Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 8


    ఆ వ్యక్తి డ్రైవర్ దుస్తుల్లో వున్నాడు. మొహంలో భయం ప్రస్ఫుటంగా కనబడుతుంది. హడావుడిగా టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి ఒక నంబర్ తిప్పాడు.

 

    చాలా కొద్ది మందికి తెలుసు ఆ నెంబరు. సరాసరి సర్పభూషణరావు మొదటి పి.ఎ. కి వెళ్తుంది అది.

 

    అట్నుంచి "హలో" అని వినపడగానే "సార్...... నేను...... డేవిడ్ ని మాట్లాడుతున్నాను" అన్నాడు కంగారుగా. పి.ఎ. ఆశ్చర్యంతో "ఎవరు.....?" అన్నాడు.

 

    "నేను సార్...... నేను డ్రైవర్ డేవిడ్ ని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా సార్ తో మాట్లాడాలి. టైమ్ లేదు."

 

    ఎంతో అర్జంటయితే  తప్ప ఆ  నంబర్ కి ఫోన్ లు రావు. పి.ఎ. ఆలస్యం చేయకుండా సర్పభూషణరావుకి కనెక్షన్ యిచ్చాడు. ఒక సాధారణ డ్రైవర్ కాడు డేవిడ్. అయినాసరే- అతడికి ఆ నంబర్ కి చేసే అధికారం లేదు. అయినాసరే  చేసేడంటే అనుకున్నాడు పియ్యే.

 

    పొగాకు పురుగులమీద నివేదిక ప్రభుత్వానికి 'అసలు రూపం'లో చేరకుండా ఎవరెవరిని ఎలా సంతృప్తిపరచాలో తన ఫైనాన్స్ సెక్రెటరీతో చర్చిస్తున్నాడు సర్పభూషణరావు ఆ సమయానికి. ఫోన్ ఎత్తి విసుగ్గా"హలో" అన్నాడు.

 

    "సార్ .....నేను డేవిడ్ ను మాట్లాడుతున్నాను. అమ్మాయిగారు తోటలోకి వెళ్ళారండి."

 

    మొదట అర్థం కాలేదు. కాగానే సర్పభూషణరావు మొహంలో విసుగు మాయమైంది. షాక్ ఒకవైపు, కంగారు మరొకవైపు చోటు చేసుకున్నాయి. ఆ వ్యక్తి అంతగా కంగారు పడటం  అదే మొదటి సారి. అమెరికా నుంచి  వచ్చిన సాయంత్రమే నేత్రతో కలిసి తన సెక్రెటరీ కారులో కనబడింది అని తెలిసిన రోజు కూడా అతడు కంగారు పడలేదు. తాపీగా ఆమె ఆత్మహత్య ప్లాన్ చేశాడు.  కానీ...... యిది అంత చిన్న విషయం కాదు. కూతురికి సంబంధించింది.

 

    "ఎలా జరిగింది యిది?" అన్నాడు కఠినత్వం నిండిన కంఠంతో.

 

    "మన తోటేకదా..... వెళ్దామన్నారండి. వద్దని నేనెంత చెప్పినా  వినలేదు."

 

    "నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. ఈ లోపులో అమ్మాయి ఆ మేడవైపు వెళ్ళకుండా చూడు. మరీ మొండితనం చేస్తే స్పృహ తప్పించినా  ఫర్వాలేదు. తను మాత్రం అటు వెళ్ళడానికి వీల్లేదు. అండర్ స్టాండ్.....?" ఫోన్  పెట్టేసి లేచాడు.

 

    
                                    *    *    *

 

    ఎత్తయిన గోడలవైపు చూచాడు నేత్ర.

 

    లోపల తోట పైభాగం, చెట్ల ఆకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తోటలో అలికిడి లేదు. అయినా అతడు తన పరిశోధనని తోట నుంచి మొదలు పెట్టదల్చుకున్నాడు. ప్రహరీ గోడ పైనున్న వైరులో కరెంట్ ప్రవహిస్తుంది. గోడ లోపలి వైపు కందకంలా వుంది వైర్ తగలగానే షాక్ కొట్టింది.

 

    నేత్ర చేతిలో వున్న తాడుని గాలిలో లోపలికి విసిరి, అది చెట్టుకి తగులిందని నమ్మకం కుదరగానే దాని సాయంతో పైకి ఎక్కాడు. కుడి వైపు సెక్యూరిటీ రూం వుంది. అయిదారు బలమైన కుక్కలు తిరుగుతున్నాయి. గార్డ్స్ వున్నారు. చెట్ల మధ్య దూరంగా బిల్డింగ్ కనపడుతూంది.

 

    అటువైపు నిశ్శబ్దంగా నడుస్తూ చూసుకోకుండా రెండు చెట్లకి కట్టిన సన్నని తీగని ఢీకొన్నాడు. అంతే..... ఆ ప్రదేశమంతా అలారం శబ్దం ప్రతిధ్వనించింది.

 

                                      *    *    *    

 

    "నేను వెంటనే అక్కడికి వస్తున్నాను" అని సర్పభూషణరావు అంటున్నప్పుడే డ్రైవర్ డేవిడ్  వళ్ళు చెమట్లు పట్టింది. విషయం చాలా సీరియస్ అని గ్రహించాడు. అతడు యస్.బి.ఆర్. కి చాలా నమ్మకస్తుడయినవాడు. యస్.బి.ఆర్.పి.య్యే. వ్యక్తిగత టెలిఫోన్ నెంబర్ తెలిసిన 'ఎ' కేటగిరి అసిస్టెంటు. అతడికి తోట లోపల ఏం జరుగుతుందో తెలీదు. ఏదో జరుగుతూ వుందని మాత్రం తెలుసు. ఇంత సీరియస్ అని తెలియదు.

 

    టెలిఫోన్ పెట్టేసి తోట దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గార్డ్స్ అతని కంగారు చూసిఏదో ప్రమాదం జరిగిందని వణికిపోయారు. మామూలుగా అయితే 'ఎ' కేటగిరి  అసిస్టెంట్స్ కి కూడా ఆ తోటలోకి ప్రవేశంలేదు. కానీ సర్పభూషణరావు కూతురు కారులో వుండడం చూసి ఏమీ మాట్లాడలేకపోయారు.

 

    డ్రైవర్ పరుగెత్తుకుంటూ చెట్టు దగ్గరకి వచ్చాడు. అక్కడ హంస లేఖ లేదు. ఆమె వ్రాసిన పాట తాలూకు కాగితం మాత్రం వుంది.

 

    అతడి కంగారు ఎక్కువైంది.

 

    అంతలో అతడి భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి వెనుదిరిగాడు. ఎదురుగా బాస్!

 

    "ఏదీ అమ్మాయి...?"

 

    "ఇప్పటి వరకూ యిక్కడే వుంది సార్. మీకు ఫోన్ చెయ్యడానికి నేను వచ్చినప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళివుంటారు. ఇదిగో అమ్మాయి గారు వ్రాసిన కాగితం" సంజాయిషీ చెపుతున్నట్టు అన్నాడు.

 

    "నాక్కావలసింది, విషయం ఎలా జరిగింది అన్న వివరణ కాదు. ఎందుకు జరిగింది అన్న వివరణ. ఆ నూతి  దగ్గర  చూడు....." తాపీగా అన్నాడు.

 

    డేవిడ్ అనాలోచితంగా నూతి దగ్గరకు పరుగెత్తాడు. యస్. బి. ఆర్. నిశ్శబ్ధంగా పిస్టల్ కి సైలెన్సర్  అమర్చాడు. డేవిడ్ ఆ బావిలోకి తొంగిచూస్తున్నాడు. నూతి గోడకి వున్న ఇనుప రాడ్ ని పట్టుకుని నూతి లోపల చీకటిలోకి కళ్ళు చిట్లించి వెతుకుతున్నాడు. వెనుకనుంచి పిస్టల్ పేలింది. అతడు పట్టుకున్న రాడ్  వూడిపోయి నూతిలోకి జారిపోయాడు. ఆ వెనకే అతని మూలుగు వినిపించింది.

 

    "రెండు రోజులపాటు ఆ చీకట్లో లోపలే వుండు డేవిడ్. బ్రతికి వుంటే బయటకు తీయిస్తాను. నువ్వు చేసిన పనికి అదీ శిక్ష" అంటూనే ఎస్.బి.ఆర్. భవంతి వైపు నడిచాడు.

 

    అప్పుడు వినిపించింది అలారం శబ్దం.

 

    అతడు విద్యుద్ఘాతం తగిలినవాడిలా ఆగిపోయాడు. మొట్టమొదటి సారి ఆ తోటలో అలారం మోగింది! ప్రభుత్వం కన్ను తనమీద వున్నదని తెలుసుకాని వచ్చిందెవరు? ప్రభుత్వం మనిషైతే రహస్యంగా రాడు. తనకు ముందే తెలుస్తుంది.

 

    ఒకసారి అలారం శబ్దం వినిపించగానే గార్డులు యాక్షన్ లోకి వచ్చారు. కుక్కలు నాలుగు వైపులా పరుగెత్తటానికి సిద్ధమయ్యాయి. కానీ భూషణరావు చీఫ్ గార్డ్ కి ఆగమన్నట్టు సైగ చేశాడు.

 

    "ఎవరో లోపలికి వచ్చారు సార్......." కంగారుగా అన్నాడు సెక్యూరిటీ  అధికారి.

 

    "నేను అమ్మాయిని తీసుకెళ్ళేవరకూ మీరేం చెయ్యొద్దు. ఇక్కడ యింత సెక్యూరిటీ వుందని మా అమ్మాయికి అనుమానం రాకూడదు" అంటూ భవంతి వైపు వడి వడిగా నడిచాడు. నిజానికి సెక్యూరిటీ చీఫ్ క్కూడా లోపల ఏం జరుగుతుందో తెలీదు.

 

    అదే సమయానికి భవంతిలోకి అడుగుపెట్టిన హంసలేఖ కళ్ళముందు దృశ్యాన్ని చూసి అవాక్కయి నిలబడి పోయింది.

 

    ఆమె నిలబడిన మెట్టుకింద, అండర్ గ్రౌండ్ లో విశాలమైన హాలు వుంది. ఒక మూల తెల్లటి మాస్క్ ల్లో కొందరు ప్రయోగాలు చేస్తున్నారు. అదికాదు ఆమె నిశ్చేష్టురాల్ని చేసింది. హాలు మధ్యలో అయిదారుగురు వ్యక్తులు శరీరాలున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS