మిగతా ముగ్గురూ గేటు ఎక్కి లోపలికి దూకేసారు.
పిచ్చి మొక్కలు, చెట్లూ...హారర్ సినిమాలో దయ్యం బంగ్లాలా వుంది.
చీకటి పడింది. చుట్టుపక్కల యిళ్లు కూడా లేవు. స్వరూప్ మెల్లగా ముందుకు కదిలాడు.
చుట్టూ పిట్టగోడ. మధ్యలో యిల్లు వుంది. తలుపు దగ్గరికి వెళ్లాడు.
నలుగురు గుండెలు చిక్కపట్టుకున్నారు. స్వరూప్ కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు.
మెల్లగా తలుపు తట్టాడు.
లోపలి నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. మళ్లీ తలుపు తట్టాడు. ఈ సారి కాస్త గట్టిగానే తట్టాడు.
"ఎవరు...ఎవరు మీరు? హు ఆర్ యూ" జేమ్స్ డేవిడ్ వైపు చూసి ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ పార్ధసారధి.
నవ్వాడు జేమ్స్ డేవిడ్.
పార్ధసారధి కోపం నషాళానికి అంటింది
"చాందినీ వాటీజ్ దిస్...వాట్స్ రాంగ్ గోయింగాన్ హియర్" కోపంగా అన్నాడు పార్ధసారధి.
చాందిని విలాసంగా నవ్వుతూ వెళ్లి జేమ్స్ డేవిడ్ భుజం మీద తలపెట్టింది.
ఈసారి ఆశ్చర్యమూ, కోపము అనుమానము మూడు ఒకేసారి కలిగాయి.
"ఏమిటి... ఏమిటిదంతా? మీరిద్దరూ ఎవరూ? అసలు యిక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు...నేను వెళ్తాను" కోపంగా వెనక్కి తిరిగాడు పార్ధసారధి.
జేమ్స్ డేవిడ్ తన నవ్వును మరింత పెంచి ముందుకు కదిలాడు.
అప్పటికే పార్ధసారధి తలుపు దగ్గరికి వెళ్లి గొళ్లెం తీయబోతున్నాడు. అదే సమయంలో పార్ధసారధి తలమీద ఇనుపరాడ్ తో బలమైన దెబ్బ తగిలింది.
తల రెండు ముక్కలైన ఫీలింగ్.
జేమ్స్ డేవిడ్ చేతిలో రాడ్ వుంది. దానికి రక్తం అంటుకుని వుంది.
తన నాలుకతో దాన్ని టచ్ చేసి, ఇనుప రాడ్ ని మూలకు వేసాడు సౌండ్ వచ్చేలా.
"ఒరే...లోపలి నుంచి ఎవరిదో కేక వినిపించింది." మోహన్ చెవులు రిక్కించి విని అన్నాడు.
"అవున్రా...నాకూ వినిపించింది" ప్రదీప్ మొహంలో భయం.
"అయితే మనం వెనక్కి తిరిగి వెళ్దామా?" శ్యామ్ అన్నాడు వణికిపోతూ.
"మనం సరిగ్గా విన్లేదు...యింత దూరం వచ్చాంగా...చూద్దాం...దాని సంగతి తేల్చుకుందాం" పట్టుదలగా అన్నాడు స్వరూప్.
అడనమే కాదు గట్టిగా తలుపు నెట్టాడు.
పార్ధసారధి శరీరాన్ని లోపలికి ఈడ్చుకుపోతోన్న జేమ్స్ డేవిడ్ తలుపు మీద ఎవరో తడుతోన్న శబ్దం విన్నాడు.
అనుమానంగా చాందినివైపు చూసాడు.
చాందిని ముందుకు కదలబోయింది.
జేమ్స్ డేవిడ్ ఆమెను వారించి, తనే ముందుకు కదిలి తలుపుతీసాడు.
ఎదురుగా నలుగురు కుర్రాళ్లు.
ఆ కుర్రాళ్లు ఎదురుగా వున్న జేమ్స్ డేవిడ్ వైపు చూసారు. హారర్ సినిమాలో డ్రాక్యులాలా వున్నాడు.
డేవిడ్ పెదవికి రక్తం అంటివుంది.
ఒక్క క్షణం భయమేసింది.
ఎదురుగా చాందిని కనిపించింది వాళ్లకు. స్వరూప్ ఆ గది వైపు చూసాడు.
దుమ్ము కొట్టుకుపోయి వుంది.
మనుష్యులు నివసించే యిల్లులా లేదది.
అతని దృష్టి సోఫా పక్కనే పడివున్న పార్ధసారధి శరీరం మీద పడింది. ఒళ్లు జలదరించింది. ఓ మూలకు ఇనుపరాడ్ వుంది. చిక్కని రక్తం దానికి అంటుకొని వుంది.
నలుగురికీ క్షణంలో అక్కడి పరిస్ధితి అర్దమైంది. ఏ క్షణమైనా పారిపోవడానికి సిద్ధంగా వున్నారు.
ప్రాణభయం మొదలైంది.
ఇదే సంఘటన ఏదైనా సినిమాలో చూస్తే వాళ్లకు థ్రిల్ల్లింగ్ గా వుండేది. ఏదైనా నవలలో చదివితే ఎక్సయిట్ మెంట్ గా వుండేది.
కానీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేసరికి ఒళ్లంతా చెమట్లు పట్టింది.
అప్పటికే తలుపు దగ్గరికి వచ్చారు. అప్పుడు గమనించారు.
డ్రాక్యులాలా వున్న ఆ వ్యక్తి తలుపు మూసి తాళం వేసాడని...ఎప్పుడు వెళ్లి మూలున్న ఇనుపరాడ్ తెచ్చాడో తెలియదుగానీ అతని చేతిలో ఇనుపరాడ్ వుంది.
నవ్వుతున్నాడు జేమ్స్ డేవిడ్...వికృతంగా...మరోవైపు చాందిని నవ్వుతూనే వుంది వాళ్లవైపు చూస్తూ.
కేవలం అడ్వంచర్ పేరుతో, డబ్బు సంపాదించాలనే ఆశతో తామెంత పొరపాటు చేసామో అప్పుడార్ధమైందా కుర్రాళ్లకు.
కానీ అర్ధమయ్యేసరికి ఆలస్యమైంది.
జేమ్స్ డేవిడ్ చేతిలోని ఇనుపరాడ్ పైకి లేచింది.
ఆ గది నాలుగ్గోడల మీద రక్తం చిమ్మింది. ఓ ఘోరం అక్కడ జరగబోతోంది.
టేబుల్ మీద పొగలు కక్కుతోన్నటీ వుంది. అయినా తాగాలని అనిపించడంలేదు కృపాల్ కు. బయట వాతావరణం చలిగా వుంది. తెలియని అనీజీనెస్ వెన్నాడుతోందతన్ని. భార్గవ కేసు ఓ కొలిక్కి రాలేదు. అతనేమయ్యాడు? మిస్సింగ్ కేసా? ఎటూ పాలుపోవడంలేదు.
బ్యాంకులో కూడా ఏ ఇన్పర్మేషన్ లేదు. అతని సిక్త్స్ సెన్స్ ఏదో చెబుతోంది. అదేమిటో సరిగ్గా రిసీవ్ చేసుకోలేక పోతున్నాడు.
అతనికి భార్గవ భార్య ప్రణవి గుర్తొచ్చింది. పాపం...భర్త ఏమయ్యాడో తెలియక అల్లాడుతూ వుండి వుంటుంది. ఆమెకెలాంటి ఆపద రాకూడదనే మఫ్టీలో శివరావు అనే కానిస్టేబుల్ ని వుంచాడు.
ఆ యింటిమీద ప్రణవికి తెలియకుండా నిఘా వేయించాడు.
"సార్...టీ చల్లారిపోతోంది" కానిస్టేబుల్ చెప్పేసరికి, కృపాల్ ఆలోచనల్లో నుంచి తేరుకుని టీ కప్పు అందుకున్నాడు.
యింతలో ఫోన్ రింగయింది. రిసీవర్ ఎత్తాడు.
"కృపాల్ దిస్ సైడ్"
"హలోసార్...నేను అపూర్వని... గుర్తుపట్టారా? ఇండియా వచ్చినపుడు మిమ్మల్ని మీట్ అయ్యాను".
"కృపాల్ మెమరీ పనిచేయండం మొదలైంది. అతనికి జ్ఞాపకశక్తి ఎక్కువ.
"ఆ...గుర్తొచ్చారు. డాక్టర్ పార్ధసారధిగారి డాటర్ కదూ...స్టేట్స్ లోనేవుంటున్నారా? నాన్నగారు ఎలా వున్నారు? ఇక్కడే వున్న కలవడం కుదరడంలేదు"కృపాల్ అన్నాడు.
"నాన్నగారు ఎలా వున్నారో తెలుసుకోవడానికే మీకు ఫోన్ చేసాను"
"వాట్!" ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు.
"అవునుసార్...మూడ్రోజులుగా నాన్నగారింట్లో ఫోన్ ఎవరూ లిప్ట్ చేయండంలేదు. ఫోన్ ఫ్రాబ్లం కాదు.
సమ్ థింగ్ హేపెన్డ్. నాకు తెలిసిన ఆప్తులు మీరొక్కరే...అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను" అపూర్వ గొంతులో దుఃఖం కనిపిస్తోంది.
"అపూర్వ..ప్లీజ్...ఎక్సయిట్ అవ్వొద్దు. అసలేం జరిగింది?"కృపాల్ అడిగాడు.
మూడ్రోజులుగా తను తండ్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించడం, ఎవరూ లిప్ట్ చేయకపోవడం, అయ్యర్ లిప్ట్ చేసాక, అతను కంగారుపడిపోవడం, ఆ తర్వాత నుంచి ఫోన్ లిప్ట్ చేయకపోవడం వరకూ వివరంగా చెప్పింది.
"ఐ ...సీ" అంటూ ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు కృపాల్.
"ప్లీజ్...ఏదో ఒకటి చేయండి...నాకు టెన్షన్ గా వుంది. డాడీ నాకు ఫోన్ చేయకుండా వుండరు. నాకు వూహ తెలిసాక గుడ్ నైట్ చెప్పకుండా నిద్రపోయిన సంఘటనలు అరుదు" ఫోన్ లోనే ఏడుపోచ్చేస్తోంది అపూర్వకు.
"ప్లీజ్...రిలాక్స్...నేను ఎంక్వయిరీ చేస్తాను. డోంట్ వర్రీ" ధైర్యం చెప్పాడు కృపాల్.
"థాంక్యూ...థాంక్యూసార్... అవసరమైతే నేను ఇండియా రమ్మన్నా వచ్చేస్తాను".
"అవసరమైతే నేను మిమ్మల్ని యిక్కడికి రమ్మని చెబుతా అన్నట్టు మీరు కూడా సర్జనేకదూ".
"అవునుసార్"
"ఓ.కే...మీ నంబర్ యివ్వండి. నేనే కాంటాక్టు చేస్తాను"
"ఫర్లేదుసార్...రేపు మళ్లీ ఫోన్ చేస్తాను. థాంక్యూ...థాంక్యూ సార్" అటువైపు నుంచి అపూర్వ మనస్పూర్తిగా అంది ఫోన్ పెట్టేస్తూ.
రిసీవర్ పెట్టేసి కృపాల్ దీర్ఘాలోచనలో పడిపోయాడు.
ఏదో జరుగుతోంది...నేర ప్రపంచంలో ఎక్కడో కదలిక మొదలైంది. అది అన్నివైపులా కబళించి తమ డిపార్ట్ మెంట్ ని కన్ ప్యూజ్ చేయకముందే తను తొందరపడాలి.
ఏదో ఒకటి చేయాలి.
టీ కూడా తాగకుండా లేచాడు ఓ నిర్ణయానికి వచ్చిన కృపాల్.
సోపాలో కూచునే కునికిపాట్లు పడుతుంది ప్రణవి. అర్దరాత్రి పదకొండ దాటింది. చాలా రోజులుగా ఆమె నిద్రకు దూరమైంది. ఎప్పుడు భర్తకి సంబంధించిన ఆలోచనలే.
కళ్లు మూతలు పడుతున్నాయి. అలాగే కళ్లు మూసుకుంది. సరిగ్గా అప్పడే యింటి తలుపు తట్టిన శబ్దం.
మరోసారి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. ఎదురుగా వున్న వ్యక్తిని చూసి-
ఒక్క క్షణం ఆశ్చర్యం
మరొక్క క్షణం విస్మయం
యింకోక్షణం విస్మయం
ఇంకో క్షణం సంభ్రమం
ఎదురుగా తన భర్త.
"ఏవండీ"
పరుగెత్తు కెళ్లింది.
మాసిన గడ్డం, నలిగిన బట్టలు...
మనిషి చిక్కిపోయినట్టు కనిపించాడు.
"ఏమైపోయారండి...మీ గురించి నేనెంత కంగారుపడ్డానో తెలుసా...చివరికి పోలీసుస్టేషన్ లో కూడా కంప్లయింట్ యిచ్చాను. అసలేమైందండీ " ప్రణవి గొంతు వణుకుతోంది.
"నన్ను రెస్ట్ తీసుకోనీ...బెడ్రూంకు తీసుకువెళ్లు" ఒకే ఒక మాట మాట్లాడాడు".
భర్త ఏదో షాక్ లో వున్నాడని అనిపించింది. "పదండి" అంటూ బెడ్రూంకు తీసుకు వెళ్లింది. మంచమ్మీద కూచున్నాడు భార్గవ.
అతని పక్కన కూచుంది.
"వేడివేడిగా అన్నం వండేదా?" అంది ప్రేమగా.
"వద్దు...పడుకుంటాను"
"అలాగే" అని అనగలిగింది.
భర్తతో ఎన్నో మాట్లాడాలని, ఎన్నో అడగాలని వుంది. కానీ భర్త పరిస్ధితి చూసి బలవంతంగా ఆపుకుంది.
తెల్లవారాక అడగొచ్చుననుకుంది. కిటికీ తలుపులు తెరిచింది, గాలి రావడం కోసమని.
అప్పుడు గమనించిది, కిటికీ నుంచి చూస్తే ఎదురుగా రోడ్డుకు అవతల ఓ వ్యక్తి తమ యింటి వైపే చూస్తున్నాడని.
అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది.
ఎక్కడ చూసానా? అని ఆలోచించసాగింది. అయినా గుర్తురావడం లేదు.
ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుంది. యింకాస్త గుర్తుచేసుకుంటే అతను కానిస్టేబుల్ శివరావు అని గుర్తుకొచ్చేది.
కృపాల్ తన గదిలో అటు యిటు పచార్లు చేస్తున్నారు. ఎన్నో కేసులు ఈజీగా సాల్వ్ చేసాడు. భార్గవ కేసు ఓ పక్క, పార్ధసారధి మిస్టరీ మరో పక్క అతన్ని చాలెంజ్ చేస్తున్నట్టు అనిపించాయి.
సరిగ్గా అప్పడే ఫోన్ మోగింది.రిసీవర్ తీసాడు.
"సార్...నేను కానిస్టేబుల్ శివరావును మాట్లాడుతున్నాను. భార్గవ వచ్చాడు సార్."
