Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 9

    అందుకే చాలా సౌమ్యంగా చెప్పాడు.
    "ఒకమ్మాయితో వెళ్లాడండీ"
    కృపాల్ నొసట ముడిపడింది.  అతనూహించని విషయం యిది.
    "ఎవరా అమ్మాయి?"
    "తెలియదండీ"
    "ఒకసారి చూస్తే గుర్తుపట్టగలవా?"
    గుర్తుపట్టగలనన్నట్టు  తలూపాడు అయ్యర్.
    "ఆవిడెప్పుడు వచ్చింది?"
    "తెలిదండీ... అసలా అమ్మాయి అయ్యగారి రూమ్ లో  వున్నట్టు మొన్నటిదాకా తెలియదు.  ఓ రోజు ఉదయమే కాఫీ యివ్వడానికి అయ్యగారి రూమ్ లోకి  వెళ్లాను.  అప్పుడు చూసాను"
    "తర్వాత"
    "ఆ  అమ్మాయి కిందకి వచ్చేదికాదు.  అయ్యగారు కూడా అదే గదిలో...హాస్పిటల్ కు  కూడా వెళ్లలేదు. ఆ తర్వాత యింటికి వచ్చిన ఫోన్లను కూడా ఎత్తవద్దని చెప్పారు. చివరికి అపూర్వమ్మాయిగారు  ఫోన్ చేసినప్పుడు కూడా".
    కృపాల్ మెదడులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
    "సరే...మళ్లీ నీ అవసరమైనపుడు  పిలిపిస్తాను.  ఒకవేళ పార్ధసారధి గారు వచ్చినా, నేను వచ్చివెళ్లిన  విషయం చెప్పొద్దు"  అన్నాడు కృపాల్.
    "అలాగే" అన్నట్టు తలూపాడు అయ్యర్.
    కృపాల్ వెళ్లబోతుంటే పిలిచాడు అయ్యర్ 'సార్'  అని.
    ఆగి అడిగాడు "ఏమిటి" అంటూ కృపాల్.
    "నా మనసేదో కీడును శంకిస్తోంది.  అయ్యగారు నాకు చలా ఏళ్లుగా తెలుసు.  అయ్యగారి అమ్మాయి అపూర్వమ్మను గుండెల మీద  ఆడించుకున్నాను.  ఆ కుటుంబానికి ఏమీ కాకుండా చూడండి"  చేతులు జోడించు అన్నాడు అయ్యర్.
    అప్రయత్నంగా కృపాల్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
    పార్ధసారధికి  ఏమీ కాని వ్యక్తి.  కేవలం వంట మనిషి అయ్యర్.కానీ తన  యాజమానిపట్ల అతనికున్న అభిమానానికి కదిలిపోయాడు.
    "అలాగే "  అంటూ బయటకు నడిచాడు.
   పార్ధసారధి  కళ్లు  తెరిచాడు.   మొదట   అంతా   చీకటిగా   అనిపించింది.  కొద్ది   సేపటికి  కళ్లు చీకటికి అలవాటుపడ్డాయి.
    "హలో...డాక్టర్...హౌఆర్యూ"ఓ మగ గొంతు వినిపించింది.
    గొంతు వినిపించినవైపు కళ్లు  చిట్లించి చూసాడు.
    అగ్గిపుల్ల గీచిన చప్పుడు వినిపించింది. క్యాండిల్ వెలిగించారు. క్యాండిల్ వెలుతురులో డేవిడ్ మొహం వికృతంగా కనిపించింది.
    "యూ...డెవిల్" కోపంగా అన్నాడు పార్ధసారధి.  తలంతా బరువుగా వుంది.  కాళ్లు కదల్చబోయాడు. అప్పుడర్ధమైంది   కాళ్లకు గొలుసులు చుట్టారని.
    "నో...నో పార్ధసారధి...నేను డెవిల్ ని   కాదు డేవిడ్ ని...అఫ్ కోర్స్...కోపమొస్తే డెవిల్ నికూడా...యు...నో.   చిన్నప్పట్నుంచి నాకు డెవిల్ కథలన్నా, డ్రాక్యుల్ సినిమాలన్నా చాలా....ఇష్టం.......నీకు  తెలుసో, లేదో...యిప్పటికి నాకు మనిషి రక్తం అంటే విస్కీకన్నా ఎక్కువ యిష్టం..."
    డేవిడ్ మాటలు వింటుంటే కడుపులో తిప్పినట్టనిపించింది పార్ధసారధికి.
    "అసలు మీ వుధ్దేశమేమిటి?  నన్ను యిక్కడికి ఎందుకు తీసుకువచ్చారు"
    అప్పుడు వచ్చింది డేవిడ్  వెనుకనుంచి చాందిని.
    "యూ...అసలు నీవల్లే యిదంతా జరిగింది.  ఎంత మోసం చేసారు...అమాయకురాలివని నమ్మాను.నీకేం కావాలి...ఛీ...యింత మోసం చేస్తావా?"
    "నో...నో...ఎక్సయిట్ అవ్వొద్దు డాక్టర్...ఆ ఆమ్మాయి నేను ఎలా చెబితే అలా చేస్తుంది".
    పార్ధసారధి పిడికిళ్లు బిగుస్తున్నాయి.  ఆవేశంవల్ల పని జరగదని అర్ధమైంది.
    "అద్సరే...మీకేం కావాలి?" అడిగాడు పార్ధసారధి ఓ నిర్ణయానికి వచ్చి.
    "ఓ కిడ్నీ... ఓ కాలేయం... ఓ కన్ను... యిస్తావా... యిస్తావా... కమాన్...కామన్... చెప్పుచెప్పు..త్వరగా"   డేవిడ్ మాటలు వింటూంటే వణుకొచ్చేస్తోంది.
    "వాడ్డూయూ మీన్!"
    "ఐ మీన్ వాట్ ఐ సే"
    "ఆర్యూ  మ్యాడ్?"
    నవ్వాడు డేవిడ్.
    తెరలు తెరలుగా...ఐదు  నిమిషాలుపాటు  నవ్వుతూ వుండిపోయాడు.
    ఆ నవ్వు వింటుంటే పార్ధసారధి ఒళ్లు జలదరిస్తోంది.  హారర్ సినిమాలో డ్రాక్యూలా నవ్వులా వుంది.
    "నేను పిచ్చివాడినా?ఊహు...అంతకన్నా ఎక్కువే" అంటూ పార్ధసారధి చెంపమీద బలంగా కొట్టాడు. పెదవి చిట్లింది.
    పార్ధసారధి కుడివైపు చెంప ఎర్రబడియింది. ఐదువెళ్లు తేలాయి చెంపమీద.
    అరవడానికి కూడా శక్తి లేకపోయింది. పెదవి చిట్లి రక్తం బయటకు వచ్చింది.
    "ప్చ్...పాపం...రక్తం...రక్తమొచ్సింది...రెడ్ బ్లడ్...ఎంత ఎర్రగా వుందో...ఏ గ్రూపు...ఏ? బి?"
    "ఓ..." అంటూ పెదవికి అంటిన రక్తాన్ని తన కుడిచేతి చూపుడు వేలితో టచ్ చేసి తన నాలుకమీద తీసుకున్నాడు.
    "ఫైన్...వెరీ వెరీ ఫైన్...యింత టెస్ట్  బ్లడ్ నేను ఎప్పడూ చూడలేదు".
    పార్ధసారధికి స్పృహ తప్పుతున్న ఫీలింగ్.  యింకాసేపు తను స్పృహలో వుంటే శాశ్వతంగా  కోమాలోకి వెళ్లిపోతానేమోననే అనుమానం వచ్చింది.
    డేవిడ్ నిజంగా డెవిలే...
    ఇలాంటి క్రూరమైన వ్యక్తిని మొదటిసారి చూసాడు.  సినిమాల్లో...నవలల్లో కనిపించే క్రూరమైనవ్యక్తి...
    తన కళ్లముందు...డేవిడ్ అడుగులు పార్ధసారధివ్తెపు పడుతున్నాయి.  పార్ధసారధికి స్పృహ తప్పింది.
    భార్గవకు స్పృహ  వచ్చింది.
    మెదడంతా మొద్దుబారిన ఫీలింగ్.
    క్యాండిల్ వెలుతురులో తను గది మారిన విషయం తెలుసుకున్నాడు. తను ఎన్ని గంటలు స్పృహ తప్పాడో కూడా తెలియదు.
    ఓసారి తన శరిరంవైపు  చూసుకున్నాడు.  షాక్ తిన్నాడు.  తన ఒంటిమీద అండర్ వేర్,  బనియన్ తప్ప మరేమీ లేవు.  చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు.  గరుగ్గా తగిలింది.
    నాసికా పుటాలను బ్రద్దలు చేసే దుర్వాసన అప్పటికివరకు సరిగ్గా గమనిచలేదు.
    కుళ్లిన మాంసం  వాసన వేస్తోంది తల తిప్పి చూసాడు.  ఒక్కసారిగా వామ్టింగ్ సెన్సేషన్ కలిగింది.  తెగిన ఎడమచేయి కుళ్లిన స్ధితిలో వుంది.  దాన్నించే భరించలేని దుర్వాసన వస్తోంది.
    ముక్కు గట్టిగా మూసుకునే  ప్రయత్నం చేసాడు. ఊపిరి వదలలేనంత గట్టిగా.
    తన కాళ్లకు గొలుసులు అలాగే కట్టి వున్నాయి.
    కడుపులో ఆకలి బాధ ఒకవైపు,  కుళ్లిన వాసన తాలూకు వామ్టింగ్ సెన్సేషన్ మరోవైపు.
    ప్రాణాలు పోతున్నట్టనిపించింది.
    "దేవుడా...నాకేమిటి శిక్ష?"  అంటూ మనసులోనే ఏడ్చేసాడు భార్గవ.
    అతనికంతా మిస్టరీగా వుంది.    
    తననెందుకిలా తీసుకువచ్చారో అర్ధం కావడంలేదు.  తన వెనక ఏదో కుట్ర జరుగుతుందన్న భయం.
    చిత్రంగా అతనికి ఈ పరిస్దితిలోనూ భార్యే గుర్తొస్తోంది.  తన అతి పొదుపుతో ఆమెను హార్ట్ చేసాడు.
    రోజూ భార్యతో మాట్లాడాలని వున్నా,  ఎ స్ టి డికి ఖర్చెక్కువ అవుతుందని చేయలేదు.  ముచ్చటగా  సినిమాకు తీసుకెళ్లమన్నా,  యింట్లో కేబుల్ వుందికదా అని సరిపెట్టడు తనంటే తన భార్యకు ఎంత ప్రేమ.
    తననే కాదు,  తనలోని బలహీనతల్ని కూడా ప్రేమించేది.  ఈ పాటికి తన కోసం ఎదురుచూస్తూ...బహశ కంగారుపడుతూ వుండొచ్చు.
    మొదటిసారిగా అతనిలో పశ్చాత్తాపం లాంటిది కనిపించింది.  తను ఈ చెర  నుంచి బయటపడగానే,  ముందు తన  భార్యను తీసుకెళ్లి ఏ  ఊటీ లోనో, ఢిల్లీలోనో  గడపాలి.
    లగ్జరీగా బ్రతకాలి.  అతి  పొదుపు పేరుతో పిసినారిగా బ్రతకొద్దు.  అనుభవించాలి,  వున్నంతలో తృప్తిగా బ్రతకాలి.  యిలా రకరకాలుగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
    కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తే తప్ప తెలియవు.  బ్రతుకు విలువ,  భార్య విలువ యిప్పుడు  తెలుస్తున్నాయి భార్గవ.
    తలుపు తెరుచుకుంటున్నశబ్దం.
    ఊపిరి బిగపట్టాడొక క్షణం.
    జేమ్స్ డేవిడ్ లోపలికి అడుగు పెట్టాడు.
    అతడ్ని చూస్తేనే భయమేస్తోంది. వళ్లు గగుర్పొడుస్తోంది.
    "హలో...వెరీ బ్యాడ్ మార్నింగ్" విష్ చేసాడు డేవిడ్.
    "ప్లీజ్...నన్ను మాయింటికి పంపించేయి" కన్నీళ్ళతో గుండె జారిపోతుండగా ప్రాదేయపడ్డాడు భార్గవ.
    "ఇప్పుడా...యిప్పడా నువ్వు యింటికి వెళ్తే మరి ఆ యింట్లో వున్నా భార్గవ ఎక్కడికి వెళ్లాలి?" నవ్వుతూ అడిగాడు జేమ్స్ డేవిడ్.
    "మా యింట్లో భార్గవ వుండడమేమిటి? నేనేగా భార్గవను  అయోమయంగా అడిగాడు భార్గవ.
    "అవుననుకో ...నీతో మాకు పనిపడింది. నువ్వెళ్లి, మీ బ్యాంకులో క్యాష్ దోచుకురమ్మంటే వింటావా? వినవు...ఫైగా పోలీసులకు చెబుతావు. అదే మీ యింట్లో వున్న భార్గవ అనుకో...రోజూ బుద్దిగా బ్యాంకుకు వెళత్తాడు.  ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ వుంది, దాన్ని ఎలా తెరవాలి... ఎంత డబ్బు వుంది, డూప్లికేట్ తాళాలు ఎలా తాయారుచేయాలి... లాంటి వ్యవహారాలు అన్నీ అతనే  చూసుకుంటాడు. వెరీగుడ్ జంటిల్మెన్ ... పైగా అతను ఆ పనులన్నీచేసి, నువ్వే ఆ పని చేసావన్న ఆధారం అక్కడ వదిలి మరీ వస్తాడు... అప్పడు  పోలీసులు  నీకోసం వేట మొదలెడతారు. యిది భరించలేక నువ్వు  ఆత్మహత్య  చేసుకుంటావు. ఆఫ్ కోర్స్ రైలుకిందపడి అనుకో... ఈ క్రయిం కథ ఎలావుంది? మంచి క్రైం థ్రిల్లర్ లా వుందికదూ."
    భార్గవ మొహమంతా స్వేదం అలుముకుంది. పిచ్చెక్కిపోతుంది. అయోమయంగా,  అనూహ్యంగా అనిపిస్తోంది. తనలా మరో వ్యక్తి వుండడమేమిటి? అంటే తన రూపంలో...
    "ఏంటి... భార్గవను చూస్తావా?" అంటూ చప్పట్లు చరిచాడు.
    ఓ వ్యక్తి లోపలికి వచ్చడు. అచ్చం భార్గావలాగానే వున్నాడు.
    భార్గవ షాకింగ్ చూసాడు.
    తను కూడా పోల్చలేనంతగా వున్నాడు.
    అతను...అతను అచ్చు తన పోలికల్లో...
    "మైగాడ్...ఏం జరగాబోతోంది...యిది ఇదెలా సాధ్యం?"
    "హలో... ఏంటా  షాకింగ్... యితను నీలా వున్నాడనా? వెరీ సింపుల్... అన్నట్టు "ఫేస్ ఆఫ్ " చూసావా, మొన్ననే వీడియోలో చూసా... హీరో విలన్ గా, విలన్ హీరోగా ...ప్చ్  ... హమ్మో ...చాలా బాగా తీసారు... పెద్ద కష్టమేమీ కాదు... నీలా ఒడ్డు, పొడువు వుంటే ప్లాస్టిక్ సర్జరీ కష్టం కాదు... కాకపోతే కాస్త ఖర్చు... నీ దుస్తులే.. బావున్నాయికదూ... బాగా నప్పాయి కదు" డేవిడ్ మాట్లాడుతుంటే  అర్ధరాత్రి డ్రాక్యులా మాట్లాడినట్లు వుంది.
    "అంటే నా పేరుతో.."
    "ఎగ్జట్లీ ... నాపేరుతో ఇతను తన పనులన్నీ చేసేస్తాడు. వెరీ యింటలిజెంట్... తర్వాత  మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేసి, యింకో షేవ్ లోకి  మారిపోతున్నాడు" జేమ్స్ డేవిడ్ చాలా క్యాజ్ వాల్ గా  మాట్లాడుతున్నాడు.
    భార్గావకు దుఃఖం ముంచుకోచ్చేస్తోంది. తను మాగాడిననే విషయం కూడా మరచిపోయి, బోరున ఏడవసాగాడు.
    "ష్...ఏడవొద్దు ...నో టాకింగ్ ... నోక్రైయింగ్ ..అండ్ నో హేపేసే " వేలిని  నోటిమీద  పెడుతూ హెచ్చరికగా అన్నాడు.
    "ప్లీజ్... మీకు దండం పెడతాను... నన్ను... మా యింటికి పంపించేయండి. మీరేం చేయమన్నా చేస్తాను "  చివరికి అతను కాళ్ల బేరానికి వచ్చాడు.
    "సారీ ... సారీ ... మైడియర్ ఎనిమీ... ఐకాంట్  హెల్ప్.." అంటూ ఆగి... అన్నట్టు ఆకలేస్తోందా? అదిగో ... అక్కడో చేయివుండాలి... దాన్ని తినేసేయ్.. మిగతాదంతా నేను తినేసా... బావుంది.... నన్ను పట్టుకొని ఈ యింట్లో అప్పగించి, అప్పనంగా లక్షరూపాయలు  కొట్టేయాలని చూసాడు.పూర్ ఫెలో ... కిడ్నీ, కన్ను, ఊపిరితిత్తులు , చర్మం... అన్ని అమ్మేసి మిగిలింది తినేసా... బెస్టాఫ్ లాక్" అని వెనుతిరిగాడు.
    కొద్ది క్షణాల తర్వాత తలుపు మూసుకుంది. కుప్పలా కూలపడిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS