ఇంటికొచ్చేసరికి భార్య ఎవరితోనో మాట్లాడుతూ వుండటం చూశాడు. ముందు భార్యతరపు బంధువేమో అనుకున్నాడు. కానీ బంధువు చేతిలో పిస్టల్  చూసి కెవ్వున అరవబోయాడు. సలీంశంకర్ కి లాంటి అరుపుల్ని వెంటనే ఆపుచేయడం ఎలాగో తెలుసు. అయిదు నిముషాలు గడిచాక సుబ్బారావు దాదాపు ఏడుస్తూ, "నేను అలా చేయలేను. నా వుద్యోగం..... పోలీసులు" అంటున్నాడు. అతడి భార్యకి నోట మాట రావటం మానేసి చాలా సేపయింది! స్వంత మనిషికన్నా స్వాతంత్య్రంగా అతడు హాల్లో కూర్చుని తాపీగా మాట్లాడటం, మధ్యలో జోకు వెయ్యటం- ఆమెని స్థాణువుని చేసింది. పూర్తి షాక్ లో వుంది.

    "అయితే నువ్వెళ్ళనంటావ్" సలీంశంకర్ అడిగాడు. సుబ్బారావు మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS