Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 8



    తొమ్మిదిన్నరకల్లా భోజనం చేసి తాంబూలం వేసుకుని జంటగా ఆఫీసుకి వెళ్ళి సాయంత్రం జంటగా తిరిగి వచ్చేవాళ్ళు. సినిమాకు వెళ్ళినా శలవుల్లో పిక్నిక్ వెళ్ళినా, పండగ రోజు గుడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్ళాల్సిందే. ఏ తగాదాలూ లేకుండా చూసేవాళ్ళంతా ఏడిచి చచ్చేలా ఎన్నో సంవత్సరాలు గడిపేశారు.

    పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సత్యంగారి పుత్రుడు కృష్ణమూర్తి. తండ్రిలాగే ఆజానుబాహువు. ఆయనలాగే జగమొండి. తల్లినించి సంక్రమించుకున్న చాదస్తం. అన్నీ కలిసి విచిత్రమైన మనిషి. అతనికి స్నేహితులు ఎవరూ లేరు అసలు అతనితో స్నేహం చేసే దైర్యం ఎవరికీ లేదు. పలకరిస్తే చాలు అర్ధం వర్ధం లేని అడ్డవాదనలతో అవతలి వాళ్ళను కరిచేసే అతనంటే అందరికీ అదురే.

    దీపిక. అక్షరాలా అతనికి తగిన చెల్లెలు తానేమో తనలోకం యేమో, యేవిషయం ఒక పట్టాన బుర్రకి ఎక్కాదు ఎక్కిందో యిక వదలదు మంచి పెక్యూలియర్ పెర్సనాల్టీ.

    సత్యంగారికి మహా జాతకాల పిచ్చి, హస్తం చూడబడును అనే కాషాయ బట్టల జ్యోతిష్యం మొదలుకొని చిలక జోస్యం వరకూ, పువ్వుతో అదృష్టం చెప్పును మొదలుకొని వారఫలాల వరకు అన్నింటినీ నమ్ముతాడు ఆయన.

    ఎక్కడైనా చెయ్యి చూసేవాడు కనిపించడం ఆలస్యం సడన్ బ్రేక్ వేసిన డబుల్ డెక్కర్ బస్ లాగా ఆగిపోయి వెంటనే ఆయనకీ తన చెయ్యి చూపించుకునిగానీ కదలడు. సూర్యంగారికి ఈ జాతకాల మీద ఏ మాత్రం నమ్మకం లేదు. జరిగేది యేదో జరగక మానదు అంటాడు ఆయన ఎప్పుడూ సత్యంగారిని ఈ విషయంలో ఎగతాళి చెయ్యడం ఆయన గయ్ మని లేవడం సర్వసాధారణం. అలా ఒకనాడు ఒక జ్యోతిష్యుడు ఆఫీసుకి వచ్చాడు. అలవాటు ప్రాకారం వెంటనే తన చెయ్యి చూపించుకున్నాడు సత్యం.

    "దివ్యమైన జాతకం అని పొగిడి మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. అరవైఏళ్ళ వయసుకి కాస్త అటూ ఇటూగా ఈ దానం మీకు లభిస్తుంది" అన్నాడు. పరమానంద భరితుడై పోయాడు సత్యం.

    బాగా చెప్తున్నాడు నువ్వూ చూపించుకో అంటూ స్నేహితుడిని కూడా బలవంతాన లాక్కెళ్ళి చెయ్యి చూపించాడు. సూర్యం చెయ్యికూడా చూసాడు జ్యోతిష్కుడు.

    "భేష్! ఇది కూడా మంచి చెయ్యి. నీకు కూడా ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. యాభై రెండు దాటగానే బోలెడంత దానం దోరుకుతుంది అన్నాడు.

    సాయంత్రం యింటికి వస్తూ అదే మాట తల్చుకుని మురిసిపోయాడు సత్యం. "నీ లాగా చేతులు చూపించుకున్న అందరికీ ఆకస్మిక ధనప్రాప్తి ఉందనే చెప్పాడు ఆయన అనవసరంగా పదిరూపాయలు తగలేశావు. ఆ డబ్బుంటే పిల్లలకి ఏదైనా కొనుక్కు వెళ్ళే వాళ్ళం!" అని విసుక్కున్నాడు సూర్యం.

    అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత సూరినాయణమూర్తిగారి యాభైరెండవ జన్మదినం కూడా బ్రహ్మండగా గడిచిపోయింది.

    మర్నాడు కాఫీలు తాగుతుండగా పేపరోచ్చింది. అలవాటు ప్రకారం యిద్దరూ చెరి సగం తీసుకుని వ్హడువు కున్నారు. తను చదివిన మధ్య భాగం మిత్రుడికి ఇచ్చేసి ఆయన దగ్గరున్న పార్టు తను తీసుకున్నాడు సత్యం.  నాలుగో పేజీలో లాట్రీ ఫలితాలు కనిపించాయి.

    తను కూడా టికెట్టు కొన్న విషయం గుర్తు వచ్చి వెంటనేలేచి వెళ్ళి టికెట్టు తెచ్చుకుని చూశాడు. నిరాశగా  పక్కన పడేసి పేపరు చదువుతూ ఉండగా హఠాత్తుగా గుర్తు వచ్చింది.

    "ఒరే సూర్యం! ఆ వేళ ఆఫీసులో నువ్వూ కొన్నావు కదురా!" అన్నాడు.

    "ఆ! ఎవడో అంటగట్టాడు!"

    "రిజల్ట్స్ వచ్చాయిగా  టికెట్ తీసుకురా చూద్దాం!" అన్నాడు సత్యం.

    "ఆ! అవేం మనకు వస్తాయా? ఏడుస్తాయా? పోనిద్దూ" నిరాసక్తంగా అన్శాడు సూర్యం.

    "కాదులే పోనీ చూద్దాం! తీసుకురా!"

    లేవడానికి బద్ధకం వేసి ఇంటి చూట్టూ జాగింగ్ చేస్తున్నా కృష్ణని పిల్చి "సొరుగులో టికెట్టు ఉంది, పట్రా!" అని వురమాయించాడు.

    పరిగెట్టుకుంటూ వెళ్ళి టికెట్ తెచ్చాడు కృష్ణ. "అసలు నాకీ లాటరీమీద నమ్మకం లేదు మామయ్యా. లాటరీలో ప్రైజు రావడం అంటే ఏమిటో ఎన్నో వేల మంది తలా ఓ రూపాయి దానం చెయ్యడం!" అన్నాడు.

    "బాగా చెప్పావురా! అయితే మనం ఆ దానం చేసే వాళ్ళలోనే ఉంటాం కాబట్టి ఏ బాదాలేదు!" అన్నాడు సూర్యం నవ్వేస్తూ.

    టికెట్ ఇచ్చి యింటి చుట్టూ రౌండ్ కొట్టి వచ్చిన కృష్ణ హఠాత్తుగా ఆగిపోయాడు. ఆశ్చర్యంగా వీళ్ళిద్దర్నీ చూశాడు.

    పేపరు కిందికి జారిపోయింది. యిద్దరూ జానపద సినిమాల్లో రాతి విగ్రహాల్లా బిగుసుపోయి ఉన్నారు.


    ఉలుకూ పలుకూ లేకుండా పిచ్చి  చూపులు చూస్తున్న ఆ మిత్ర ద్వయాన్ని చూసి కంగారు పడ్డాడు కృష్ణ యిప్పటి దాకా లక్షణంగా ఉన్నారుగా ఇంతలోనే ఏమైంది అసలే నాన్నకి హై బి.పి. మామయ్యకి లో బి.పి. దగ్గరకు వెళ్ళి "నాన్నా! మామయ్యా!" అంటూ ఇద్దరినీ కుదిపాడు.

    అదిరిపడి ఇహలోకంలోకి వచ్చారు ఇద్దరూ!

    "ఒరే సూర్యం! చూశావుట్రా నిన్ను అదృష్టం వరించేసింది" అన్నాడు సత్యం. గడగడ వణికిపోతూ మిత్రుడిని కావలించేసుకున్నాడు సూర్యం.

    "ఏమిటి? ఏమైంది?" అయోమయంగా అడిగాడు కృష్ణ.

    "ఏమిటి? ఏమిట్రా? మీ మామయ్యకి లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఒసే వర్దనీ ఎక్కడున్నావ్. త్వరగా రా......ఓ మహాలక్ష్మమ్మ తల్లీ త్వరగా యిటురా, దీపా! భారతీ మీరు రండర్రా.....అంటూ అందర్నీ ఒకేసారి పిల్చేశాడు.

    ఏం కొంపలు అంటుకు పోయాయో అని  అంతా పరుగున వచ్చేశారు "ఏమిటి? ఏమైంది?" అన్నారు కంగారుగా.

    మరోసారి ఆ శుభవార్త చెప్పారు సత్యంగారు.

    కయ్ మని అరిచి గాల్లోకి ఎగిరింది భారతి నోరావిలించి బిగుసుకు పోయింది దీపిక. ముఖం తిరిగి ధన్ మనికింద పడిపోయింది మహాలక్ష్మి. ఆనంద భాష్పాలు వట్టుకుంది వర్ధనమ్మ.

    ఏ రియాక్షనూ లేనిది కృష్ణలో మాత్రమె. అతను విసుగ్గా అందరివంక చూశాడు. "ఇదిగో అందరూ కాస్త నా మాట వినండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందని ఆనందపడనవసారం లేదు. ఈ ఫలితాలను నమ్మకూడదు. యిప్పుడిలా వేశారా? మరో నాల్రోజులు ఆగి ఆ నెంబరుకి కాదు ఇదిగో ఈ నెంబరుకి వచ్చింది బహుమతి పోరపాతుకు చింతిస్తున్నాం అని ప్రకటించే అవకాశం ఉంది. అలాటి దేమైనా అయితే అప్పుడు  ఏడవాలి. ఎందుకైనా మంచిది మరీ అంత ఆనందపడి పోకండి!" అన్నాడు.

    అంతా గతుక్కుమన్నారు. "నిజమేనట్రా" బితుకు బితుకు మంటూ అడిగాడు సత్యం.

    అవును అనేసి జాగింగ్ కంటిన్యూ చేశాడు కృష్ణ. అంతా నీరసంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. తన లాట్రీ  టికెట్టును.....అతి భద్రంగా దాచాడు సూర్యం ఎందుకైనా మంచిదని తన టికెట్టును కూడా అంత భద్రంగానూ దాచాడు సత్యం.

    అతికష్టం మీద నాలుగు రోజులు గడిచాయి. అదృష్టవశాత్తూ అటువంటి ప్రకటన ఏదీ వెలువడలేదు.

    "మరిప్పుడు ఆనందపడచ్చా మనం?" అని కృష్ణనిఅడిగారు, తలాడించాడతను. ఆనందతో కయ్ మని అరిచారు ఇద్దరూ.

    "అలా అరవకండి. ఎవరికైనా తెలిసిందంటే మన బుర్ర బద్దలు కొట్టి ఆ టికెట్టు కాస్తా లాక్కుపోతారు" అన్నాడు కృష్ణ.

    ఠకున్న నోరు మూసేసుకున్నారు ఇద్దరూ మరైతే వెళ్ళి డబ్బు తెచ్చుకుందామా?" గుసగుసగా అడిగాడు సూర్యం.

    "ఆ తెచ్చుకుందాం, జాగ్రత్తగా ప్లాను వేసుకుని చెయ్యాలి ఈ పని. ఆ విషయం నా కోడిలెయ్యండి, నేను  చూసుకుంటాను" అన్నాడు కృష్ణ గుసగుసగా.

    "ముగ్గురెళ్తే ముడిపడదు. మీరిద్దరూ వెళ్ళిరండి!" గుసగుసగా సలహా  చెప్పాడు సత్యం.

    అన్న ప్రకారం మంచి పట్టిష్టంగా ప్లాన్ వేసుకుని వెళ్ళి డబ్బు తీసుకొచ్చి దాన్ని బద్రంగా భద్రపరిచి ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణ. సత్యం,  సూర్యంగార్ల ప్రాణాలు కూడా కుదటపడ్డాయి.

    అప్పటి వరకూ ఆ విషయం మూడో ఇంటివాళ్ళ తెలీకుండా జాగ్రత్తపడ్డారు వాళ్ళంతా.

    ఆ తరువాత ఆటమ్ బాంబులా పేలింది ఈ విషయం. కార్చిచ్చులా వ్యాపించి పోయింది ఈ వార్త.

    షేక్ హండ్లు ఇచ్చి ఇచ్చి సూర్యంగారి కుడి చెయ్యి దూలంలా వాచీపోయింది. తిరణాలలా ఇంటికి వచ్చి పోయే జనానికి కాఫీలు ఇవ్వలేక విసిగిపోయింది మహాలక్ష్మి.

    స్నేహితుడి వైభవం చూసి మనస్ఫూర్తిగా ఆనందించాడు సత్యం. ప్రాణ స్నేహితుడికి అద్ర్ష్టం వరించింది అనే కారణం ఒకటి అయితే మరో కారణం కూడా ఉంది.

    సూర్యానికి ధనప్రాప్తి ఉంది అని చెప్పిన జ్యోతిష్కుడే తనకు కూడా ఆ ధనప్రాప్తి ఉందనీ చెప్పాడు. కాబట్టి నేడో రేపో ఆ అదృష్టం ఆ వైభవం హనకూ లభిస్తాయి.

    అకస్మాత్తుగా లక్షాధికారి అయిపోయిన సూర్యం గారికి ఇంటా బయట బోలెడంత పరపతి పెరిగింది.

    ఎంతోమంది ఆయనకోసం రావడం మొదలుపెట్టారు. వ్యాపారంలో భాగస్తుడిగా చేరమని కొందరు మా సంస్ధకి కొంచెం విరాళం ఇచ్చేస్తే మిమ్మల్నే చైర్మన్ ని చేస్తామని మరికొందరు.

    ఒకనాడు ఓ నాటక సమాజం వాళ్ళు వచ్చారు. "సార్ మా గ్రూప్ లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ వున్నాడు మేకప్ మేన్ వున్నాడు. సింగర్సున్నారు. డైరెక్టరుగారున్నారు కథకూడా రెడీగా వుంది. నిర్మాత దొరికితే సినిమా తీద్దాం అని చాల్రోజులుగా చూస్తూన్నాం. అదృష్టవశాత్తూ మీరు దొరికారు. పదండి మెడ్రాస్ వెళ్దాం! అన్నారు.

    అయితే సూర్యంగారు మాత్రం ఏ ప్రలోభానికీ లోంగాలేదు. "ఈ అదృష్టం చాలు నాకు. చేతావాతా గాని పనులుచేసి కాల్చుకోను" అని ఖచ్చితంగా చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS