Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 7


    స్నానం చేస్తున్నంతసేపూ మనసు మనసులో లేదు. సుశీలమ్మ దగ్గర నుంచి తన జన్మ రహస్యం ఎలా లాగాలో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా శరత్ కు.


    స్నానం చేసి బట్టలు వేసుకుని పాయసం తిని బయటికి బయలు దేరాడు శరత్. సుశీలమ్మకు శరత్ ను పలుకరించాలంటే భయంగా వుంది.


    శరత్ కు ఆమెను అడగాలంటే మళ్ళీ ఏడుస్తుందేమోనని జంకుగా వుంది.


    శరత్ బయటికి వెళ్ళిపోయాడు.


    సుశీలమ్మ దిగాలుపడి, శరత్ వెళ్ళినవైపే చూస్తూ కూర్చుండిపోయింది.


                                    4


    శరత్ అశాంతిగా ఎక్కడెక్కడో తిరిగాడు. ఒకచోట నిలవ లేకుండా వున్నాడు.


    "నేనెవర్ని? నేనెవర్ని?" అనే ప్రశ్న పండులో ప్రవేశించిన పురుగులాగా శరత్ మస్తిష్కాన్ని తొలుస్తూ వుంది.


    తలనొప్పిగా వుండి కాఫీ హోటల్లోకి వెళ్ళి జనం తక్కువగా వున్నచోట ఓ మూలగా కూర్చున్నాడు. తెలిసిన వాళ్ళు కన్పిస్తారని భయంగా వుంది. ఎవరితోనూ మాట్లాడాలనిలేదు. కాఫీకి ఆర్డరు ఇచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు.  


    "హల్లో శరత్!"


    శరత్ చివ్వున తలెత్తి చూశాడు. ఎదురుగా అతని క్లాసుమేట్సు రవీంద్ర, గోపాలరావు కన్పించారు.


    "ఏమిటోయ్ పట్టపగలు పదిమంది మధ్య కూర్చుని కలలు కంటున్నావ్?" ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రవీంద్ర.  


    "మనవాడికేం బంగారు పిచ్చుక. ఎన్ని కలలైనా కంటాడు" అన్నాడు నవ్వుతూ గోపాలరావు.


    "ఏం తీసుకుంటారు?" మాట మారుస్తూ అడిగాడు శరత్. సర్వర్ కాఫీ తెచ్చి శరత్ ముందు పెట్టాడు.


    "నువ్వు టిఫిన్ చేసేశావా? ఛాన్స్ పోయిందన్నమాట!" భోజనం ప్రియుడు గోపాలరావు అన్నాడు.  


    "లేదు. తలనొప్పిగా వుంటే కాఫీ తాగుదామని వచ్చాను. మీరు ఏం తింటారో చెప్పండి" అన్నాడు శరత్.


    శరత్ కు వాళ్ళను త్వరగా వదిలించుకొని బయటపడాలని వుంది.


    "స్పెషల్ మసాలా దోసె." గోపాలరావు మొహమాట పడకుండా చెప్పాడు.


    ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొహమాటం పనికిరాదని గాఢంగా నమ్ముతాడు గోపాలరావు.


    "నాకేం వద్దు. కాఫీ చాలు." రవీంద్ర మొహమాట పడిపోతూ అన్నాడు. గోపాలరావు రవీంద్ర ముఖంలోకి జాలిగా చూశాడు. మరో రోజైతే శరత్ బలవంతం చేసి రవీంద్ర చేత టిఫిన్ తినిపించేవాడు.


    "ఏమిటోయ్ అదోలా వున్నావ్? రాజేశ్వరి ఏమంటోందేమిటి?" గోపాలరావు ప్రశ్నించాడు.


    శరత్ నొసలు చిట్లించాడు. అది గమనించిన రవీంద్ర ఏదో అనబోయి ఆగిపోయాడు.


    మీరిరువురూ పెళ్ళిచేసుకోబోతున్నారని రూమర్ గా వుంది! మీ పేరెంట్సు ఒప్పుకున్నారా?" తన ధోరణి తప్ప ఎదుటివారిని గురించి ఆలోచించడం తెలియని గోపాలరావు స్పూన్ తో ఆవురావురుమంటూ తింటూ అడిగాడు.   


    శరత్ కు చిరాకుగా వుంది. అయినా చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు.


    "ఎందుకు ఒప్పుకోరోయ్! శరత్ అంటే వాళ్ళ అమ్మగారికి ఆరో ప్రాణం. కొడుకు సుఖానికి ఆమె అడ్డు రాదు" అన్నాడు రవీంద్ర.


    "మరి నాన్నో?" అన్నాడు గోపాలరావు.


    త్వరగా కానివ్వండోయ్! నేను అర్జంటుగా వెళ్ళాలి." అన్నాడు శరత్.


    "ఇవ్వాళ కాలేజీకి సెలవు పెట్టావా?" ఆ సంభాషణను మరో వైపుకు తిప్పుతూ అడిగాడు రవీంద్ర.


    "అవును" అన్నట్టు తలవూపాడు శరత్.


    ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా మాట్లాడలేదు. హోటల్ బయటకు రాగానే రిక్షా పిలిచి వస్తాను" అంటూ కూర్చున్నాడు శరత్.    


    రిక్షావాడు రెండు బారలు వెళ్ళి ఆగాడు.


    "ఎందుకు ఆగావ్? పోనియ్?"


    "ఎక్కడికి బాబూ?" రిక్షావాడి కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది అవును ఎక్కడికి? తనెక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్తే? అమ్మ అనేక ప్రశ్నలు వేస్తుంది. నిజమే! అమ్మకు తను ప్రాణం.    


    తను కొంచెం పరధ్యానంగా వుంటేచాలు. గాభరా పడిపోతూ ప్రశ్నల వర్షం కురిపించేస్తుంది. ఆ తల్లిని, తన మనసులోని మమకారాన్ని పంచిపెంచిన తల్లిని, అమ్మా! మా అమ్మ ఎవరు? నన్ను కన్నతల్లి ఎక్కడ వుంది?" అని ఎలా అడగ్గలడు!    


    "ఏం బాబూ!" రిక్షావాడు మళ్ళీ అడిగాడు.


    "నాంపల్లి!" ఏదో చెప్పాలి కనక చెప్పేశాడు.


    "నాంపల్లిలో ఎక్కడికి బాబూ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS