Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 7

    "నవ్వుతారు నాయనా... మనకి కావాల్సిందే అది నాయానా...  నువ్వలాంటి డ్రెస్ వేస్కోడం చూసి వాళ్లు బాగా నవ్వుకుంటారు. మర్నాడు గేటు దగ్గర నీ కోసం వెతుకుతారు. అప్పుడు కూడా నువ్వు అదే డ్రెస్సులో ఉంటావ్!!.... ఇంకా బాగా నవ్వుకుంటారు. ఆ విధంగా అందరికీ నువ్వు గుర్తుండిపోతావ్.... మళ్ళీ మూడోరోజు నీకోసం అమ్మాయిలు చూస్తారు. కాని మూడోరోజు నువ్వు మామూలు డ్రెస్ లో కనిపిస్తావ్, నీట్ గా తయారై. రెండు రోజులు నిన్ను అలా పిచ్చి డ్రెస్సులో చూసిన వాళ్ళకి మూడోరోజు నిన్నలా చూసేసరికి అందంగా కనిపిస్తావ్... అలా రోజూ వచ్చి కాపుకాస్తావ్... వాళ్లు కూడా నువ్వు వచ్చావో లేదోనని చూస్తుంటారు.... చూశావా నాయనా... అలాంటి డ్రెస్ వేస్కోవడం వల్ల వాళ్ళ దృష్టిలో పడడమే కాకుండా చిరస్థాయిగా వాళ్ళకి గుర్తుండిపోతావ్... ముందీపని చెయ్యి నాయనా... తరువాత ఆ అమ్మాయిల్లో ఒకర్ని ఎలా సెటప్ చేయాలో నేను చెప్తాను..."

    చిట్టబ్బాయి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

    "చాలా బాగుంది గురూజీ... కానీ నాకు అఫీసుంది కదా.... నేను ఆఫీసయ్యాక ఈవెనింగ్ కాలేజీ దగ్గర కాపేస్తాను గురూజీ."

    "ఎలాగో అలా ఏడువ్ నాయనా. నా కన్సల్టేషన్ ఫీజు యాభై రూపాయలు ఇవ్వు నాయనా."

    చిట్టబ్బాయి జేబులోంచి యాభై తీసి ప్రేమానందంకి ఇచ్చాడు.

    "గురూజీ చిన్న సందేహం!... మీరు కూడా ప్రేమించే పెళ్ళి చేస్కున్నారా?" కన్నారావు ప్రేమానందంని అడిగాడు.

    "అవును నాయనా..." గిరిజాల జుట్టుని సవరిచుకుంటూ చిరునవ్వుతో అన్నాడు ప్రేమానందం.

    అప్పుడే లోపల్నుండి కరుకుగా ఓ కంఠస్వరం వినిపించింది.

    "కంచంలో పిండాకూడు తగలెయ్యమంటారా ఇంకాస్సేపు ఆగుతారా?"

    ప్రేమానందం ఓసారి వెర్రిమొహం వేస్కుని ఇద్దరి వంకా చూసి, ఆ తరువాత వెనక్కి తిరిగి "పెట్టేసెయ్... నేను వచ్చేస్తున్నా.." అన్నాడు.

    కన్నారావు, చిట్టబ్బాయిలు గుడ్లప్పజెప్పి ప్రేమానందం వంక చూశారు.

    ప్రేమానందం భళ్లున నవ్వేశాడు.

    "ప్రేమించి పెళ్ళి చేస్కున్న పెళ్ళాలెప్పుడూ పవర్ పుల్ గానే ఉంటారు.... ఇది ఈవేళ నేను చెప్తున్న మరో సత్యం నాయనా..."

    "వడ్డించేశా... తగలడ్తున్నారా లేదా?..." లోపల్నుండి మళ్ళీ గట్టిగా అరుపు వినిపించింది.
    "ఆ... ఆ.... వస్తున్నా... మీరిక వెళ్ళండి నాయనా..... నేను పిండాకూడు మింగాలి" అని నాలుక కొరుక్కుని "భోజనం చేయాలి..... హిహి" అన్నాడు ప్రేమానందం.

    నాలుగు రోజుల తరువాత తన ముందు ప్రత్యక్షమైన చిట్టబ్బాయి, కన్నారావ్ ల వంక ఆశ్చర్యంగా చూశాడు ప్రేమానందం.
    ప్రేమానందం అలా ఆశ్చర్యపోవడానికి చిట్టబ్బాయి ఆయన సలహాలని అనుసరించి ఎవరో అమ్మాయిని ప్రేమలోపడేసి, పొర్లించేసి తనకూడా తీసుకురాలేదు. ఇదివరకులా కన్నారావుని వెంట బెట్టుకునే వచ్చాడు. మరి ఎందుకలా ఆశ్చర్యంగా చూశాడు.... ఇందుకే,

    ప్రేమానందం కళ్ళు ఇంతింతగా తెరుచుకున్నాయి. వాటితోబాటు అతని నోరు కూడా తెరుచుకుంది. కొన్ని క్షణాల తరువాత గొంతు పెగల్చుకున్నాడు.

    "ఏంటి నాయనా కుక్కలు చింపిన విస్తరిలా ఇలా ఉన్నావ్..." అన్నాడు చిట్టబ్బాయి వంక విస్మయంగా చూస్తూ.

    ఆయనలా అనగానే చిట్టబ్బాయికి దుఃఖం పొంగొచ్చింది. కన్నారావు భుజం మీద తలవాల్చి బోరుమంటూ ఏడ్చాడు.

    ప్రేమానందం జాలిగా చిట్టబ్బాయి వంక చూశాడు. అతను ప్రేమానందం సూచించిన బట్టల్నే వేస్కుని ఉన్నాడు... ఎర్ర పంట్లాం మీద చిలకాకు పచ్చరంగు షర్టు, నెత్తిన నీలిరంగు టోపీ... కాళ్ళకి తెల్లబూట్లు.

    అంతా బాగానే ఉందికానీ చిట్టబ్బాయి చొక్కా, పంట్లాంలు పీలికలు పీలికలుగా చీలిపోయి ఉన్నాయి.

    "నిజంగానే నా బతుకు కుక్కలు చింపిన విస్తరైంది గురూజీ...." చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చిట్టబ్బాయి.

    "కండలు తిరిగి వస్తాదుల్లా ఉండే అబ్బాయిలు అన్నయ్యలుగాకల అమ్మాయిల వెంట పడకూడదు నాయనా. ఇది జీవితం సత్యం! ముందు జాగ్రత్త కోసం నీకు చెప్దామనుకున్నా గానీ ఆ మాత్రం నీకు తెలీకుండా ఉంటుందా అని చెప్పలేదు నాయనా..." అన్నాడు ప్రేమానందం గొంతులో జాలి పలికిస్తూ.

    ఆయన మాటలకి చిట్టబ్బాయి ఆశ్చర్యంగా, కన్నారావు కోపంగా ప్రేమానందం వంక చూశారు.

    "అయితే మా వాడిని ఏ అమ్మాయి అన్నయ్యో తన్నాడని అనుకుంటున్నారా?" కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు కన్నారావు.

    "కాదా?... అమ్మాయిలు మరీ ఇంత దారుణంగా బట్టలు చీలికల్లా అయ్యేలా తంతారని నేనెప్పుడూ ఊహించలేదు నాయనా... అంత బలమైన అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్ నాయనా?" అడిగాడు ప్రేమానందం!

    "ప్రేమానందా బొందా?.... అసలు అమ్మాయిల దాకా వెళ్తే కదా గురూజీ..." నీర్సంగా అన్నాడు చిట్టబ్బాయి.
    "మరి నీవాలకం ఇలా వై=తయారు కావడానికి కారణం ఏమిటి నాయనా?"

    "ఇవిగో.. ఈ బట్టలే గురూజీ... మీరు చెప్పారు కదా అని ఆ మర్నాడే బజారెళ్ళి వీటిని కొని టైలరుచేత అర్జంటుగా కుట్టించి ఈ వేళే తీస్కున్నాను గురూజీ..."

    "ఆ తరువాత?" కుతూహలంగా అడిగాడు ప్రేమానందం.

    "ఆఫీసు నుండి ఇంటికి పరుగెత్తి నీటుగా తయరై ఈ డ్రెస్ వేస్కుని గరల్స్ ఈవెనింగ్ కాలీజీకి బయల్దేరాను గురూజీ... నేను ఒక్కడినే వెళ్ళాలంటే భయంగా అనిపించి కూడా వీడిని రమ్మన్నాను గురూజీ"....

    "ప్రేమ వ్యవహారాల్లో ఎవర్నీ తోడు తీస్కెళ్ళకూడదు నాయనా... ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన పాయింటు" అన్నాడు ప్రేమానందం గిరిజాల జుట్టుని సవరించుకుంటూ.

    "కానీ నేను వీడిని తోడు తీస్కెళ్ళబట్టే ఇలా బతికి బయటపడ్డాను. గురూజీ..." బిక్కమొహం వేస్కుని అన్నాడు చిట్టబ్బాయి.

    "అసలు విషయం చెప్పు నాయనా... సస్పెన్సుతో చస్తున్నాను నాయనా..." కొద్దిగా చికాకుపడ్తూ అన్నాడు ప్రేమానందం.

    "నాకు చెప్పడానికి చచ్చేంతసిగ్గేస్తుంది గానీ నువ్వు చెప్పరా కన్నీ..." అన్నాడు చిట్టబ్బాయి కన్నారావుతో.

    "చెప్పడానికి ఏముంది గురూజీ...వీడు ఈ డ్రస్సు వీస్కుని ఆడ పిల్లల కాలేజీకి బయలుదేరాడు కదా. దార్లో వీడి డ్రస్సు కలర్ కాంబినేషన్ ఆ టోపీ, ఆ వాలకం చూసి కుక్కలు వీడివెంట పడి పీకేశాయి గురూజీ... వీడేదో వింత మనిషో, జంతువో అనుకుని అవి మీదపడ్డాయి గురూజీ..." అన్నాడు కన్నారావు.

    "వీడు వాటిని రాళ్ళతో కొట్టికొట్టి తరిమేశాడు కాబట్టి బతికిపోయాను గానీ లేకపోతే బట్టల్తోపాటు ఒళ్ళు కూడా చీరేసి ఉండేవి గురూజీ...." ఏడుపు మొహం పెట్టి అన్నాడు చిట్టబ్బాయి.

    "అంతే... వెంటనే ఇటు మీ దగ్గరికి వచ్చాం... ఇప్పుడు వీడేం చెయ్యాలో చెప్పాండి" అన్నాడు కన్నారావు.

    "ఈ డ్రెస్సు వేస్కోడం అంత మంచిది కాదు నాయనా... ఇక ముందు వేస్కోవద్దు..." అని చెప్పాడు ప్రేమానందం.

    "మీరు వేస్కోమన్నా వేస్కోను గురూజీ.... వేరే మంచి సలహా ఏదైనా ఉంటే చెప్పండి..." ప్రాధేయపడ్తూ అన్నాడు చిట్టబ్బాయ్. ప్రేమానందం కాస్సేపు కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు.

    "పధ్ధతి పాతదేగానీ చాలా మంచి ఫలితాన్నిస్తుంది నాయనా..."

    "ఈసారి రిస్కు తీసుకోదలచుకోలేదు గురూజీ...." అన్నాడు చిట్టబ్బాయ్.

    "లేదు నాయనా...ఏ మాత్రం రిస్కులేని పద్ధతినే నీకు చెప్తాను... దీనికోసం ఇప్పుడు నువ్వు బట్టలకి ఖర్చు పెట్టినట్టుగా ఏమీ ఖర్చు పెట్టనవసరం లేదు.... రెండ్రూపాయలు పెట్టి ఒక ఆడాళ్ళ చేతి రుమాలు కొంటే చాలు...."

    "అంతేనా?... అంటే ఎవరైనా అమ్మాయికి రుమాలు కావల్సి వచ్చినప్పుడు అరువిచ్చి ఆనక స్నేహం పెంచుకోవాలి!... అంతేనా గురూజీ!?...." ఉత్సాహంగా అడిగాడు చిట్టబ్బాయి.

    అది వినగానే కన్నారావు, ప్రేమానందం ఘొల్లున నవ్వారు.

    చిట్టబ్బాయ్ మొహం చిన్న బుచ్చుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS