అప్పుడు ఇనపచువ్వ రాకెట్ వేగంతో మళ్ళీ వచ్చి రాజు మోకాళ్ళని వెనకనుంచి తాకింది. మోకాళ్ళు వంగిపోయి నీలమీద కూలిపోయాడు రాజు. ఇనప నాడా బూటు ఇంకోసారి అతని దవదని తాకింది.
స్పృహ తప్పిపోయింది రాజుకి.
తరుణ్ మనుషులు రొప్పుతూ నిలబడ్డారు.
"ఆడవిదున్నలా పోట్లాడాడు బాస్టర్డ్!" అన్నాడు ఒకతను.
"వీళ్ళ కోడ్ కనుకున్నాం! తేలిగ్గా వీణ్ణి హోటల్ కి రప్పించగాలిగాం! కానీ వీణ్ణి లొంగదీయడానికి తొమ్మిది మంది జమాజెట్టీలు కావలసి వచ్చింది" అన్నాడు మరొకడు.
"వీణ్ణి షూట్ చేసి చంపి ఉండవచ్చు. కానీ ప్రాణాలతో పట్టుకోమని కదా తరుణ్ ఆర్డర్స్! అందుకని శ్రమ అయిపొయింది."
"పందిని కొట్టినట్లు కొట్టాం! ఇంతకీ బతికి ఉన్నాడా? చచ్చాడా?"
అందరూ వంగి చూశారు. ఆగి ఆగి శ్వాసపీలుస్తున్నాడు రాజు. దెబ్బలతో అతని మొహం ఉబ్బిపోయి ఉంది. కళ్ళు వాచి , మూసుకుపోయి ఉన్నాయి.
"మన అంబులెన్స్ పిలిపించండి! నేను ఈలోగా తరుణ్ కి మెసేజ్ పంపుతాను" అన్నాడు వాళ్ళ లీడరు, రాంచందర్.
మరో అరగంట తర్వాత ఊరి బయట ఉన్న ఒక ఇంటికి చేర్చారు రాజుని.
మెసేజ్ అందుకుని, మర్నాటికి ఇండియాకి తిరిగి వచ్చేశాడు తరుణ్.
రావడం రావడం , నేరుగా రాజుని ఉంచిన ఇంటికెళ్ళిపోయాడు.
మంచం మీద పడుకుని ఉన్నాడు రాజు. అతని షర్టు విప్పేసి ఉంది. వంటి మీద ఉన్న గాయాలు అన్నీ ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ గాయాలకీ బాండేజ్స్ ఉన్నాయి. మంచానికి బిగించి కట్టేశారు అతన్ని లెదర్ స్ట్రాప్స్ తో. ఒక డాక్టరు రాజు మీదకి వంగి చూస్తున్నాడు.
"ఎలా ఉంది?" అన్నాడు తరుణ్.
"సీరియస్ కండిషన్! ఇతనుచాలా ఆరోగ్యవంతుడు కాబట్టి మీవాళ్ళు కొట్టిన చావుదెబ్బలు భరించి బతికాడు. రెండు పక్కటెముకలు విరిగాయి. ముక్కుదూలం విరిగింది. మోకాలిచిప్ప పగిలిపోయింది. లోపల ఒకటి రెండు చోట్ల రక్తానాళాలు చిత్లినట్లు అనుమానంగా ఉంది."
"అతను చావకూడదు డాక్టర్! బతకాలి! బతికితీరాలి! బతికించండి!"
"అతని మీద అంత అభిమానం ఉంటే ఇంత దారుణంగా ఎందుకు కొట్టారు?" అన్నాడు డాక్టర్ వ్యంగ్యంగా.
"కొట్టకపోతే దొరికే మనిషి కాడతను. అతను బతకాలి డాక్టర్! అతనిచేత కక్కించవలసిన విషాలు, విషయాలు చాలా వున్నాయ్!"
డాక్టర్ చీదరగా చూశాడు.
"మీరన్నది నాకు అర్ధం అవుతోంది! అతనిచేత ఏవో రహస్యాలు చెప్పించడానికి తీసుకువచ్చారు మీరు! చెప్పకపోతే చిత్రవధ చేస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి! అతను ఇప్పుడేమీ చెప్పే స్థితిలో లేడు. లేకుండా చేశారు మీవాళ్ళు. అతని మీద మీరు ఇప్పుడు ఏమన్నా ప్రయోగాలు చేశారంటే , నిశ్చయంగా చచ్చిపోతాడు. కనీసం పదిహేనురోజులు పాటు అతనికి పూర్తీ విశ్రాంతి అవసరం!"
"నధింగ్ డూయింగ్! అతన్ని సాధ్యమైనంత త్వరలో ప్రశ్నించాలి నేను."
"ఇంపాజిబుల్! వారం రోజులవరకు కళ్ళు తెరవలేడు అతను" అన్నాడు డాక్టర్ స్ధిరంగా.
తరుణ్ తలపంకించి తన మనుషులతో ఏదో చెప్పి, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
నాలుగోరోజున తెలివి వచ్చింది రాజుకి.
ఆ సాయంత్రమే అతన్ని ప్రశ్నించడానికి ఏర్పాట్లు జరిగాయి. తరుణ్ మాత్రం అక్కడికి రాలేదు. అతను ఇంకోపని మీద తన బాస్ దగ్గర ఉండిపోయాడు. పైగా, అతను సాధ్యమైనంత వరకూ ఇలాంటి అన్ ప్లెజెంట్ వర్కు అవాయిడ్ చేస్తాడు. హింసని చూడడం అతనికి ఇష్టం ఉండదు.
తరుణ్ కి డిప్యుటీ అయిన రాంచందర్ ఇంటరాగేషన్ మొదలెట్టాడు.
చిన్న గది అది. కుర్చీలో కూర్చుని ఉన్నాడు రాజు. అతని చేతులు కుర్చీ చేతులకి కట్టేసి ఉన్నాయి. కాళ్ళు కుర్చీ కాళ్ళకి కట్టేసి ఉన్నాయి. ఛాతికి కుర్చీనీ కలుపుతూ ఒక లెదర్ స్ట్రాప్ బిగించి ఉంది.
కళ్ళు, ముక్కూ నోరూ అని తేడాలు తెలియకుండా ఉబ్బిపోయి ఉంది రాజు మొహం. అతనికి ఎదురుగా ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఉన్న పవర్ ఫుల్ లైటు కాంతి సూటిగా రాజు మొహంమీద పడుతోంది.
టేబుల్ దగ్గర మరో కుర్చీలో కూర్చుని వున్నాడు రాంచందర్. అతని పక్కనే గోడకి ఒక స్విచ్చి ఉంది. అక్కడ నుంచి ఎలెక్ట్రిక్ వైర్లు రాజు కూర్చున్న కుర్చీలోకి పాకి అతని చేతులకి చుట్టుకుని ఉన్నాయి.
రాంచందర్ మృదువుగా చెప్పడం మొదలెట్టాడు.
"మైడియర్ రాజూ! నీమీద మాకేం కోపంలేదు. నికిల్ మీదే మా దృష్టి అంతా! నువ్వు అతని కొలువులో వున్నావని మాకు తెలుసు. యజమాని మాట వినడం ధర్మం. నిజమే! కానీ ఆ యజమాని దేశద్రోహం తలపెడితే? గంగిరెద్దులా తల ఊపి అతను చెప్పినట్టే చూస్తూ పోతామా? రాజూ! నిఖిల్ రహస్యాలు నీకు చాలా తెలుసు! అన్నీ చెప్పేయ్! నీ మీదకి ఏ కేసూ రాకుండా మేం రక్షణ ఇస్తాం సరేనా?"
రాజు అతికష్టం మీద తల అడ్డంగా ఊగించాడు.
సహనం కోల్పోలేదు రాంచందర్.
"నాకు తెలుసు రాజూ! నువ్వు నిజాయితీ పరుడివి! నువ్వు నిఖిల్ ఉప్పు తిన్నావు కాబట్టి అతనికి అపకారం చెయ్యలేకుండా ఉన్నావ్. కానీ మనకి నిఖిల్ కంటే దేశం ముఖ్యం రాజూ! అవునా?"
రాజు మాట్లాడలేదు.
"రాజూ! నువ్వు చాలా ధైర్యవంతుడివి, భయమంటే నీకు తెలియదు. కానీ చిత్రహింసకు ఎవరైనా సరే, లోన్గిపోతారు రాజూ! లోంగిపోక తప్పదు! అంతగా డెవలప్ అయ్యాయి టార్చర్ టెక్నిక్స్! నిజాలు చెప్పడానికి నీ మనసు ఒప్పుకోకపోయినా, నీ మనసుని మేం లొంగదీస్తాం రాజూ! మైండ్ బెండింగ్ డ్రగ్స్ తో! మీరు చాలామందిని చిత్రహింసలు పెట్టి ఉంటారు. మీకూ ఈ టేక్నిక్సు అన్నీ తెలిసే ఉంటాయి.
నువ్వు తెలివైనవాడివి రాజూ! నీకు తెలిసే వుంటుంది! చిత్రహింసను నిరంతరంగా భరించడం ఎవరికీ సాధ్యంకాదని! ఇవాళ కాకపోతే రేపయినా నువ్వు చెప్పక తప్పదు! నువ్వే కాదు, నిఖిల్ మాకు దొరికినా అతనికీ తప్పదు. మేము మీ చేతికి దొరికితే మాకూ తప్పదు. "నాప్రాణాలు తీసినా సరే నిజం కక్కను" అని ఉదాత్తంగా పెరిగింది, నోరెత్తకుండా ఉండడం అసంభవం. ఇప్పుడు ఇక్కడ నిఖిలే గనక ఉంటే నిజాలు చెప్పవద్దని నిన్ను నిర్భంధించి ఉండేవాడు కాడు. ఎందుకంటే రాజూ! అతనికి తెలుసు! నాకు తెలుసు! నీకు తెలుసు! మోడరన్ మెదడ్స్ లో చేసే టార్చర్ ఎవరూ కూడా ఎంతోకాలం భరించలేరని! చెప్పు రాజూ! నేను రక్తపిపాసిని కాను. నిన్ను హింసించడం నాకు ఇష్టం లేదు. నువ్వు త్వరగా చెప్పేస్తే ఆ తర్వాత నీకు పూర్తీ విశ్రాంతి ఇస్తాను. హాయిగా , నిశ్చింతగా నిద్రలోకి జారిపోవచ్చు. చెప్పు."
నెమ్మదిగా తల అడ్డంగా ఆడించాడు రాజు.
కాసేపు వేచి ఉన్నాడు రాంచందర్.
తలవంచుకుని ఉన్నాడు రాజు, ఉబ్బిపోయిన కనురెప్పల్ని అతికష్టం మీద తెరిచి చూశాడు.
దెబ్బలు భరించలేక తను చేసుకున్న వాంతి ఒడినిండా పడి ఉంది.
మళ్ళీ అతనికి కళ్ళు మూసుకుపోయాయి.
"చెప్పురాజూ! ఎక్కువ టైం లేదు. నిఖిల్ హధీని ఎందుకు కలిశాడు?"
జవాబు చెప్పలేదు రాజు.
"హాధీ కడుతున్న మందిరం రహస్యమేమిటి? దానితో నిఖిల్ కి సంబంధం ఎంతవరకూ?"
