Previous Page Next Page 
మారణహోమం పేజి 88

 

    పైనా చర్మం ఉన్నా, లేనట్లుగానే మెడ కింద ఉన్న కాలర్బోన్ ఆకృతి స్పష్టంగా కనబడుతోంది దానిమీద ఒక పుట్టుమచ్చ.
    సందేహంలేదు! బతికి ఉన్న ఈ ఆస్థిపంజరం తన చెల్లెలు కాదంబరే!
    ఆమె పక్కన మోకాళ్ళ మీద కూచుండిపోయి, "కాదంబరీ!" అన్నాడు నిఖిల్ గాద్గాదికంగా.
    అతని కంఠస్వరం తన మస్తిష్కంలో మారుమూల అణిగిమణిగి ఉన్న జ్ఞాపకాల పరంపరను స్పృశించి, స్పందింపజేసినట్లు ఆమె మోహంలో ప్రశ్నార్ధకం కనబడింది మూసి ఉన్న రెప్పలు అల్లల్లాడాయి.
    బ్రహ్మ ప్రయత్నం మీద కనురెప్పలు సగం పైకి ఎత్తి చూడగలిగింది కాదంబరి. కన్నీళ్ళతో ఈదుతున్న చేపల్లా అటూ ఇటూ కదిలాయి ఆమె కళ్ళు. చివరికి దృష్టి కేంద్రీకృతమయింది ఒక రూపం మీద.
    "కాదంబరీ!" అన్నాడు నిఖిల్. అతని గొంతు వణుకుతోంది.
    కొద్దిగా వంకరపోతున్న పెదిమలను స్వాధీనంలోకి తెచ్చుకుని అనుమానంగా అంది కాదంబరి.
    "అన్నయ్యా!"
    "కాదంబరీ!"
    "నువ్వు.........! నువ్వు నువ్వేనా అన్నయ్యా!"
    "అవును కాదంబరీ!" అని ఆమె తలను రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి వెతుకుతూ చూశాడు నిఖిల్. "కాదంబరీ! నీవు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా?"
    "హాదీ!" అని మొదలెట్టింది కాదంబరి. ఇంతలో పేగులు తెగిపోయేలా దగ్గుతెర వచ్చింది. కాసేపు మాట్లాడలేకపోయింది. ఎగశ్వాసతో డొక్కలు ఎగిరెగిరి పడ్డాయి.
    హధీ పేరు వినగానే నిఖిల్ కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. "హదీనా? హదీ నిన్ను ఏం చేశాడు? చెప్పు కాదంబరీ! చెప్పు!"
    వెంటనే మాట్లాడలేకపోయింది కాదంబరి.
    ఆదుర్దాగా నర్స్ వైపు తిరిగాడు రింగడు. "నర్స్! డాక్టర్ కి కబురంపు."
    సాభిప్రాయంగా అతనివైపు చూసి, మౌనంగా ఉండిపోయింది నర్సు. అర్ధమైనట్లు విచారంగా తలపంకించి ఊరుకున్నాడు రింగడు.
    చాలాసేపటి తరువాత దగ్గుతెరలో నుంచి బయటపడింది కాదంబరి. హీనస్వరంతో చెప్పడం మొదలెట్టింది.
    "హాదీ..........హాతీ అనే మనిషి ..........కాదు ..........కాదు............కాదు...............హాధీ అనే మృగం ...........నన్ను కొని, కొన్ని సంవత్సరాలు నాతొ హైక్లాసు హోటళ్ళలో వ్యాపారం చేయించి నా రక్తం పిండుకుని నా మాంసం పీక్కుతిని తర్వాత కసాయివాడికి అమ్మినట్లు లీ అనేవాడికి అమ్మేడన్నయ్యా! లీ నన్ను సింగపూర్ తీసుకొచ్చి........ఇక్కడ .........." మళ్ళీ దగ్గు తెర." ఇక్కడ నాతొ వ్యాపారం మొదలెట్టాడు. చౌకబారు .....కళాసీలూ........సెయిలర్లూ.........." ఆమె ఇంకా పూర్తీ వాక్యాలు మాట్లాడే తెలివిని కోల్పోతోంది. "చాలా కష్టాలు........చివరికి.........ఈ .........ఈ .......జబ్బు"
    'కాదంబరీ! భయపడకమ్మా! జబ్బు తగ్గిపోతుంది! నేను వచ్చేశాగా!"
    "నేను జబ్బుని తలచుకొని భయపడలేదన్నయ్యా! కానీ ఈ దూరదేశంలో నా అన్నవాళ్ళేవారూ లేకుండా ముఖ్యంగా నా అన్నని కడసారి చూడకుండా వెళ్ళిపోతానెమో , వెళ్ళిపోవాలేమో అని దిగులుపడ్డాను. అప్పుడు దేవదూతలా రింగడుగారు కనబడ్డారు. తర్వాత దేవుడిలా నువ్వు........" ఒక్కసారి ఆయాసం ముంచుకొచ్చింది కాదంబరికి. "నువ్వు ప్రత్యక్షమయ్యవు. నాకు తెలుసున్నయ్యా! నీ కాదంబరి చచ్చిపోయేలోగా నువ్వు వచ్చి చూస్తావని."
    "కాదంబరీ!" అన్నాడు నిఖిల్, ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా పలికిస్తూ అతని పిలుపు కాదంబరికి వినబడినట్లు లేదు. ఎవరికీ వినబడని మరేదో శబ్దం తన కొక్కదానికే వినబడతున్నట్లు తల కొంచెం పైకెత్తి చెవులు రిక్కించి విన్నది.
    "ఏమిటది? ఏమిటది? గంటలసవ్వడి! డెక్కల చప్పుడు! అన్నయ్యా! చూడు! చూడు! యముడివాహనం! నల్ల దున్న! కాదు హాదీ! హదీ మీద సవారీచేస్తూ వస్తున్నాడు యముడు వస్తున్నాడన్నయ్యా! యముడు వచ్చేస్తున్నాడు! అన్నయ్యా! అమ్మా నాన్నా!........"
    ఏమీ మాట్లాడలేదు నిఖిల్. వణుకుతున్న చేతులతో ఆమె తలని నిమురుతూ ఉండిపోయాడు.
    "అమ్మా నాన్నా అక్కడన్నా నన్ను కలుసుకుంటారా ఆ..........న్న్........య్య్.........ఆ"
    ఆమె నోరు అలా తెరచుకునే ఉండిపోయింది. ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
    "హాదీ!" అని పెనుకేక పెట్టాడు నిఖిల్. ఆ కేక సింహపుర ద్వీపమంతా ప్రతిధ్వనించి, తుఫానులా సముద్రాన్ని దాటి, దూరదేశంలో సుందరీమణులమధ్య సుఖాసీనుడయి ఉన్న హదీ కర్ణభేరీని బద్దలు చేస్తుందా అని భ్రమ కలిగింది రాధకు.
    "హాదీ! ఇంకా నీకు రోజులు దగ్గర పడ్డాయ్! వస్తున్నా కాచుకో!"
     "నిఖిల్!" అంది వారిస్తున్నట్లు.
    కళ్ళు గట్టిగా మూసుకుని, పిడికిళ్ళు బిగించి పళ్ళు గిట్టకరిచి పట్టుకుని తనని తాను కంట్రోలులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిఖిల్. అప్పుడు ఆవేశం కాదు కావలసింది. ఆలోచన!
    మరణహోమం తలపెట్టాడు తను. అద్భుతమైన ఆలయాన్ని బద్దలు చెయ్యదలుచుకున్నాడు.
    ఆ ఆలయాన్ని కట్టిస్తున్న హధీనే తన చెల్లిలి బతుకును ముక్కలు చెక్కలు చేసినవాడన్నామాట!
    ఆ దేవాలయంతో బాటు హధీ శరీరం కూడా తునాతునకలయిపోవాలి. అయి తీరుతుంది.
    అయేలా చేస్తాడు తను!
    ఆ తర్వాత -
    బరువెక్కిన మనసులతో, కాదంబరి అంత్యక్రియలు టూకీగా , నిరాడంబరంగా జరిపించారు వాళ్ళు.


    
                                                           * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS