Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 7


                                                 పడిలేచే కడలితరంగం
    లలితమ్మ అన్నగారి ఊరు వెళ్ళాలని నాలుగేళ్ళుగా అనుకుంటోంది. కాని, ఎప్పుడూ ఒకటే సమస్య ఎదురవుతోంది. తను ఓ వారంరోజులు ఇల్లు వదిలి వెడితే ఏమీ కాదని అన్నగారు ఎన్నోసార్లు చెప్పాడు. "నువ్వు లేకపోయినా ఇల్లేమీ కాదు. ఎక్కడికీపోదు. ఎవరి పనులు వారు చేసుకుంటారు. సుఖంగా ఉంటారు" అని. అయినా ఏమిటో ఇల్లు వదిలి వెళ్ళడానికి లలితమ్మ మనసు సమాధానపడటం లేదు. 
    ఎనిమిదయే సరికి తన పెద్ద కొడుక్కు టిఫిన్ చేసి బాక్సులో పెట్టియియ్యాలి. ఒక్క రోజు మానేసినా వాడు ఏ హోటళ్ళతోను తినడు. తను లేకపోతే ఎవరు చేసి పెడతారు? చిట్టితల్లికి ఒక్కపని రాదు. దానికి జడ వేసుకోడం కూడ రాదు ఆఖరికి. శ్రీవారి సంగతి చెప్పనక్కర్లేదు__ బలవంతాన లాక్కొచ్చి కూచోపెట్టినా పెద్దగా తినాలనే అనిపించదు. చిన్నవాడు మహదుడుసు పిల్లాడు. స్కూలునించి తిన్నగా ఇంటికి వచ్చేవరకు రోజూ భయమే. ఈలాటి సంసారాన్ని వదిలి ఎక్కడకెడుతుంది, ఎలా వెడుతుంది తను? పైగా అన్నగారు నీకు రావాలనుకుంటే ఇవేమీ పెద్ద అడ్డంకులు కావులే అంటాడు. వాడికేమి అర్థం అవుతుంది తన యింటి పరిస్థితి? లలితమ్మ బియ్యం ఏరుకుంటూ పదేపదే ఆ విషయమే అనుకుంటోంది. క్షణంలో లలితమ్మ మనసు మారిపోయింది. తను ఇలా తాపత్రయపడుతోంది గాని తన చెల్లెలు ఏడాదికి ఆర్నెల్లు ఊళ్ళు తిరుగుతూనే ఉంటుంది. దాని సంసారాని కేమొచ్చింది? లక్షణంగా ఉంది - కాని, దాని విషయం వేరు - దాని మొగుడు, పిల్లలు ఇల్లంతా చూసుకుంటారు. మరి తనవాళ్ళో! లలితమ్మకి ఒక్కసారిగ మొగుడిమీద, పిల్లల మీద విసుగు వచ్చేసింది. కాఫీ కూడా కాచుకోనవసరం లేకుండా ఇల్లు వదిలి ఒక్క రోజన్నా ఎక్కడికి వెళ్ళకుండా తనే ఈ ఇంటిని ఇలా తయారు చేసింది అనుకుంది మళ్ళీ. ఇప్పుడనుకుని ఏం లాభం - తనకి కుదరదు. అబ్బే, తనెక్కడ కెడుతుంది. మనసు నిశ్చయం చేసుకుంది లలితమ్మ బియ్యం డబ్బాలోకి ఎత్తుతూ. పిల్లలంతా పెద్దవాళ్ళయ్యాక ఎక్కడకన్నా ఊరేగచ్చు. ఇప్పుడేం తొందర - లలితమ్మ మనసు కుదుట పర్చుకుని హాయిగా పనులలో నిమగ్నురాలయిపోయింది.
                                               *    *    *
    రోజులు గడుస్తున్న కొద్ది చుట్టాలందరూ లలితమ్మకి గర్వం అని అయినా దాన్ని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోనీరని రకరకాలుగ చెప్పుకోటం మొదలుపెట్టారు.
    ఆ రోజు మామయ్య రోడ్డు మీద కనిపించి, 'ఏరా! మీ అమ్మని ఇల్లు కదలనీయకుండా కట్టేస్తున్నారు. దానికి మాత్రం పుట్టింటికి రావాలని ఉండదూ' - నిలదీసి అడిగేసరికి మెడికల్ కాలేజిలో మూడో సంవత్సరం చదవుతున్న రఘు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. మామయ్య అక్కడతో ఆపకుండా ఇంటికొచ్చి ఆఫీసు నుంచి వస్తున్న రాజశేఖరానికి ఎదురెళ్ళి 'ఏం బావగారూ! మా చెల్లాయిని ఒక్క వారంరోజులు పుట్టింటికి పంపరేమిటి - మా చెల్లాయిని మీ ఇంటికి కాపలా పెట్టేసి నట్టున్నారే - ఎప్పుడూ' అంటే రాజశేఖరం కళ్ళు ఎర్రబడ్డాయి.
    'అయినా మెడిసిన్ చదువుతున్న పిల్లాడు కాఫీ కాచుకుని, కాస్త అన్నం ఒండుకోలేడంటే' అని ఒకరంటే 'అదేం చిత్రమో మరి - పదమూడేళ్ళ పిల్ల జడలేసుకోలేదంటుంది విన్నావా' అని ఒకరు. 'అసలు విషయం నే చెప్తా - అతనికి పెళ్ళాన్ని పుట్టింటికి పంపటం ఇష్టం ఉండదు - ఏమిటో మరి' అని మరొకరు అనుకుంటూ ఉంటే, చేరాల్సిన కబుర్లన్నీ రాజశేఖరం చెవికి, అంతకుముందే రఘు చెవికి చేరనే చేరాయి.
    ఆ రోజు తులసి కోట దగ్గర కూచుని బియ్యం ఏరుతోంది లలితమ్మ. రఘు తల్లి దగ్గర కొచ్చి కూచున్నాడు.
    'అమ్మా ! నిన్నోమాట అడుగుతాను కోపం రాకూడదు.
    'చెప్పు ముందు' - రెండు బియ్యం గింజలు నోట్లో వేసుకుంది.
    'మరి నువ్వు మామయ్య ఎన్నిసార్లు రమ్మన్నా ఎందుకెళ్ళవు? క్షణం విస్తుపోయింది.
    'బావుంది నాకు వాడంటే కిట్టదనుకున్నావా?'
    'మరెందుకు?'
    'ఎందుకేమిటి - నేను నిజంగా నాలుగు రోజులు ఊరెడితే కదా మీకు తెలిసేది - తెల్లవరేసరికి అందరికీ అన్ని పనులు అమరుస్తుంటే ఎవరికీ తెలియదు.' తెల్లని లలితమ్మ చెవులు ఎర్రపడ్డాయి. అంటే లలితమ్మకి కోపం వచ్చేసింది. రఘుకి నవ్వొచ్చింది. ఇంకా అ విషయమే మాట్లాడితే అమ్మకి కోపం ఎక్కువయి పోతుందని భయమేసి అప్పటికి ఆ విషయం ఆపాడు. కాని, రెండు రోజుల తర్వాత రాజశేఖరం కాఫీ తాగుతూ 'నువ్వు ఓ వారం రోజులు మీ అన్నగారింటికి వెళ్ళి రారాదూ - ఏదో ఇంట్లో గడుపుకుంటాం నెమ్మదిగా' అన్నాడు. అవును మమ్మీ నువ్వెళ్ళు మేము ఎలాగో అన్నీ చేసుకుంటాము. అయినా నువ్వు మాకు ఏమీ నేర్పకపోబట్టి నీకీ భయం - ఒక్కసారి మమ్మల్ని ఒదిలిపెట్టు - అన్నీ పనులు నేర్చేసుకుంటాము.' రఘు రేడియో చెవి దగ్గర పెట్టుకునే తల్లితో అంటున్నాడు.
    'మమ్మీ! నువ్వు గనక ఊరెడితే నేను నాన్నకి హాయిగా అన్నం వండి పెట్టగలను తెలుసా?' పుస్తకాలు సద్దుకుంటూ చిట్టితల్లి.
    'నేను లేకపోతే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? చెట్టు కొకరు, పుట్టకొకరు అయిపోతారు అని ప్రతి ఇల్లాలు సహజంగా భావిస్తుంది. కాని తను లేనంతమాత్రాన ప్రపంచం ఆగి పోదని, అన్నీ యథా విధిగా సాగిపోతాయని తెలిసినప్పుడు ఆ ఇల్లాలి మనసు గతేమిటి - లలితమ్మ ఆలోచిస్తోంది.
    'అమ్మా! నా కోసం నువ్వేమీ భయపడకు. నువ్వు ఊరెళ్ళితే వచ్చే వరకు ఎవరింటికి వెళ్ళి అల్లరి చేయను చెట్లెక్కను, ఐరన్ బాక్స్ పెట్టి బట్టలు ఇస్త్రీ చేసుకోను. చాలా బుద్ధిగా ఉంటాలే- వెళ్లు నువ్వు.' చిన్నాడు ఉత్సాహంగా మాట్లాడుతుంటే అందరికీ నవ్వొచ్చింది.
    క్షణంలో అంతా మళ్ళా ఎవరి పనులలోకి వారు వెళ్ళిపోయారు. పిల్లలు, భర్త అంతా వెళ్ళిపోయాక, 'పనులన్నీ అయ్యాక లలితమ్మ కాసేపు నడుం వాల్చింది. మనసు పరిపరి విధాలపోతోంది. ఇందాకటి మాటలు లలితమ్మ గుండెల్లో గుచ్చుకున్నాయి. ఇంట్లో అందరూ నువ్వెళ్ళు, నువ్వెళ్ళు' అనే అంటారు కాని ఒక్కరయినా 'అమ్మా వెళ్ళద్దే మేము ఒక్కళ్ళం ఉండలేం అనరేం?' నువ్వెళ్ళు, మేము హాయిగా ఉంటాం అంటారు పిల్లలు. నువ్వెళ్ళు నేను ఇల్లు చూసుకుంటా;లే అంటాడు భర్త. అంటే-అంటే, తనెవరికీ అక్కర్లేదా? తనెంత పిచ్చిది! ఇంత కాలంగా ఇల్లు వదిలి వెళ్ళడానికి ఎంత వెనకాడింది తను. అందరూ తనని వదిలేసినట్లు, తను ఉన్నా లేకపోయినా ఎవరికీ ఏ బాధ లేనట్లు, తను ఒంటరిదయిపోయినట్లు అనిపించగానే పెద్దగా ఏడుపొచ్చింది లలితమ్మకి. ఎవరికీ తనక్కర్లేదు. లలితమ్మకి కన్నీళ్ళు ఆగలేదు. ఆ క్షణంలోనే లలితమ్మ నిశ్చయించుకుంది - అన్నయ్యకు ఉత్తరం రాస్తాను బయల్దేరుతున్నానని. వారం రోజులు కాదు, ఆర్నెల్లు లేకపోయినా నా కోసం ఏడ్చేవాళ్ళెవరు?!
                           *    *    *
    లలితమ్మ ప్రయాణం నిశ్చయమైంది. స్టేషనుకి గంట ముందే వెళ్ళారు మంచి సమయం చూసి. ఎంత వద్దనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది లలితమ్మ.
    'నీకు జడవేసుకోటం రాదు - పక్క పిన్నిగారిచేత వేయించుకో.' చిట్టితల్లి నవ్వి 'ఊరుకో అమ్మా! అందరూ నవ్వుతారు మా క్లాసు' పిల్లలందరూ ఎప్పట్నుంచో వాళ్ళే వేసుకుంటారు తెలుసా?' దీర్ఘం తీసింది చిట్టితల్లి.
    'ఒరేయ్ పెద్దాడు! తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. చిన్నాడు దీపాలు పెట్టగానే నిద్రపోతాడు, కాస్త పెందరాళే వాడికి అన్నం పెట్టు. రఘు మేగజైన్ తిరగేస్తూ 'ఊ' అన్నాడు అసలు వినిపించుకోకుండా.
    'పనిమనిషిని ఓకంట కనిపెట్టండి-తెలిసిందా?' అబ్బ ఏమిటీ ఛాదస్తం మేము అన్నీ చూసుకుంటాంగా విసుక్కున్నాడు భర్త.
    లోపలకెళ్ళు టైమవుతోందని భర్త హెచ్చరిస్తుంటే లలితమ్మ పెట్టెలోకెళ్ళి కూర్చుంది. ప్రాణాలన్నీ ఇంటిమీదే ఉన్నాయి.
    రైలు పరిగెడుతోంది. ఎదురు సీటులో కూచున్నావిడ లలితమ్మతో కబుర్లకు దిగింది.
    'ఇంట్లో కుక్కపిల్ల ఉందండి. నేనులేకపోతే అది బెంగపెట్టుకుంటుంది. మొన్న మ్ చెల్లెలి ఊఋ వరంగల్ వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసరికి పాపం బెంగపడి కాళ్ళకు చుట్టేసుకుంది.' లలితమ్మ వింటూ కూచుంది.
    'మావారికి మొక్కలంటే సరదా. వద్దంటే వినకుండా ఇంటినిండా కొనిపెట్టారు. నీళ్ళు పొయ్యాలంటే ఇంట్లో అందరికీ విసుగే - నేనే పొయ్యాలి. తిరిగి వచ్చేసరికి ఎలా ఉంటాయో మరి.
    మా పెద్దాడు అంటాడు - 'అమ్మా! అంతా నీ వెర్రికానీ - నువ్వు లేనంతమాత్రాన ఏమీ ఎక్కడా ఆగిపోదు. ఇల్లు ఏమీ అయిపోదు. హాయిగా వెళ్ళిరా అంటూ బలవంతంగా రైలెక్కించాడనుకోండి. నిజంగా నాకిష్టంలేదు ఇప్పుడు బయలు దేరడం.' ఆవిడ అలా చెప్పుకుపోతుంటే లలితమ్మకి నోటిదాకా వచ్చింది - 'మావాళ్ళూ నన్ను బలవంతంగానే పంపిస్తున్నారు' అందామని. కాని, ఏమీ అనకుండా విని ఊఋకుంది. మమకారాలు పెంచుకోకూడదు - మనసులో అనుకుంది లలితమ్మ.
                                                 *    *    *
    ఊరెళ్ళి నాలుగు రోజులు కాకుండా ఉత్తరం వచ్చింది లలితమ్మ దగ్గరినుంచి. అ ఉత్తరం నిండా విశేషాలే "డబ్బా మూతలు జాగ్రత్తగా పెట్టండి. ఎలకలు తిరుగుతున్నాయి చిట్టి తల్లి పెంకితనం చేసినా కాస్త చూసీచూడనట్లు ఊరుకోండి, అది నాకోసం బెంగపడితే కష్టం. నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త. విసుక్కోకుండా నాన్నకి కావలసినవి చూడండి. నేను తొందరగా వచ్చేస్తాను' లలితమ్మ ఉత్తరం చదువుకొని పెద్దాడు నవ్వుకున్నాడు. పిల్లలిద్దరూ అమ్మ మంచిది కదూ అనుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు.
    ఉత్తరం రాసి పడేసిన తర్వాత లలితమ్మ ఓవారం రోజులుంది. ఒక్క ఉత్తరం కూడా రాలేదు. 'నువ్వు తొందరగా వచ్చేయి అమ్మా' అని చిట్టితల్లి రాస్తుందనుకుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే రమ్మని భర్త ఓ వైర్ చేస్తే ఎంత బావుంటుంది! ఆ, ఎందుకు చేస్తారూ తను లేకపోతే ఎవరికేమి లోటుందని ఆర్నెల్లున్నా రమ్మని రాయరేమో! తమ లేనిలోటు గుర్తుంచే వాళ్ళెవరూ లేరు. దీర్ఘంగా నిట్టూర్చింది లలితమ్మ. ఓ వెచ్చని కన్నీటి బొట్టు ఒళ్ళో వచ్చి పడింది.
                                                 *    *    *
    లలితమ్మ ఇంట్లో అడుగుపెట్టే సరికి ఏదో తెలియని ఆనందంతో మనసు పులకరించిపోయింది. కాని, మరుక్షణంలో ఆనందం మాయమయింది. 'మమ్మీ, మొన్న నేను కారంబూంది చేసాను. రోజూ జడ నేనే వేసుకుంటన్నాను' పరిగెత్తి వచ్చింది చిట్టితల్లి తల్లికి ఎదురుగా.
    'మమ్మీ - నిన్న నేను, స్నేహితులు పిక్ నిక్ కి వెళ్ళాం ఏం దెబ్బలు అనీ ఎక్కడా లేవులే!' చిన్నవాడు నవ్వుతూ తల్లితో అంటున్నాడు.
    లలితమ్మ అలా చూస్తూ నిలబడింది. ఇదేమిటి పిల్లలంతా ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. నిజంగా చిట్టి తల్లికి చక్కగా బుగ్గలొచ్చాయి. చిన్నవాడికి ఒక్కరవ్వ రంగొచ్చి నట్టుందేమిటి.
    అవును. వాళ్ళంతా ముందే చెప్పారుగా - అమ్మా నువ్వెళ్ళు మేము హాయిగా వుంటామని.
    "నీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? వాళ్ళే వండుకు తింటున్నారు పాపం, అని రోజూ సాయంత్రం స్వీట్సు, రాత్రి అన్నం తిన్నాక ఫ్రూట్స్, పడుకునేటప్పుడు మిల్కు - చూశావా? ఎన్ని ఏర్పాట్లు చేసానో' రాజశేఖరం నవ్వుతుంటే ఎవరైనా పిల్లల్ని చూస్తే దిష్టితగులుతుందేమో ఇప్పుడు అనుకుంటోంది లలితమ్మ మనసులో.
                                                 *    *    *
    లలితమ్మ తెల్లవారకుండా ఇంటి పనులలో మునిగిపోయింది కాని, మనసు మందంగానే పని చేస్తోంది. 'ఫరవాలేదు నేను లేకపోయినా వీళ్ళంతా హాయిగా బతికేయగలరు.' దీర్ఘంగా విట్టూర్చి వంటిల్లంతా సద్దడంలో మునిగిపోయింది.
    'మా అమ్మ వచ్చిందిగా - నేను స్కూలుకిరాను ఇవ్వాళ' పిన్నిగారి పిల్లాడితో చెప్తున్నాడు చిన్నాడు. 'మమ్మీ జడ కుదరటంలేదు వెయ్యవే!' జుట్టు విప్పుకుని రిబ్బన్లు, దువ్వెన పట్టుకు నిల్చుంది చిట్టితల్లి.
    'ఈ పది రోజుల్నించి ఇంట్లో అడుగుపెట్టాలంటే చిరాకేసింది. ఇవాళ హాయిగా వుంది ప్రాణం. ఆఁ - మా ఆవిడా ఊర్నించి వచ్చేసింది. ఇవాళ ఆఫీసుకి సెలవు పంపిస్తున్నాను.' రాజశేఖరం నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతున్నాడు.
    'గబగబా చెయ్యి చెపాతీలు - కాలేజీకి టైమయిపోతుంది.' పెద్దవాడు రఘు తల్లిని తొందర పెడుతున్నాడు.
    ఇల్లంతా తనే అయి ఆ పని ఈ పని చేస్తున్న లలితమ్మ మనస్సు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS