"మనుషుల్ని చంపటం నాకు కష్టం కాదు. నాకేమాత్రం ఉపయోగం వుండదని తెలిసినా ప్రాణాలు తీయటానికి వెనుకాడను. నీ భార్యని చంపటం నాకిష్టం లేదు. నేనలా చెయ్యకపోవటాన్ని నువ్వు అలుసుగా తీసుకుంటున్నట్టు వుంది. చూడు" అంటూ పిస్టల్ రోడ్డు వైపుకు తిప్పి పేల్చాడు. అవతలివైపు మురిక్కాలవ పక్కన కూర్చున్న ముష్టివాడు ముందుకు కూలిపోయాడు.
ఒక మనిషిని చాలా మామూలుగా సైలెన్సర్ రివాల్వర్ తో ఒక దోమని చంపినట్టు చంపడాన్ని సుబ్బారావు విభ్రాంతితో చూసాడు. అతడి భార్యకి స్పృహ తప్పింది. సలీంశంకర్ తాపీగా అన్నాడు. "నీకింకో దారిలేదు సుబ్బారావ్! తాళాలు తీసుకుని వెళ్ళు..... బ్రీఫ్ కేసు కూడా".
"లాకర్ కి తాళాలు రెండుంటాయి. ఒకటే నా దగ్గిర వుంటుంది. రెండోది ఆఫీసర్ దగ్గిర...."
"తెలుసు. సరీగ్గా ఆరున్నరకి మీ ఆఫీసర్ బ్రహ్మం కూడా ఆ రెండో తాళంతో బ్యాంకుకి వస్తున్నాడు". సుబ్బారావుకి గత్యంతరం లేకపోయింది. బ్యాంకుకి రెండు తాళం చెవులుంటాయనీ, ఆ రెండూ చెరో ఒకరి దగ్గరా వుంటాయని, అడ్రసులతో సహా తెలుసుకుని వచ్చిన వాళ్ళకి మరేం సాకు చెప్పాలో అతడికి తెలియలేదు. సలీంశంకర్ చివరి విషయం కూడా చెప్పాడు-
"బ్యాంక్ లో ఈ రోజు డబ్బు 14,70,386-96పైసలు సుబ్బారావ్! మొత్తం అంతా తీసుకురా....."
సుబ్బారావుకి గుటక పడలేదు. "నీకెలా తెలుసు?" అని అడిగాడు ఎలాగో గొంతు పెగుల్చుకుని.
"నీకనవసరం. తొందరగా బయల్దేరు"
[అంతకుముందు నాల్గురోజుల నుంచీ వాళ్ళు ఆర్.బి.ఐ. తరపున వచ్చిన వాళ్ళలా ఒక్కొక్క బ్రాంచీ డిపాజిట్లు, అప్పులూ పరీక్షించుకుంటూ వస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనగానే మానేజర్లు ఏ ప్రశ్నా అడక్కుండా క్యాష్ స్క్రోల్ తో సహా అన్ని పుస్తకాలూ చూపిస్తున్నారు. అలా చూపిస్తారా అన్న అనుమానం వున్న ఎవరైనా కావాలంటే పరీక్ష చేసి చూసుకోవచ్చు. ఏ బ్రాంచిలో ఎక్కువ డబ్బుందా అని వెతికి పట్టుకోవటానికి వారికి నాల్గురోజులు పట్టింది. తాళాలు ఎవరి దగ్గిర వుంటాయో తెలుసుకోవటానికి ఒక నాలుగు నిముషాలు, వాళ్ళ ఇళ్ళెక్కడ వుంటాయో తెలుసుకోవటానికి మరో నాలుగు నిముషాలు పట్టినయ్! ఇవన్నీ మానేజరే స్వయంగా పెర్సనల్ ఫైల్స్ తీసి చూపించాడు.]
* * *
సుబ్బారావు బయల్దేరాడే గానీ, అతడి మనసంతా ఇంటిమీదే వుంది. ఎంత తొందరగా ఈ పని పూర్తి చేసుకుని, వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఇంటి నుంచి పంపేద్దామా అన్న తొందర్లో వున్నాడు. ఎంత వేగంగా అతడు నడుస్తున్నాడంటే, ఆ తొందర్లో ఎదుటి అరుగుమీద చచ్చినట్టుపడున్న ముష్టివాడు లేచి వెళ్లిపోవడం కూడా చూడలేదు.
అప్పటివరకూ అలా పడుకున్నది వర్థన్. సుబ్బారావ్ బ్యాంకుకి బయల్దేరగానే లేచి రామబ్రహ్మం ఇంటికి వెళ్ళటం కోసం బయల్దేరాడు. వసంత్ దాదా ఈ పని ఇద్దరే చేయాలని సూచించాడు.
సుబ్బారావు అక్కడికి చేరుకున్న అరగంటకి బ్రహ్మం వచ్చాడు. ఆఫీసులో ఎంతో స్టైల్ గా వుండే బ్రహ్మం ఆ క్షణం ఏడుపోక్కటే తక్కువగా వున్నాడు. అతడు ఆఫీసర్స్ యూనియన్ సెక్రటరీ కూడాను. చాలామంది బ్యాంక్ యూనియన్ నాయకుల్లాగే, మామూలు సమయాల్లో పులిలాగానూ, అపాయం వచ్చినప్పుడు లేడిలాగానూ బెదిరిపోతున్నాడు.
"మీ ఇండిక్కూడా వచ్చారా?"
"నా కొడుకుని చాక్లెట్లు కోని పెడతానని తీసుకెళ్ళాడు".
ఇద్దరూ బ్యాంకు ముందు తలుపుతీసి లోపలికి ప్రవేశించారు.
రోడ్డు మీద పోతున్నవాళ్ళకీ, పక్క కొట్లవాళ్ళకీ ఏ మాత్రం అనుమానం రాలేదు. మిగిలిపోయిన పని పూర్తి చేసుకోవటానికి వాళ్ళు ప్రవేశిస్తున్నారేమో అనుకున్నారు.
పది లక్షలకు పైగా డబ్బువున్న బ్రాంచి తాళాలు కేవలం ఇద్దరు వ్యక్తుల దగ్గిర వుంచుకోవచ్చు. జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళవచ్చు - అన్న బ్యాంకు ఆనవాయితీని ఆ విధంగా, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్లాన్ వేసి, ఏ విధమైన అలజడీ, హడావుడీ లేకుండా దోపిడీ చేసిన ఖ్యాతి వసంత్ దాదాకి దక్కింది. బ్యాంకు వాళ్ళచేత బ్యాంకు తెరిపించి, వాళ్ళచేతే వాళ్ళ ఇళ్ళకి డబ్బు తెప్పించిన అతడి ప్లాను పోలీసుల్ని విస్తుబోయేట్టూ చేసింది. బ్రహ్మంగానీ, సుబ్బారావుగానీ ఒక్క క్లూ ఇవ్వలేకపోయారు.
డబ్బు దొరికిన తరువాత వర్థన్ వసంత్ దాదా దగ్గిరకి తిరిగి వెళ్ళక్కర్లేదన్నాడు. "ఎక్కడో ఢిల్లీలో అతడుంటాడు. మనం అతడిని కలుసుకున్నది మొదటిసారి. ఇట్నుంచి ఈ డబ్బు తీసుకువెళ్ళిపొతే మనని లా గుర్తుపట్టగలడు? పైగా ఇంత కష్టపడిందీ మనం" అంటూ తన సగం వాటా తను తీసుకువెళ్ళిపోయాడు.
సలీంశంకర్ మాత్రం ఢిల్లీ వెళ్ళి దాదాని కలుసుకున్నాడు. ఏడు లక్షలపైగా డబ్బున్న బ్రీఫ్ కేస్ ని ముందుపెట్టి అతడికి జరిగింది చెప్పి, "దాదా! మనం అనుకున్న ప్రకారం నీకు ఏడు లక్షలా ముప్పై వేలు ఇవ్వాలి. రెండో వాడు మోసం చేసాడు. అతడు ఎవరో నాకు అంతగా తెలీదు. ఇందులో నీకెంత కావాలో తీసుకో" అన్నాడు.
దాదా నవ్వేసి, "ఇదంతా నీదే. నేను ఆడినమాట తప్పను. పోతే నాకో చిన్నపని చేసిపెట్టు" అన్నాడు.
"ఏమిటది?"
"బయట హాల్లో ఒక పెట్టె వుంది. దాన్ని ఎక్కడైనా బయటపడెయ్యి".
సలీంశంకర్ బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు. బయట ఒక పెట్టె వుంది కాస్త బరువుగా వుండటంతో లోపల ఏముందా అని తీసి చూసాడు.
లోపల వర్థన్ శవం వుంది.
సలీంశంకర్ కి మతిపోయినట్టయింది. దాదా ఎంత 'ఫాస్ట్' గా పనిచేస్తాడో అతడికిప్పుడు అర్థమైంది.
గుమ్మం దగ్గిర దాదా నిలబడి వున్నాడు. "నా వాటా నాకు ముట్టింది శంకర్ అందుకే నీ వాటా నిన్ను తీసుకొమ్మన్నాను. పోతే ఇంకో సలహా ఇవ్వదల్చుకున్నాను. క్రైమ్ కీ, స్త్రీకీ ఎప్పుడూ ముడిపెట్టకు".
"నేనేం చేసాను?"
"సుబ్బారావ్ బ్యాంక్ కి వెళ్ళగానే అతగాడి భార్యని అనుభవించటం గురించి మాట్లాడుతున్నాను నేను"
సలీంశంకర్ విభ్రాంతుడయ్యాడు. మాఫీయా అంటే ఏమిటో అతడికి అప్పుడప్పుడే అర్థమవుతూంది. లోపల జరిగిన విషయాన్ని కూడా అద్దంలో చూసినట్టు చెప్పటం.....
"ఇంట్లో ఇద్దరమే వున్నాం. పైగా ఆవిడకి కొత్తగా పెళ్ళయింది. ఆపుకోలేక పోయాను. ఆవిడ కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు".
"భయంతో చెప్పలేదు. కానీ రెండు మూడు రోజులు మానసిక ఘర్షణ అనుభవించి నిన్నే ఆత్మహత్య చేసుకుంది".
సలీంశంకర్ మాట్లాడలేదు.
"ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావ్. నీకు అభ్యంతరం లేకపోతే నాక్రింద పనిచెయ్యి గణేశ్ దళంలో....."
శంకర్ ఎగిరి గంతేసినంత పనిచేసాడు.
ఆ విధంగా అతడు హైద్రాబాద్ లో వసంత్ దాదాకి అనుచరుడయ్యాడు.
అంచెలంచెలుగా పైకి వెళ్ళాడు.
దాదాపు పదిహేను హత్యలు చేసాడు. అతడికి బలి అయ్యేవాళ్ళందరూ దాదాపు టూరిస్టులే. చార్మినార్ మీద, గోల్కొండ లోపల- లాటి నిర్జన ప్రదేశాల్లో ఈ హత్యలు జరిగేవి. వందా రెండొందల డాలర్ల కోసం అతడీ హత్యలు చేసేవాడు. ముఖ్యంగా టూరిస్టుల్లో స్త్రీ వుంటే అతడినించి తప్పించుకుపోగలిగేది కాదు. అయిదారుసార్లు అనుభవించి నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు.
ఏ కేసులోనూ అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు.
కొన్నిటికి కారణం - సాక్ష్యాలు లేకపోవటం.
అదీగాక - వసంత్ దాదా అండ!
అతడి పేరు వెల్లడిచేయకుండా అతడితో ఇంటర్వ్యూ జరిపిన ఒక పత్రిక అతడిని వేసిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, "ఒక్కసారి మాత్రం కాస్త జాలేసింది. అరబ్బు దంపతులు ఒకరు వచ్చారు. సాలార్ జంగ్ మ్యూజియం చూడాలని వాళ్ళ కెప్పట్నుంచో కోరికట. ఒక్కొక్క పైసా కూడబెట్టుకుని వచ్చామని అతడు నాతో అన్నాడు. అతడిని చంపుతూంటే మాత్రం కాస్త జాలేసింది. అతడి దగ్గర కేవలం ఇరవై డాలర్లు దొరికాయి. భార్య మాత్రం అందంగా వుంది" అన్నాడు. అతడు చేసిన హత్యల్లో కెల్లా దారుణమైనది- ఒక టెలిఫోన్ ఆపరేటర్ ని రేప్ చేసి, ఆసిడ్ పోసి చంపటం, 'రేప్ మొదలయ్యాక సాధారణంగా అందరూ తాత్కాలికంగానైనా ఇష్టపడే స్టేజికి వస్తారు. కానీ ఆవిడ చివరివరకూ పెనుగులాగుతూనే వుంది. అందుకే ఆసిడ్ పోసాను" అని చెప్పాడు తన వాళ్ళతో.
సలీంశంకర్!
సైకోపాత్!!
అతడిని బజార్లో చూసిన వాళ్ళెవ్వరూ అతడిది అంత దారుణమైన మనస్తత్వం అనుకోరు. తెలివైనవాడికి దారుణమైన మనస్తత్వం వుంటే ఎంత రాక్షసుడు అవుతాడో చెప్పటానికి అతడో ఉదాహరణ. ఏ స్త్రీ మీద కన్నుపడ్డా అతడు వూరుకోడు. పక్కన భర్త వుండనీ - తండ్రీ వుండనీ - ఇంటి వరకూ వెంటాడతాడు. ఎలాగో ఒంటరిగా పట్టుకుంటాడు. ఎత్తుమీద పైఎత్తు వేస్తాడు. వప్పుకునేలా చేసో, బలవంతం చేసో, అనుభవించేవరకూ నిద్రపోడు.
వసంత్ దాదా శంకర్ లో ఈ గుణాన్ని చూసీ చూడనట్టు వదిలెయ్యటానికి కారణం - శంకర్ మిగతా విషయాల్లో చూపే తెగువ - గూండాయిజం- వగైరా.
* * *
అనూషకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అరెస్ట్ వారెంట్ వుంది కాబట్టి వెంటనే బెయిల్ కు ప్రయత్నించటం వీలుకాదు.
"నేను మా లాయర్ తో మాట్లాడవచ్చా" అని అడిగింది.
"తప్పకుండా" అన్నాడు.
ఆమె ఫోన్ ఎత్తింది. అది పనిచెయ్యటం లేదు.
సలీంశంకర్ నవ్వుకున్నాడు. ఇలాటి జాగ్రత్తలు అతడు ముందే తీసుకుంటాడు. మరో పది నిముషాలపాటు ఆ ఫోన్ పని చెయ్యదు.
ఆమె అరెస్ట్ వారంట్ ని మరోసారి చూసింది. తనని మోసంచేసి షేర్లు కొనిపించింది అని ఎవరో అనామకుడు ఇచ్చిన కంప్లైంటు అది. కోర్టులో మొదటిరోజే కొట్టివేయబడుతుంది.
"చాలా చిన్న కేసు. మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి అయినా మీ లాయర్ కు ఫోన్ చేసుకోవచ్చు" అన్నాడు. ఆమె తలూపి మెట్లు దిగింది.
ఇనస్పెక్టర్ వేషంలో వున్న సలీంశంకర్ కూడా ఆమెతో పాటే వచ్చి జీపులో కూర్చున్నాడు.
జీపు స్టార్ట్ అవబోతూ వుండగా అనూష వెనక్కి చూస్తూ "ఎవరూ లేరేం?" అంది.
"ఎవరుండాలి?"
"పోలీసులు....."
"ఒక ఆడదాన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులెందుకు?" తేలిగ్గా అన్నాడు సలీం. ఆమె నొచ్చుకుంది 'ఆడదాన్ని' అని అతడు ఎగతాళిగా మాట్లాడినందుకు.
