Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 7


    సలీం శంకర్ సంతృప్తుడై "ఇక ఈ విషయం మర్చిపోండి. నెల రోజులు తిరిగే సరికల్లా ఈ అమ్మాయి ఇంకెప్పుడూ ఇలాంటి పన్లు చేయకుండా బుద్ధి చెపుతాం" అన్నాడు.

    "రేపట్నుంచే ప్రారంభించండి".

    "రేపూ ఎల్లుండీ కోర్టుకి వెళ్ళాలి. మాకివన్నీ తప్పవులెండి. గురువారం మంచి రోజు, ఆ రోజు నుంచీ ప్రారంభిస్తాం. మామూలుగా వద్దు, ఏదైనా ప్లాన్  ఆలోచించమన్నాడు దాదా. ఆలోచిస్తాను".

    సుబ్బారావు వెళ్ళిపోయాడు. సలీం శంకర్ చేతిలో వున్న ఫోటో వంక చూశాడు. ఫోటోలో అనూష నవ్వుతూంది.

    అతడు షాపు వెనుక వున్న రూమ్ లోకెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏం చెయ్యాలి? ఏమైనా  చేయవచ్చు. కత్తితో పొడవచ్చు.  రోడ్డు మీద  వెళ్తుంటే ఆసిడ్  పోయవచ్చు. అవన్నీ చాలా సులభం. గాంగ్ రేప్ కూడా కష్టంకాదు. దారికాసి లాక్కుపోవచ్చు.

    కానీ తెలివిగా చెయ్యమన్నాడు దాదా. తనొక్కడే తనుభవించాలి! ఆ  అనుభవించడంలో కూడా తన తెలివితేటలు కనపడాలి. ఎక్కడ చెయ్యాలి ఈ పని?

    పోలీస్ స్టేషన్!

    అవును. పోలీస్ స్టేషన్ లో బల్లమీద  చెయ్యాలి.

    అదీ తన తెలివితేటలకి పరాకాష్ట!

    అతడు ఫోటో వైపు మరోమారు చూశాడు.

    అనూష అందంగావుంది.

    సలీం శంకర్! ఆరు బ్యాంకుల్ని అందంగా మోసం చేసినవాడు. అరవై దాకా హత్యలు చేసినవాడు. దిగిపోయిన ముఖ్యమంత్రి కుడిభుజం. రకరకాల మొహాలున్నవాడు. ప్రస్తుతం అతడి మొహంలో కాంక్ష కనపడుతుంది. అతడో దారుణమైన సెక్స్ మానియాక్ అని కొద్దిమందికే తెలుసు. చార్మినార్ గోల్కొండ వైభావాల్ని చూడటానికి వచ్చి ప్రమాదవశత్తూ మరణించిన విదేశీ దంపతుల్లో స్త్రీలకి - మరణానికి పది నిముషాల ముందు  తెలుసు- అతడెంత దారుణంగా  స్త్రీని అనుభవిస్తాడో.


                        *    *    *

    ఆమె ఆఫీసుకొచ్చేసరికి పండా పిలుస్తున్నాడని కబురందింది. ఆమె ఆయన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఆయన నుదుటిమీద చెయ్యి పెట్టుకుని దీర్ఘాలోచనలో వున్నాడు.

    'కూర్చో' అన్నాడు. ఆమె ఎదుటి కుర్చీలో కూర్చుంది. ఆయన చాలాసేపు ఆలోచనలోనే వుండి తేరుకుని ఒక పుస్తకాన్ని ఆమె ముందుకు తోసి 'చూడు' అన్నాడు.

    శ్రీ కంపెనీ బ్యాలెన్స్ షీటు అది. ఆమె దానిని తిరగేస్తూ వుండగా ఆయన చెప్పసాగాడు.

    "శ్రీ కంపెనీ చాక్లెట్టు గురించి తెలియని ఇల్లుండదు. దాదాపు పిల్లలున్న ప్రతీ వారూ ఆ పేరు వినే వుంటారు!..... ఆ కంపెనీ భారత దేశంలో వేరువేరు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి తన ఉత్పత్తి పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో షేర్లు ప్రకటించగానే దేశంలో అందరూ వారి కోసం ఎగబడ్డారు. సహజంగానే మన సంస్థ కూడా పెద్ద  ఎత్తులో- అంటే దాదాపు పాతిక లక్షల దాకా  అందులో పెట్టుబడి పెట్టాలనుకుంది".

    ఆమె వింటూంది.

    ".....మన సంస్థ అంత పెట్టుబడి పెట్టాలంటే దానికి డైరెక్టర్ల అనుమతి అవసరం. మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకి పెట్టాం. మీటింగ్ లో అందరు  డైరెక్టర్లూ దీనికి సుముఖులే. కానీ ఇంకో అయిదు నిముషాల్లో మీటింగ్ వుందనగా మన సర్వీస్ ఏజన్సీ నుంచి కబురొచ్చింది-"

    "ఏమని?"

    "శ్రీ కంపెనీ చాక్లెట్టు అంత పాపులర్ అవటం ఇష్టంలేని ఒక పారిశ్రామికవేత్త  ఒక రూమర్ లేవదీయబోతున్నాడు అని మన సంస్థ తెలిపింది".

    "ఏమిటా రూమరు?"

    "ఆ చాక్లట్టులో ఆవు కొవ్వు కలుపుతున్నారని! ఒక్కసారి ఆ రూమరు బయట కొచ్చిందంటే ఇక పోదు. చాక్లెట్ల అమ్మకం రాత్రికి రాత్రి పడిపోతుంది. హిందువులకీ ఆవుకీ అంత సెంటిమెంటుంది".

    ఆమెకి మిగతాది అర్థమైంది.

    ఆసెంబ్లీలోనో పార్లమెంటులోనో ఒక ప్రతిపక్ష సభ్యుడు లేచి, "ఆర్యా! ఆ చాక్లెట్ లో ఆవు కొవ్వు కలుపుతున్నారని వినవచ్చింది. దీని మీద ప్రభుత్వం  ఏమీ  చేస్తూవుంది?" అని పాయింటు లేవనెత్తుతాడు.

    అంతే!

    మిగతావన్నీ చకచకా జరిగిపోతాయి. 'శ్రీ చాక్ లెట్ లో ఆవుకొవ్వు' అని వార్తా ప్రముఖంగా పడుతుంది. పడి రోజుల తరువాత ఎంక్వయిరీలో అటువంటిదేమీ లేదు అని తేలినా దాని ప్రభావం ప్రజలమీద ఎక్కువగా వుండదు. అప్పటికే ఆ వార్త మనసులో ఇంకిపోతుంది.

    మా....స్ ...... మెం..... టా..... లి..... టి.

    మొదట పడిన అభిప్రాయమే గొప్ప ప్రభావం! చెడు వార్త పట్ల ఆకర్షితుడైనంత తొందరగా పాఠకుడు మంచి వార్త పట్ల అవడు.

    పార్లమెంట్ లో కేవలం నిజానిజాలు తెలుసుకోవడానికే అడిగాడు కాబట్టి చాక్లెట్ సంస్థ ప్రతిపక్ష సభ్యుడిమీద చట్టరీత్యా చర్య తీసుకోవటానికి వీలుండదు. పార్లమెంటులో అతడు అడిగినట్టు వ్రాసింది కాబట్టి (హెడ్డింగ్ మరో  విధంగా పెట్టినా) దిన పత్రికను కూడా ఏమీ చెయ్యలేం. ప్రత్యర్థుల్ని చాలా తెలివిగా దెబ్బతీసే చట్టబద్ధమైన ఏర్పాట్లు ఇవి.

    "మన స్టాక్ హొంని ఎవరో తెలివిగా మోసం చేశారు" అన్నాడు పండా. "శ్రీ కంపెనీ చాక్లెట్ మార్కెట్ లోకి అంతగా 'పుష్' కాదు అని తెలియగానే ఆ సంస్థలో పాతిక లక్షలు పెట్టుబడి పెట్టడానికి మేము  వెనుకాడేము. కానీ ఆ సంస్థ షేరు ధర మార్కెట్ లోకి విడుదల అవగానే పది రూపాయిలది -పదిహేను రూపాయిలు అయింది. అంటే మేం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అప్పుడే పది లక్షలపైగా  రావలసిన లాభం పోయిందన్నమాట-"

    "మరి అనుకున్నట్టుగా ఆ 'ఆవు కొవ్వు' రూమరు బయటకు రాలేదా?"

    "అసలు ఆ రూమరు వ్యాప్తి చేసే ఉద్దేశ్యమే ఎవరికీ లేదు"

    అనూష  దిగ్భ్రమతో "మన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఇచ్చిన వివరాలు తప్పటానికి వీల్లేదే" అంది.

    "అసలా ఏజెన్సీ మనకే వివరాలూ పంపలేదు".

    దిగ్భ్రమతో "మరి" అంది.

    పండా ఆ రోజు జరిగింది చెప్పాడు. "మీటింగు లోపల జరుగుతూ వుండగా  ఈ కవరు వచ్చింది. కవర్లో  వార్తా చూసి, ఆ చాక్లెట్ సంస్థ షేర్ కొనకూడదని నిర్ణయించుకున్నాము. కానీ ఆ తరువాత మన ఏజెన్సీ ఆ కవరు పంపలేదని అనే సరికి విస్తుబోయాము.  నిజానికి జరిగిందేమిటంటే లోపల మీటింగు జరుగుతూ వుండగా ఎవరో మన ప్యూన్ కి కవరు అందించారు. కవరు మీద సీలూ అదీ  అలాగే వుంది కానీ కవరు పంపింది మాత్రం వాళ్ళుకాదు. మనకి నష్టం తీసుకురావాలని ఎవరో చేసింది. ఇదొకటే కాదు. ఇలాటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య".

    "ఆ ప్యూనూ".

    "ఆ ప్యూన్ సంగతి చూసుకోనవసరం లేదు. చాలా నమ్మకస్తుడు. నేను హామీ వుంటాను ఆ విషయానికి" అన్నాడు పండా. "చాలా విధాలుగా ప్రయత్నించాం నేరస్థుడిని పట్టుకోవాలని! లాభం  లేకపోయింది".

    "కవరు ప్యూన్ నుంచి అందుకుని మొదట చదివినదెవరు?"

    "నేనే"

    ఆమె నవ్వి "సారీ" అంది.

    "పర్వాలేదు".

    "మీరు చదవటం ఏమిటి? బోర్డు రూమ్ లోపలికి తీసుకు వెళ్ళవలసినది సెక్రటరీ కదా!"

    "ఆ రోజు అతడు శలవులో వున్నాడు."

    ఆమె మరికొన్ని విషయాలు అతడితో మాట్లాడి తన గదికి వచ్చేసింది. వస్తూ వస్తూ సీక్రెట్ ఏజెన్సీ పేరుమీద వచ్చిన రిపోర్ట్ తనతో తీసుకు వచ్చింది.

    ఆమె గదిలో కాగితాలు చూసుకుంటూవుండగా తలుపుచప్పుడు వినిపించింది. 'కమిన్' అంది.

    రామలింగేశ్వరర్రావు లోపలికి వచ్చాడు. స్టాక్ హొం సెక్రటరీ అతడు. నిజానికి, సీనియారిటీ ప్రకారం తను జనరల్ మానేజర్ అవుతాననుకున్నాడు. బయట నుంచి వచ్చిన (అందులోనూ ఆడది) మనిషంటే అతడికి చిన్నచూపు. అతడి వయసు ముప్పై తొమ్మిది. దాదాపు పదిహేను సంవత్సరాల్నుంచీ స్టాక్  హొంలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తాలూకు అన్ని విషయాలూ తనకొక్కడికే తెలుసు అన్న అహం వుంది. వయసులో ఇంత చిన్నది తనపై అధికారి కావటం కారం రాసినట్టుగా వుంది.

    ".....కూర్చోండి" అంది. అతడు కూర్చుంటూ చేతిలో ఫైలు దాదాపు విసిరేస్తున్నట్టుగా ఆమె ముందు పడేసాడు. "ఎందుకు, ఈ ధ్యానం  మిల్లు షేర్లు అమ్మెయ్యమని వ్రాసేరు మాడమ్?" అన్నాడు. 'మేడమ్' అని చివర చేర్చిన  సంబోధనలో కేవలం అమ్మెయ్యమన్నాను" అంది. "ఇంకొన్ని రోజులు పోయాక వీటినే తిరిగి మనం చౌకగా కొనుక్కోవచ్చు".

    "మీరీ అభిప్రాయానికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా" ....... మళ్లీ అదే వెటకారం.

    ఆమె కుర్చీ వెనక్కివాలి అతడి వైపు సూటిగా చూసింది. "అది దీక్షో, పట్టుదలో నాకైతే తెలీదుకానీ మన మంత్రికి కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. సెక్రటేరియట్ లో వాళ్ళు పనిచేయరు..... రైస్ మిల్లు వాళ్ళు లక్షలకి లక్షలు ఆర్జించేస్తున్నారు వగైరా! చాలా కొద్ది రోజుల్లోనే, నా ఊహ నిజమైతే అతడికీ ధాన్యం మిల్లులకీ గొడవ జరిగి జరగగానే దీని షేరు ధర పడిపోవటం సహజం. ఇప్పుడు ఆమ్మేసి అప్పుడు కొనుక్కొందామని ఆ ఫైలులో అందుకే వ్రాసేను".

    రామలింగేశ్వరర్రావు ఆమెవైపు అప్రతిభుడై చూసాడు. ఆమె అంచనా తప్పుకావొచ్చు కాకపోవచ్చు కానీ ఆమె భవిష్యద్దర్శనం అతడిని మాట్లాడనీయకుండా చేసింది. అంతటి అనుభవమూ వెలవెలబోగా అతడు  ఫైలుఅందుకుని వెనుదిరిగాడు.

    "రామలింగేశ్వర్రావుగారూ! ఒక్క నిముషం కూర్చోండి" అన్న ఆమె పిలుపుకి ఆశ్చర్యపోతూ కూర్చున్నాడు.

    "ఎలా వుంది ప్లాస్టిక్ ధర?"

    "పెరుగుతూనే వుంది"

    "మరెందుకు దాన్ని అమ్మెయ్యమని వ్రాసారు?"

    "అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం సంగతి. అదేనా మీరు అడుగుతున్నది!"

    "అవును. దాని ప్రభావం ఇప్పుడు  కనపడుతూవుంది" అంది. అతడు  దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని మొహం చూస్తుంటే తెలుస్తూంది......

    చివరికి "ప్లాస్టిక్ ధర తగ్గుతుంది అనుకున్నాను. నా అభిప్రాయం తప్పయింది. అలా  తప్పవడానికి 50-50 ఛాన్సు  వుందని స్టాక్ హొంలో ప్రతి ఉద్యోగికీ తెలుసు" అన్నాడు.

    "నాకూ తెలుసు. అందులో తప్పులేదు కూడా! కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది కేవలం మీ అనుభవం, తెలివితేటలవల్ల కాస్త నేనూ నేర్చుకుందామని! ఆఫ్ట్రా మీకీ షేర్లలో వున్న అనుభవంలో  నాకు  సగం కూడా లేదు".

    రామలింగేశ్వర్రావు నవ్వాడు. "ఇందిరా గాంధి జపాన్ పర్యటనతో ఫ్లాస్టిక్ ధర తగ్గుతుంది అనుకున్నాను. ఆమె హఠాత్తుగా హత్య చేయబడటంతో ప్రయాణం జరగలేదు. జాపాన్  నుంచి దిగుమతి విషయమై ఆ తరువాత రాజీవ్ గాంధీ పట్టించుకొకపోవటంతో ధర పెరుగుతూ వుంది" తన అనుభవాన్నంతా నాలుగు వాక్యాల్లో చెప్పాడు. అతడి చూపులో 'నేను చెప్పింది నీకేమైనా అర్థమైందా?' అన్న అహం వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS