Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 10



    గతుక్కుమన్నాడు సత్యం. "నా ఇష్టం. సన్యాసి వెంట తిరుగుతాను గంగలో దూకుతాను, నా ఇష్టం. అడగదానికి నువ్వెవారివి?" అన్నాడు.

    "నేనెవర్ని? అంతేలే అంత మాటనక ఇంకేమంటావ్ నువ్వు? నాకు డబ్బొచ్చినప్పటనించి చూస్తూన్నాను. లోలోపలే కుళ్ళిపోతున్నావ్."

    "నేనేం కుళ్ళిపోవడంలేదు. నీకే కళ్ళు నెత్తికెక్కాయి. నడమంత్రపుసిరి రావడంతో ఒళ్ళు పొగరెక్కింది నీకు.

    ఇద్దరిమధ్య తీవ్రంగా మాటలు నడిచాయి. "నీ  మొహం నాకు చూపించకు నా ఇంట్లోంచి బయటికి నడు" అమిత ఆగ్రహంగా అరిచాడు సత్యం.

    "నాకేం గతిలేక నీ యింటికి రాలేదురా! వెళుతున్నాను. యిక జన్మలో నీ యింటి గడప తొక్కను. నీ  మొహం చూడను" అనేసి విసురుగా యింట్లోకి వచ్చేశాడు.

    వాళ్ళ తగాదా ఇంట్లోని  వాళ్ళందరూ విన్నారు. మామూలు తగాదానే అనుకున్నారు.

    భర్త ఇంట్లోకి రాగానే అలవాటు ప్రకారం రెండు గ్లాసుల్తో కాఫీ తీసుకొచ్చింది మహాలక్ష్మిమ్మ "అన్నయ్య గారేరీ?" అంది.

    "అన్నయ్యాలేడు దున్నయ్యాలేడు వాడి పేరెత్తితే పళ్ళు రాలగోడ్తాను. లోపలికి తగలడు" అని అరిచాడు సూర్యం.

    ఆ కేక సత్యంకి వినిపించింది వెంటనే వంటింట్లోకి వెళ్ళి "నే చెప్పేది జాగర్తగావిను. అన్నయ్యగారికి పులుసు యిష్టం. అన్నయ్యగారికి పచ్చడి యిష్టం అని తీసుకెళ్ళి వాడి మొహాన కొట్టేవంటే డొక్క చీరేస్తాను. ఇక ఆ యింటి మొహం చూడడానికి వీల్లేదు" అని అరిచాడు సూర్యం.

    అప్పుడే పేపరు వాడొచ్చాడు. వాడిని కేకేసి :ఇవాల్టినించి నాకు పేపరు విడిగా యివ్వు" అన్నాడు సూర్యం.

    ఇదేదో సీరియస్ గానే వుందే అనుకున్నారు పిల్లలు.

    ఆ తరువాత కాసేపటికి యింట్లోంచి బయటికి వెళ్ళి పోయాడు సత్యం. ఆ వెనకే వెళ్ళాడు సూర్యం.

    వెళ్ళి యిల్లు కట్టిన మేస్త్రీతో మాట్లాడి సామాన్ల నీ కూలీలని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు వచ్చి రెండు యిళ్ళ గీత గీసి తవ్వకం ప్రారంభించారు.

    అదిరిపడింది మహాలక్ష్మి "ఇదేమిటండీ! యిప్పుడీ అడ్డుగోడ యెందుకు? మీరూ అన్నయ్యగారూ మాటా మాటా అనుకోటం ఇవాళ కొత్తా? హైబ్లడ్ ప్రెషర్ మనిషి ఏదో ఆవేశపడి వుంటారు మీరు తొందరపడకండి!" అని నచ్చ చెప్పింది. కానీ ఆయన వినలేదు. "నువ్వు నోర్మూసుకుని లోపలికిపో" అని కసిరాడు.

    పదకొండు గంటలకి యింటికొచ్చిన భర్తకి ఎదురు వెళ్ళి "ఏమండీ! కొంప మునిగింది. అన్నయ్యగారు అడ్డుగోడ కట్టిస్తున్నారండీ! వెళ్ళి ఆపండి!" అని లబలబ లాడింది వర్ధనమ్మ.

    "గోడ కాకపోతే వాడి గోరీ కట్టించుకోమను" అన్నాడు సూర్యం మండిపడుతూ.

    ఆ విధంగా ఎన్నో సంవత్సరాలనుండి కలిసి వున్న కుటుంబాలమధ్య అడ్డుగోడ లేచింది. ఆడవాళ్ళిద్దరూ కుమిలిపోయారు పిల్లలుకూడా బాధపడ్డారు.

    అందరూ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ  ఫలితం లేకపోయింది. సూర్యంగారు తనధ్యానాన్ని ఆసనాల వైపు మళ్ళించారు.

    సత్యంగారికి లంకిబిందెల హడావిడితోనే సరిపో సాగింది. లంకె బిందెలు త్వరగా దొరికే మార్గం చూపమని బాబాగారిని వేడుకున్నాడు. ఆయన ఒక మండలం రోజుల పాటు భైరవుడికి పూజ చెయ్యాలి అన్నారు.

    "చెయ్యండి స్వామీ!" అన్నాడు సత్యం.

    దానికి బోలెడంత ఖర్చు అవుతుంది మరి!  హెచ్చరించేవారు బాబాగారు రాబోయే ధనంకోసం ఉవ్విళ్లూరుతూ ఫర్వాలేదని హామీ యిచ్చాడు సత్యం. మర్నాటినించే భైరవుడికి పూజ మొదలయింది.

    బాబాగారు దమ్మిడీకూడా తీసుకోలేదు. కేవలం పూజా ద్రవ్యాలు మాత్రం సత్యంచేత కొనిపించేవారు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొత్తబట్టలు, పటికబెల్లం, పాలకోవా, వులగం, పరమాన్నం, ఇలా రోజూ బోలెడు కావల్సివచ్చేవి భైరవుడికి. సత్యం గారు మాత్రం ఒంటిపొద్దులుండేవారు.

    నలభై రోజులు గడిచేసరికి లీలగా కనిపించేయి లంకె బిందెలు "బిందెలయితే కనిపిస్తున్నాయి నాయనా! వాటి నిండా వజ్ర వైఢూర్యాలు, రత్నమాణిక్యాలు, బంగారు కాసులు వున్నాయి. కానీ సంగతి ఏమిటీ అంటే!" అని కళ్ళు తెరిచేసరికి కళ్ళు తిరిగి కిందపడిపోయి కనిపించాడు సత్యం. ముఖాన తీర్ధం జల్లి లేవదీశారు స్వామివారు.

    "ఏవి స్వామీ? ఎక్కడున్నాయి నా బిందెలు?" కన్నీళ్ళు జలజల  కారిపోతూ వుండగా అడిగాడు సత్యం.

    "అదే  తెలియడంలేదు నాయనా! ఇంకా మానక మసగ్గానే కనిపిస్తున్నాయి" అన్నారు.
    "మరేమిటి స్వామీ మార్గం?"

    "అదైర్యపడకు నాయనా! ఈసారి మండలంపాటు వీరభద్రుడిని ఉపానన చేద్దాం!" దైర్యం చెప్పారు.

    మర్నాడే వీరభద్రుడి పూజలు ఆరంభం అయ్యాయి వీరభద్రుడి మెనూకూడా బైరవుడి మెనూ లాగేనే వుండేది కాకపోతే సీమాబాదం పప్పులు, జీడిపప్పులు, కుంకుమపువ్వు పచ్చకర్పూరం వేసిన చిక్కని పాలు మాత్రం ఎక్స్ ట్రాగా కావాల్సివచ్చేవి.

    సత్యంగారు మాత్రం యధాప్రకారం ఒంటిపూట భోజనం. మండలం రోజులు నడిచాయి. బాబాగారు బాగా ఒళ్ళు చేసి రక్తంపట్టి నిగనిగలాడుతూ తాయారయ్యారు. సత్యంగారు బుగ్గలు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి నీరసంగా తయారయ్యారు.

    నలభయ్యో రోజున సత్యంగారి చెవిలో మంత్రోపదేశం చేశారు బాబాగారు. ఇంటికెళ్ళి ఈ మంత్రం ఏడువేల సార్లు జపించు. నిద్రపోకు. తెల్లవారిస్నానం చేసి వచ్చి గంగాయినా తాగకుండా ఇక్కడికి రా! నేనుకూడా రాత్రంతా మహా భైరవ వీరభద్రోపాన్న చేస్తాను. రే ప్రొద్దున పూజచేసి బిందెలెక్కడున్నాయో చెప్తాను. ఎల్లుండి వెళ్ళి తవ్వి తెచ్చేసుకుందువుగాని" అన్నారు.

    ఇంటికెళ్ళి స్నానపానాదులు ముగించి మఠం వేసుకుని కూర్చుని "భం భం భం భైరవాయ నమః ఢం ఢం ఢం వీరభద్రాయనమః లంకెబిందెల దర్శన ప్రాప్తిసిద్ది" అంటూ బాబాగారు ఉపదేశించిన మంత్రం ఏడువేలసార్లు జపించారు సత్యంగారు. తెల్లారిపోయింది ఆదరా బాదరా స్బానం చేసి ఉరుకులూ పరుగులూ పెడుతూ బాబాగారి దగ్గరకు వెళ్ళారు.

    అక్కడంతాఖాళీ. ఆ  పాడుబడిన పత్రంలో బాబాగారు లేరు.

    ఆయన శిష్యులు లేరు. ఆయనకు సంబంధించిన పూచిక పుల్లకూడా లేదు.

    "బాబాగారు వాళ్ళఎక్కడికెళ్ళారు?" అని అడిగాడు సత్యం.

    "ఏమో, అలాంటివాళ్ళకి ఓ ఊరూ పాడూ వుండవుగా! కొన్నాళ్ళికి ఓ ఊరూ పాడూ వుండవుగా! కొన్నాళ్ళిక్కడా కొన్నాళ్ళడ!" అన్నారు.

    అంతే కళ్ళు బైర్లు కమ్మి ధబ్ మని కిందపడిపోయాడుఆయన. వాళ్ళే జాలిపడి ఆయన ఎక్కి వచ్చిన రుక్షావాడిని వెనక్కి పిలిచి అందులో ఎక్కించి ఇంటికి తీసుకువెళ్ళారు.

    భర్తని ఆ స్థితిలో చూసి బెదిరిపోయింది వర్ధనమ్మ. దీపికను డాక్టర్ కోసం పరుగు పెట్టించింది. పడుకోబెట్టి నీళ్ళు జల్లి స్పృహ తెప్పించారు. కళ్ళు తెరిచి భార్యని చూసి కంటతడి పెట్టుకున్నా డాయన. నోట మాట రాలేదు పాపం.

    ఫేమిలీ డాక్టర్ చలపతి రావుగారు వచ్చారు. పరిస్థితి చూసి బ్లడ్ ప్రషర్ చూద్దామని చేతికి కట్టి ఇలా ప్రెస్ చేసేసరికి పాదరసం లెవల్ పాపంలా పెరిగిపోయింది. వెంటనే అది విప్పేసి_

    "మీ మొహం మండిపోనూ సత్యనారాయణమూర్తిగారూ! ఇదేం బ్లడ్ ప్రెషర్ బాబోయ్ నా జన్మలో చూడలేదు. ఇంకా కాస్త వుంటే నా ఇన్ స్ట్రుమెంటు కాస్తా ఢామ్మని పగిలిపోయేది!" అని విసుక్కుని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS