ఈజిట్...కృపాల చేతులు రిసీవర్ మీద బిగుసుకున్నాయి ఉద్వేగంతో...
"నిజమా"
"నిజంసార్...నా కళ్లతో చూసాను. ఆటోలో యింటి ముందు దిగాడు. లోపలికి వెళ్లాడు. కాసేపటికి బెడ్ రూమ్ కిటికీ తలుపులు తెరిచింది ప్రణవి నన్ను చూసింది కానీ, గుర్తు పట్టినట్టు లేదు"
"వెరీగుడ్...నువ్వు వాచ్ చేస్తూనే వుండు" అంటూ ఫోన్ పెట్టేసాడు.
ఇప్పుడు కాస్త హుషారుగా అనిపించింది కృపాల్ కు. అయితే సమస్య మరి కాస్త జటిలం అవుతుందేమోనన్న అనుమానం కూడా కలిగింది.
భార్గవని కలిస్తే తప్ప ఏ వివరాలు తెలియవు. అసలు మిస్టరీ అంతా విడిపోతుంది. భార్గవ మిస్టరీ తెలిస్తే, పార్ధసారధి మిస్టరీని మరో కోణంలో ఛేదించొచ్చు అనుకున్నాడు.
భార్గవ మిస్టరీ కి, పార్ధసారధి మిస్టరీకి వుందన్న విషయం తెలియదు కృపాల్ కు.
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
భార్గవ ఉదయమే లేచి నీట్ గా షేవ్ చేసుకున్నాడు. స్నానంచేసి డ్రెస్ ఛేంజ్ చేసుకున్నాడు.
అప్పటికే ప్రణవి టిఫిన్ రెడీ చేసింది భార్గవ తయారవ్వడం చూసి.
"ఇంత పొద్దున్నే తయారయ్యరేమిటండీ?".
"అనీజీనెస్ తగ్గించుకోవడానికి" అన్నాడు తడబడుతూ భార్గవ.
తను చెప్పిన సమాధానం ఎంత పూలిష్ గా వుందో తెలుస్తూనే వుందతనికి.
అప్పుడు గుర్తొచ్చింది ప్రణవికి , తను ఇన్స్ పెక్టర్ కు ఫోన్ చేసి కనీసం తన భర్త తిరిగొచ్చిన విషయం చెప్పలేదని. పాపం తన కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. తనకు ఓ ఆత్మీయుడిలా ధైర్యం చెప్పాడు.
వెంటనే ఫోన్ దగ్గరికి నడిచింది.
"ఫోన్ ఎవరికి" కాఫీ తాగుతూ క్యాజువల్ అడిగాడు.
"ఇన్స్ పెక్టర్ కృపాల్ గారికి"
ఒక్కసారిగా పొలమారింది భార్గవకు. కంగారుగా లేచి ఫోన్ దగ్గరికి వచ్చి రిసీవర్ పెట్టేసి..."ఇప్పడెందుకు?" అడిగాడు కోపంగా.
"అదేమిటండీ అలాగంటారు? నేను కంగారుగా పొలీసు స్టేషన్ కు వెళ్తే నన్ను ఓదార్చి మీ కోసం ఎంక్వయిరీ చేసాడు. నాకు ధైర్యం చెప్పాడు. ఎఫ్.ఐ. ఆర్ కూడా ఫైల్ చేయనని చెప్పాడు. మీరు కనిపించారని చెబితే సంతోషపడతాడు" అంది ప్రణవి.
"ఇప్పుడేం అక్కర్లేదు" విసుగ్గా అన్నాడు.
ఒక్క సారి ఫోన్ చేస్తే ఏమవుతుందండీ?"
"అంతగా అయితే నేనే బ్యాంకు నుంచి పొలీసుస్టేషన్ కు వెళ్లి థాంక్స్ చెప్పోస్తాను" అన్నాడు.
మిన్నకుండిపోయింది ప్రణవి.
ఇంత చిన్న విషయానికి భర్త ఎందుకు యిరిటేట్ అవుతున్నాడో అర్ధం. కాలేదు.
కాఫీ తాగి, పేపర్ తిరగేస్తుండగా ఇంటి ముందు పొలీసు జీపు ఆగిన శబ్దం వినిపించింది. కాసేపట్లో బూట్ల శబ్దం.
భార్గవ కంగారుగా పేపర్ నుంచి తలెత్తి చూసాడు. ఎదురుగా ఇన్స్ పెక్టర్ కృపాల్.
భార్గవ మొహంలో రంగులు మారాయి.
"హలో...అయామ్ కృపాల్...క్రైం బ్రాంచి ఇన్స్ పెక్టర్ ని" అన్నాడు చేయి చాచి.
"అయామ్ భార్గవ"
కృపాల్ సోఫాలో కూచున్నాడు. యింతలో ప్రణవి వచ్చిందక్కడికి.
"థాంక్యూ ఇన్స్ పెక్టర్ గారూ...ఇన్నిరోజులు నాకు మోరల్ సపోర్టు యిచ్చారు. నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. తను రాత్రే వచ్చారు. మిమ్మల్ని ఆ టైంలో డిస్ట్రబ్ చేయడం యిష్టంలేక...అన్నట్టు వన్ మీనిట్ టిఫిన్ తీసుకువస్తాను. మీరు మాట్లాడుతూ వుండండి" అంటూ కిచెన్ రూమ్ వైపు వెళ్లింది.
కృపాల్ భార్గవని పరిశీలనగా చూస్తున్నాడు. భార్గవ కొద్దిగా షేక్ అవుతున్నట్టు అర్ధమైంది.
పోలీసులను చూస్తే అలాంటి షేక్ కొంత వరకు సహజమే.
"బైదిబై... నిజానికి మీ కేసు నేను ఫైల్ చేయలేదు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకులెద్దు...అని వదిలేసా...యింతకీ ఏం జరిగింది?" క్యాజువల్ అడిగినట్టు అడిగాడు కృపాల్.
"మూడ్రోజుల క్రితం నేను సెకండ్ షో చూసి వస్తుండగా ఎవరో వెనగ్గా వచ్చి, నా ముక్కుకు క్లోరోఫామ్ వాసన చూపి తీసుకెళ్లారు. నాదగ్గర డబ్బు వుందని అనుకున్నారేమో... రెండ్రోజులు నన్ను హింసించి స్టేషన్ దగ్గర వదిలేసారు".
కృపాల్ తల పంకించాడు.
అతడు చెప్పింది నమ్మబుద్దేయలేదు. అతను అబద్ధం చెబుతున్నాడని అర్ధమైంది. నేర పరిశోధనలో ఎంతో అనుభవం వున్న కృపాల్ కు భార్గవ నిజం చెబుతున్నాడా? అబద్ధం చెబుతున్నాడా అని కనుక్కోవడం కష్టం కాదు.
"పోనీ వాళ్లెవరో తెలుసా?"
"తెలియదండీ"
"ఎక్కడ బంధించారో గుర్తుపట్టగలరా?"
"లేదండి కళ్లకు గంతలు కట్టారు"
"సెకండ్ లో సినిమాకు మీరొక్కరే వెళ్లారా?"
"అవునవును"
"ఏ సినిమా'
"అదీ" ఒక్క క్షణం కంగారు పడిపోయాడు.
"ఆ రోజు బ్యాంకుకు సెలవు పెట్టారా?"
"అవునవును...మా మిసెస్ కూడా యింట్లో లేకపోతే ఏమీ తోచక, అలా రోడ్లు తిరుగుతూ వుండిపోయాను"
" ఆరోజు ఎవరినైన కలుసుకున్నారా?"
"లేదు"
ఖచ్చితంగా భార్గవ అబద్ధం చెబుతున్నాడని కృపాల్ కు అర్ధమైంది. ఎందుకంటే పేపర్ లో 'కనబడుటలేదు' ప్రకటనలో వున్న వ్యక్తితో భార్గవ తన యింట్లో గడిపిన సాక్ష్యం కృపాల్ దగ్గరుంది.
భార్గవా బ్యాంకుకు బయలుదేరాడు.
కృపాల్ తనని ఇంటరాగేషన్ చేయడం వలన కాస్త కంగారుపడ్డాడు. ఆ కంగారులోంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది.
బ్యాంకులోకి వెళ్లగానే స్టాప్ పలకరించారు. మేనేజర్ కాస్త చికాకుపడ్డా భార్గవ అతన్ని ఏదో విధంగా మేనేజ్ చేయగలిగాడు. భార్గవ వర్క్ లో ఎఫీషియంట్ కావడం వల్ల.
కస్టమర్లతో బిజీగా వుంది బ్యాంకు. పైగా ఆ బ్యాంకు ఎప్పుడూ రద్దీగా వుంటుంది. కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్.
క్యాష్ కౌంటర్ కూచున్నాడు. కస్టమర్లు ఒక్కొక్కరు వచ్చి క్యాష్ తీసుకెళ్తూన్నారు.
భార్గవ స్పీడ్ గా క్యాష్ లెక్క పెట్టలేక పోతున్నాడు.
"ఏయ్ భార్గవ...ఏంటి...చాలా ఫాస్ట్ గా నోట్లను కౌంట్ చేసే నువ్వు నెమ్మదిగా లేక్కెడుతున్నావు. ఎనీ ప్రాబ్లం" అడిగాడు.
"ఏంలేదు, చేతికి దెబ్బ తగిలింది" చెప్పాడు భార్గవ.
మధ్యాహ్నం రెండవుతుండగా రష్ తగ్గింది. మధ్యమధ్యలో టీ తాగుతూ, కౌంటర్ నుంచి బయటకు రాలేదు.
అంత ఎ.సి లోనూ భార్గవకు చెమట్లు పడుతున్నాయి. రెండున్నర అవుతుండగా భార్గవ చివరి కస్టమర్ కు టోకెన్ తీసుకొని డబ్బు యిస్తూ ఖంగు తిన్నాడు.
ఎదురుగా కృపాల్.
"మీరు" భార్గవ గొంతు తడారిపోయింది.
"డబ్బు తీసుకోవడానికి వచ్చాను. మా ఫ్రెండు ఒకతను చెక్కిచ్చాడు..లేటయింది...లాస్ట్ కస్టమర్ ని నేనే కాదూ" నవ్వుతూ అన్నాడు కృపాల్.
"అవునవును" భార్గవ మొహంలో కంగారు.
"అదేంటి...ఏ.సిలో మొహం చెమట్లు పడుతున్నాయి" కృపాల్ అతని వంకే పరిశీలనగా చూస్తూ అడిగాడు.
"అది...కాస్త జ్వరం వచ్చినట్టుంది" తనలో తను గొణుక్కుంటున్నట్టు అన్నాడు.
డబ్బు కౌంట్ చేసి టోకెన్ సరిచూసుకొని కృపాల్ కు యిచ్చేసాడు.
కృపాల్ డబ్బు లెక్క పెడుతూ భార్గవ
వంకే చూస్తున్నాడు. భార్గవకు ఆ పరిస్ధితి యిబ్బంది కరంగా వుంది.
అవును...భార్గవ చాలా స్పీడ్ గా నోట్లను కౌంట్ చేస్తాడట...ఒక్క సారి కౌంట్ చేస్తే తేడా కూడా రాదట" అతని వైపే చూస్తూ అన్నాడు.
"అవునా" అన్నాడు భార్గవ వెంటనే.
"అదేంటి...అవునా అంటారు...మీ గురించి మీకు తెలియదా?"
"తెలుసు...తెలుసు"
"ఏమైనా ఎక్కువిచ్చారా?" అడిగాడు నోట్లను కౌంట్ చేసిన కృపాల్.
"ఎక్కువిచ్చానా?"
"లేదే...అదే భార్గవ అయితే ఎక్కువ తక్కువ వచ్చే ప్రసక్తి లేద్సార్ అంటాడట"
"అదేంటి...నేనే భార్గవనుకదా. నా గురించి నాకు తెలియదా?"మొహన నవ్వు పులుముకొని అన్నాడు భార్గవ.
"అవును కాదు...మీరు భార్గవ అన్న విషయం మరచిపోయాను"అంటూ వెనక్కి తిరగబోతూ ఆగి...
"టు థర్టీకి బ్యాంక్ క్లోజ్ చేస్తారు కదు...అలా హొటల్ కు వెళ్లి కాఫీ తాగుదామా?" కృపాల్ అడిగాడు.
"లేదు..లేదు...మాకింకా దాదాపు ఐదు వరకు పని వుంటుంది. అకౌంట్స్ అవీ యివీ టాలిచేసుకోవడం లాంటి పనులుంటాయి".
"అవునా...సరే...మళ్లీ కలుద్దాం"అంటూ కృపాల్ వెళ్లిపోయాడు.
మోటార్ సైకిల్ డాక్టర్ పార్ధసారధి యింటి ముందాగింది.
కృపాల్ మోటార్ సైకిల్ స్టాండు వేస్సి గూర్ఖాని పిలిచాడు.
"సాబ్ హై అందర్ " అడిగాడు.
కృపాల్ యూనిఫామ్ లో వుండడం చూసి గూర్ఖా అటెన్షన్లోకి వచ్చి చెప్పాడు "లేరుసార్" అంటూ. గేటు తీసుకొని లోపలికి నడిచాడు. విశాలమైన స్ధలం. మధ్యలో బంగ్లా వుంది. చాలా రిచ్ గా వుంది. డోర్ దగ్గరికి వెళ్లి డోర్ బెల్ ప్రెస్ చేసాడు.
రెండు నిమిషాలు తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అయ్యర్ తలుపు తీశాడు.
అపూర్వ ఫోన్ చేసినపుడు అయ్యర్ గురించి చెప్పిన విషయంగుర్తొచ్చింది.
"నువ్వేనా అయ్యర్"
"అవునండీ...మీరు" అడిగాడు అయ్యారు.
" నా పేరు కృపాల్. క్రైం బ్రాంచి ఇన్స్ పెక్టర్ ని" భయంగా చూసాడు అయ్యర్.
'పోలీసులకు తనతో ఏం పని? యజమాని కోసమొచ్చాడా?' స్వగతంలో అనుకుంటున్నాడు.
"ఎన్నాళ్లనుంచి పనిచేస్తున్నావు?" అతనివైపే చూస్తూ అడిగాడు కృపాల్.
"చాలా ఏళ్లయింది"
"నువ్వుకాక యింకా ఎవరెవరు పనిచేస్తారు?"
"తోటమాలి, మరో నౌకరు...వాళ్లు ఉదయం, సాయంత్రం వస్తారు. రాత్రి కాగానే వెళ్లిపోతారు"
"మరి నువ్వు"
"నేను కూడా రాత్రి అయ్యగారికి కావలసిన వంటలు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది వెళ్లిపోతాను"
"రాత్రిళ్లు యిక్కడ ఎవరూ వుండరా?"
గూర్ఖా తప్ప మరెవరూ వుండరు. గుర్ఖా గేటు దగ్గర వున్న చిన్న షెడ్ లో వుంటాడు. యింట్లో అయ్యగారు తప్ప మరెవరూ వుండరు."
"డాక్టరుగారు ఎక్కడికి వెళ్లారు?"
"తెలియదండీ"
"ఎప్పుడు వెళ్లారు?"
"మొన్నరాత్రి"
"నిన్నంతా రాలేదా?"
"లేదండి"
"ఒక్కరే వెళ్ళారా?"
'సందేహించాడొక క్షణం అయ్యర్. అసలు విషయం చెప్పాలా? వద్దా? అన్న డైలమాలో వున్నాడు. చెబితే అనవసరంగా ఏమైనా రిస్క్ ఎదురవుతుందేమో! ఎందుకు చెప్పావని యాజమాని తిడితే?
"ఫర్లెదు...ఏం జరిగిందో విపులంగా చెప్పు. నీకు భయంలేదు. మీ అపూర్వమ్మగారు నన్ను పంపించారు" అనునయంగా అన్నాడు కృపాల్.
అతనికి తెలుసు. సాధారణంగా పోలీసులంటే అందరికి భయం. కరుడు గట్టిన నేరస్తులమీద తప్ప, తన కాఠిన్యాన్ని మామూలు వ్యక్తులమీద ప్రదర్శించడానికి యిష్టపడడు కృపాల్.
