Previous Page Next Page 
మారణహోమం పేజి 85

 

    ఒక కారు డ్రైవర్ నిఖిల్ వైపు  చూసి కనబడీ కనబడనట్లు చిరునవ్వు నవ్వి తల పంకించాడు. మంగోలాయిడ్ పోలికలతో ఉన్న అంతమంది మనుషుల మధ్యలో అతను ఇండియన్ అని స్పష్టంగా తెలిసిపోయింది.
    ఆ కార్లో ఎక్కారు ఇద్దరూ.
    అతి శుభ్రంగా ఉన్న నున్నటి రోడ్డు మీద జారుతున్నట్లు వెళుతోంది కారు. కొద్ది నిమిషాలా తర్వాత జలాన్ రంబియా దగ్గర ఉన్న ఒబెరాయ్ ఇంపీరియల్ హోటల్ ముందు ఆగింది.
    "తమ కొరకు రెండు రూములు రిజర్వు కాబడియున్నవి." అన్నాడు ఆ డ్రైవరు అతి ప్రయాసతో తెలుగు మాట్లాడుతూ.
    "థాంక్స్ రింగడూ!" అన్నాడు నిఖిల్.
    వాళ్ళని అక్కడ దింపి, కారు కదిలి వెళ్ళిపోయింది.
    "ఎవరతను? పేరేమిటి? రింగడా?" అంది రాధ ఆశ్చర్యంగా.
    నిఖిల్ నవ్వాడు "నాలుగు తరాల క్రిందట సింగపూర్ వచ్చి సేటిలయిపోయిన తెలుగు కుటుంబం వాళ్ళది. వాళ్ళ తాత పేరో, ముత్తాత పేరో  రంగడు. అదే వాడుకలో రింగడుగా మారిపోయింది. పాతపేరే ఇతనికి పెట్టారు. అపభ్రంశాలతో అయినా సరే ఇప్పటికీ వాళ్ళింట్లో తెలుగే మాట్లాడతారు."
    "అలా ఉండాలి స్పిరిట్" అంది రాధ.
    హోటలు రూములోకి వెళ్ళాక చెప్పాడు నిఖిల్ "ఇవాళంత బాగా నిద్రపో! అర్ధమయిందా? బాగా తిను! మళ్ళీ కంటినిద్రా నిద్ర ఎప్పుడూ పోతామో! కడుపునిండా తిండి ఎప్పుడు తింటామో తెలియదు!"
    తల ఊపింది రాధ.
    ఆరోజు షేన్ టాన్ వేలో ఉన్న మే ఫవర్ రెస్టారెంట్ లో డిన్నర్ తీసుకున్నారు.  అసలైన ఫేమస్ కాంటోనీస్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ.
    సింగపూర్ కి "టెస్టియేస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్" అనే పేరు ఉంది.
    డిన్నర్ పూర్తీ అయ్యాక, రెండు ట్రైషాలు మాట్లాడాడు నిఖిల్. ట్రైషా అంటే, దాదాపు మన సైకిలు రిక్షా లాంటిది. సైకిలుకి ఒక పక్కన సైడ్ కార్ అమర్చి ఉంటుంది. దాన్లో కూర్చుంటారు ప్రయాణీకులు.
    ట్రైషాలు సెరంగూన్ రోడ్డు వైపు వెళ్ళడం మొదలెట్టాయి. సేరంగూన్ ని 'లిటిల్ ఇండియా' అని పిలుస్తారు కొంతమంది. ఇండియన్స్ సింగపూర్ లో, మలయాలో వేల సంవత్సరాలకు పూర్వమే స్థిరపడ్డారని చెబుతారు. సింగపూర్ అసలు పేరు సింహాపుర.
    సువర్ణ ద్వీపాన్నీ నారికేళద్వీపాన్ని తక్కోలా (యాలకాయల దొరికే ప్రాంతం) నీ వెదుక్కుంటూ ప్రాచీనకాలంలో భారతీయలు బంగాళాఖాతాన్ని దాటి దాదాపు రెండు వేల కిలోమీటర్లు పయనించి వచ్చారనీ , ఇంతలో వర్షాలు ప్రారంభంకాగా, గాలివాటం మార్పుకోసం ఎదురుచూస్తూ , అకక్డ ఆగిపోయారానీ , క్రమంగా అక్కడే స్థిరవాసం ఏర్పరుచుకున్నారనీ సింగపూర్ లో చెప్పుకుంటూ ఉంటారు.
    రామకృష్ణా మిషన్ దాటి కొంతదూరం ముందుకు పోయాక. అక్కడ "హిందూరోడ్" లో ఉంది రింగడి ఇల్లు.
    వాళ్ళు ఎక్కిన ట్రైషాలు ఆగడానికి ఒక్క క్షణం ముందే, అక్కడ నుంచి ఒక టాక్సీ కదిలి వెళ్ళిపోయింది.
    అందులో ఉన్నాడు తరుణ్.
    అతను అప్పుడే అక్కడే గనక వాళ్ళని చూసి ఉంటే, కధ మరోలా మలుపు తిరిగి ఉండేది.


                                                          * * *


    ఇందియాలో -
    నిఖిల్ అసిస్టెంట్ రాజుకి కోడ్ లాంగ్వేజ్ లో ఒక వర్తమానం అందింది.
    "అర్జెంటుగా హోటల్ రూప్ మతికి రా! రూం నెంబరు నూట అయిదు! అత్యవసరం! జెన్."
    వెంటనే బయల్దేరాడు రాజు. అతని మెదడులో కొంచెం ఆందోళన చోటు చేసుకుంది. ఎందుకు మెసేజ్ పంపించింది జెన్! ఏమిటంత తొందర?
    హోటల్లో ప్రవేశించి, రూమ్ నెంబరు నూట అయిదు ముందు ఆగి బజర్ నొక్కగానే, తలుపులు తెరచుకున్నాయి.
    వెంటనే అతని తల మీద ఇనుప చువ్వతో బలంగా ఒక దెబ్బ పడింది. కపాలం చిట్లినట్లనిపించింది. చాలా దృడకాయుడు కావడం వాళ్ళ ఆ దెబ్బకు తట్టుకోగలిగాడు రాజు. కళ్ళలోకి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ చూశాడు. ఎదురుగా రూములో ఆరుమంది మనుషులు కనబడుతున్నారు. చటుక్కున రివాల్వర్ తీసి కాల్చాడు. అలోగానే మరొక దెబ్బ అతని మణికట్టు మీద పడింది. గురితప్పి నేలకు తగిలింది బుల్లెట్. మళ్ళీ రివాల్వర్ ఎత్తబోయాడు. ఇనుప చువ్వతో ఇంకోదెబ్బ. రాజు చేతి నరాలు చచ్చుబడిపోయాయి. చెయ్యి స్వాధీనం తప్పింది. రివాల్వర్ నెల మీదకు జారిపోయింది. అయినా భయపడకుండా కొడం సింహంలా వాళ్ళ మీదకు ఉరికాడు రాజు. ఈలోగా బయట పొంచి వున్న మరో ముగ్గురు వ్యక్తులు వెనకనుంచి అతని మీదకు లంఘించారు. వాళ్ళందరూ తరుణ్ మనుషులు. తర్ఫీదు పొందిన కమెండోలు.
    వాళ్ళు తనమీదికి రావడం గమనించి కాలు వెనక్కి విసిరాడు రాజు. అతని పాదం వేగంగా వచ్చి పొత్తికడుపు కింద తగలగానే వెర్రికేక పెట్టి విలవిలలాడుతూ కింద పడిపోయాడు ఒకడు. కానీ అలోగానే ఇంకో కమెండో గాల్లోకి లేచిన రాజు కాలిని లాఘవంగా ఒడిసిపట్టుకుని, వెనక్కి గుంజాడు. మొదలు నరికిన చెట్టులా కిందపడ్డాడు రాజు. తక్షణం అతని మొహాన్ని తాకింది ఒక బూటుకాలు. ఇనప నాడా కొట్టి ఉన్న ఆ లెదర్ సోల్ తాలూకు మడమ తగలగానే రాజు ముక్కుదూలం విరిగింది. బూటు మదమతో అతని చెవి మీద మరోసారి కొట్టాడు కమెండో.
    శక్తినంతా ఉపయోగించి స్ప్రింగులా లేచి నిలుచున్నాడు రాజు. అరచేతి అంచుతో ఎదుటివాన్ని బలంగా కొట్టాడు. పోర్లిగింత పెట్టి ధభేలుమని కిందపడ్డాడు అతను. ఆ పడటం పడటం మళ్ళీ లేవలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS