"ఇవాళ నువ్వు చేసిన పనికి నిన్నేం చేసినా పాపంలేదు. నీకివాళ అన్నం పెట్టదు" అన్నాడు కృష్ణయ్య కాఠిన్యం తెచ్చుకుంటూ. వెంగమాంబ విచిత్రంగా తండ్రివైపు చూసింది.
"నేనేం చేశాను?"
"వీథిలో గంతులేమిటి? అంతమంది పొగవడమేమిటి? ఇంటి పరువేమవుతుంది? ఇదా నువ్వు మాకు చేసే ఉద్ధరింపు?" తండ్రి గొంతు పెంచి అన్నాడు.
"జనం ఎక్కడ పోగయ్యారు? నా స్వామి, నేను తప్ప ఎవరూ లేరు" అంది అరమోడ్పు కనులతో ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వెంగమాంబ.
"ఎవరూ లేరా? నీ అబద్ధాలు పాడుగాను. సీత వచ్చి చెప్పబట్టి నేనొచ్చి నిన్ను లాక్కొచ్చాను. నీ పిచ్చి చేష్టలూ, పిచ్చి గంతులూ నువ్వూ" అంది మంగమాంబ.
"మీకేం తెలుసు? ఆ దేవుడే నాచేత పాడించుకుని, ఆడించుకుని ఆనందిస్తున్నాడు" అంది వెంగమాంబ.
"ఏ దేవుడే పిచ్చిమొద్దా? ఇంకా దేవుడి పేరు ఎత్తావో నీ వీపు చీరేస్తాను." కృష్ణయ్య లేని కఠిన్యం తెచ్చుకుంటూ గొంతు పెంచి అన్నాడు.
తల్లి, తండ్రి తనమీద అలా ఎందుకు కోప్పడుతున్నారో వెంగమాంబకు అర్థం కాలేదు. తన మాటలు నమ్మరేమిటి? స్వామి రాత్రి కలలో కనిపించి తనమీద పాట రాయమనీ, అది పాడుతూ నృత్యం చేయమనీ చెప్పాడు. తాను అదే చేసింది. అందరూ పూజించే ఆ స్వామి చెప్పినట్లే తనుచేయడం తప్పా? అమ్మకీ, నాన్నకీ, నాకూ అందరికీ తండ్రి ఆయనే కదా! అందరికీ దిక్కు ఆయనే కదా! అందరికీ కదా! అందరినీ పాలించి, పోషించే ఆ పరమాత్మ వీళ్ళకు కనిపించి అలాగే చేయమంటే చేయరా? ఇలా ఆలోచనలతో సతమతమవుతూ వెంగమాంబ వహించింది.
తండ్రి కేకలు వేస్తూనే ఉన్నాడు. "ఇంకోసారి అలా వీథిలో గంతులేస్తూ, దేవుడు దేవుడంటూ వెర్రిచూపులు చూస్తూ, పిచ్చిపాటలు పాడుతూ ఉన్నావంటే ఊరుకోను" అన్నాడు. వెంగమాంబ మాట్లాడకుండా తలవంచుకునే కూర్చుండి పోయింది. ఆమె కళ్ళనుంచి అశ్రువులు జలజలరాలాయి. మంగమాంబ కడుపు చెరువైపోయింది. పిల్లను దగ్గరకు తీసుకుంటూ, "పాపిష్టివాళ్ళం, నీ కంట తడిపెట్టించామా తల్లీ, మా అమ్మకదూ.... నాయన చెప్పినట్లు వినవే. నలుగురిలో మా పరువు తీయకే..... పద బువ్వతిందువుగాని" అని లేవదీసి వంటింట్లోకి తీసుకెళ్ళింది.
వెంగమాంబ విషయంలో ఏం చేయాలా అని దంపతులిద్దరూ ఆరోజు రాత్రి ఏకాంతంగా చర్చించుకున్నారు. దీనికి చదువుమీద ఎలాగూ ధ్యాస కుదరడం లేదు, పోనీ చిన్న చిన్న ఇంటి పనులు అలవాటు చేస్తేనైనా బుద్ధి మళ్ళుతుందేమో ననుకున్నారు.
మరునాటి నుంచే తమ ఆలోచనను అమలులో పెట్టారు. పొద్దుటే వీథిగుమ్మం ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం, ఆవుకీ, దూడకీ గడ్డివేయడం, పువ్వులు కోయడం, చిన్న చిన్న వంట సామాను తోమడం, పూజా సామగ్రిని శుభ్రం చేయడం, మజ్జిగ చిలకడం, కూరలు తరగడంలాంటి పనుల్ని వెంగమాంబకు అప్పగించారు. వెంగమాంబ ఆ పనులన్నీ ఎంతో సంతోషంగా చేస్తోంది. చేతులు పనిచేస్తున్నా చిత్తం మాత్రం స్వామిమీదే. ప్రతి పనిలోనూ ఆ పిల్లకు పరమాత్మే కనిపిస్తున్నాడు. ఏ పని చేస్తున్నా అది పరమాత్మ సేవగానే అనిపిస్తోంది. ఆవులో, దూడలో, పూలలో, పాలలో, నీటిలో, నిప్పులో అన్నింటా ఆమెకు పరమాత్మ స్వరూపమే పోడగడుతోంది.
ప్రకృతి అంతా పరమాత్మ విలాసంగానే స్ఫురిస్తోంది. భగవంతుని పట్ల ఆ పాప అవగాహన మరింత వైశాల్యాన్ని, లోతునూ పెంచుకుంటోంది. దేవుడి ధ్యాస తగ్గుతుందని తల్లిదండ్రులు పిల్లచేత పనులు చేయిస్తుంటే, ఆ పనుల వల్ల వెంగమాంబ దేవునికి మరింత దగ్గరైంది.
తొలికోడి కూత చెవిన పడగానే లేచి కూర్చుంది వెంగమాంబ. స్వామి రూపాన్ని తలచుకుని మనసులోనే నమస్కరించుకొని ఉత్సాహంగా పనిలోకి దిగింది. వీథి వాకిలి తుడిచి కల్లాపి చల్లింది. ముగ్గువేయడం ప్రారంభించింది. ఏ పని చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా ధ్యాస మాత్రం ఆ స్వామి మీదే. అంతసేపూ ఆ నోట స్వామి గురించిన పాటలూ, పద్యాలూ, కీర్తనలూ ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకే వెంగమాంబ పనిలో ఆనందాన్నే తనివితీరా అనుభవిస్తోంది. ఎంతసేపూ భగవధ్యాసలోనే ఉండకుండా, అందరి పిల్లల్లా లౌకిక విషయాలలోకి దృష్టి మళ్లిస్తుందనే తల్లిదండ్రులు వెంగమాంబ చేత ఇంటిపని చేయించడం ప్రారంభించారు. కానీ వారి ఆశ అడియాసే అవుతోంది. వెంగమాంబ పనిలో పడినా పరమాత్మను మాత్రం మరువలేదు.
ముగ్గుల్లో ఎన్ని రకాలో! అన్నీ ఇట్టే నేర్చుకుంది వెంగమాంబ. ఆ రోజు వైకుంఠ చుక్కలముగ్గు పెట్టాలనుకుంది. మొదలెట్టింది. ముగ్గు వేయడం పూర్తికాలేదు కానీ, కాలం మాత్రం గడిచిపోయింది. చూస్తూండగానే బారెడు పొద్దెక్కింది.
తల్లి అంతా గమనిస్తూనే ఉంది. కానీ ఏమనాలో తోచలేదు. ఏమన్నా పిల్లలో మార్పు ఉంటే కదా! తిట్టడానికి నోరు రాదు, కొట్టడానికి చేతులు రావు.
"నా ఇల్లే వైకుంఠం, నాస్వామే నాప్రాణం" పరిసరాలు మరచిపోయి వెంగమాంబ కూనిరాగం తీస్తూ ముగ్గువేస్తూనే ఉంది.
ఎప్పుడొచ్చాడో కృష్ణయ్య అక్కడికి వచ్చి, భార్యనూ, కూతురునూ చూశాడు. అతనికి పట్టలేనంత కోపం వచ్చింది. విసవిసా వెళ్ళి వెంగమాంబ వీపుమీద ఒక్క చరుపు చరిచాడు. "బారెడు పొద్దెక్కింది. ఇంకా ముగ్గు వేయడం కాలేదా?" అంటూ గర్జించాడు. కోపం ఆగక ముగ్గుమీద నీళ్ళు కుమ్మరించి, వెంగమాంబ చెయ్యి పుచ్చుకుని ఇంట్లోకి లాక్కువెళ్ళాడు. వెంగమాంబ ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయింది. కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. తల్లి కడుపు తరుక్కుపోయింది. కానీ ఏమీ అనలేకపోయింది.
కృష్ణయ్య ఈరోజు ఇంతగా ఒళ్ళు మరచిపోయి పిల్లమీద చేయి చేసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ముందు రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న బంధువొకరు వెంగమాంబ గురించి ప్రస్తావించి "పిల్లని కాస్త దారిలోపెట్టు, ఆడపిల్ల. రేపు పెళ్ళి కావద్దా? పిచ్చిదని ఇప్పటికే ఊరంతా అనుకుంటున్నారు. సంబంధాలెలా వస్తాయి?" అని హెచ్చరించాడు. బంధువులతో ఇలా చెప్పించుకోవడం కృష్ణయ్యకు తల కొట్టేసినట్టయింది. ప్రొద్దున్నే లేవగానే ఆ దృశ్యం చూసి అతనిలో కోపం బుసబుసా పొంగింది. కన్నకూతురి మీద మొదటిసారి చేయి చేసుకున్నాడు! అందుకతనికి పశ్చాత్తాపంగానే ఉంది. కానీ అంతలోనే నిబ్బరం తెచ్చుకుని తను కఠినంగా ఉండవలసిందేననుకున్నాడు.
అంటుగిన్నెలు ముందేసుకుని కూర్చున్న వెంగమాంబ దగ్గరకు వెళ్ళి, "ఈరోజు నుంచి గుడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. పాటలు పాడటానికి వీల్లేదు. చెప్పినట్లు వినకపోయావో నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను" అని తీక్షణంగా అన్నాడు.
వెంగమాంబ సరేనన్నట్లు తల ఊపింది. ఆ లేత చెక్కిళ్లమీద కన్నీటి బొట్లు జలజలరాలాయి. తన తండ్రికి అంతకోపం ఎందుకొచ్చిందో ఆపిల్లకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. తనకూ, తన తండ్రికీ కూడా తండ్రి అయిన ఆ స్వామి గురించి పాడుకుంటుంటే తనకు తెలియకుండానే పొద్దెక్కిపోయింది. అందరికీ తండ్రి అయిన స్వామి గురించి పాడుకుంటూనే కదా, తను జాగు చేసింది! అది కూడా తప్పేనా? తండ్రులందరూ ఇలాగే ఉంటారేమో! తమ పిల్లలు దేవుణ్ణి తలచుకోవడం వారికి ఇష్టం ఉండదేమో!
భాగవతంలో ప్రహ్లాదుడి కథ గుర్తొచ్చింది వెంగమాంబకి. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగానే ఆ వైకుంఠవాసునికి భక్తుడయ్యాడు. చిన్న వయసులోనే ఎప్పుడూ ఆ విష్ణువునే తలచుకుంటూ ఉండేవాడు. తండ్రి అయిన హిరణ్యక శివుడు విష్ణువును తలచుకోడానికి వీలులేదంటూ ప్రహ్లాదుణ్ణి ఎన్ని బాధలు పెట్టాడో! కొండమీదనుంచి తోయించాడు. ఏనుగులతో తొక్కించాడు. పాములతో కరిపించాడు. శూలాలతో పొడిపించాడు. ఏం చేసినా ప్రహ్లాదుడు చావలేదు. అందరికీ తండ్రి అయిన మహావిష్ణువే అతణ్ణి రక్షించాడు. పైగా ప్రహ్లాదుని అన్ని బాధలు పెట్టినందుకు హిరణ్యకశిపునే చంపేశాడు.
ఈ ఊహ రాగానే వెంగమాంబ వణికిపోయింది. నాన్న నామీద ఇలా కోప్పడు తున్నాడు. హిరణ్యకశిపునిలానే నడుచుకుంటున్నాడు. కానీ నాన్నకి హిరణ్యకశిపునికి జరిగింది జరగకూడదు. నాన్న పైకి కోప్పడుతున్నాడుగానీ, తనంటే ఎంతో ప్రేమ. వెంగమాంబ చెక్కిళ్ళమీద ఆగకుండా అశ్రువులు జారుతూనే ఉన్నాయి.
తండ్రికి కోపం తెప్పించడం ఎందుకని ఆరోజునుంచి గుడికి వెళ్ళడం మానేసింది వెంగమాంబ ఇంట్లోనే పనిపాటలు చేస్తూ గడుపుతోంది.
ఓరోజు పొద్దుటే గుడి గంటలు ఆ పిల్ల చెవినపడ్డాయి. ఆ గంటలధ్వని ఎంతో శ్రావ్యంగా, ఆ స్వామి స్వయంగా తనను రమ్మని పిలుస్తున్నట్లుగా వినిపించింది వెంగమాంబకు. ఎంతో ఆనందం, ఉత్సాహం కలిగాయి. కాలు నిలవలేదు, అమ్మా, నాన్న ఏమన్నా అననీ, ఒక్కసారి తను గుడికివెళ్ళి స్వామిని దర్శించుకొని రావలసిందే అనుకుంది. తలుపు వారగా వేసి చెంగున వీథిలోకి దూకింది.
పరుగు పరుగున వెళ్ళి మెట్లెక్కి స్వామి ఎదుట వగరుస్తూ నిలబడి పోయింది. చూసి ఎన్నో రోజులు అవడం వల్ల కాబోలు స్వామి రూపం మరింత అందంగా, అపురూపంగా కనిపించింది. "ఇన్ని రోజులూ నిన్ను చూడడానికి రానందుకు నన్ను క్షమించు స్వామీ. ఆనాడు ప్రహ్లాదుణ్ణి కాపాడినట్లు, గజేంద్రుడికి మోక్షమిచ్చినట్టు నా కష్టాలు కూడా గట్టెక్కించు. ఇక ఆ యింట్లో నేనుండలేను. నిన్ను చూడకుండా, నీ పాట పాడకుండా, నీ ఎదుట నృత్యం చేయకుండా నేను బతకలేను స్వామీ" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
