ఇది కలకాలముగా మగవాడు చేస్తున్న పనియే!
శుక్రునిది వట్టి పుత్రికా వాత్యల్యమేనా? అతనికి ఆ చిన్నారులలో చిగురించిన ప్రేమాంకురము తెలియదా? శుక్రునికి దివ్యదృష్టి ఉన్నది. కాబట్టి తెలిసియె ఉండవలెను. అయినను మిన్నకున్నాడు ఏల?
శుక్రుడు శాస్త్రజ్ఞుడు. శాస్త్రజ్ఞులు సర్వదా శాంతికాముకులు. కచ దేవయానుల బంధము ద్వారా ఉభయ పక్షములకు అనుబంధము ఏర్పరుపదలచినాడేమో? కావచ్చును. ఆలోచించుడు.
8. శుక్రుడు బాపలు కల్లు త్రాగరాదను నియమము ఏర్పరచినాడు . ఇది మానవుని ప్రగతిలో ఒక మైలురాయి. బాపలు ఒక కులము కాదు. బుద్దిజీవులందరు బ్రాహ్మణులు అనబడిన కాలమది మత్తు పదార్దముల వలన బుద్ది నశించునని గ్రహించిన మేధావి శుక్రుడు. ఈనాటి శాస్త్ర పరిశోధన వలన కూడ అది రుజువు అయినది. బుద్ది జీవులు తమ విధులు నిర్వర్తించవలెనన్నచో మత్తు మందులు సేవించరాదు.
యయాతి చరిత్ర
వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఆమెకు వేయి మంది సఖులు. ఒకనాడు శర్మిష్ఠ దేవాయానులు జల క్రీడలకు వెళ్ళినారు. వారు బట్టలు విడిచినారు. ఒడ్డున పెట్టినారు. సరస్సులోనికి దిగినారు. వారు జలక్రీడలు అడుచున్నారు. అప్పుడు పెనుగాలి వీచినది. ఆ గాలికి ఒడ్డున ఉన్న బట్టలు కలిసిపోయినవి.
దేవయానీ, శర్మీష్ట లు సరస్సు నుంచి బయటికి వచ్చినారు. బట్టలు కలిసిపోయినవి. శర్మిష్ఠ గుర్తించలేదు. దేవయాని బట్ట దీసుకున్నది. కట్టుకున్నది. దేవయాని కోపించినది. శర్మిష్ఠ బట్ట తాను కట్టుకొను అన్నది.
"నా తండ్రి సమస్త లోకపూజ్యుడు. నేను అతని కూతురును. నీకు పూజనీయను. నీబట్ట నేను కట్టను" అని దేవయాని అలిగినది.
"నీ తండ్రి నా తండ్రికి పనులు చేయుచూ జీవించుచున్నాడు. అట్టి దానికా ఇంత గర్వము. నా బట్ట కట్టవులే" అని దేవయానిని ఒక బావిలో తోసినది శర్మిష్ఠ. వేయిమంది సఖులతో వెళ్ళిపోయింది.
యయాతి అను రాజు అటు వచ్చినాడు. అతడు వేటకు వచ్చినాడు. అలసిపోయినాడు. దప్పి అయినది. దప్పి తీర్చుకొనుటకు బావికి వచ్చినాడు. లోనకు చూచినాడు. బావిలో మొలచిన చెట్టు కొమ్మ పట్టుకొని దేవయాని వ్రేలాడుచున్నది. యయాతి చేయి అందించినాడు. దేవయాని యయాతి చేతిని అందుకున్నది. బయటికి వచ్చినది. యయాతి వెళ్ళిపొయినాడు.
దేవయాని అలిగినది. నగరమున అడుగు పెట్టలేదు. దుఃఖించినది. నగరపు వెలుపల నిలిచినది. ఆ విషయము శుక్రునికి తెలిసినది. అతడు పరుగు పరుగున అచటికి వచ్చినాడు. జరిగిన సంగతి తెలుసుకున్నాడు. దేవయానితో అన్నాడు :-
"యజ్ఞములు చేయువారి కన్న కోపము లేని వారు మిన్న. ధర్మము తెలిసినవాడు పరుల అలుకకు కోపించరు. పరులు కీడు కల్పించినను వారి కీడు కోరరు. పరులు తిట్టినను తిరిగి తిట్టరు. విననట్లుందురు. అవమానములను సహింతురు. అవమానించరు. కాబట్టి శర్మిష్ఠ విషయమున విరోధ భావము విడువము. రమ్ము నగరమున ప్రవేశింతము."
తండ్రి మాటలు దేవయానికి నచ్చలేదు. ఆమె అన్నది :-
ఒకచోట ఉండుటకు ప్రియము, స్నేహభావము, భక్తీ, ఆసక్తి గల వారుండవలెను. ఆసక్తి లేక, నిందించు స్వభావము గల జ్ఞాన శూన్యుల వద్ద వసించుట వ్యర్ధము. అది ఆపదలు తెచ్చును. కావున నేను నగరమునకు రాను. వేరుచోటికి పోవుదము.
శుక్రునికి ఉన్నది ఒక్క కూతురు. ఆమెను విడిచి ఉండలేడు. తానూ కూడ దేవయానితో వత్తునన్నాడు.
శుక్రుడు వృషపర్వుని పురి వీడుచున్నాడు. ఈ విషయము వృషపర్వునకు తెలిసినది. అతడు పరుగు పరుగున శుక్రాచార్యుల వద్దకు వచ్చినాడు. "మీరు వెళ్ళిన మరునాడు దేవతలు ఈ నగరిని , రాక్షసులను నాశనము చేయుదురు. మన్నించుడు. మమ్ము రక్షించుడు." అని ప్రార్ధించినాడు.
అందుకు దేవయాని "వృషపర్వా! నీ కూతురు శర్మిష్ఠ తన వేయి మంది సఖులతో నాకు దాసీ కావలెను" అన్నది.
వృషపర్వుడు అందుకు అంగీకరించినాడు.
శర్మిష్ఠ దేవయానికి దాసీ అయినది.
ఒకనాడు దేవయాని వన విహారమునకు వెళ్ళినది. శర్మిష్ఠ దాసిగా ఆమెను అనుసరించినది. అడవి అందముల రాశివలె ఉన్నది. వారు పూలు తెంపుతూ విహారము జరుపుచున్నారు.
యయాతి వేట కొఱకు అటు వచ్చినాడు. వారిని చూచినాడు. దేవయానిని సమీపించినాడు. వారందరు ఎవరు అని అడిగినారు. దేవయాని చెప్పినది. అన్నది :-
"రాజా! ఒకనాడు నీవు నన్ను బావి నుండి ఉద్ధరించినావు. అప్పుడే పాణిగ్రహణము చేసినావు. అందుకు సూర్యకిరణములు సాక్షులు. నీవు నన్ను పెండ్లాడుము. శర్మిష్ఠ వేయి మంది కన్యలతో నీకు దాసీ అగును."
అందుకు యయాతి సమ్మతించలేదు. అనుమానము వ్యక్తపరిచినాడు. అన్నాడు:-
"దేవయానీ! బ్రాహ్మణులు రాచ కన్నియలను పెండ్లాడ వచ్చును. రాచవారు బ్రాహ్మణ కన్యను వివాహమాడుట ధర్మ విరుద్దము ఇది లోకాచారమునకు విరుద్దము."
అందుకు దేవయాని "నా తండ్రి సర్వలోక పూజ్యుడు. ధర్మా ధర్మములు తెలిసినవాడు. అతడు చెప్పిన సంమతింతువా?" అని అడిగినది.
యయాతి అంగీకరించినాడు.
దేవయాని తండ్రిని పిలిపించినది. "తండ్రీ! ఈతడు యయాతి. నన్ను బావి నుండి బయటికి తీసినాడు. అప్పుడు నా కుడి చేతిని పట్టుకున్నాడు. పాణి గ్రహణము వేసినాడు. నాకు ఇతడే భర్త కావలెను. ధర్మ హాని కలుగకుండ మా వివాహము జరిపించవలెను" అన్నది.
శుక్రునకు దేవయాని యనిన యెనలేని ప్రేమ . ఈ వివాహమునకు ధర్మ హాని లేకుండునట్లు వరమిచ్చినాడు. యయాతి దేవయానుల వివాహము జరిపించినాడు. కూతురును యయాతికి అప్పగించినాడు. అప్పుడు ఇట్లు అన్నాడు :-
"యయాతీ! ఈమె శర్మిష్ఠ. వృషపర్వుని కూతురు. ఈమెకు అన్న వస్త్రములు, మాల్యాలంకరణములు సమకూర్చుము, కాని ఎన్నడును ఈమెతో సంబోగించరాదు" అను నియమము విధించినాడు.
