పొగడ్తలు వినడం తనకు ఇష్టం లేనట్లు నుదురు చిట్లించాడు నిఖిల్. "వీళ్ళ కార్యక్రమాలకు కవర్ లాగా మహారాష్ట్ర బోర్డరులో ఒక గుడి కట్టిస్తున్నారు రాదా!"
తెల్లబోయి చూసింది రాధ.
"గుడా?"
"గుడే! మామూలు గుడి కాదు! మహామందిరం! అద్భుతమైన పాలరాతి కట్టడం! ఎకరాల మేర తోటలు! వాటిమధ్య దేవాలయం!"
"స్మగ్లర్లకు హటాత్తుగా ఇంత దైవభక్తి ఎందుకు పుట్టుకొచ్చింది."
"దైవభక్తి కాదు అది ! దేశాన్ని అంతా దోచుకు తినాలన్నా కుయుక్తి! దేముడి పేరు చెప్పి మాయచేసి, దైవభక్తి అనే ముసుగువేసి మోసం చేసి బతుకుతున్నవాళ్ళు ఎక్కువయి పోతున్నారు రాదా! మల్టీ మిలినీయర్లను మాత్రమే ముఖ్య శిష్యులుగా చేర్చుకుంటూ, జెట్ విమానాల్లో తప్ప ప్రయాణం చెయ్యని మహాత్ములు ఎంతమంది లేరు? హిమాలయాల్లో ఎయిర్ కండిషన్డ్ 'గుహలు" కట్టి , ఇన్ స్టంట్, మోక్షం ఇప్పిస్తామని పాశ్చాత్య పాప్ గాయలకులను తీసుకొచ్చి, వాళ్ళ భ్రమలు తొలిగాక భంగపడ్డ మహర్షులు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం సంపాదించి, ఆ పరిచయంతో లైసన్సులు సంపాదించి, తుపాకుల ఫ్యాక్టరీ పెట్టిన సర్వసంగ పరిత్యాగులను గురించి నువ్వు వినలేదా రాదా? కామిగాక మోక్షకామిగాడు అన్న నానుడిని రుజువుచేస్తూ, అమాయకులను ఆకర్షించి కామకేళిలో తేలుతున్న జితేంద్రలు లేరా? ఉన్నారు రాదా! ప్రతిచోటా, ప్రతి మతంలో కూడా! మతం పేరు చెప్పుకు బతికే ప్రతి మనిషి ఒక జిడ్డు కృష్ణమూర్తి , ఒక మదర్ ధేరిసా , కారు రాదా! పురుషులందు పుణ్యపురుషులు వేరని యోగివేమన ఎప్పుడో చెప్పాడు . అవునా?
మతం అన్నది మారణాయుధంగా మారిపోతోంది! మతం పేరుతొ మందిని ఉసిగొలపడం మహా సులువు. జనాన్ని ఉద్రేకపరిచి, ఉన్మాదావస్థలోకి తీసుకెళ్ళిపోవడానికి మతాన్ని పవర్ ఫుల్ వేషన్ గా వాడడం నేర్చుకుంటున్నారు కొందరు.
హధీ లాంటి స్మగ్లర్లు ఇప్పుడు ఈ ఆలయం కడుతోంది దేముడి మీద భక్తితో కాదు. జనం మీద ప్రేమతో కాదు. పరలోక చింతనతో కాదు.
తాము ఇకనుంచి భారీ ఎత్తున కొనసాగించాబోయే సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు దాన్ని ఒక కవర్ గా ఉపయోగించుకోబోతున్నారు. దాన్ని వాళ్ళు దేవాలయంగా చుదబోవడం లేదు రాదా! దొంగల డెన్ గా చేయబోతున్నారు."
"ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం జరుగుతున్నట్లు నేనెప్పుడూ వినలేదే!"
"ముందుగా పబ్లిసీటీ ఇవ్వలేదు వాళ్ళు. అందరూ వచ్చి చూస్తూ అడ్డంగా నిలబడుతూ ఉంటే, వాళ్ళకి అనుకూలమైన పద్దతిలో నిర్మాణం చెయ్యడం కుదరదు . నా ఉద్దేశ్యంలో అ ఆవరణలో చాలా అండర్ గ్రౌండ్స్, వాల్టులూ, సొరంగాలు ఆయుధగారాలూ కూడా కట్టబోతున్నారు.
గుర్తుంచుకో రాదా! వాళ్ళు కట్టబోతోంది గుడికాదు! అర్సేనల్! ఆయుధగారం! అది దేవాలయం కాదు! అవినీతికి ఆలవాలం! అక్కడ దేవతా శక్తి ఏమీ ఉండదు. దానవుల కుయుక్తి మాత్రం ఉంటుంది.
ఈ ఇరవయ్యో శతాబ్దంలో నోరులేని దేముడి పేర జరపబోతున్న మహాత్తరమైన ఫ్రాడ్ ఇది! నభూతో నభవిష్యనతి! ఇంత దారుణమైన మోసం ఇంతకుముందు ఎప్పుడూ జరిగి ఉండలేదు! ఇకముందు జరగదు కూడా!
జరగనివ్వకూడదు మనం!
వాళ్ళ పదకాలని నీటిబుడగని పేల్చినట్లు పెల్చేయ్యాలి రాదా మనం!"
"ఎలా?"
"ఆ దేవాలయాన్ని పెల్చేయ్యాలి!"
స్థంభించిపోయింది రాధ.
"దేవాలయాన్ని డైనమైట్ చెయ్యడమా?"
నిఖిల్ ఆ మాట అనగానే , విశ్వాంతరాళాలన్నీ వ్యాపించి ఉన్న అదృశ్యశక్తి ఏదో ఒళ్ళు విరుచుకున్నట్లు భ్రాంటి కలిగింది రాధకు.
పాపులు కట్టిన ఆలయమైనా సరే, అది దేవాలయం! దానిని ద్వంసం చెయ్యడమా?
ఆమె కళ్ళలో కనబడ్డ ఆందోళన చూసి పెద్దగా నవ్వాడు నిఖిల్.
"భయపడుతున్నావా రాదా! దేముడి మీదకు నేను దండెత్తి పోతున్నాననా? అలాగే అనుకో. పాపాత్ములకు పట్టంగడుతూ , పుణ్యాత్ములకు పరీక్షలు పెడుతుంటాడు ఈ దేవుడు. బహుశా నిద్రమత్తులో జోగుతున్నాదేమో అయన! చూద్దాం! ఈ డైనమైట్ శబ్దాలకన్నా మేల్కొని మంచి వాళ్ళకు మంచి ఏమన్నా చేస్తాడేమో!"
రాధ జవాబు చెప్పకుండా చూస్తోంది.
"ఆదిలోనే హంస పాదా రాదా? నువ్వే నన్ను రెచ్చగొట్టావ్! నేను రెచ్చిపోయి ముందుకు దూకే సమయంలో వెనుకంజ వేస్తావా రాదా!"
రాధ మోహంలో రంగులు మారాయి. పట్టుదల కనబడింది. "నేనా? నో! నెవర్! నేను నీతోనే నడుస్తాను నిఖిల్! నరకానికైనా సరే నీతో వస్తాను! నిజం నిఖిల్!" అంది నిజాయితీగా.
వెళ్ళి ఒక ఆల్బం తీసుకొచ్చాడు నిఖిల్. దానిలో కొత్తగా కట్టబోయే ఒక పాలరాతి మందిరం తాలూకు స్నాప్స్ ఉన్నాయి. వివిధ కోణాల నుంచి తీసిన ఫోటోలు అవి. కొన్ని ఏరియల్ వ్యూనుంచి తీసినవి ఉన్నాయి. ఆ ఫోటోల మీద ఎర్రటి సైన్ పెన్నుతో అక్కడక్కడ మార్క్ చేసి వుంది.
"ఆ గుర్తులు ఏమిటి?" అంది రాధ పరిశీలనగా చూస్తూ.
"దాడి చెయ్యడానికి తగిన స్థానాలు గుర్తుపెట్టి ఉంచాను."
ఆశ్చర్యంగా అతనివైపు చూసింది రాధ. ఇతనిది ఎంత లోతు స్వభావం! ఒకపట్టాన బయటపడిపోడు! ఇప్పటిదాకా తను ఉద్రేకంగా లెక్చరు ఇచ్చింది. దాని ప్రభావంవల్లనే అతను మారాడని ఉహిస్తోంది. కానీ ఇతను ఇంతకుముందే ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాడన్నమాట!
"నిఖిల్!" అంది మృదువుగా. "నిన్ను చూసి, నీ మాటలను విని, నీ చేతలను గమనించి, నేను విస్మయచాకితురాలనయిపోవడం ఇది మొదటిసారి కాదు! అంటే, ఈ దేవాలయాన్ని పెల్చేయ్యలని ఇంతకుముందే నువ్వు నిశ్చయించుకున్నావా?"
"మూడు నెలలకు ముందే నిర్ణయించుకున్నాను రాదా!"
"ఎందుకు?"
నిఖిల్ నిట్టూర్చాడు.
"ఆ మందిరం నిర్మాణం జరుగుతున్న ఛాయలకు కూడా ఎవరినీ రానివ్వలేదు హధీ మనుషులు. అది తెలియక, దారితప్పి డస్సిపోయి, దప్పికొని, అటువైపు వచ్చారు ఒక బీద స్త్రీ, ఆమె పదేళ్ళకూతురు. ఆకలితో నకనకలాడిపోతున్నారు ఇద్దరూ కూడా. ఆలయం నిర్మాణం చేస్తున్న కూలీలు అప్పుడే పని ఆపి, చద్దిమూటలు విప్పి తింటున్నారు.
ఆ తల్లికి బిచ్చమెత్తుకోవడం ఇంకా అలవాటు కానట్లుంది. తను ఆకలితో చావడానికి కూడా తయారుగానే ఉంది. కానే ఆ పసిపిల్ల సంగతి?
అందుకని తను మొహమాటంగా దూరంలోనే ఆగిపోయి, కూతురికి చెప్పింది "వెళ్ళి ఏదన్నా వాళ్ళని అడిగి పెట్టించుకుని తినమ్మా!" అని.
ఆ కూతురు వెళ్ళి అడగడం చేతగాక దీనంగా చూస్తూ నిలబడింది ఒక కూలీ జంటదగ్గర. వాళ్ళు పాపం మంచివాళ్ళే. ఆ అమ్మాయిని చూసి జాలిపడి , దగ్గర కూర్చోబెట్టుకుని, అట్టలా గట్టిపడిన ఒక రొట్టె ముక్కను విరిచి ఇచ్చారు.
అదే వాళ్ళు చేసిన పాపం! అటు వచ్చిన హధీ మనుషులు అదిచూసి ఆగ్రహంతో ఆ కూలీ జంటనీ, ఆ అమ్మాయినీ , ఆమె తల్లినీ కూడా అప్పటికప్పుడే కాల్చి వేసి పునాదుల్లో పూడ్చి పెట్టారు. దేవాలయం రహస్యం బయటపడి పోతుందేమోనని వాళ్ళ భయం అనుకుంటా!
చూశావా రాదా! అక్కడ దేవాలయంలో హత్యలు! ఇక్కడి కోర్టు ఆవరణలో మారణాయుధాలతో దారుణాలు! ఎక్కడున్నాడు రాదా దేముడు! ఎక్కడుంది న్యాయం?
ఆ తల్లీ పిల్లా చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను రాదా! కానీ కొంత ఆలస్యంగా చేరుకున్నాను అక్కడికి. వాళ్ళని కాల్చినవాళ్ళను నేను కాల్చేశాను. కానీ అప్పుడే మనసులోకి వచ్చింది ఆలోచన! ఒక్కొక్కళ్ళనీ చంపడం కాదు, మూకఉమ్మడిగా మారణహోమం చెయ్యాలని. పాలబుగ్గల పసిపాపని చంపుతుంటే చూస్తూ ఉండిపోయిన ఈ రాతిమనసు దేవుడి పాలరాతి దేవాలయాన్ని పేల్చి పారేయ్యాలని!"
