కుర్చీకి కట్టివేయబడి ఉన్న రాజు వైపు పరీశిలనగా చూశాడు తరుణ్. రాజు క్రింద పెదిమ రెండుగా తెగి ఉంది. ముందుపళ్ళు రెండు విరిగి ఉన్నాయి. నిర్జీవంగా తెరచుకుని, ఉన్న నోట్లోకి ఒక ఈగ యదేచ్చగా వెళుతూ వస్తూ వుంది.
నిట్టూర్చి, టేప్ రికార్డర్ 'ప్లే' బటన్ నొక్కాడు తరుణ్. రాజు గొంతు వినబడడం మొదలెట్టింది విరిగిపోయిన పదాలు .......తెగిపోయిన వాక్యాలు........మధ్య మధ్య కేకలు.........తర్వాత గుండెలు తరుక్కుపోయేలా మూలుగు.
ఆ తర్వాత టేపురికార్డర్ తాలూకు సూక్షమైన మోటారు శబ్దం , అతి చిన్నగా! అంతే.........ఆ తర్వాత కొద్ది నిమిషాలకు టేపు 'క్లిక్' మన్న శబ్దంతో అటోస్టాప్ అయిపోయింది.
టేపుని రివైండ్ చేసి మళ్ళీ 'ప్లే' బటన్ నొక్కాడు తరుణ్.
అప్పటికి అది పంతోమ్మిదోసారి, అతనా టేపుని వినడం. అతనికి అర్ధం అయిందల్లా నిఖిల్ ఏదో దారుణమైన మారణహోమం తలపెట్టాడు. అందుకుగానూ ఏర్పాట్లు చెయ్యడానికి సింగపూర్ వెళ్ళాడు.......భాధతో!
నుదురు చిట్లించాడు తరుణ్. అతనికి ఆ పదం అర్ధంకాలేదు.
భాధతో ఎందుకు వెళ్ళాడు నిఖిల్? ఏం బాద?
మళ్ళీ రివైండ్ చేసి విన్నాడు.
"ఏర్పాట్లు.....చె....చెయ్యడానికి సింగ.....సింగపూర్ వెళ్ళాడు........బాధతో."
బాధా? బాధతో వెళ్లడమేమిటి? ఎందుకు?
కానీ రాజు చెప్పినది అసలు అదికాదు. మారణహోమం జరిపించబోతున్నాడు నిఖిల్. అందుకు ఏర్పాట్లు చెయ్యడానికి సింగపూర్ వెళ్ళాడు రాధతో అని చెప్పబోయాడు రాజు. కానీ తెగిపోయిన పెదిమ పదాలని సరిగ్గా ఉచ్చరించలేకపోయింది. అస్పష్టంగా ఉచ్చరించబడిన రాధ అనే పదం 'భాధ' అని అస్పష్టంగా వినబడుతోంది టేపులో.
ఆ విధంగా మంచి క్లూ ఒకటి మిస్సయిపోయాడు తరుణ్. ఇరవయ్యోసారి తెపుని విని దాన్ని ఆఫ్ చేసాడు. అల్ రైట్! నిఖిల్ సింగపూర్ వెళ్ళాడు బాధతో. మేబీ! అతను చాలా టెన్షన్ లో ఉండి ఉంటాడు. నిఖిల్ అందుకే బాధతో వెళ్ళాడు.
ప్రస్తుతానికి అది అలా ఉండనిచ్చి మిగతా విషయాల గురించి ఆలోచించాలి.
సింగపూర్ వెళ్ళాడు నిఖిల్. తను ఉహించినట్లుగానే ఈసారి చాలా పెద్ద ఎత్తున ఘతకం చెయ్యబోతున్నాడు.
అది జరగనివ్వకూడదు తను!
టేపు కేసెట్ కోటు జేబులో వేసుకుని తన బాస్ దగ్గరకు వెళ్ళాడు తరుణ్.
మిశ్రా రివాల్వింగ్ చెయిర్లో కూర్చుని పైపు కాలుస్తున్నాడు. చిన్మయానందంగా ఉన్నట్లు అయన కళ్ళు మూతలు పడి ఉన్నాయి.
"గుడ్ మార్నింగ్ సర్!" అన్నాడు తరుణ్.
"మార్నింగ్! ఏమిటి విశేషం?"
గొంతు సవరించుకున్నాడు తరుణ్ "హధీ కట్టిస్తున్న టెంపుల్ ని నిఖిల్ బ్లాస్ట్ చెయ్యబోతున్నాడు.
"బిలియన్స్ ఆఫ్ బిలియన్ బ్లూ బ్లిస్టరింగ్ బర్నాకిల్స్ ఇన్ ఏ ధండరింగ్ టైఫూన్!" అని అతి పెద్ద ఊతపదం ఒకటి వాడేసి, "ఏమిటి? మళ్ళీ చెప్పు!" అన్నాడు మిశ్రా.
వివరంగా అంతా చెప్పాడు తరుణ్. పైపుతో బల్లమీద నెమ్మదిగా కొడుతూ, శ్రద్ధగా విన్నాడు మిశ్రా.
"సర్!" అన్నాడు తరుణ్.
"ఏమిటి?"
"ఈ దేవాలయం కలశ ప్రతిష్టాపనకి పెద్ద పెద్దవాళ్ళని ఇన్వయిట్ చేస్తున్నాడు హాధీ. దైవకార్యం కాబట్టి రావడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. నాకు ఇంతవరకూ తెలిసిన సమాచారం బట్టి.........." అని కోటు జేబులోంచి ఒక పేపర్ తీశాడు తరుణ్. అందులో వరసగా పేర్లు రాసి ఉన్నాయి. "రాబోయే ప్రముఖులు. నేపాల్ ప్రధాన మంత్రి, అమెరికానుంచి అయిదు ప్రతినిధి వర్గాలు, మారిషస్ నుంచి ఒక బృందం హాంగ్ కాంగ్ నుంచి రెండు బృందాలు , సిలోన్ నుంచి , బర్మానుంచి, థాయ్ లాండ్ నుంచి ఒక్కొక్క బృందం. ఇకపోతే ఇండియాలో ముగ్గురు ముఖ్యమంత్రులు , నలుగురు పీఠాదిపతులు, అసంఖ్యాకమైన సాధువులు, యోగులు, భోగులు, భక్తులు, వాళ్ళు కాక ఈ కార్నివాల్ అట్ మాస్ ఫియర్ చూడాలని వచ్చే టూరిస్టులు."
"మొత్తం ఎంతమంది రావచ్చు?"
"ఎట్టి పరిస్థితులలోనూ సంఖ్య ఒక లక్షకు తగ్గకపోవచ్చు!"
"అక్కడ ఈ దారుణం జరుగబోతోందని హెచ్చరిక చేస్తే?"
"హెచ్చరికలు చేసి అన్ని కట్టుదిట్టాలు చేసిన తర్వాత వచ్చే జనమే ఒక లక్ష ఉంటారని ఉహిస్తున్నాను."
నిశితంగా చూశాడు మిశ్రా. "ఎందుకు?"
భుజాలు ఎగరేశాడు తరుణ్. "సర్ ఇది ఇండియా , దటీజ్ భారత్! కర్మభూమి ఇది! కనీసం మూడు పెద్ద మతాలకు జన్మభూమి ఇది! మతమే ఇక్కడి మనుషులకి మనుగడ! విశ్వాసం వీళ్ళ ఊపిరి!
దేవాలయాన్ని పెల్చేస్తానని ఒక దేవాంతకుడు ప్రగల్భాలు పలికినంతమాత్రాన ప్రతిమనిషి , పిరికిపందలా పారిపోడు. పైగా చాలామంది దైవభక్తులతో పట్టుదల పెరుగుతోంది. దేవాలయాలలో విలయ విధ్వంసం చేస్తాడని ఒకడు విర్రవీగుతుంటే సృష్టి స్థితిలయకారుడైన దేముడు వినీ విననట్లు ఊరుకుంటాడా , విశ్వరూపం చూపించి ఈ వెధవకు బుద్దిచెప్పడా అని ఉహించి వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారు.
వాళ్ళ సంఖ్య కనీసం లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నాను నేను."
"వెల్ వెల్ వెల్! సో! చిలికి చిలికి గాలివాన అయినట్లు ఇది పోను పోనూ దేముడికీ, ఒక దేవాంతకుడికీ మధ్య చాలెంజ్ గా తయారయిందన్న మాట! దేముడేమంటున్నాడు? దైవలోకంలో మన ఏజెంట్లు ఎవరూ లేరా? లేటెస్ట్ న్యూస్ ఏమిటి?" అన్నాడు మిశ్రా నవ్వుతూ.
తరుణ్ కూడా నవ్వాడు. "మనం ఈ దేముణ్ణి నమ్మలేం సర్! ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ఒకటి చెప్పి మరొకటి చేస్తాడు. "చెప్పేది చేయ్యబోకురా, చేసేది చెప్పబోకురా!" అన్నది అయన పాలసీ అనుకుంటాను. అయన మీద మనం డిపెండ్ కావద్దు. మన ఏర్పాట్లు మనం చేసుకుందాం."
"ఏమిటా ఏర్పాట్లు?" అన్నాడు మిశ్రా నవ్వుతూ.
"నిఖిల్ సింగపూర్ లో ఉన్నాడు. ఆటను అక్కడనుంచి ఇండియాకు రాకుండా , మారెక్కదికీ పారిపోకుండా , సింగపూర్ బోర్డర్స్ క్లోజ్ చేసెయ్యమని చెప్పాలి. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, సముద్ర మార్గాలు, ఆకాశ మార్గాలూ అన్నీ అష్టదిగ్భంధనం చేసెయ్యాలి. ఆటను దొరికి పోతాడు. దొరకగానే , సర్, నేను నా లైసెన్స్ ని ఉపయోగించదలచుకున్నాను."
"లైసెన్స్? ఎస్? వాట్? ఓ? లైసెన్స్! యూ వాంట్ టూ కిల్ హిమ్?"
"యస్సర్!"
"ఇంక నేను వినదలచుకోలేదు" అన్నట్లు గబగబ చెయ్యి ఊపాడు మిశ్రా. చెప్పకు! చేసి చూపించు!"
"సింగపూర్ గవర్నమెంటుని కాంటాక్ట్ చెయ్యాలి సర్!"
"అది నేను చూసుకుంటాను."
"ఇండియన్ నేవీనీ , ఎయిర్ ఫోర్సునీ, అర్మీనీ , బార్డర్ సెక్యురిటీ ఫోర్సునీ అలర్టు చెయ్యాలి."
నుదురు చిట్లించాడు మిశ్ర. "అవసరమంటావా? చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నామేమో మనం! ఊర పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేస్తున్నామా?"
"చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు సర్! రిస్కు తీసుకునే అవకాశం లేదు మనకి."
"సరే! నేను విదేశాంగ మంత్రితో, హోమ్ మినిస్టరుతో, మాట్లాడతాను."
"థాంక్యూ సర్! మే ఐ గో నౌ?"
"యస్! యూ కెన్ గో!"
