Previous Page Next Page 
నా కథవింటావా పేజి 8


    "భగవంతుడా ! ఎవర్నైనా  పంపించు! ఈ దరిద్రుడి  నుంచి నన్ను విడిపించు" కన్నీళ్ళు కుండపోతగా  చెంపల మీదుగా  కారిపోతున్నాయి, కావ్యకి.
    ఆ నల్లటి  మొహం  క్రౌర్యంతో మరింత  నల్లబడింది, కోపంతోటీ, ప్రతీకారంతోటీ వాడి కళ్ళు  చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. కామంతో నిండిపోయిన వాడి శరీరం  పశువులా  వెర్రిగా  ముందుకు దూకుతోంది!
    కావ్య రాక్షసుణ్ణి  చూసినంతగా  వొణికి పోతోంది. వాడి కబంధ హస్తాల నుంచి ఎలా తప్పించుకు పోవాలా అని ఆలోచిస్తోంది. వాడు క్షణంలో మీదకి  దూకాడు. వాన  పెద్దదవుతోంది. జన సంచారం  అసలు లేదనే  చెప్పాలి.
    గట్టిగా పట్టుకున్న  వాడి చేతులని  కొరకడానికి  ప్రయత్నించింది. ఈసారి వాడు గట్టిగా పట్టుకుని బలం కొద్దీ నోరు నొక్కేశాడు, కొరకడానికి  వీల్లేకుండా. కాళ్ళతో తన్నింది. గోళ్ళతో గీరింది. వాడిలో కసి మరీ పెరిగింది. పెనుగులాటలో వాడు బలం కొద్దీ  లాక్కుపోతున్నాడు! కానీ క్షణంలో పెద్ద తళుక్కు! మెరుపులా కాంతి వాళ్ళమీద పడింది! అది మెరుపుకాదు! కారు లైట్లు! ఉరుములా మోగింది హారన్!
    వాడు పట్టు వొదిలి  పారిపోయాడు! కావ్య కారుకేసి  పరుగెత్తింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెకి మాట రావడంలేదు.
    "నేనూ....నన్ను....వాడూ....నన్ను....మా ఇంట్లో  దింపండీ....ప్లీజ్!" ఏడ్చింది కావ్య!
    డ్రైవ్ చేస్తున్న అతని పక్కసీటులో  కూర్చున్నతను  "ఎందుకొచ్చిన గొడవండీ! ఇదో నటన కావొచ్చు. ఈ మధ్య మనం సినిమాల్లో చూడ్డంలేదూ? ఆడవాళ్ళు 'లిఫ్ట్' అని కారాపడం, కార్లో కూర్చున్నాక, 'పర్స్ తియ్యి! లేకపోతే అరుస్తా' అని బెదిరించడం. సినిమాల్లో ఏమిటి? మొన్నామధ్య నా ఫ్రెండొకడికి, ఇలాంటి ఎక్స్ పీరియన్సే  జరిగింది. టాంకుబండ్  దగ్గర సరిగ్గా కారాపి లిఫ్ట్ అడిగిందట  ఒకామె! "ఎక్కడికెళతారు?" అని అతడు కారాపి గెటిన్ అని లిఫ్ట్ చ్చాట. "ఆబిడ్స్ కి పోనివ్వండి" ఆటో దొరకడంలేదు. అందుకే సికింద్రాబాదు నుంచి నడిచి వతున్నాను అందిట ఆమె! "అయ్యో పాపం! ఈ ఆటోలంతేనండీ! సమయానికి దొరకవు! దొరికినా రామంటారు! ఒకవేళ ఒస్తామన్నా, హైదరాబాదు కెళ్ళమంటే సికిందరాబాదంటారు! సికిందరాబాదు  కెళ్ళమంటే  హైదరాబాదంటారు! మీటరు లేదంటారు, వున్నా రెండురూపాయలెక్కువిస్తే  మీటరు కంటే వొస్తాం!" అంటారు. ఛీ....ఛీ....ఛీ....అంటూ ఆటోలమీద చర్చించేలోగా  అబిడ్స్ ఒచ్చేసింది. "థాంక్స్ చెప్పి ఆమె దిగిపోయింది. కాస్సేపటికి  తన పాంటు వెనక జేబులో వున్న పర్సు  పక్కసీట్లో ఖాళీగా, కన్పించే సరికి, గుండె ఆగినట్టయి కారాపి చూసుకుంటే, పర్సులో ఆ రోజు సూపర్ బజారుకెళ్ళి, సామాన్లు కొనడానికి  తెచ్చిన నాలుగొందలూ, నాలుగు వందరూపాయలనోట్లు, "హుష్ కాకీ" అయిపోయాయి! "చెంప లేసుకున్నాడు జన్మలో మరెవ్వరికీ  లిఫ్టివ్వనని! జరిగింది  భార్యతో చెబితే, యుద్ధం జరుగుతుంది. పైగా తను లిఫ్టిచ్చింది  ఆడపిల్లకి. లేనిపోని గొడవలొస్తాయి. అందుకని ఎవరికీ  చెప్పుకోనుగూడా  లేదా మానవుడు" ఇదంతా  గుక్కతిప్పుకోకుండా  అయిదు నిమిషాల్లో  చెప్పేడతను, నవ్వుతూ.
    కావ్యకి కాళ్ళు ఒణుకుతున్నాయి. మళ్ళీ వాడొచ్చి  వెనక్కి లాక్కుపోతాడేమో, ఈ కారు కూడా వెళ్ళిపోతే, ఈసారి వాడి నుంచి తనని రక్షించే వాళ్ళు కూడా వుండరు. భయం, ఏడుపూ ముంచుకొస్తూంటే, "ఏమండీ! మా ఇల్లు ఆ రెండో సందులోనండీ! నేను స్టూడెంటుని. ఫ్రెండ్సందరం  కలిసి  సినిమాకెళ్ళాం. నేను ఇంటికొస్తూంటే  వీడు నా వెంటపడీ...." ఏడుస్తోంది. ఎలాగో అక్షరాలన్నీ కూడబలుక్కుని  ఇంతసేపు మాట్లాడ గలిగింది.
    డ్రైవ్ చేస్తూన్నతడు  తలుపు తియ్యబోయాడు, వెనకడోరు! "ఒరేయ్! అందరూ ఇలాంటి కథలే చెబుతార్రా! ఈ చీకట్లో, ఈ వానలో, ఈ అమ్మాయి చెప్పే మాటలు విని, మనం ట్రబుల్స్ లో పడితే" అన్నాడు పక్కసీట్లో వున్నతను.
    కావ్యకి ఒళ్ళుమండి పోయింది. "మీరు మనుషులేనా? చీకట్లో, ఒక ఆడపిల్ల, ఇబ్బందిలో వుండి కాస్త సాయం కోరితే, ఇంత ఆలోచనా? ఐ....యామ్....నాట్....ఎ....బాడ్....కారెక్టర్....నా పేరు కావ్య. బి.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మై....బ్రదర్....ఈజ్....మిస్టర్ క్రాంతి, ఇంజనీయరింగ్  ఫైనలియర్ లో వున్నాడు. మా నాన్నగారు పోయారు. అమ్మ మిసెస్ సీతాదేవి! ఈ వివరాలు చాలా నన్ను నమ్మడానికి?" అంది కోపంగా! అంతలోనే కారు స్టార్ట్ చేసి ఇతను వెళ్ళిపోగానే  మళ్ళా ఒస్తే_ఇంక అతనితో పెనుగులాడే బలం తనకి లేదు! తల్లి మాటలు జ్ఞాపకం వొచ్చాయి. "మగవాడి శారీరక బలం ముందు  ఆడది నిలవలేదమ్మా. అది భగవంతుడు ఆడవాళ్ళకిచ్చిన శాపం!"
    అతను కారు వెనక డోర్ తీసి "కూర్చోండీ" అన్నాడు.
    వెంటనే కారెక్కింది. పోతూన్న ప్రాణాలు తిరిగొచ్చినట్టనిపించింది. కారు కదలగానే ఇంక వాడి చేతిలో పడతానన్న భయం పోయింది. జరిగిన దానికి సిగ్గూ, అవమానం, బాధా అన్నీ కలిసి కన్నీరు ప్రవాహంలా కారుతూంటే, వెక్కి వెక్కి ఏడ్చింది.
    డ్రైవ్ చేస్తూన్న  శ్రీనివాసరావు అద్దంలోంచి  వెనుక సీట్లో వున్న కావ్యని చూశాడు. అమాయకత్వం, నిజాయితీ ఆమె మొహంలో కనిపించింది.
    "చూడమ్మా! ఆడపిల్ల  అర్దరాత్రి  వొంటరిగా  నడిరోడ్డు మీద ధైర్యంగా నడవగలిగినప్పుడే  మనకి నిజమైన స్వాతంత్ర్యం  వొచ్చిన రోజు అన్నారు గాంధీగారు! కానీ ఆ మహాత్ముడి  కలలు నిజం కాలేదు సరికదా, ఈ రోజున ఆడపిల్ల వొంటరిగా, పట్టపగలు  కూడా ధైర్యంగా నడవలేక పోతోందమ్మా! అదే మన దౌర్భాగ్యం !"
    అతని ఓదార్పుకి మరింత ఏడుపొచ్చింది. అంతవరకూ, కొంచెమైనా  నిగ్రహించుకుంటూ  వొచ్చిన కావ్య పసిపాపలా ఏడ్చింది. జరిగినదంతా  చెప్పింది. వాడు తనని పగబట్టి, అలా చేశాడని చెప్పింది. దేముడు సరిగ్గా సమయానికి మిమ్మల్ని పంపి నన్ను కాపాడాడు కానీ, లేకపోతే ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని పీడ కలగా  నా జీవితంలో మిగిలిపోయేది. అసలు నా జీవితం, సర్వనాశనమైపోయుండేది! థ్యాంక్ యూ వెరీమచ్....సార్!" వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది కావ్య!
    "యూ....ఆర్....లక్కీ!....నిజంగా  ఆ దేముడే మిమ్మల్ని కాపాడాడు" అన్నాడు.
    పక్కసీట్లో  కూర్చున్న  తను కావ్యనే   గమనిస్తూండడం, కావ్య  చూసింది.
    "కారు ఇక్కడాపండి  సార్! అదే మా ఇల్లు! అదుగో! ఆ మూడో గేటు" చూపించింది.
    కారాపాడు శ్రీనివాసరావుగారు.
    "మీ పేరేమిటో నాకు తెలీదు" అంది నమస్కరిస్తూ కావ్య!
    "నా పేరు శ్రీనివాసరావు కాంట్రాక్టర్ ని. అతను నా ఫ్రెండు  కాశీనాథ్" పరిచయం చేశాడు.
    కావ్య కాశీనాథ్ గారి కేసిచూసి "ఏమండీ! మీరిందాక  చెప్పిన ప్రతి అక్షరంతోనూ, నేను ఏకీభవిస్తాను. కానీ, ఒక్క  విషయంలో మాత్రం ఒప్పుకోను! వస్తువుల్లో కల్తీ జరుగుతోందని  చెప్పు వస్తువులు కొనడం మానేస్తున్నామా? ఏది అస్ లీయో, ఏది నకిలీయో....ఐ....మీన్....ఏది కల్తీ వస్తువో, ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం! కొంటాం! తెలుసుకునే శక్తీ, జ్ఞానం, మనలో వుండాలి  కాశీనాథ్ గారూ! మీమాట విని, వీరు నన్ను దింపడానికి ఒప్పుకోక పోయుంటే, ఈ రోజు నా జీవితం పతనమై పోయుండేది! శ్రీనివాసరావుగారూ! మీ మేలు   జన్మ జన్మలకీ మర్చిపోలేను!" అంది.
    తను ఎంత పొరపాటు  చేశాడో, ఆ అమ్మాయి మాటల్లో  ఎంత నిజం వుందో  తెలుసుకొని  సిగ్గు పడ్డారు కాశీనాథ్ గారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS