"వాడికి తగ్గట్టు చక్కటిదీ, ఉత్తమురాలూ. ఎక్కడో పుట్టే వుంటుంది వాడికి పెళ్ళాంగా."
"అంటే నీ ఉద్దేశం? నాకు తగ్గవాడూ ఉత్తముడూ యెక్కడా ఇంకా పుట్టలేదనా?" గొణుక్కుంటూ కోపంగా అడిగేది కావ్య.
"అది కాదే అల్లరిపిల్లా! ఈ చిలిపిపిల్ల తలొంచుకుని పీటల మీద నిశ్శబ్దంగా, ఎలా కూర్చుంటుందా?" అని.
నీ మెడలు వంచి, అతను మూడుముళ్ళూ వేస్తూంటే, ఈ అల్లరి పిడుగు ఎలా నోరుమూసుకుని వుంటుందో, చూడాలనుంది" అనేది ఆవిడ ముచ్చట పడిపోతూ మనవరాలి పెళ్ళిని ఊహించుకుంటూ.
"ఏయ్! అమ్మమ్మా! ఇప్పుడే చెప్తున్నాను. నేనేమీ అలా తలొంచుకుని కూర్చోను. అసలు పెళ్ళంటే, పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఇద్దరూ వుంటారు కదా? మరి పెళ్ళికూతురే ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు తలొంచుకుని కూర్చోవాలి? ఏదో తప్పు చేసిన దానిలాగా ఎందుకా శిక్ష ఆమెకి! ఒక పక్క పట్టుచీరా ,పూలజెడా ,వగయిరా బరువులతో అసలే, వంగిపోయుంటే ఇంకా సిగ్గు పడుతూన్నట్టు అభినయిస్తూ మరీ వొంగిపొమ్మంటారు. అమ్మమ్మా! పెళ్ళికూతురు కూడా హాయిగా, నిక్షేపంగా తలెత్తుకుని కూర్చోవొచ్చు. తన స్నేహితులతో తనూ హాయిగా మాట్లాడొచ్చు. అంతేకానీ, ఊరందరినీ పిలిచి, ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా, తలొంచుకొని ముంగిలా మూతిబిగుంచుకుని కూర్చోవలసిన అవసరం ఆమెకిలేదు" అనేది.
ఆ మాటకి తల్లి ఎంతగా మురిసిపోయేదో తలుచుకుంటే సీతాదేవి కళ్ళలో నీళ్ళొచ్చాయి.
"కావ్య అలా మాట్లాడితే తను కోప్పడేది, మందలించేది, ఏమిటా మాటలు? ఎవరయినా వింటే యేమనుకుంటారు?" అని.
"ఎవరున్నారిక్కడ వినడానికి? అయినా, అమ్మమ్మా నా మాటల్లో యేదయినా తప్పుందా చెప్పు?" అనేది కావ్య అమ్మమ్మకి మరింత దగ్గరగా జరిగి కూర్చొని.
"నా బంగారు తల్లే! నీ మాటలు వరహాల మూటలు, ఎవరికయినా నచ్చుతాయి" అనేది, బుగ్గలు ముద్దెట్టుకుంటూ.
"చూడు మమ్మీ కోప్పడుతోంది!" అనేది కావ్య అమ్మమ్మ ఒళ్లో కూర్చుంటూ.
"ఎందుకోప్పడుతుందే? నీ మాటలు హైకోర్టుకి వెళ్ళినా అప్పీలు లేని మాటలు. నా చిట్టి తల్లి వకీలయిపోయి, కోర్టులో వాదిస్తూ వుంటే, కోర్టంతా వొణికిపోతుంది" అనేది కావ్య తలని ఆప్యాయంగా నిమురుతూ ఆవిడ.
ఇదంతా జ్ఞాపక మొచ్చి, ఆమె కళ్ళల్లోంచి కన్నీరు జలజలారాలాయి. చెంపలమీదుగా.
అది చూసిన క్రాంతి "అమ్మా! ఏడుస్తున్నావా? ఎందుకమ్మా?" అడిగాడు.
కావ్య పరుగెత్తుకొచ్చింది.
"మమ్మీ! ఇంకెప్పుడూ నేనలా ప్రవర్తించను. నువ్వు భయపడకు. బెంగపెట్టుకుని ఏడవకు" అంది తల్లి కన్నీళ్ళు తుడుస్తూ _ సీతాదేవి కావ్యని గుండెలకి హత్తుకుంది.
"అమ్మమ్మ జ్ఞాపకం వొచ్చిందమ్మా! నీ పెళ్ళి చూడాలని ఎంతో కలవరించింది" అంది దుఃఖాన్నాపుకోవడానికి ప్రయత్నిస్తూ.
అమ్మమ్మ పేరు చెప్పేసరికీ కావ్యకీ, క్రాంతికీ కూడా, కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
"ఆమెది వెన్నలాంటి మనసు! ఎవ్వరినీ నొప్పించేదికాదు. ఎనలేని తెలివితేటలు, చదువుకోలేదు గానీ లేకపోతే రాజ్యాలేలేది మీ అమ్మ" అనేవారుట నాన్నగారు, అమ్మ చెప్పేది!
తనూ ,అన్నయ్యా దెబ్బలాడుకుని తగువు తీర్చమని వెళితే, ఏదో కిటుకులేసి ఇద్దర్నీ రాజీ చేసేది. ఓరోజున ,క్రాంతీ, తనూ పోట్లాడుకున్నారు. అమ్మమ్మ ఏదో సర్ది చెప్పబోతే.
"నీకు కావ్యంటేనే యిష్టం. నాకు తెలుసులే" అన్నాడు బుంగమూతి పెట్టి. కావ్య సంతోషంగా కూచుంది.
"క్రాంతీ! నువ్వు నాకన్న తండ్రివిరా! బంగారు కొండవి. శ్రీరామచంద్రుడిలా శాంతమూర్తివి. నీ తరువాతేరా అది. ఎంతైనా అది గడుగ్గాయి!" అంది. ఆ చివరి మాటలు మెల్లగా చెవి దగ్గర రహస్యం చెబుతూన్నట్టుగా అంది.
"మమ్మీ చూశావా అమ్మమ్మ! నా దగ్గర నా మాటా! అన్నయ్య దగ్గర అన్నయ్య మాటా!" అంది తను కోపంగా.
"నాకు తెలుసులేవే అమ్మమ్మ డిప్లొమసీ! అమ్మమ్మ రాజకీయాల్లో చేరితే, రాజ్యాలు వేలేసేది!" అన్నాడు క్రాంతి.
అమ్మమ్మ గర్వంగా, తల్లికేసి చూడ్డం, తనని ముద్దు పెట్టుకోవడం, ఇంకా జ్ఞాపకం వున్న కావ్యకి కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అది చూసి సీతాదేవి కావ్య కళ్ళు తుడుస్తూ "రండి! భోంచేద్దాం!" అంటూ వడ్డన మొదలెట్టింది.
"మమ్మీ నువ్వు కలిపిపెట్టు" అంది కావ్య.
"అవును! నువ్వే కలపాలి! నువ్వు కలిపితే చాలా రుచిగా వుంటుంది. చాలా బాగా కలుపుతావమ్మా! మాకు రాదలా" అన్నాడు క్రాంతి.
సీతాదేవి మనసునిండా తృప్తి!
కళ్ళనిండా సంతోషం.
వెంటనే ఇద్దరికీ ఒకే కంచంలో కలిపి ముద్దలు తినిపించింది.
పసిపిల్లలా తల్లిచేతి ముద్దల్ని అమృత గుళికల్లా అందుకుని ఆనందంగా భోంచేశారు కావ్య, క్రాంతీ !
5
ఆ రోజు ఆఖరు పరీక్ష. మధ్యాహ్నం పరీక్షయిపోగానే, ఫ్రెండ్సందరూ కలిసి హోటలుకెళ్ళి భోంచెయ్యాలనుకున్నారు. ఆ తరవాత సినిమా కెళదామనుకున్నారు.
కాలేజీకి దగ్గర్లో వున్న చైనీస్ రెస్టారెంట్ కెళ్ళి భోంచేశారు. నటరాజ్ థియేటర్ ఏదో హిందీ పిక్చర్ చూశారు. పరీక్ష ఫలితాలెలా వుంటాయోగానీ, పరీక్షలయిపోయాయన్న సంబరం మాత్రం వాళ్ళని సంతోషంలో ముంచేసింది.
"అన్ని పరీక్షలూ ఒకెత్తూ, ఈ పరీక్ష ఇంకో ఎత్తు! డిగ్రీ తరవాత, ఎవరేంచేస్తారో, ఎవరెక్కడుంటారో! అందరికీ తలోదారి అవుతుంది!" విచారంగా అంది నిర్మల.
"మనలో సగం మందికి పెళ్ళయి పోతుంది. ముఖ్యంగా నిర్మలకీ, గంగకీ!...." అంది కళ్యాణి.
"ఏమో నీకూ అవొచ్చు!" అంది కావ్య కళ్యాణిని.
"నాకేంకాదు."
"ఏమిటో ఆ ధీమా?"
"మా అక్కయ్యుందిగా రత్న! దానిక్కాకుండా నాకెలా అవుతుంది?" నవ్వింది కళ్యాణి.
"అలా అని రూల్ ఏమీలేదు. ఈ రోజుల్లో ఎవరికి ముందు కుదిరితే, వాళ్ళకి చేసేస్తున్నారు. పెళ్ళి చూపులకొచ్చినవాళ్ళు, నిన్ను చూసి వరించారనుకో, లేదా నువ్వే ఎవరినైనా ప్రేమించేశావనుకో...." అంది గంగ.......
"ఛీ....డోంట్ బి స్టుప్పిడ్!....అలా ఎప్పటికీ జరగదు. నేను ఎమ్.ఏ. చెయ్యనిదీ పెళ్ళి చేసుకోను." అంది ఖచ్చితంగా.
"నాకు మాత్రం చాలు బాబూ ఈ చదువులు. ఇంక నా వల్ల కాదు. నేను మాత్రం మా అమ్మకి చెప్పి పెళ్ళి చేసెయ్యమంటాను" అంది కావ్య! అందరూ పగలబడి నవ్వారు.
పెళ్ళి పేరు చెబితేనే వాళ్ళల్లో ఏదో గిలిగింత! ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ, ఆ స్నేహ బృందం ఒదలలేక ఒదల్లేక, ఒకొర్నొకరూ, ఒకరి ఎడ్రసులు మరొకరు రాసుకుంటూ, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ, అందరూ కలుసుకోవాలో చర్చించుకుని విడిపోయారు, ఒకొక్కరూ ఒక్కొక్క వైపుకి.
ఒచ్చేవారం అందరూ ముందు కావ్యా వాళ్ళింట్లో కలుసుకోవడానికే నిశ్చయమైంది, ఆ తరవాత కళ్యాణి, తరవాత గంగా....ఇలా అప్పుడే నిర్ణయాలు తీసేసుకుని, విడిపోతున్నామన్న బెంగతో, "గుడ్ బై" చెప్పి బయల్దేరారు.
అప్పటికే ఆకాశం చీకట్లు కమ్మింది. ఉన్నట్టుండి మబ్బేసి, సన్నగా జల్లుకొట్టడం మొదలెట్టింది. జల్లుకొడుతూండడం వల్ల, పిల్లలెవ్వరూ బయట ఆడుకోవడం లేదు. టి.వీ.లో చిత్రలహరి ఒచ్చేటైమేమో ఆడవాళ్ళెవ్వరూ కూడా, బయట కనిపించలేదు.
"చాలా చీకటి పడిపోయింది! అమ్మ ఎదురు చూస్తోందేమో!" అనుకుంటూ గబగబా నడవడం మొదలెట్టింది కావ్య!
"అంత స్పీడెందుకే బుల్ బుల్" చెయ్యి పట్టుకున్నాడతడు. ఆ నిశ్శబ్దంలో, ఆ వాతావరణంలో, ఈ హఠాత్ సంఘటనకి, గుండె కొట్టుకుంది కావ్యకి. అతని మొహం చూడ్డానికి భయం వేస్తోంది. చెయ్యి విదిలించుకుంటూ "ఎవరు నువ్వు" అంది మెల్లగా భయంగా! అరవడానికి గొంతు రావడంలేదు! మాట కూడా సరిగ్గా రావటంలేదు. వెన్నులోంచి ఏదో వొణుకు పుట్టుకొచ్చినట్టయింది.
"నేనేనే బుల్ బుల్! నీ పాలిట మొగుణ్ణి! నీతో కాపరం చెయ్యడానికొచ్చాను రావే....దొంగ ముం"
"నోర్ముయ్! హెల్ప్....హెల్ప్....హె....ల్ ల్ ల్" అరవకుండా అతని బలమైన చెయ్యి ఆమె నోటిని మూసేసింది. మరో చెయ్యి పక్కనున్న సందువైపు తోసేసింది. బలాన్నంతా కూడగట్టుకుని, అడుగు ముందుకు పడకుండా పెనుగులాడింది కావ్య!
మోకాలితో వీపుకింద ఒక్కతోపుతోసేడు. "అబ్బా...." అంటూ మూలుగుతూ అతనికేసి చూసింది. నల్లని మొహం, తెల్లటి పళ్ళు! కావ్య జడని పట్టి గట్టిగా లాగుతూ" దాని జెడ లాగితే నీకు పౌరుషం వొచ్చి పదిమందిలోనూ నన్నుకొట్టి అవమాన పరుస్తావా? ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో వుందేలం...." గబుక్కున వంగి అతని చెయ్యి కొరికేసింది కసిగా కావ్య.
"బాబోయ్!" అంటూ వాడుచెయ్యి వెనక్కిలాక్కుని నొప్పిని చేత్తో అణిచి పెట్టుకున్నాడు. కావ్య పరుగెత్తబోయింది. దెబ్బతిన్న పులిలా వెంటపడి, మెడపట్టుకున్నాడు. అరవ బోయింది! అంత జరుగుతూన్నా ఆ రోడ్డు మీద ఎవ్వరూ జనం కనిపించలేదు, ఆ సమయంలో.
