Previous Page Next Page 
నా కథవింటావా పేజి 9

  "నన్ను  క్షమించమ్మా! యూ....ఆర్....రైట్" అన్నాడు పశ్చాత్తాపపడుతూ.
    "దిగండి సార్. మా అమ్మనీ, అన్నయ్యనీ  పరిచయం  చేస్తాను" అంది కావ్య.
    "ఇప్పుడొద్దు లేండి. మరోసారొస్తాం" అంటూనే, కావ్య కారుడోర్ తెరిచి నుంచోనుండడం  వల్ల  దిగారు.
    కారు చప్పుడు విని పరుగెత్తుకొచ్చింది  సీతాదేవీ, పక్కింటి సుందరమ్మ పిన్నిగారూ!
    కూతురి వాలకం చూసి "ఏం జరిగిందమ్మా! ఏమిటిలా వున్నావ్? ఇలా తడిసి ముద్దయ్యావేమిటి?
వీళ్ళెవరూ?" అని ప్రశ్నల వర్షం  కురిపిస్తూ, చెయ్యి పట్టుకుని  లోపలికి తీసికెళ్ళబోయింది  సీతమ్మ, కళ్ళు తుడుచుకుంటూ.
    "అమ్మా వీరు  శ్రీనివాసరావుగారు, వారు కాశీనాథ్ గారు." అని పరిచయం చేసింది కావ్య.
    "లోపలికి రండి" ఆహ్వానించింది  సీతాదేవి, కూతురికేసి  అదోలా చూసి కళ్ళు తుడుచుకుంటూ.
    "అన్నయ్య ఇంట్లో  లేడామ్మా?" అడిగింది.
    "నువ్వింకా  రాలేదని  నేను భయపడుతూ వుంటే, వర్షం వల్ల రాలేక ఏ ఫ్రెండింట్లోనయినా  వుండి  పోయావేమోనని  గంగా  వాళ్ళింటికెళ్ళాడమ్మా" అంది. 
    "అమ్మా! ఈ రోజు...." ఏదో చెప్పబోయిన కావ్య మాటకి అడ్డుపడి "ఏమ్మా! ఇంతసేపు ఇంటికి రాకుండా  వుంటే  మీ అమ్మ ఎంత గాభరా పడిపోతోందో తెలుసా? ఆమె బాధ  చూడలేక, పలకరించి  పోదామని ఒచ్చిన నేను అలాగే కూర్చుండి పోయాను. ఇందాకటిదాకా, మీ అన్నయ్య బాగానే ధైర్యం చెబుతూ  ఒచ్చాడు  మీ అమ్మకి! కానీ వాన మరీ  ఎక్కువై చీకటి పడడంతో, తనూ కొంచెం  కంగారుపడి! అమ్మ వెళ్ళమనగానే బయల్దేరాడు. ఆడపిల్ల, ఇంటికి రావడం ఆలస్యమైతే  ఎంత కంగారుగా వుంటుందో తెలుసా? నువ్వు ధైర్యవంతురాలివే అనుకో! అయినా ఆడపిల్ల ఆడపిల్లే" అంది సుందరమ్మగారు.
    మరొకప్పుడైతే  ఎవరైనా  ఈ మాటంటే పెద్ద ఉపన్యాసం ఇచ్చేది కావ్య!కానీ అప్పుడు మాట్లాడలేదు. తలవంచుకుని  నుంచుంది. ఎవరైనా అలా అన్న తక్షణం యుద్ధానికి దిగే కావ్య, అలా మౌనంగా ఎందుకుందో  అర్ధంకాక, ఆశ్చర్యంగా చూసింది సీతాదేవి. చెరిగిపోయిన బొట్టు, చెదిరిపోయిన జుట్టు, ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కళ్ళూ, పాలిపోయిన మొహం, ఆమెకేదో  అనుమానం వొచ్చింది. "ఏం జరిగిందమ్మా? ఏమండీ? ఏం జరిగిందీ? మా అమ్మాయి ఎందుకిలా  వుంది?" అడిగింది  శ్రీనివాసరావుగారిని  ఆదూర్ధాగా.
    తాను చూసినదంతా  వివరంగా చెప్పారు  శ్రీనివాసరావుగారు. కావ్య  వెక్కి వెక్కి ఏడ్చింది!
    సీతాదేవి  గుండె  తరుక్కు పోయినట్టు, కావ్యని  పట్టుకుని రోదించింది.
    ఆ దృశ్యానికి  శ్రీనివాసరావుగారికి కూడా  కళ్ళనీళ్ళొచ్చాయి. ఇంట్లో తన బిడ్డ రూప గుర్తుకొచ్చింది.
    "అమ్మా! దేముడు మిమ్మల్ని  కనిపెట్టుకున్నాడమ్మా. ఏ ప్రమాదమూ జరగలేదు. సమయానికి మేము వెళ్ళడంతో, కారు చూసి పారిపోయాడు స్కౌండ్రల్ ! మీరెంతో అదృష్టవంతులు! ఊరుకోండి! అమ్మాయిని ఓదార్చండి" అన్నారు. సీతాదేవి అతనికి నమస్కరించింది. "మీరు దేముళ్ళు! మీరే లేకపోతే, ఈ రోజు నా బిడ్డ....నా చిన్న తల్లి....వాడి చేతుల్లోపడి...." పెద్దగా  గుక్కపట్టి  ఏడుస్తూన్న  ఆమెని అతి కష్టంమీద, ఓదార్చారు.
    "వెళ్ళొస్తామమ్మా! జాగ్రత్తగా వుండండి. అమ్మాయిని ఒంటరిగా ఎక్కడికీ  పంపకండి" అంటూ బయలుదేరారు శ్రీనివాసరావుగారు.
    "టీ తాగి వెళ్ళండి" అడిగింది సీతాదేవి.
    "ఒద్దమ్మా....వెళ్ళిపోవాలి" అంటూ బయల్దేరారు వాళ్ళు. సినిమాకి వెళ్ళింది మొదలు, ఇల్లు చేరుకునేదాకా, ఆ రోజు జరిగిన విషయాలన్నీ  పూసగుచ్చి చెప్పింది కావ్య. కావ్యాని  గుండెలకి  హత్తుకుని  వింటోంది  సీతాదేవి! సుందరమ్మ  చోద్యంగా  ఆశ్చర్యంగా వింటోంది, కావ్య మాటల్ని!
                                         6
    ఇరుగూ, పొరుగూ అంతా ఒకటే గోల! ఆ వీధి వీధంతా, అట్టుడికినట్టు  ఉడికిపోతోంది. 'కావ్యని ఎవరో  రేప్ చేశారట!' ఆఁ....ఆ  పిల్ల  చెడిపోయిందిలే! అంత చీకట్లో, ఆ వానలో ఒంటరిగావున్న  ఆడపిల్లని పాడు చెయ్యడం, ఎంతసేపమ్మా?' నన్నేమీ  చెయ్యలేదు, నాకేమీ కాలేదు' అని కబుర్లు చెప్పగానే  సరా' ఇరుగమ్మ సుందరమ్మ పిన్నిగారి మాటలు. 'నాకేమీ జరగలేదూ' అని చెప్పకపోతే, నేను చెడిపోయానని  ఏ ఆడపిల్ల చెపుతుందమ్మా నీ పిచ్చిగానీ!' పొరుగమ్మ  శేషమ్మగారి గొంతు.
    "అయినా  ఎంత తండ్రిలేని పిల్లయినా  అంత గారాబమేమిటమ్మా ఆ తల్లి! ఆ పిల్ల ఆడింది ఆటా, పాడింది పాటా. తగుదునమ్మా  అంటూ  మగరాయుడిలాగా, ఆ మధ్యన ఎవడినో  బస్సుస్టాండు దగ్గర చెళ్ళున కొట్టిందిటమ్మా! అలా కొడితే ఏ మగాడన్నా  ఊరుకుంటాడా?" మరొక అమ్మ.
    "అయినా సుందరం పిన్నీ! నాకు  తెలీకడుగుతాను. రోడ్డు మీద పోతూ వుంటే. లక్షమంది లక్షంటారు. అలా అందరినీ కొడుతూ వాళ్ళతో పోట్లాట  పెట్టుకుంటే  కురుక్షేత్రం వేరే అఖ్కర్లేదు. మొన్నేమయిందను కున్నారు పిన్నిగారూ, మా కుర్రముండ  మనమరాలు  లేదూ, దానికిపట్టుమని పదేళ్ళుకూడా లేవా, నేనూ అదీ కలిసి  మార్కెట్టు కెళ్ళాం కూరలు కొనడానికి. అసలే ఆ మూండా  మార్కెట్టు  మనుష్యులతోటే కాకుండా, ఆవులూ, ఎద్దులూ, కుక్కలూ, జంతువులతోటి కూడా నిండి వుంటుందేమో జనం  క్రిక్కిరిసి  వున్నారు. ఎవడో ఓ పాతికేళ్ళ వెధవ! వెనక నుంచి 'నిలువవే వాలుకనుల దానా, వయ్యారీ హంసనడక దానా' అని పాడుతూ  మా దగ్గరగా వొచ్చి మరీ పాడ్డం మొదలెట్టాడు. పదేళ్ళు కూడా నిండని కుర్రది సుమ గురించా అనుకున్నాను. కాదు! వాడు ఇంచుమించు  నన్ను రాసుకుంటూ, తోసుకుంటూ వెళ్ళి మరీ పాడుతున్నాడు. సిగ్గుతో చచ్చిపోయానంటే నమ్మండీ" అంది సుందరమ్మ పిన్ని.
    "అలా అన్నాడని తిరగబడి  నువ్వు నాలుగు తంతే? నీ పరువేమైనా  మిగిలేదా? వాడింకేదో అనేవాడు" అంది ఇంకొకావిడ.
    "అసలు ఆ పిల్లకి పొగరులెద్దూ! మగరాయుడి వేషాలూ తనూనూ"
    "ఆ పిల్లననేం లాభం, తల్లి ననాలి, ఆ పెంపకానికి!"
    "ఇలా అయితే ఆ పిల్లకి పెళ్ళయినట్టే  ఇంక."
    "నీ పిచ్చి కాకపోతే  ఇప్పుడవుతుందనా? ఏ తలమాసినవాడూ ఒచ్చి చేసుకోడు."
    అలా పెద్దగా మాట్లాడుకుంటూన్న వాళ్ళల్లా కావ్యని చూసి మాటలు మానేశారు.
    "ఆపేశారేం  పిన్నీ? మాట్లాడుకోండి! తనివితీరా  మాట్లాడుకోండి. కానీ ఒక్కటి జ్ఞాపకం వుంచుకోండి. మీ ఇంట్లోనూ నాలాంటి పిల్లలున్నారు  వాళ్ళకి ఇటువంటి దుర్ఘటన జరిగితే? వాళ్ళమీద  ఇటువంటి నిందలు మోపితే మీకెలా వుంటుంది? తోటి ఆడపిల్లని  ఎవడో నడిరోడ్డు మీద ఏడిపిస్తూ వుంటేనే వెళ్ళి ఆదికోవడం 'మగరాయుడి తనమా?' వాడు నా మీద దౌర్జన్యానికి తలపడితే అది నా పొగరు మోతుతనమా? ఇదే మీ పిల్లలకి జరిగుంటే? పైగా చెడిపోయానని పుకార్లు పుట్టిస్తారా? ఏ పాపమూ ఎరుగని మా అమ్మని, తన పెంపకం బాగులేదని నిందిస్తారా? మీరు ఆడవాళ్ళేనా? అసలు మనుషులేనా?" కోపంతో  వొణికిపోతూ  అడిగింది కావ్య!
    ఒక్క నిమిషం  అందరూ అవాక్కయినా, వెంటనే  సుందరమ్మ తేరుకుని "పెద్దా చిన్నా లేకుండా ఏమిటా మాటలు మిమ్మల్ని పట్టుకుని చెడిపోయినదాన్ని చెడిపోయినదీ అనకపోతే  ఇంకేమంటారు?" అందొకావిడ.
    "చెడిపోవడం  మీరు చూశారా? లేదూ అని చెప్పినా నమ్మే సంస్కారము మీలో లేదూ? ఛీ.... ఛీ...."               
    "భార్యాభర్తలు కాపరం  చెయ్యడం కూడా ఎవరూ చూడరు. వాలకాన్ని బట్టి తెలుసుకుంటారంతే" అంది ఇంకొకావిడ.
    "ఓహో! అయితే మీరంతా మీ భర్తలతోటే కాపరం చేస్తున్నారనడానికి గ్యారంటీ ఏమిటీ?"
    "ఏమిటా పాడు మాటలు? మర్యాదస్తులు మాట్లాడే మాటలేనా ఇవి?" అంది సుందరమ్మ పిన్ని.
    "మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి పిన్నీ!"
    "పిన్నీ లేదు గిన్నీ లేదు. నీ చేత అలా పిలిపించుకోవడమే  నాకు కళంకం."
    "పాపం! నా మాటలకి మీ మంగళసూత్రాలు మైలపడిపోయాయేమో? పాతికేళ్ళ కుర్రాడు మిమ్మల్ని చూసి కన్నుకొట్టి, ప్రేమగీతం పాడితే, మీరు ముసిముసిగా నవ్వుకుని  బయటపడినప్పుడు  మీ మంగళసూత్రాలకి ఏ మైలా తాకలేదు పాపం!"
    "ఏయ్! జాగ్రత్తగా మాట్లాడు  పళ్ళు  రాలగొడతాను  ఏమనుకున్నావో?" అంది సుందరమ్మ.
    ఈ గొడవంతా విని కంగారుగా  పరుగెత్తుకొచ్చింది  సీతాదేవి. ఈ రెండిళ్ళకీ మధ్య ఒక గోడే అడ్డం. అలాగే ఇటు పక్కింటికీ, అటు పక్కింటికీ కూడా ఒక గోడే అడ్డం! అందరూ వాళ్ళ పెరటివైపు  గోడ దగ్గర నుంచుంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. అక్కడ ఒక చిన్న మహిళా మండలిలాంటి  సమావేశం తరచు జరుగుతూ వుంటుంది. వాళ్ళ చర్చల్లో పాల్గొననిదల్లా  ఒక్క సీతాదేవి మాత్రమే. తన పనేదో  తను చేసుకుంటూ, కుట్టుకుంటూ  కూర్చునేది.
    "మీకు మహా టెక్కు, మాట్లాడనే మాట్లాడరూ" అనేవారు సీతాదేవిని  చూసి.
    "మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? బట్టలిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అర్జంటుగా కావాలి అంటూ ఒస్తారు" నవ్వుతూ చెప్పేది సీతాదేవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS