అనూష వంగి డ్రాయర్ లోంచి 'ప్లాస్టిక్' అని వ్రాసి వున్న ఫైలు తీసి అతడి ముందుకు తోస్తూ "వీటిని అమ్మెయ్యమని మీరు వ్రాసింది ఏప్రిల్ 24న! ఇందిరాగాంధీ జపాన్ ప్రయాణం ఏర్పాటయింది మే 16న" అంది తాపీగా.
రామలింగేశ్వర్రావు మొహం వెల వేలబోయింది. కానీ వెంటనే సర్దుకున్నాడు.
"అవును, రెండు నెలలు ముందుగానే ఆ విషయం పేపర్లో వచ్చింది" అన్నాడు.
"చూసారా, అక్కడే మీ అనుభవమూ తెలివితేటలూ కనబడుతున్నాయి. వీటి నుంచి మేము నేర్చుకోవలసింది".
రామలింగేశ్వర్రావు కాలరు సర్దుకున్నాడు.
"ఎలా వుంది మీ పార్శ్వపు నొప్పి?"
"పార్శ్వపు నొప్పి ఏమిటి?"
"మొన్న సిక్ లీవ్ పెట్టారుగా".
"ఓ అదా..... తగ్గింది".
"నాకు ఈ ప్రాంతం కొత్త. మీకు తెలుసుగా నేనొక్కదాన్నే వుంటున్నాను. నాకు మీ ఫామిలీ డాక్టర్ ని పరిచయం చేయాలి కాస్త. ఆయన మంచి హస్తవాసి వున్నాయనేనా?"
'ఒక్కదాన్నే వుంటున్నాను; అన్నవాక్యం దగ్గర అతడి కళ్ళు మెరవటాన్ని ఆమె సునిశితమైన చూపు పట్టుకుంది. ప్రపంచానికి ఎక్సెప్షను లేదు.
"తప్పకుండా తీసుకెళ్తాను. డాక్టర్ శాస్త్రి అని...... మంచివాడే".
"శాస్త్రా....." అంది ఆమె. "మీ సిక్ లీవ్ సర్టిఫికెట్ ఎవరో జోసెఫ్ అని ఇచ్చారే! పైగా గాంధీనగర్ అని వుంటే అంత దూరంలో ఫామిలీ డాక్టర్ ఏమిటా అనుకున్నాను".
"అదా...... మా శాస్త్రిగారు పది రోజులు టూర్ వెళ్ళారు. అందుకని....." అతడి మొహంలో అదోరకమైన ఇబ్బంది కనపడింది.
అంతలో ఫోన్ మ్రోగింది. పండా "ఒకసారి ఇలా వస్తావా అమ్మా" అని అడిగాడు ఫోన్లో. "ష్యూర్" అని ఫోన్ పెట్టేస్తూ "మిమ్మల్ని చైర్మన్ పిలుస్తూన్నారు" అంది. రామలింగేశ్వర్రావు మొహంలో రిలీఫ్ కనపడింది. లేచి వెళ్లాడు.
అతడు వెళ్ళగానే ఆమె చైర్మన్ కి ఫోన్ చేసి, "మీ దగ్గరకి రామలింగేశ్వర్రావు గారు వస్తున్నారు. అయిదు నిముషాలు ఎలాగైనా మీ దగ్గరే ఆపుచేయండి" అని చెప్పింది.
పండా కంఠంలో విస్మయం కనపడింది. "ఎందుకు?" అని అడిగాడు.
"చెపుతాను".
"ఆమె ఫోన్ పెట్టేసి, డైరెక్టరీ చూసి డాక్టర్ శాస్త్రికి ఫోన్ చేసింది. ఆయన లైన్లోకి వచ్చాక "మీరు 14వ తారీఖున ఏదైనా టూర్ లో వున్నారా?"
"అట్నుంచి విసుగ్గా "ఎవరు మాట్లాడుతున్నారు?" అని వినపడింది.
"సెంట్రల్ ఇంటెలిజెన్స్"
అటు చప్పున సర్దుకున్న ధ్వని. గౌరవంగా "లేదు మాడమ్. ఏం ఏమైంది?" కంగారు కూడా కాస్త మిళితం.
"ఏమీ లేదు".
"నెల రోజులుగా నేనసలు వూరు దాటలేదు".
"థాంక్స్"
ఆమె ఫోన్ పెట్టేసి పది నిముషాల తరువాత చైర్మన్ దగ్గరకి వెళ్ళింది- "ఎందుకో పిలిచారట".
"దానిదేముంది గానీ, ముందిది చెప్పు- ఎందుకు అతడిని నా గదిలో అట్టే పెట్టమన్నావు?"
"ఒక తప్పు సరిదిద్దుకోవటానికి అతడొక తప్పు చేశాడు. నాకన్నా ముందుగా అతడు తన డాక్టర్ కి ఫోన్ చేయకుండా అడ్డుపడటం కోసం-"
"నాకేమీ అర్థం కావటం లేదు".
"స్టాక్ హొంకి నష్టం తెప్పిస్తున్నదెవరో తెలుసుకున్నాను".
"ఎవరు?"
"మన సెక్రటరీ - రామలింగేశ్వర్రావు-"
పండా చేతిలో పైపు జారిపోయింది. "నిజమా" అన్నాడు.
ఆమె చెప్పటం ప్రారంభించింది.
"ఆ రోజు సెక్రటరీ శలవులో వున్నాడనగానే నాకు అనుమానం వచ్చింది. ఆయనే గానీ వుండి వుంటే కవరు ఆయనే అందుకుని చింపి తెచ్చిన వాడిని నిలదీయటం జరిగేది. ఈ వ్యవహారాన్నించి ఆయన దూరంగా వుండాలని నిశ్చయించుకున్నట్టు కనపడింది. కానీ ఈ ఆలోచన నూటికి నూరుపాళ్ళూ కరెక్టు కాదు. మొత్తం మీద అనుమానం మాత్రం కలిగింది. ఆయన టైప్ చేసిన ఉత్తరాలు తెప్పించి చూశాను. (స్టాక్ హొం లాంటి సంస్థలో ముఖ్యమైన ఉత్తరాలు పై అధికారులే వ్రాసుకుంటారు. లేదా టైప్ చేసుకుంటారు.) మనకొచ్చిన రిపోర్టూ, రామలింగేశ్వర్రావు టైపు చేసిన వుత్తరాలూ చూస్తే- రెండూ ఒకరే టైప్ చేసినట్టు కనపడింది. చేతి వ్రాతని ఎలా గుర్తుపట్టగలమో వేర్వేరు మిషన్ల మీద టైప్ చేసినా చేసింది ఓకే వ్యక్తి అయితే దాన్ని గుర్తుపట్టగలిగేశాస్త్రాన్ని 'అన్ ఫోల్డ్ టైప్ టెక్నిక్' అంటారు. A-S-D-F-అక్షరాల్ని వ్రేళ్ళు నొక్కే విధానం, లైను చివర ఆపే పద్ధతి ఇవన్నీ సహాయం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనలో నూటికి తొంభైమంది చేసే తప్పు - YOURS FAITHFULLY అని వ్రాయటానికి బదులు YOURS FAITHFULLY అని వ్రాయటం - తన వుత్తరాల్లోనూ, ఈ రిపోర్టులోనూ అతడు చేసాడు" ఆమె ఆగి చెప్పసాగింది.
"ఇందిరాగాంధీకి జపాన్ పర్యటన ఆలోచన వున్నట్టు ఏ పేపర్లోనూ రాలేదు. కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే తెలుసు. సాధారణంగా తప్పుచేసినవాడు దాన్ని కప్పి పుచ్చుకొనే ప్రయత్నంలో ఆడే అబద్దాలు చాలా సులభంగా తేలిపోయేవి అయి వుంటాయి. ఇందిరాగాంధీ పర్యటన వార్త పేపర్లో చదివానని అతననటం కేవలం అలాటి తప్పే. ఇంతకన్నా దారుణమైన తప్పు అతడి పార్శ్వపు నొప్పి. మొత్తం మీద దీని వెనుక ఎవరెవరున్నారన్నది తెలియాలంటే కొంతకాలం మనకేమీ తెలియనట్టు అతడిని గమనించటమే!!"
స్టాక్ హొం ఛైర్మన్, అంత పెద్దవాడు ఆమె వివరంగా చెప్పినదాన్నీ, చేసుకుంటూ వచ్చిన దాన్నీ విని చాలాసేపటి వరకూ మాట్లాడలేకపోయాడు. చివరికి "గుడ్" అన్నాడు. "అమ్మాయ్! ఈ సీట్లో కూర్చొని నేనెంతో మంది మేధావుల్ని చూసాను. షేర్లతో ఆడుకునే వాళ్ళనీ, ఎత్తులకీ ఎత్తులు వేసే లౌక్యుల్నీ చూసాను. కానీ ఇంత చిన్న వయసులో ఇంత తెలివిగా, తార్కికంగా ఆలోచించగలిగేదాన్ని నిన్నొక్కదాన్నే చూసాను. నువ్వు ఇలా ఈ సంస్థలోకి రాకుండా ఏ ఇంటలిజెన్స్ కో వెళ్ళి వుంటే మొత్తం నేరస్తులూ, మాఫియా అంతా దాసోహం అయివుండేది!" అన్నాడు.
అనూష నవ్వుతూ లేచి నిలబడి "అలా అనకండి. తథాస్తు దేవతలుంటార్ట! ఎదుర్కోవడం మాట అటుంచి, అసలా చీకటి ప్రపంచంవైపు చూడటమంటేనే నాకసహ్యం......." అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
సరీగ్గా అదే సమయానికి రామలింగేశ్వర్రావు హడావుడిగా తన గదిలో ఫోన్ తిప్పుతున్నాడు. "హాల్లో- డాక్టర్ శాస్త్రిగారా...... హమ్మయ్య. ఎంతసేపట్నుంచో ప్రయత్నిస్తూ వుంటే ఇప్పటికి లైన్లో దొరికారు. మీరో సాయం చెయ్యాలి. ఎవరన్నా అడిగితే మొన్నటి వరకూ మీరు టూర్లో వున్నట్టు చెప్పాలి".
"అరె - ఇప్పుడే ఎవరో ఇంటలిజెన్స్ నుంచి అడిగారే-"
"ఇంటెలిజెన్సా?"
"ఎవరో స్త్రీ"
"స్త్రీయా?" రామలింగేశ్వర్రావు నుదుటన చెమట పట్టింది...... పెదాలు కొరుక్కున్నాడు.
6
ఉత్పల తన పక్కనున్న ఇద్దరి వైపూ పరిశీలనగా చూసింది.
చివరికీ ముగ్గురమ్మాయిలు మిగిలారు!
రెండొందల రూపాయిల జీతానికి రెండొందల మంది అభ్యర్థులు వచ్చారన్న విషయం తల్చుకుంటే, భారతదేశంలో నిరుద్యోగం ఎంతలా ప్రతిబింబిస్తూందోఅర్థమవుతుంది! రోజుకి పదిమంది చొప్పున ఓపిగ్గా ఇంటర్వ్యూ చేసాడు పాపం ముసలి డాక్టరు. ఇరవై రోజుల తరువాత ఫైనల్ ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. రెండొందల రూపాయిలకి రెండుసార్లు ఇంటర్వ్యూ ఏమిటా అని ఇంట్లోవాళ్లు ఎగతాళి చేసినా అంతమందిలో సెలక్టయినందుకు గర్వంగా వుంది ఆమెకి!
ఆమె ఆలోచనల్లో వుండగానే తలుపు తీసుకుని డాక్టర్ హరనాధరావు ప్రవేశించాడు. ముగ్గురూ లేచి నిలబడ్డారు. "కూర్చోండి - కూర్చోండి" అంటూ తనూ కూర్చున్నాడు.
"రెండొందల మందిలో మీరు ముగ్గురూ మిగిలారు. కంగ్రాట్స్. బైదిబై నేను పిచ్చివాడిని అని చాలామంది అనుకుంటూ వుంటారు. మీకూ అలా అనిపించటం లేదుకదా!"
లేదన్నట్టు మౌనంగావుండి, అవునన్నట్టు మనసులో అనుకున్నారు ముగ్గురూ.
"కౌటిల్యుడి గురించి కూడా ఆ రోజుల్లో ప్రజలు ఇలాగే అనుకునేవారట" అన్నాడు హరనాధరావు. ముగ్గురూ మాట్లాడలేదు. అంతలో ఒక నర్సు చిన్న ప్లేటులో అయిదు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు తెచ్చింది.
"చాలా పురాతన కాలంనాటి సమస్య ఇది. దీన్ని ఆర్యభట్టు తయారు చేసాడంటారు. అర్థశాస్త్రం వ్రాసిన కౌటిల్యుడికే ఈ సమస్య తేల్చటానికి అరగంట పట్టిందట. చూద్దాం మీకెంత కాలం పడుతుందో" అంటూ నవ్వేడు. కౌటిల్యుడికే అరగంట పట్టిందంటే తనకి అయిదు సంవత్సరాలు పట్టవచ్చు అనుకుంది ఉత్పల.
"ఈ ప్లేట్లో అయిదు స్టిక్కర్లు వున్నాయి చూడండి" అన్నాడు. ఉత్పల ప్లేటు వేపు చూసింది. రెండు నల్లబొట్లు, మూడు ఎర్ర బొట్లు వున్నాయి.
"ముగ్గురూ ఒకేసారి కళ్ళు మూసుకుంటారా?" అని అడిగాడు. "మా నర్సు మీకు బొట్లు పెడుతుంది". శ్రావణ శుక్రవారం పేరంటానికి వచ్చినట్టు ముగ్గురు అభ్యర్థులూ కళ్ళు మూసుకున్నారు. తన నుదుటి మీద ఒక బొట్టు అంటించబడటం స్పర్శ ద్వారా గ్రహించింది ఉత్పల.
"ఇక కళ్ళు తెరవొచ్చు".
ఆమె తెరిచింది. ఈ లోపులో మిగతా రెండు బొట్లూ డ్రాయర్ లో దాచేసాడు అతడు.
"ఇప్పుడు మీరు చేయవలసిందల్లా, ఎదుటి ఇద్దరి బొట్లూ చూసి, మీ నుదుటి మీద ఏ బొట్టు అతికించబడిందో చెప్పటం..... ఎవరు ముందు చెపుతారో వారికే ఈ ఉద్యోగం".
ఉత్పలకి మతిపోయింది. ఎదుటి ఇద్దరి వైపూ చూసింది. ఇద్దరి అభ్యర్థుల నుదుటి మీద ఎర్రబొట్లు వున్నాయి.
మిగిలినవి రెండు నల్లబొట్లూ, ఒక ఎర్రబొట్టు. అందులో ఏది తన నుదుటిని అలంకరించింది?
మిగతా ఇద్దరు కూడా తన వైపు అయోమయంగా చూడటం గమనించింది!
ఆర్యభట్టూ ...... కొంప ముంచావుకదా! తన నుదుటిమీద ఏ రంగు బొట్టు వుందో ఆ ఇద్దర్లో ఎవరైనా చెపితే ఎంత బావుణ్ణు. ఎందుకు చేపుతారూ....... వాళ్ళూ తనుచెపుతే బావుణ్ణు అనుకుంటూ వుండి వుంటారు.
"మళ్లీ ఒకసారి కళ్ళు మూసుకుంటారా?"
ముగ్గురూ మూసుకున్నాక బొట్లు వొలుచుకుని వెళ్ళిపోయింది నర్సు.
"నాకో హెర్నియా ఆపరేషన్ వుంది. ఐ మీన్ - నేను చెయ్యాల్సింది! అది చేసుకుని వచ్చేలోపులో మీకు కొద్ది క్షణాల క్రితం ఏ రంగు బొట్టు పెట్టబడిందో ఆలోచించి చెప్పండి" అని వెళ్ళిపోయాడు.
అయిదు నిముషాలు గడిచాయి.
పది .....పావుగంట..... అరగంట..... హరనాధరావు తిరిగొచ్చే టైమైంది. మిగతా వాళ్ళిద్దరూ ఆలోచించటం మానేసి, వెళ్ళిపోతే బావుండదని, కుటుంబ నియంత్రణ పోస్టర్లు చూస్తున్నారు. విశాలమైన వరండా.
అద్దాల్లోంచి, వరండా చివర ఫోను.....
