"అదుగో అమ్మాయి వచ్చేసింది" సంతోషంతో అరచినంత పనిచేసింది నాగరత్నమ్మ. కూతురిని చూడగానే రామానాధం గారి ముఖం వికసించింది.
కారు దిగి వస్తున్న సాగర్ ను, మాధవిని చూసి "ఏమిటే , నీకేమయిన మతి పోయిందా? చెప్పా పెట్టకుండా ఇంత పొద్దు పోయిందాకా తిరిగొస్తావ్ . మీ నాన్నగారు ఎంత ఆదుర్దా పడిపోయారో తెలుసా?" నాగరత్నమ్మ కూతురి మీద విసుక్కుంది.
సాగర్ ఊపిరి బిగపట్టాడు. చాలా హడావుడి పడి వుంటారు. ఏం చెప్పాలా , ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు.
మాధవి చాలా తేలిగ్గా తీసుకొని అన్నది -----
"ఏమిటమ్మా నీ గొడవ! ఇప్పుడేమయిందని?"
"మిస్టర్ సాగర్! ఎక్కడికి వెళ్ళారు?" రామనాధం గారి ప్రశ్న ముక్తసరిగా సూటిగా ఉన్నది.
"మీరు వెళ్ళిన చోటుకే వచ్చాం సార్"
"శంకర్ మఠ్ కు వచ్చారా?"
"అవును సార్! ఈవినింగ్ మీ ఇంటి కొచ్చాను. మీరప్పుడే తన్మయానందస్వామి గారి వేదాంత గోష్టి కి వెళ్ళారని మాధవి చెప్పింది."
"తన్మయానంద స్వామి కాదు!"
` "మీ అమ్మాయి అలాగే చెప్పింది సార్! ఒంటరిగా ఏం కూర్చుంటావు , రమ్మని నేనే మీ అమ్మాయిని బలవంతం చేశాను. ఇద్దరం కలసి వచ్చాం."
'అలాగా నాయనా! అయితే అయన గారి ఉపన్యాసం అయిపోయి గంటయిపోయింది కదా! ఇప్పటి దాకా మీ రెక్కడున్నట్లు?" నాగరత్నమ్మ సాగదీసి అడిగింది.
"ఏమిటమ్మ నీ క్రాస్ ఎగ్జామినేషన్! త్రోవలో కారు చెడిపోయి ఇంతవరకూ మేం అవస్థ పడ్డాం. ఇక్కడేమో మీ గోల."
"దట్సాల్ రైట్! ముద్దాయిల సంజాయిషీ ని కోర్టు వారు అంగీకరించడమైనది. మీ ఇద్దర్ని నిర్దోషులుగా ఎంచి విడుదల చేయడమైంది."
'అంత ఆ తన్మయానందుల వారి దయ."
'అదుగో , మళ్ళీ తన్మయానందుల వారంటున్నావ్!"
"మీ అమ్మాయి అలానే చెప్పింది."
"ఓరి నీ ఇల్లు బంగారం గానూ! మీ అమ్మాయి చెప్పింది, మీ అమ్మాయి చెప్పింది అనకపోతే అసలు ఆ స్వామి పేరు తత్వానందుల వారని చెప్పలేవూ."
"తత్వానందుల వారెవరే?" రామనాధం గారు పెద్దగా నవ్వుతూ అన్నారు.
"ఏదో నందులవారు, పేరులో ఏముంది స్వాముల వారు చెప్పిన తత్వం ముఖ్యం గాని!" స్వాముల పేరు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, గుర్తు రాక నాగరత్నమ్మ అనేసింది.
"అదేనండీ! నేనూ అనేది!" సాగర్ తప్పుకోవడానికి అవకాశం దొరికినందుకు సంతోషించాడు.
"అయన పేరు- పేరూ - అబ్బ ! మీ గొడవతో నేను కూడా మర్చిపోయాను!" రామనాధం గారు బుర్ర గోక్కున్నాడు.
"పోనీలే డాడీ! స్వాముల వారు చెప్పిన వేదాంతం గుర్తుంటే చాల్లే!" మాధవి తండ్ర్తి చేయి పట్టుకుని లోపలికి వేళదామన్నట్లు అంది.
"పేరే గుర్తు లేదు ఆయనకు. ఇంకా ఆ వేదాంతం ఏమి గుర్తుంటుంది!" మూతి తిప్పింది నాగరత్నమ్మ."
"గుడ్ నైట్ సార్! మాధవీ చీర్ యూ! సాగర్ కార్లో కూర్చున్నాడు.
సాగర్ ఇంటికి రాగానే అర్దర్లీ విక్టర్ పరుగెత్తుకొచ్చి కారు డోర్ తెరిచాడు.
"సార్! అయ్యగారు ట్రంకాల్ చేశారు" అన్నాడు.
"ఏం చెప్పారు?"
"మీ రెక్కడికి వెళ్ళారని అడిగారు."
"ఏం చెప్పావ్?"
"జడ్జి గారమ్మయితో యింతకు ముందే బయటకు వెళ్ళారని చెప్పాను."
"ఇడియట్!"
"అమ్మగారితో చెప్పోద్దాన్నారు కాని అయ్యగారితో చెప్పొద్దనలేదుగా , సార్ మీరు!"
"సంతోషించాంలే! ఇంతకీ ఎందుకు చేశారు ఫోన్!"
"రేపు ఉదయం రావటం లేదు. సాయంకాలానికి వస్తారట. సాయంకాలం పార్టీకి ఏర్పాట్లన్నీ మిమ్మల్నే చూసుకోమన్నారు" గుక్క తిప్పుకోకుండా చెప్పాడు విక్టర్!
సాగర్ విక్టర్ ను కారు గెరేజ్ లో పెట్టమని చెప్పి తను ఇంట్లోకి వెళ్ళాడు. పిల్లిలా అడుగులు వేసుకుంటూ తల్లి పడుకొన్న గది తలుపులు వోరగా తోసి చూశాడు.
సుభద్రమ్మ మంచం మధ్యలో కూర్చుని అయాసపడుతుంది.
తల్లి ప్రశాంతంగా పడుకొని వుంటుందని ఆశించిన సాగర్, ఆమె పరిస్థితి చూసి తప్పు చేసినవాడిలా బాధపడ్డాడు.
"నిద్ర పోలేదా అమ్మా"
"నిద్రా పాడా! నా పని అయిపోయిందిరా అబ్బాయ్! నేనింక ఏంతో కాలం బతకను రా' అన్నది సుభద్రమ్మ.
"అదేం మాటలమ్మా! టాబ్ లేట్ వేసుకోన్నావా?" అని అడిగాడు సాగర్.
"ఒకటి కాదు..... రెండు ! బాధ ఓర్చుకోలేక ఒకటి ఎక్కువ కూడా వేసుకున్నాను. అందువల్లనే ఈ మాత్రం కూర్చో గలుగుతున్నాను."
"అయితే నన్ను పిలవక పోయావా అమ్మా"
"ఇంతకీ ఆ పిల్ల ఏమంటుందిరా?"
"ఏ పిల్లమ్మా' అన్నాడు సాగర్!
"జడ్జి గారికి ఇష్టమేనా?"
"ఏమిటమ్మా నీ వనేది? నాకేం అర్ధం కావడం లేదు."
"అన్ని గంటలు ఈ ప్రపంచాన్నే మరచిపోయి - మాట్లాడుకున్నారు కదా? పెళ్ళి సంగతి మాట్లాడుకోలేదా?"
సాగర్ నీళ్ళు నమిలినట్లు చూశాడు. "నువ్వు చూశావా అమ్మా?"
"నేను చూడటమేమిటిరా? మీరే చూడలేదు. రెండు సార్లు మీ గది ముందుకు వచ్చాను. అయినా జడ్జిగారి అమ్మాయి ఇంత రాత్రప్పుడు ఒంటరిగా రావటం ఏమిటిరా? జడ్జి గారికి అభ్యంతరం లేదేమో గాని మీ నాన్నకి తెలిస్తే ఊరుకోరు తెలుసా? మీ ఇద్దరికీ ఇష్టమయితే జడ్జిగారి నొచ్చి మీ నాన్నగారిని అడగమను. నా ప్రాణం 'హారి' అనకముందే మీ పెళ్ళయినా చూస్తాను."
"అది కాదమ్మా! ఆ అమ్మాయికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ విషయం నాతొ చెపుతూ కూర్చుంది."
