డబ్బంతా భద్రంగా బ్యాంకులో వేశారు. భార్యాకీ, కూతురికీ నగలు చేయించారు.
ఆపై నిశ్చింతగా పాత ఉద్యోగం చేసుకుంటూ పాత జీవితమే గడపసాగారు.
వేసవికాలం వచ్చింది.
ఆ రోజు ఉదయం మామూలుగా కాఫీ తాగుతూ "ఒరే సత్యం ఈ శెలవుల్లో దక్షిణాది అంతా తిరిగి రావాలిరా! కన్యాకుమారి, రామేశ్వరం చూసి రావాలని మీ చెల్లెలు గోల పెట్టేస్తోంది" అన్నాడు సూర్యం.
"అలాగా! అలాగే వెళ్ళిరండి. అనీ చూసిరండి!" అన్నాడు సత్యం.
"నీ మొహంలా వుంది వెళ్ళిరండి అంటావేమిట్రా! అందరం కలిసే వెళ్దాం. ప్రోగ్రాం తయారు చెయ్యి శెలవులు పెడదాం!" అన్నాడు సూర్యం.
స్నేహితుడి మంచి మనసుకి మరోసారి ఆనందించాడు సత్యం. ప్రోగ్రాం తయారైంది.
లీవ్ అప్లికేషన్ తీసుకుని ఆఫీసర్ గారి దగ్గరకు వెళ్ళారు సూర్యంగారు. "రండి! రండి" అని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వివరాలు అడిగి అలాగా! చాలా సంతోషం వెళ్ళిరండి!" అంటూ లక్షాధికారి సూర్యంగారికి వినయంగా లీవ్ శాంక్షన్ చేశాడు ఆఫీసర్.
ఆ సాయంత్రమే తన శెలవుచీటీ పట్టుకెళ్ళారు సత్యంగారు. ఎగాదిగా చూసి "ఏమిటి?" అని కళ్ళెగరేశాడు ఆఫీసర్ విషయం తెలుసుకుని భేష్ అందరూ ఆయనది అదృష్టం అంటారుగానీ అసలు అదృష్టం నీదయ్యా! సొమ్ము ఒకడిది సోకు ఒకడిది పెట్టి పుట్టావుమరి వెళ్ళిరా" వ్యంగ్యంగా నవ్వుతూ మామూలు గుమస్తా సత్యంగారి లీవ్ లెటర్ శాంక్షన్ చేశాడు ఆఫీసర్.
చెంపదెబ్బ తిన్నట్లు అయిపోయాడు సత్యం. వున్న పాటున ప్రయాణం కాన్సిల్ చేసుకోవాలని అనిపించింది. కానీ భార్యా . పిల్లలు, స్నేహితుడు బాధపడతారని బలవంతంగా బయలుదేరాడు.
ఇరవైరోజుల టూర్. దివ్యంగా గడిచింది. మిత్రుడి చేత పైసా ఖర్చు పెట్టించకుండా ఏ లోటూ రాకుండా, చూసుకున్నాడు సూర్యం అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ సత్యం మాత్రం ఏదో న్యూనతా భావంతో బాధపడుతూనే వున్నాడు.
స్నేహితుడు ముభావ ప్రవర్తన గమనించిన సూర్యం మనసు చివుక్కుమంది ఏమిటిది? ఇలా ప్రవర్తిస్తాడేం వీడు, నాదంతా వాడిదికాదా! అని బాధపడ్డాడు.
ఇంటికి తిరిగివచ్చారు. కొద్ది రోజులు గడిచాయి. "మన దగర డబ్బుందికదా నాన్నా! మంచిమెడ కట్టించుకుందాం!" అంది భారతి ఎన్నాళ్ళబట్టో ఆయనకీ కోరిక వుంది మనసులో కూతురు కోరేసరికి కాదనలేకపోయాడు.
"సత్యం, ఈ యిల్లు పడగొట్టి మంచి యిల్లు కట్టించు కుందామనుకుంటున్నారా! ఎన్నాళ్ళనించో కోరిక నాకు!" అన్నాడు ఆ మర్నాడే మిత్రుడుతో.
పేలవంగా నవ్వి "అలాగా! మరి ఆలస్యం ఎందుకు? ప్రారంభించు అన్నాడు సత్యం"
"కొద్ది రోజులకే శుంఖుస్థాపన జరిగింది. ఆ రాత్రి భార్యతో "వర్దనీ నాకు అరవైఏళ్ళు యెప్పుడోస్తాయి?" అని అడిగాడు సత్యం.
నవ్వేసింది ఆవిడ "అప్పడే ఎక్కడ? ఇంకా యాభై నాలుగేగా? ఏం షష్ఠిపూర్తీ చేయించుకోవాలని తొందరగా వుందా?" అంది.
దిగులుగా నిట్టూర్చాడు ఆయన,
ఆర్నెల్లు తిరక్కుండానే చక్కటి మేడ కట్టిం చేశాడు సూర్యం. గృహ ప్రవేశం ఆర్భాటంగా జరిగింది.
ఈ ఆర్నెల్లలోనూ సత్యం పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కనిపించిన వాళ్ళందరికీ చెయ్యి చూపించుకున్నాడు. బోలెడంతమందికి జాతకం చూపించుకున్నాడు.
శనికి అభిషేకం చేయించాడు. ఉపవాసాలున్నాడు. ప్రదక్షిణలు చేశాడు. వీటన్నిటివల్ల ఆయన ఆరోగ్యం పాడైంది తప్ప ఆకస్మాత్తుగా ధనం మాత్రం రాలేదు.
ఆయనకై ఆయన చెప్పకపోయినా యిదంతా గమనిస్తూనే వున్నాడు సూర్యం ఆయనకీ స్నేహితుడిమీద ఆగ్రహం కలిగింది. అయినా ఊరుకున్నాడు.
ఒకసారి ఎవరో బాబా వచ్చి ఊరిబయట విజయం చేశాడనీ, భూత భవిష్యత్ వర్తామనాలు అరటిపండు ఒలిచి చేతుల్లో పెట్టినట్లు చెప్తాడనీ, దమ్మిడీ తీసుకోడనీ తెలిసింది.
వెంటనే ఎగిరివెళ్ళి ఆయన పాదాలమీద లేండ్ అయిపోయాడు సత్యం. పాదాలమీద వాలిన భక్త పరమాణువును చూసి చిన్నగా నవ్వారు బాబాగారు. "లే నాయనా!" అన్నాడు.
లేచి కూర్చున్నాడు సత్యం. "నువ్వు ఏదో బాధ పడుతున్నావు నాయనా! చెప్పు ఏమిటి నీ బాధ?" అన్నారు వాత్సల్యంగా నవ్వుతూ.
"ఏం చెప్పమంటారు స్వామి! నా జీవితం దుర్భరంగా మారిపోయింది." అన్నాడు సత్యం దుఃఖంపూరితంగా.
"ఎందుకని నాయనా? కారణం ఏమిటి?" ప్రశ్నించారు బాబాగారు. వెంటనే కుడి చెయ్యి అందించాడు సత్యం. "స్వామీ నా చేతిలో ధనరేఖ వుందా?" కుతూహలంగా అడిగాడు.
ఓరకంట చూసి "జెర్రిపోతులా వుంది నాయనా ధనరేఖ" అన్నారు బాబాగారు.
స్వామీ ధనరేఖ దివ్యంగా వుందనీ ఆకస్మిక ధనప్రాప్తి వుందనీ ఇప్పటికి సవాలక్షమంది చెప్పారు. కానీ ఆ ప్రాప్తి వుందనీ ఇప్పటికి సవాలక్షమంది చెప్పారు. కానీ ఆ యోగం ఎప్పుడుందో ఎవరూ చెప్పటంలేదు. తమరు సర్వయోగం ఎప్పుడుందో ఎవరూ చెప్పటంలేదు. తమరు సర్వజ్ఞులు....నాకు సాయంచేసి నన్ను కాపాడండి!" వేడుకున్నాడు సత్యం.
కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో చూశారు బాబాగా "నీకు లంకెబిందెల రూపంలో ధనం లభిస్తుంది నాయనా!" అన్నారు.
ఆనందంతో ఏడ్చేశాడు సత్యం. "స్వామీ లంకెబిందెలా? నాకా?"
"అవును నాయనా!" ఆదరంగా అన్నారు బాబాగారు.
"ఎప్పుడు దొరుకుతాయి స్వామీ? ఎక్కడ దొరుకుతాయి?" భరించలేని ఉత్కాంఠంతో ప్రశ్నించాడు.
మళ్ళీ కళ్ళు మూసుకున్నారు బాబాగారు.అయిదు నిమిషాల తరువాత కళ్ళు తెరిచారు. "అంతా అగమ్య గోచరంగా వుంది నాయన? అన్నాడు దీనంగా.
"బాధపడకు నాయనా? "ఇది ఏదో దుష్టగ్రహ ప్రభావం. శాంతి జరిపించాలి" అన్నారు.
"జరిపించండి స్వామీ!" క్షణం ఆలస్యం చెయ్యకుండా అనేశాడు సత్యం.
నేనలాటివి చెయ్యను అనేశాడు ఆయన.కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమలాడాక సరే అన్నారు అయిష్టంగా.
"రేప్రోద్దున్నే పూజలో కూర్చోవాలి. నువ్వు తెల్లవారేసరికి ఇక్కడికిరా!: అని ఆదేశించారు.
"ఆ రాత్రంతా నిద్రలేదు సత్యంగారికి. తెల్లవారు ఝూమున స్నానంచేసి పట్టుబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని గుమ్మం దాటేసరికి సూర్యంగారు ఎదురొచ్చారు.
"ఎక్కడికిరా తెల్లారకుండానే బయలుదేరావు?" ఆశ్చర్యంగా అడిగారు.
అసలే వంటి బ్రాహ్మడి శకునం. పైనించి ఎక్కడికి వెళుతున్నావనే ప్రశ్న సత్యంకి చిరాకువేసింది. చిరాగ్గా మొహం చిట్లించాడు.
"గుళ్ళోకా? నాతో చెప్పలేదేం? చెపితే నేనూ వచ్చేవాడినిగా?" స్నేహితుడిని పరిశీలించి చూస్తూ అడిగాడు సూర్యం.
"నేనేదో స్వంత పనిమీద వెళుతున్నాను. నువ్వు వచ్చే అవసరం లేదులే!" ముక్తసరిగా సమాధనం చెప్పి ముందుకు కదిలాడు సత్యం.
"ఆయన ప్రవర్తనకి అరికాలిమంట నెత్తికెక్కింది సూర్యానికి. "నాకు తెలుసురా ఆ స్వంత పనేమిటో మళ్ళీ ఏ సన్యాసో కనిపించివుంటాడు. వాడి చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టావు అన్నాడు వ్యంగ్యంగా.
