డైరెక్టర్ మాట్లాడటానికి కూడా ఓపిక లేనట్టు చూస్తూ వుండిపోయాడు.
"అతని దగ్గర పనిచేసే అమ్మాయిల్ని స్వంత భార్యల్లా చూసుకోవడం అతని అలవాటు. మరీ ఎక్కువ రహస్యాలు తెలుస్తాయనుకున్న రోజు వాళ్ళని ఏదో ఒక నెపంమీద ఉద్యోగం లోంచి తీసేస్తాడు. నెల రోజుల క్రితం ఈ అమ్మాయి నాకు కనకమహాలక్ష్మి గుడి దగ్గర పరిచయం అయింది. ఆ సాయంత్రం బార్ కెళ్ళాం. ఆ రాత్రే పుట్టుమచ్చ సంగతి తెలిసింది. యస్.బి,ఆర్. కి సెక్రెటరీ అని తెలిసాక ఉత్సాహం పెరిగింది. నిన్న అమెరికా నుంచి రాగానే ఆ అమ్మాయి హుషారుగా ఎయిర్ పోర్టు విశేషాలు, యస్.బి.ఆర్. తన పి.ఎ.కి 'ఆ విలేకరి సంగతి కాస్త చూడు' అని చెప్పిన వైనం, విలేకరి మరణం వగైరాలు నాకు వివరిస్తూండగా పోలీసులు కారు వేగం ఎక్కువ నేరం మీద పట్టుకున్నారు."
"ఇంత కథ వుందా దీని వెనుక........"
"చూసారా సార్...... నేనేదో అమ్మాయిల వెనుక తిరుగుతున్నాననుకున్నారు. పని చేస్తున్న సార్..... పని. ఎ అమ్మాయి వెనుక ఏ రహస్యం తాలూకు బాంబ్ వుందో అని....."
"మోకాళ్ళు వెతుకుతూ వుంటావ్....." అని పూర్తి చేశాడు. నేత్ర జవాబు చెప్పలేదు. అంతలో అహోబిల లోపలికి వచ్చింది.
"సర్పభూషణరావు సెక్రెటరీ తన యింట్లో ఆత్మహత్య చేసుకుందటసార్" అంది వస్తూ.
ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ గదిలో నిశ్శబ్దం తాండవం చేసింది. చాలా విషాదకరమైన నిశ్శబ్దం. అంతవరకూ హుషారుగా వున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేత్ర అసహనంగా తలూపాడు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. "సర్పభూషణరావుకి నాతో తన సెక్రెటరీ స్నేహం సంగతి తెలిసి వుంటుంది. నాదే ఈ తప్పంతా" అన్నాడు స్వగతంలో......
"రెండు హత్యలు..... ఏదీ నిరూపించలేం...... షిట్....." అన్నాడు డైరెక్టర్ బల్లమీద నిస్సహాయంగా కొడుతూ.
నేత్ర లేచి నిలబడ్డాడు. "ఒకే సర్! ఈ కేసు నేను టేకప్ చేస్తాను. ఇది ఎంత చిన్న కేసైన సరే. ఆ యాస్భీయార్ని కటకటాల వెనక కూర్చోబెడతాను" అన్నాడు.
వాళ్ళనుకున్నంత చిన్న కేసు కాదది.
When the whole world is fast a sleep
I wake up from my sound sleep.
To see you, the stars hurriedly line - up
The sky eagerly sheds its cloudy make - up
The stars whisper- "He is here
Hurry up my dear"
I hesitate for a while
The roses give an encouraging smile
Sky and the moon-
Force me to speak up soon
Suddenly up I wake
Its already day break.
Emotion and devotion
The two doors of my world close behind,
"There is still another night"
To a dejected self I remind.
అయిదు నిమిషాలు పట్టింది ఆమెకా గేయం వ్రాయటానికి. ఆమెకు ఇంగ్లీషులో మంచి ప్రవేశం వుంది. మంచి భావాల్ని చక్కని పదాల్లో పొందుపర్చగల్గటం ఆమె నైపుణ్యం. "నేనేమో మౌనంగా వుంటాను. నిన్ను చూడటం కోసం నక్షత్రాలు వరుసగా నిలబడతాయి. ఆకాశం కూడా మేఘాల మేకప్ తీసేస్తుంది" అన్నది నిజంగా మంచి ప్రయోగం.
ఆమె చదివిన చదువు రసాయన శాస్త్రమైనా, ఈ అభిరుచి ఎందుకో ఆమెకు బాగా అలవడింది. కొన్ని పరస్పర విరుద్ధ సంస్కృతుల సమ్మేళనం ఆమె ఆమె అంత భావుకతతో కూడిన గేయం వ్రాస్తూంటే పక్కనున్న టేప్ రికార్డర్ లోంచి "....జస్ట్ బీటిట్" అన్న పాట రణగొణ ధ్వనితో వస్తోంది. చెంపల మీదకు జారిన జుట్టు, స్వచ్చమైన కళ్ళు, చిన్న నోరు, మొత్తమంతా కలిపితే ఆమె, హిమశిఖరం నుంచి కరిగిన నీహారికా బిందు సందోహం నీటి చుక్కై, కొండ పక్క.
శిధిలమైన గుడిని అనుకుని వున్న కోనేట్లో కలువపూల రేకుల మీద చేరినంత నిర్మలంగా వుంటుంది ఆమె. అయితే దానికి వ్యతిరేకంగా ఆమె జీన్స్ పాంట్ లోకి చొప్పించిన బనియను మీద రొమ్ముల మధ్య. 'పంచ్ యిట్ హియర్' అని వుంటుంది ఫ్యాషన్ ప్రపంచానికి కీట్స్ కూతురు రాణి అయితే ఎలా వుంటుందో అలా వుంటుందామె.
ఆమె పేరు హంసలేఖ.
తను వ్రాసిన గేయాన్ని మరోసారి చూసుకుంటూ వుండగా సన్నటి ఆర్తనాదం వినిపించింది. మొదట ఆమె తన చెవుల్ని నమ్మలేదు. కానీ అనుమానం మాత్రం అలాగే వుండిపోయింది. వాళ్ళతోటే అది. కానీ ఆమె రావటం మొదటిసారి.
చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడ, మధ్య అయిదారెకరాల తోట, చెట్ల నడుమ ఒక పురాతనమైన భవనం. ఎవరూ అక్కడికి రాక చాలా కాలమైనట్టు వుంది. ముందు భాగంలో ఎండుటాకులూ, పుల్లలు, చెత్త పేరుకుని వుంది.
ఆమె బంగ్లావైపు నడిచింది.
అప్పుడప్పుడు అరచే పక్షి కూత తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దంలో ఆమె అడుగుల చప్పుడు మరింత గట్టిగా వినపడుతూంది.
హంసలేఖ భవంతికి చేరువైంది. ముందు వైపు చిందరగావున్నా, వెనుక వైపు టైర్ల గుర్తులు కనబడ్డాయి. ఆమె అటు నడిచింది. అక్కడ తలుపులు బిగించి చెక్కలు కొట్టేసారు. లోపలికి దారిలేదు.
ఆమె వంగి సందులుగుండా చూచింది. లోపల లైట్ల వెలుతురు కనపడుతూంది.
అంతలో ఒక వ్యక్తి లోపల నుంచి తనువున్న వైపు రావడం గమనించింది. చప్పున పక్కకి తప్పుకుంది. ఆమెకి ఆశ్చర్యం కొలిపేలా అతడు వచ్చి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. చెక్కలు కొట్టినట్టు బయటకు కనబడుతూన్న ద్వారం బయటకు తెరుచుకునే వీలున్నది.
ఆమె తటాపటయించకుండా తలుపు తోసి లోపలికి ప్రవేశించింది.
అలా ప్రవేశించడంతో ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపుకు మొదటి శంకుస్థాపన జరిగింది.
