రాజు మాట్లాడలేదు.
"టెర్రరిస్టు జపాటాని నిఖిల్ కలవడం నిజమేనా? ఎందుకు?"
మౌనం.
"మీకు టెర్రరిస్టులతో గానీ, గ్యాంగ్ స్టర్ లతో గానీ సంబంధాలు ఉన్నాయా? అబూనిడాల్, కార్లోస్ దజాకాల్, జపాటా, బాంబూ యునియన్, మాఫియా?"
"............"
"మొత్తం మీరు చేసిన హత్యలు ఎన్ని? మీ రాబడి ఎంత? ఎవరితో మీకు కనెక్షన్స్ ఉన్నాయ్? మీ వ్యాపారాలు ఏమేమిటి?"
"..........."
"చెప్పు రాజూ?"
మౌనం.
"నిఖిల్ ప్రవర్తన ఈ మధ్య చిత్రంగా మారింది. ఇదివరకు అతను ఎన్ని నేరాలు చేసినా , చట్టం పరిధిలోనే, చట్టానికి అందకుండా చేసేవాడు. ఇప్పుడతను చట్టానికి భయపడటం లేదు. కోర్టు కేసులకీ అటెండ్ కావడం లేదు. అతనిలో ఎందుకని ఆ మార్పు వచ్చింది? చాలా పెద్ద ప్రయత్నం ఏదన్నా చేస్తున్నాడా? చెప్పు రాజూ! నిన్ను అనవసరంగా హింసించడం నాకు ఇష్టం లేదు."
చెప్పనన్నట్లు తల అడ్డంగా ఆడించాడు రాజు.
నిట్టూర్చి, గోడకు ఉన్న స్విచ్ వేశాడు రాంచందర్.
వెంటనే కుర్చితో సహా లేచి పోయాడు రాజు. షాక్ తో అతని నోరు ఇంకా తెరచుకునే ఉంది.
"మైడియర్ రాజూ! చెప్పు!"
తల అడ్డంగా ఊపాడు రాజు. దుర్భంగా కేక పెట్టాడు రాజు. కేకమీద కేక.......కేక మీద కేక.........బాధా , భయం కలిపినా గొంతుతో చెట్టంత మొగాడు పెడుతున్న కేకలు అవి!
స్విచ్ ఆఫ్ చేశాడు రాంచందర్.
"చెప్పు రాజా............"
అతి కష్టం మీద గొంతు పెగాల్చుకుని చెప్పడం మొదలెట్టాడు రాజు...........
* * *
రింగడితో కలిసి బయటికి వచ్చి , హిందూరోడ్డు , రోవెల్ రోడ్డు దాటి డేస్కర్ రోడ్డులోకి వచ్చారు నిఖిల్ రాధ. రిలాక్స్ డ్ గా ఉన్నాడు నిఖిల్. తను అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగిపోతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో, తను విలయ ధ్వంసం సృష్టించి, భయానకమైన పరిస్థితులు క్రియేట్ చేసి, ఇండియా మొత్తాన్ని తన కంట్రోలులోకి తెచ్చుకుంటాడు. అప్పుడు తను, తన ప్రజలనీ, తన దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు.
ఆ విధిలో వరసగా పాత ఇళ్ళు ఉన్నాయి. "హస్తసాముద్రికం చేపబడును" అని బోర్డులు తగిలించి ఉన్నాయి ఇళ్ళముందు.
అక్కడ సాముద్రికం చెప్పేవాళ్ళందరూ చైనీయులు.
ఒక చైనా అతను నిఖిల్ ని పిలిచాడు.
"నీవు అనుకున్నది అనుకున్నట్లు చేయ్యబోతావు. లోపలికి రా! వివరంగా చెబుతాను."
రింగడు చైనీస్ లో అతన్ని గదమాయించి, నవ్వుతూ నిఖిల్ వైపు తిరిగాడు.
"వాళ్ళు అలా వెంతబడుతూనే ఉంటారు. మనం త్వరగా కాంపోంగ్ కాపోర్ రోడ్డు చేరుకోవాలి. లేకపోతె లేటయిపోతుంది."
"మనకు ఏం, పని అక్కడ?" అన్నాడు నిఖిల్.
చెప్పాలా వద్దా అని ఓక క్షణం అలోచించి , " అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది." అన్నాడు రింగడు అస్పష్టంగా.
తను చెప్పదలుచుకున్న విషయం నోటితో చెప్పలేక పోతున్నాడు రింగడు. అది తలచుకుంటేనే అతని గుండె నీరయిపోతోంది.
* * *
ఒక చిన్న ఇంటిముందు ఆగాడు రింగడు. సంకోచంగా నిఖిల్ వైపు తిరిగి అన్నాడు "జీవితంలో ఒక్కొక్కసారి మనం ఉహించలేని దృశ్యాలని చూడవలసి వస్తుంది నిఖిల్. మనసు మధించే పరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కునే గుండె నిబ్బరం నీకు ఉంటుందని నాకు తెలుసు . అయినా .........." అని ఆగి, "లోపలి వెళ్దాం రండి" అన్నాడు.
దీనంగా ఉంది ఆ ఇంటి వాతావరణం. కిటికీలకు కట్టిన కర్టెన్లు మాసి పేలికలై రెపరెపలాడుతున్నాయి. స్ప్రింగులు బయటికి వచ్చేసిన ఒక పాత కాలపు సోఫాలో పడుకుని ఉంది ఎముకల గూడులా ఉన్న ఒక స్త్రీ. ఆ సోఫా తప్ప మరే ఫర్నిచరూ లేదు ఇంట్లో. ఆ స్త్రీ ప్రక్కనే ఒక నర్సు నిలబడి బోమికలా ఉన్న చేతికి ఇంజెక్షనూ సూది గుచ్చే ప్రయత్నం చేస్తోంది. సోఫా మీదకు వంగాడు రింగడు.
"కాదంబరీ !" అన్నాడు మృదువుగా.
ఉలికిపడ్డాడు నిఖిల్. కాదంబరి! కాందంబరా? కళ్ళు చిట్లించి ఆమె వైపు చూశాడు.
ఆమె కళ్ళు చుట్టూ నల్లచారికలు ఉన్నాయి. చెంపలు పీక్కుపోయి ఉన్నాయి. జుట్టు ఊడిపోయి పల్చగా అయిపొయింది. తలమీద ఉన్న చర్మం అక్కడక్కడ బయటపడుతోంది అయినా -
రాజ ప్రాసాదపు శిధిలాలలో గత వైభవపు ఛాయలు లీలగా దర్శనిమిస్తున్నట్లు అంత అనారోగ్యంలో కూడా ఆమె కనుముక్కు తీరు, ఒకప్పుడు ఆమె చాలా చక్కటి మనిషి అని తెలియబరుస్తున్నాయి.
