Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 9


    చేపల మార్కెట్ లో గుట్టలు పోసినట్టు ఆ అయిదారుగురి శరీరాలు ఒకదానిమీద ఒకటి పడివున్నాయి. ఒక్కొక్కటే స్ట్రెచర్ మీదికి చేర్చబడుతుంది. హాస్పిటల్ వార్డ్  బోయ్స్ లా తెల్లడ్రెస్ లో వున్న  వ్యక్తులు ఆ  శరీరాల్ని బయటకు చేరుస్తున్నారు.

 

    ఒక మనిషి శరీరం బల్ల మీద పడుకోబెట్టబడి వుంది. అతడి శరీరం నుంచి రెండు వైర్లు కార్డియో గ్రాం కి కనెక్ట్ చేయబడి వున్నాయి. అతని గుండె చప్పుడు ఆ మిషన్ లో చుక్క రూపంలో ప్రయాణం చేస్తూ వుంది.

 

    అంతలో ఆ మనిషి దగ్గరే నిలబడి డాక్టర్లా పరీక్షిస్తున్న వ్యక్తి తన మొహంమీద వున్న మాస్క్ తీసేసింది. ఆ వ్యక్తి ఒక అమ్మాయి. ఆమెని చూసి హంసలేఖ ఉలిక్కిపడింది.

 

    తన అక్కని ఆ స్థితిలో అక్కడ చూస్తానని, ఆ విధంగా చూస్తానని హంసలేఖ ఊహించలేదు.

 

    ఆమె  హంసలేఖ కన్నా నాలుగైదు సంవత్సరాలు పెద్దది. ఆమె వేసుకున్న తెల్లకోటు ఆమెనో డాక్టరుగా సూచిస్తూంది. ఆమె  కళ్ళలో విజ్ఞానం తొంగి చూస్తుంది. కళ్ళక్రింద నల్ల గీతలు విషాదాన్ని, అలసటనీ చెపుతున్నాయి. అన్నిటికన్నా ఏదో తెలియని 'కసి' ఆమెలో కనపడుతూంది.

 

    ఆమె పేరు స్వర్ణరేఖ.

 

    ఆమె అక్కడినుంచి కదిలి, గాజు బీకర్ల దగ్గరకు వెళ్ళింది. వరుసగా వున్న గాజు పెట్టెల్లో పది కుందేళ్ళు వున్నాయి. ఆమె బీకర్ల చివరవున్న సంప్ తిప్పగానే, వాటికి అమర్చబడివున్న పైప్ లోంచి గ్యాస్  ఆ పెట్టెల్లోకి వెళ్ళింది. కుందేళ్ళు నెమ్మదిగా అచేతనమయ్యాయి. వరుసగా తగిలిన బుల్లెట్స్ కి ఒక్కొక్క సైనికుడూ కూలిపోయినట్టు కుందేళ్ళు ఒకదాని తరువాత ఒకటి మరణించటాన్ని హంసలేఖ స్తబ్ధురాలై చూసింది.

 

    అంతలో ఆమె వెనుక నీడ పొడుగ్గా పాకింది. ఆమె ఇంకా ఆ నిశ్చేష్ఠావస్థలో వుండగానే భుజం మీద చెయ్యి పడింది. కెవ్వున పెట్టాలనుకున్న కేకని అతి కష్టంమీద ఆపుకుంది. కారణం -ఎదురుగా  తండ్రి నిలబడి వుండడం.

 

    "ఏమిటమ్మా  ఇక్కడ నిలబడి వున్నావు?"

 

    "నాన్నా..... యిక్కడ ..... యిక్కడ ......... ఏం జరుగుతూ వుందో తెలుసా?"  

 

    సర్పభూషణరావు నవ్వాడు "ఏమీ జరగడం లేదమ్మా. భయంకరమైన కాన్సర్ వ్యాధిని నయంచేసే ప్రక్రియ గురించి అక్క  ప్రయోగం చేస్తూ వుందంతే."

 

    "కానీ........ ఈ జనం..........?" అంది శవాకారంలో వున్న మనుషుల్ని చూపిస్తూ.

 

    "ఎలాగూ కొద్దికాలంలో మరణించబోయే కాన్సర్ పేషెంట్లు. మిగతా విషయాలు బయటకువెళ్ళి మాట్లాడుకుందాం రామ్మా. వీళ్ళకెందుకు డిస్ట్రబెన్స్" అంటూ భవంతి బయటకు తీసుకొచ్చాడు.

 

    సరిగ్గా అదే సమయంలో నేత్ర అక్కడికి వచ్చి చెట్ల చాటు నుంచి చూసాడు.

 

    సర్పభూషణరావు సెక్రెటరీ కొన్ని రోజులక్రితం కార్లో తనతో చెప్పిన విషయం గుర్తొచ్చింది. "ఆయన కూతురు కూడా రిసెర్చి చేస్తుంది. విషయం ఏమిటో తెలీదు. చాలా రహస్యంగా జరుగుతూ వుంటాయని."

 

    అతను వాళ్ళకి  దూరంగా వున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నది అతడికి వినపడలేదు. లోపల నుంచి శరీరాల్ని తీసుకువచ్చి వ్యాన్ లో ఎక్కిస్తున్నారు. ఆ క్షణమే వాళ్ళిద్దర్నీ అరెస్టు చేయించవచ్చు. కానీ....... ఆ సాక్ష్యం సరిపోదు. టోటల్ రైడింగ్ చేయించాలి. దానికన్నా ముందు ఆ ప్రయోగం ఏమిటో తెలుసుకోవాలి. ఆ శరీరాలు బ్రతికి వున్నవో లేదో తెలుసుకోవాలి. అవి బ్రతికున్నవినా, లేదా వాళ్ళు చేసేది శవాలమీద ప్రయోగాలలైనా తను అనవసరంగా బయటపడినట్టు అవుతుంది. వాళ్ళకి అంత చిన్న శిక్ష సరిపోదు.

 

    ఇన్ని ఆలోచనలతో అతనుండగా వ్యాన్ దగ్గర  హంసలేఖ తండ్రిని అడుగుతోంది "బయట తాళం వేసి వుండటాలూ, లోపల ప్రయోగాలూ ఏమిటి నాన్నా యిదంతా...."

 

    యస్. బి. ఆర్. భారంగా నిశ్వసించాడు. "లోక కల్యాణార్థం చేసే పన్లకి కూడా చాటు అవసరం. హంసలేఖా. రేప్రొద్దున మేము ఈ మందు కనిపెడితే మాకు  నోబెల్ బహుమతి రావచ్చు. కానీ...... యిలా అనుమతి లేకుండా ప్రయోగాలు చేస్తున్నామని తెలిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకే మన తోటని ఎన్నుకున్నాం."

 

    నేత్ర తన జేబులోంచి వాకీ టాకీ తీశాడు. మైలుదూరంలో చీఫ్ దగ్గర బెల్  మోగింది. భగీరథరావు స్పీకర్ ఆన్ చేసి "హలో" అన్నాడు.

 

    "నేను ఏజెంట్ నేత్రని మాట్లాడుతున్నాను. యస్.బి. ఆర్. తోటలో అతని కూతురు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రయోగాలు చేస్తూంది. మిగతా విషయాలు నేనొచ్చి చెపుతాను" అని వాకీటాకీని ఆఫ్ చేశాడు. ఎ క్షణమైనా ఏజెంటు ప్రాణాలు పోవచ్చు. అంత ప్రమాదకరమైనది వాళ్ళపని. అందువల్ల ఏజెంట్లు తన పరిశోధనా ఫలితాన్ని చివరి వరకూ వెల్లడి చెయ్యకుండా ఆపు చెయ్యకూడదు. ఎప్పటికప్పుడు తమ డిపార్ట్ మెంట్ కి అంచెలంచెలుగా వివరాలు (ప్రోగ్రెస్_ అందచేస్తూ వుండాలి.

 

    నేత్ర వాకీటాకీ జేబులో పెట్టుకుంటూన్న సమయానికి సర్పభూషణరావు కూతుర్ని  కారెక్కించాడు.

 

    "ఈ విషయం యిక్కడే మర్చిపోతానని, ఎంత బలవంతం చేసినా ఎవరికీ చెప్పనని నామీద ఒట్టెయ్యమ్మా....."

 

    "ఒక మంచి పనికోసం మీరు చేస్తున్నదాన్ని నేనెందుకు బయట పెడతాను నాన్నా...."

 

    "నామీద ఒట్టేస్తేగానీ తృప్తి వుండదమ్మా."

 

    "అలాగే...... నీ మీదొట్టు...... చెప్పను. సరేనా?" కారు కదిలింది. తండ్రి చూస్తూ నిలబడ్డాడు. ఒక్కసారి ఆ కారు గేటు దాటటం ఏమిటి, సెక్యూరిటీ చీఫ్ "ప్రొసీడ్" అన్నాడు. కుక్కలు రంగంలోకి దూకాయి. గార్డ్సు పరుగెడుతున్నారు. అక్కడ వాతావరణం వున్నట్టుండి మారిపోయింది. "అంగుళం అంగుళం గాలించండి" అరుస్తున్నాడు యస్.బి.ఆర్.

 

    నేత్రకి అంత సంచలనం ఒక్కసారిగా ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. చిన్నతోట అది. కుక్కల బారినుంచి తప్పించుకోవడం కష్టం. గార్డులు కూడా సుశిక్షితులైన వారిలాగే వున్నారు. కేవలం హంసలేఖ అక్కడినుంచి వెళ్ళిపోవడం కోసం వాళ్ళు ఆగారని అతడికి తెలీదు.

 

    అలారం మోగిన ఇంత సేపటికి వాళ్ళు వెతకటం మొదలుపెట్టటం అతడికి అందుకే ఆశ్చర్యం కలిగించింది.

 

    మృత్యువు తోసుకు వస్తున్నట్టు తోచింది. ఒక గార్డు రెండు కుక్కల్ని పట్టుకుని అటే వస్తున్నాడు. వాటి ఫోర్సుని ఆపటానికి ఆ గార్డు చాలా కష్టపడవలసి వస్తున్నట్టు అతడు పట్టుకున్న గొలుసులే చెబుతున్నాయి. పరాయి వ్యక్తి తాలూకు వాసన పసిగడ్తూ దూసుకు వస్తున్నాయవి.

 

    నేత్ర బిల్డింగ్ వైపు పరుగెత్తాడు. పక్కనున్న చెట్టెక్కి బిల్డింగ్ మీదకు దూకాడు.

 

    వెనుక వస్తూన్న కుక్కలు ఆ చెట్టువరకు వచ్చి మొరగడం ప్రారంభించాయి.

 

    గార్డ్ చెట్టుమీదకు గన్ పేల్చడం ప్రారంభించాడు. దట్టంగా కొమ్మలు, ఆకులు వున్న చెట్టు అది. ఒక రౌండ్ కాల్చి ఆపి, ఒక గార్డు చెట్టెక్కడం మొదలు పెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS